Dreams and What They Really Mean as per Garuda Purana | గరుడ పురాణం ప్రకారం కలలు!


కలలు! జీవిత సత్యాలు..
‘గరుడ పురాణం’ ప్రకారం మనకు వచ్చే ఈ కలలకు అర్ధం తెలుసా?

సాధారణంగా ఎవరికైనా కలలు రావడం అనేది సహజమే. వాటిలో కొన్ని సంతోషం కలిగించేవిగా ఉంటే, కొన్ని పీడ కలలు కూడా వస్తూంటాయి. కొన్ని మనకు కర్తవ్య బోధ చేసేవిగా ఉంటే, మరికొన్ని ఎక్కడో ఆకాశంలోనుంచి పడిపోతున్నట్లు, విచిత్రంగా కూడా ఉంటాయి. వీటిలో కొన్ని కలలు గుర్తుంటాయి, మరికొన్ని గుర్తుండవు. మన పురాణాలు, శాస్త్రాల ప్రకారం, తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం కూడా, కలలో వచ్చేవి కొన్ని నిజం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, కలల గురించి గరుడపురాణంలో, శ్రీ మహావిష్ణువు గరుడుడికి తెలియజేసిన సత్యాలేంటి? వాటిపై ప్రేతాల ప్రభావం ఉంటుందా? కలలో కనిపించే కొన్నింటికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వాటికి ప్రాయశ్చిత్తాలేంటి వంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/lqxfEzeB4Uc ]


గరుడపురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్పిన ప్రకారం, కొన్ని కలలు మన మానసికి స్థితి మీద ఆధారపడి ఉంటే, కొన్ని కలలపై ప్రేతాల ప్రభావం వుంటుంది. గరుడపురాణంలో ప్రేతాలకు సంబంధించి గతంలో నేను చేసిన వీడియో link, చూడని వారి కోసం description లో, I-cards లో పొందుపరుస్తున్నాను. ప్రేతాల నుండి విడుదల వుంది. దానికి ముందు అది ఎలాంటి ప్రేతమో, ఇది ఎలాంటి తాపమో తెలియాలి. దానికి జ్యోతిర్విద్వాంసుల సహకారం అవసరం. ప్రేతగ్రస్త ప్రాణికి కొన్ని అద్భుతమైన కలలొస్తుంటాయి. తీర్థ యాత్రలకు వెళ్ళాలనీ, నదీ స్నానాలు చెయ్యాలనీ, ధర్మకార్యాలను అనుష్టించాలనీ గట్టిగా నిశ్చయించుకుని, ముహూర్తం కూడా చూసుకున్నాక, ఎందుకో అత్యంత నిరాసక్తత ఏర్పడుతుంది. ఎక్కడికీ వెళ్ళ బుద్ధికాదు. చెడు పనులవైపు మనస్సు లాగుతుంది. వెంటనే ఇది ప్రేత నిర్వాకమే అని పోల్చి, జ్యోతిర్విద్వాంసులనాశ్రయించిన వాడు, బాగు పడతాడు. వారిని సంప్రదించవలసిన అవసరం లేకుండా కూడా, దానాలు చేసినా ప్రేత బాధలు వదిలి పోతాయి. కలలో కనిపించిన ప్రేతాన్నుద్దేశించి మంత్ర సహితంగా దానం చేయడం వల్ల, ఆ ప్రేతానికీ, ఈ మనిషికి కూడా తృప్తి కలుగుతుంది. ప్రేతాలు వాటిలో అవి కూడబలుకుకుని, దానమిచ్చిన వానికి సుఖాలనిస్తాయి. వారి బంధు బాంధవులకు కూడా, ధన ధాన్యాల నిస్తాయి. స్వప్నాలలో ప్రేతాలు కనిపించిన పిమ్మట కూడా, వాటి మాటలు, చేష్టలు, పీడలను చూసి కూడా, శ్రాద్ధాదుల ద్వారా వాటి నుండి ముక్తికై ప్రయత్నించని వారు, ఆ ప్రేతాలు పెట్టే శాపాలకు లోనై, దుఃఖ సాగరంలోనే మునిగి వుండి, ఇక తేలరు. కొంత మంది మరుజన్మలో కూడా నిస్సంతులు, పశుహీనులు, దరిద్రులు, రోగులుగానే వుండిపోతారు.

కొన్ని సందర్భాలలో ప్రేతాల నామ గోత్రాలు, స్వప్నాల వల్ల తెలుస్తాయి. కొందరిని కలలు రాకున్నా, ప్రేతాలు పట్టి పీడిస్తాయి. అలాంటి సందర్భాలలో, కుల పురోహితుని మాటనే పూర్తిగా విశ్వసించి, ఆయన ఆదేశం మేరకు, భక్తిభావ పూర్వకంగా పితృభక్తి నిష్టులై, పురశ్చరణ పూర్వకంగా నారాయణ బలి కార్యాన్ని నిర్వహించి, జప, హోమ, దానముల ద్వారా దేహ శోధనను చేసుకోగానే, సమస్త విఘ్నాలూ సమసిపోతాయి. ఇవన్నీ చేయగానే, అంతవరకూ భూత ప్రేత పిశాచాదులచే పీడింపబడుతున్న ప్రాణి బాధలన్నీ, దూదిపింజలలాగా ఎగిరిపోతాయి.

ఒక్కటి మాత్రం గుర్తుంచుకో కశ్యప నందనా! పితృభక్తి ఉండాలి. లేకుంటే సుఖం లేదు. అన్ని ప్రయత్నాలలోనూ విజయం కావాలంటే, తండ్రిపోయిన తొమ్మిదవ, లేదా పదవ సంవత్సరంలో, పదివేల గాయత్రీ జపం చేసి, దశాంశ హోమం కూడా చేసి, “ఇది మా పితరుల నిమిత్తం” అని చెప్పుకోవాలి. దీని ఫలితంగా ఉపద్రవాలిక దరిజేరవు. తల్లిదండ్రులను మించిన దైవాలు లేరు.

పితృమాతృ సమం లోకేనాస్త్య న్య దైవతం పరం ।
తస్మాత్‌ సర్వప్రయత్నేన పూజయేత్‌ పితరౌ సదా ॥

హితానాము పదేష్టా హి ప్రత్యక్షం దైవతం పితా ।
అన్యాయా దేవతాలోకే న దేహ ప్రభవో హి తాః ॥ (ధర్మ... 21/28 29)

ప్రాణులకు స్వర్గానికిగానీ, మోక్షానికి గానీ, ఏకమాత్ర సాధనం శరీరమే. అటువంటి శరీరం దేని ద్వారా అయితే వచ్చిందో, దానికన్న పూజ్యమేది? కాబట్టి, దానమిచ్చిన వాడికి దక్కే ఫలమే గొప్పది.

పుత్రుడు పుట్టుటయే భాగ్యము. వాడు మంచివాడై, అన్ని పితృకార్యములనూ చేయుటయే గొప్ప పుణ్య ఫలము. వాడు పుట్టగానే తండ్రికి 'పుత్' అనే నరకబాధ తప్పిపోతుంది.

పున్నామ నరకాద్యస్మాత్‌ పితరం త్రాయతే సుతః ।
తస్మాత్‌ పుత్ర ఇతి ప్రోక్త ఇహచాపి పరత్ర చ ॥ (ధర్మ... 21/92)

ఓయి ఖగరాజా! ఎవరికైనా మాతాపితరులిరువురూ అకాల మృత్యువు పాలైతే, వారొక యేడాది పాటు ఆ తల్లిదండ్రులకు పుణ్యలోకాలను ప్రాప్తింపజేసే ప్రయత్నంలోనే వుండాలి. ఆ ఏడు వ్రతాలనూ, తీర్థయాత్రలనూ, వివాహాది మంగళ కార్యాలనూ తలపెట్టకూడదు. (అధ్యాయం - 21)

తమ సతీసుతుల, బంధు మిత్రుల కలలలో భయంకరమైన అశ్వాలుగా, ఏనుగులుగా, ఎద్దులుగా, వికృత రూపులైన మానవులుగా కనిపించి, బాధిస్తాయి. కొంతమంది నిద్ర పోతుండగా వచ్చి, వారి శయ్యలను అన్ని విధాలా అపభ్రంశం చేసి పడేస్తాయి. మనిషి తెల్లారి లేచి చూసుకునే సరికి, తానూ తన పక్కా చాలా అసహ్యకరంగా తయారౌతారు. కొందరికి తాము సంకెళ్ళచే బంధింపబడినట్లు కల వస్తే, మరికొందరికి చనిపోయిన తమ వారు పరువు తక్కువ, నిందనీయ వేషాలలో తిరుగుతున్నట్టు కల వస్తుంది. తింటున్న వాని నుండి అన్నాన్ని తామే లాగుకొని పారిపోతున్నట్లు, దాహంతో ఆబగా నీరు త్రాగబోతున్న వాని నుండి ఆ నీటిని తామే లాక్కుని పారిపోతున్నట్లు, కొందరికి కలలు వస్తాయి. ఇవన్నీ ప్రేతాల నిర్వాకాలే. ప్రేతాలలో ఒక రకమే పిశాచాలు. ఇవన్నీ వాటి విన్యాసాలు.

ఎద్దు మీద స్వారీ చేస్తున్నట్లు, ఎద్దులతో కలసి ఎక్కడికో వెళుతున్నట్టు, ఆకాశంలో భయంగా, పడిపోయేలా ఎగురుతున్నట్టు, ఆకలితో అలమటిస్తూ తీర్ధంలో తిరుగుతున్నట్టూ, ఆవు, ఎద్దు, గుర్రం, పక్షులతో, తన గొంతులోనే వాటి భాషను మాట్లాడుతూ గోష్టి సలుపుతున్నట్టూ, తన నుదుటిపై తనకే, ఏనుగు, దేవతలు, భూతప్రేత నిశాచరాదుల చిహ్నాలు కనిపిస్తే, తనకి పిశాచజన్మే వస్తుందని అర్ధం.

పక్షీంద్రా! ప్రేతయోని సంబంధితాలైన ఎన్నో చిహ్నాలు కలల్లో వచ్చి కంగారు పెట్టేవి ఉన్నాయి. తన అన్నదమ్ములు, భార్య, కొడుకు ఎవరైనా పోయినట్టు కల వస్తే అది ప్రేత దోషమే. మనిషికి ఆకలి దప్పులతో తాను ఆరాట పడుతున్నట్టూ, “వాటిని తీర్చండి మహాప్రభో” అని ఎవరినో యాచిస్తున్నట్టూ కల వస్తే, ప్రేత దోషాన్ని వదలించుకోవాలి. వెంటనే ఏదైనా తీర్థానికి వెళ్ళి, తన పితరులందరికీ పిండదానం చేసి, ప్రేత సంతృప్తిని సాధించాలి. పుత్ర, పితా, భ్రాత, పత్ని, పశు, పత్యాది ముఖ్యులు ఇల్లు వదలి బయటికి పోతున్నట్టు కల వచ్చినా, ప్రేత దోషముందని అర్ధము.

గరుడా, ఇలాంటి స్వప్న దోషాలకు ప్రాయశ్చిత్తమెలా చేయించుకోవాలో విను. ఆ వ్యక్తి ఇంట్లోగానీ, తీర్ధంలోగానీ స్నానం చేసి, మారేడు మూలంలో జలతర్పణమివ్వాలి. వేద పారంగతులైన బ్రాహ్మణులను పూజించి, వారికి నల్లని ధాన్యాలను దానమివ్వాలి. తరువాత యథాశక్తి హవనం చేసిన పిమ్మట, గరుడ పురాణ పారాయణ చేయించు కోవాలి. శ్రద్ధాపూర్వకంగా ఈ అధ్యాయాన్ని విన్నా, చదివినా, వారికి ఏ ప్రేత దోషమూ అంటదు. అప్పటికే అంటివుంటే మంటిలో కలసి పోతుంది. (అధ్యాయం -23)

సర్వేజనాః సుఖినోభవన్తు! లోకాః సమస్తా సుఖినోభవంతు!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home