Satyameva Jayate | సత్యమేవ జయతే! - ఒక మంచి కథ..


సత్యమేవ జయతే! - ఒక మంచి కథ..
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మరణానికి సిద్ధపడిన నంద ఎవరు?

మన పురాణాలు సన్మార్గ బోధకాలు. వీటిలో మనకు ఎన్నెన్నో మంచి కథలు కనిపిస్తాయి. ఒక కథకు మంచి కథ అనిపించుకోవడానికి, కచ్చితమైన లక్షణాలంటూ ఏమీ ఉండవు. ఎందుకంటే, ఏవి మంచి కథకు ఉండకూడని లక్షణాలని అనుకుంటామో, ఆ లక్షణాలతోటే మంచి కథ అనిపించుకునేవీ వస్తూనే ఉంటాయి. అలాగే, మంచి కథ లక్షణాలని మనం అనుకునేవన్నీ పొదుగుకునీ, నిరుత్సాహపరిచే కథలూ ఉంటాయి. మంచి కథ మొదలయ్యాక, ఏదో ఒక క్షణంలో పాఠకుణ్ణి ట్యూన్ చేసుకుని, తనలో లీనం చేసుకుంటుంది. అందుకు పాఠకుడి నేపద్యమూ, అనుభవాలు కూడా, అన్నిసార్లూ కారణం కాకపోవచ్చు. కథను అనుసరించే సమయంలో, మన మానసిక స్థితిగతులే అందుకు కారణం కావచ్చు. చిట్టచివరికి అది పాఠకుడు, లేక వీక్షకుడిపై కలిగించే స్పందనా, ప్రభావమే గీటురాళ్లు. అందరికీ సన్మార్గాన్ని బోధించే వ్యాస విరచిత అష్టాదశపురాణాలలో ఒకటైన ‘పద్మపురాణం’ లోని అటువంటి ఒక కథను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. ఇదే కథను కొంత రూపాంతరంతో, పంచతంత్ర కథలలో కూడా మనం చూడవచ్చు. ఇక కథలోకి వెళితే..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/9omJY5UQwQ4 ]


పూర్వం సరస్వతీ నదీ తీరాన విస్తరించి ఉన్న రాజ్యాన్ని, ప్రభంజనుడనే రాజు పరిపాలిస్తూవున్నాడు. ఒక రోజు ఆయన వేట నిమిత్తం అరణ్యానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక లేడి తన పిల్లకు పాలిస్తూ ఉండటం, ఆయన చూశాడు. వెంటనే ప్రభంజనుడు ఆ లేడి మీద బాణ ప్రయోగం చేశాడు. మరణించే ముందు ఆ లేడి, “బాణ ప్రయోగం చేసిన రాజు పులిగా మారిపోవాలి!” అని శపించింది. ఆ శాపం తక్షణమే ఫలించి, రాజు పులి అయిపోయాడు. పులిగా మారిన రాజు తన అపరాధాన్ని మన్నించమని, ఆ లేడిని వేడుకున్నాడు. “నువ్వు నూరు సంవత్సరాలు పులిగా జీవిస్తూ, శాపాన్ని అనుభవిస్తావు. ఆ తరువాత నంద అనే గోవు కారణంగా, నీకు శాప విమోచనం కలుగుతుంది” అని చెప్పి, లేడి ప్రాణం విడిచింది.

పులిగా మారిన రాజు ప్రభంజనుడు, గతాన్ని పూర్తిగా మరచిపోయి, పులి సహజ నైజాన్ని సంతరించుకుని, ఆ అరణ్యంలో జీవించసాగాడు. తక్కిన జంతువులను చంపి ఆకలిని తీర్చుకుంటూ, కాలం వెళ్ళబుచ్చసాగాడు. ఇలా అనేక సంవత్సరాలు గడిచాయి. ఒకానొక రోజు ఆ పులి జీవిస్తూన్న అరణ్యానికి, పచ్చిక మేయడానికి ఒక ఆవులమంద వచ్చింది. అరణ్యంలో రోజంతా మేసిన గోవులు, సాయంత్రం తమ ఊరికి తిరిగి వెళ్ళ నారంభించాయి. ఆ మందలో నంద అనే గోవు కాస్త వెనుకబడింది. అదే సమయంలో వర్షం కురవడం ప్రారంభించడంతో, తక్కిన గోవులు నంద వెనుకబడటం గమనించక, తమ దారిన తాము వెళ్ళిపోయాయి. వాన కారణంగా ఒక చెట్టు క్రింద ఒదిగి ఉన్న నంద, తన స్థితిని గ్రహించుకుని, వేగంగా తమ ఊరికేసి పరుగెత్తసాగింది. అదే సమయంలో పులి తన పిల్లలకు మాంసం వెదుకుతూ, అటువైపు వచ్చింది. నందని గమనించగానే, మంచి మాంసాహారం లభిసోందని భావిస్తూ ఆ పులి, గోవును అడ్డగించింది. నంద మీదికి పంజా విసరడానికి సంసిద్ధమైంది.

నంద తన ప్రాణం గురించి దిగులు చెందలేదు. కానీ, గోకులంలో తన రాకకై ఆతృతగా ఎదురు చూసే తన దూడను తలచుకుని, దాని మనస్సు విలవిలలాడిపోయింది. తనను చంపబోతున్న పులితో, “అయ్యా, నా దూడ ఇప్పుడు గోకులంలో ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. దానికి పాలివ్వడానికే నేను వేగంగా పోతున్నాను. నేను వెళ్ళి నా దూడకు పాలిచ్చి, దానిని నా గోనేస్తాలకు అప్పగించి తిరిగి వస్తాను. అప్పుడు మీ అభీష్టం ప్రకారం, నన్ను ఆహారంగా చేసుకోండి. నా దూడను చివరిసారిగా చూడాలనీ, దానికి నాలుగు హితవచనాలు చెప్పిరావాలనీ ఆశిస్తున్నాను. ప్రస్తుతం నా పట్ల కరుణ వహించి, నా దూడను చూసిరావడానికి అనుమతి ఇవ్వండి” అని వినయంగా వేడుకున్నది.

నంద వేడుకోలును మన్నించడానికి, పులి సిద్ధంగా లేదు. “ఇప్పుడు నిన్ను వెళ్ళడానికి అనుమతిస్తే, నువ్వు తిరిగి వస్తావని హామీ ఏమిటి? నేడు నువ్వు నాకు ఆహారం కావడం, విధి నిర్ణయం. నిన్ను నేనిప్పుడు చంపవలసిందే!” అని అన్నది. ఆ మాటలు విని నంద, “నేను మాట తప్పను. నన్ను నమ్మండి” అంటూ తాను కనుక మాట తప్పితే, ఫలానా ఫలానా పాపాలకు ఒడిగట్టిన దాన్నవుతానని, కొన్ని ఘోరపాపకృత్యాలను పేర్కొని, వాటిపై శపథం చేసింది.

సామాన్యంగా మనుషుల స్థితి వేరు. బహుశా పులిగా ఉన్నందున, నంద చెప్పినది విన్న ప్రభంజనుడి మనస్సు కరిగిందేమో. “సరే, నువ్వు చెబుతున్నది నమ్ముతున్నాను. కానీ, వెంటనే నీ దూడను చూసి తిరిగి వచ్చేయాలి! దానితోపాటు మరో విషయం కూడా గుర్తుంచుకో: ప్రాణం కాపాడుకోవడానికి అబద్ధమాడినా తప్పులేదని చెప్పి, పలువురు నీ మనస్సు మార్చాలని ప్రయత్నిస్తారు. వారి మాటలు పట్టించుకోకుండా, చేసిన వాగ్దానం ప్రకారం ఇక్కడకు వచ్చేయాలి” అని అన్నది పులి. “నేను ఎన్నటికీ మిమ్మల్ని వంచించను. ఇతరులను వంచించే వాడు, ఆత్మవంచన చేసుకున్న వాడే అవుతాడు” అని నంద జవాబు చెప్పి, పులి అనుమతితో గోకులానికి బయలుదేరింది.

అక్కడ గోకులంలో నంద కనిపించకపోవడంతో, దూడ ఆందోళనతో తల్లడిల్లిపోతున్నది. తల్లిని చూడగానే, ఆనందోత్సాహాలతో గంతులు వేసి, పాలు త్రాగనారంభించింది. కానీ, అలవాటు ప్రకారం ఆప్యాయంగా నాలుకతో తనను తడిమే తల్లి, ఆ నాడు శోకమయంగా ఉండటం చూసి, దూడ ఉత్సాహం నీరుగారింది. అది ఆతృతగా, “అమ్మా. ఎందుకు దిగులుగా ఉన్నావు? కారణం ఏమిటో నాకు చెప్పకూడదా?” అని నందను అడిగింది.

నంద కారణాన్ని వివరించింది. అది వినగానే దూడ రోదించింది. “అమ్మా! నేనూ నీతోనే వచ్చి, ఆ పులికి ఆహారమైపోతాను” అన్నది కృత నిశ్చయంతో. ఆ మాట వినగానే నంద మనస్సు చివుక్కుమన్నది. తనను తాను సంభాళించుకుని, మనస్సును దృఢ పరచుకుని, ప్రేమ ఉట్టిపడే స్వరంలో, బిడ్డకు హితోక్తులు చెప్పింది. తను లేని స్థితిలో దూడ తనను తాను ఎలా రక్షించుకోవాలో, ఎలా జీవించాలో, ఇతరులతో ఎలా మసలుకోవాలో వివరించి చెప్పి, దూడ మనస్సును సాంత్వన పరచింది. తరువాత నంద తన దూడను, తన తల్లి వద్దకు, నేస్తాల వద్దకు తోడ్కొని పోయింది. వారికి దూడను అప్పగించి, తను అరణ్యానికి వెళ్ళవలసిన అగత్యాన్ని తెలిపింది.
పులి భావించినట్లే, నంద తల్లీ, నేస్తాలూ ఇలా చెప్పాయి: “ప్రాణ రక్షణకై అబద్ధం చెప్పినప్పటికీ, అది సత్యమే అవుతుంది; ప్రాణం కోల్పోయేట్లు చేసే సత్యం, అబద్ధమే అవుతుంది” అని లోకం చాటి చెప్పే పలు న్యాయాలను, నందకు నొక్కివక్కాణించారు. “పులికి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని భంగం చెయడంలో తప్పులేదు” అని నంద మీద, దాని దూడ మీద ఉన్న ప్రేమాభిమానాల కారణంగా వేడుకున్నాయి.

కానీ, తన తల్లీ, నేస్తాలూ నొక్కిచెప్పిన కార్యకారణాలనూ, న్యాయాలనూ నంద అంగీకరించలేదు. అది వాటితో ఇలా చెప్పింది: “ఇతరులను రక్షించడానికైతే అబద్ధం చెప్పవచ్చు. నా ప్రాణ రక్షణకోసం నేను ససేమిరా అబద్ధం ఆడను. ఎవరు చేసిన పాప పుణ్యాల ఫలితాన్ని, వారే అనుభవించి తీరాలి. స్వర్గం, మోక్షం, ధర్మం, అన్నీ మన వాక్కులను బట్టే ఉంటాయి. ఎవడు సత్యం పలుకడం విడనాడతాడో, అతడు మంగళకరమైన హితాలనన్నీ కోల్పోతాడు. మనస్సులో ఒకటి ఉంచుకుని, బైటకు మరో విధంగా మాట్లాడే వాడు, తన ఆత్మనే తస్కరించే దొంగ అవుతాడు.”

నంద దృఢనిశ్చయాన్ని ఎవరూ మార్చలేకపోయారు. తరువాత అది అందరి వద్దా సెలవు పుచ్చుకుని, అరణ్యంలోని పులి వద్దకు వెళ్ళింది. పులితో నంద, “నా కర్తవ్యాలను పూర్తి చేసుకున్నాను. ఇక మీరు నన్ను నిరాక్షేపణీయంగా ఆహారంగా చేసుకోవచ్చు” అన్నది నిర్లిప్తంగా. అదే సమయంలో దూడ కూడా అతివేగంగా అక్కడకు వచ్చి చేరింది. అది తన తల్లి ముందు నిలబడి, “నా తల్లిని చంపడంతో పాటు నన్నూ చంపి, మీ ఆకలి తీర్చుకోండి” అని పులి వైపు చూస్తూ చెప్పింది. నంద శిక్షణలో పెరిగిన ఆ దూడ, తల్లి సుగుణాలనన్నీ పుణికిపుచ్చుకున్నది.

తన ముందు జరుగుతున్నదంతా చూసిన పులికి, అది కలా నిజమా అనే అనుమానం కలిగింది. ఆడిన మాటను సునాయాసంగా తప్పేవారు ఉండే ఈ లోకంలో, ప్రాణాన్ని ఖాతరు చేయక, ఆడిన మాటను నిలబెట్టుకునే నంద వంటి వారు ఉండటం, పులికి ఆశ్చర్యంతో పాటు, ఆనందం కూడా కలిగించింది.

పులికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు. అదీ ఒక తల్లే కదా! “నేను చనిపోతే నా పిల్లలు ఎంత కష్టపడతాయో! అదే విధంగా ఈ గోవు మరణిస్తే, దాని దూడ కష్టపడుతుంది!” అనే ఆలోచన తలెత్తగానే, పులి మనస్సు ద్రవించింది. అంతేకాక తన దూడనూ బంధుగణాన్నీ విడిచి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన గోవు నంద నిజాయితీ, పులి మనస్సును పూర్తిగా మార్చి వేసింది. “నిన్ను చంపాలనే ఉద్దేశాన్ని మార్చుకున్నాను. సత్యమనే నీలో ఉన్న మహోన్నత సుగుణం, నన్ను జయించి వేసింది. నీ సత్యమే ఇప్పుడు నిన్ను రక్షించింది. ఇప్పటి నుండి ఇతరులను చంపి బ్రతికే జీవితం నాకు వద్దు. అటువంటి జీవితాన్ని నేను అసహ్యించుకుంటున్నాను. నాకు హితం చేకూరే ఉపదేశాలు చెప్పు” అని పులి ప్రార్ధించింది.

యావత్తు మానవాళీ స్వీకరించి, పాటించవలసిన ఒక ఉపదేశం, పులికి నంద చేసింది: “సర్వభూతాలకూ ఎవరు అభయమిస్తారో, అతడు బ్రహ్మాన్ని పొందుతాడు.” గోవు చెప్పడం పూర్తి అయినప్పుడు, దాని పేరు నంద అని పులికి తెలియ వచ్చింది. అది నందను తాకి ప్రణమిల్లింది. ఆ క్షణంలోనే, పులి రూపంలో జీవిస్తూన్న ప్రభంజనుని శాపం తీరి, తన పాత రాజోచిత రూపం దాల్చాడు. ఆ సమయంలో ధర్మదేవత అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ధర్మదేవత అనుగ్రహంతో, నందకు మోక్షం ప్రాప్తించింది. గోవత్స న్యాయం మేరకు, దూడకు కూడా తల్లితో పాటు మోక్ష పథం దక్కింది. ప్రభంజనుడు తన నగరానికి తిరిగి వెళ్ళి, మునుపటి కంటే ధర్మంగా, న్యాయంగా రాజ్యాన్ని పాలించాడు. సత్యమనే మహోన్నత గుణాన్ని ఊపిరిగా చేసుకున్న నంద పేరు, లోకంలో శాశ్వతంగా నిలిచిపోవడం న్యాయ సమ్మతమే.. నంద ముక్తి పొందిన నాటినుండి, సరస్వతీ నదికి నంద సరస్వతీ నది అనే పేరు శాశ్వతంగా స్థిరపడిపోయింది.

సత్యమేవ జయతే!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home