Who are you? What is Karma Siddhanta? | ఎవరు నువ్వు? కర్మ సిద్ధాంతం ఏమిటి?


ఎవరు నువ్వు? కర్మ సిద్ధాంతం ఏమిటి?
కోరికలు తీరకపోతే నమ్ముకున్న దైవాన్ని మార్చి, వేరే దైవాన్ని ఆశ్రయిస్తారా?

సనాతనధర్మం ప్రకారం కర్మ సృష్టి ధర్మం. ప్రకృతి గుణాల వలన కర్మలు నిర్వహించబడతాయి. మానవుడు స్వతంత్రుడు కాదు.. కర్మబద్ధుడు! కర్మ ఫలితంగానే జన్మ ఆధారపడి ఉంటుంది. ఈ జన్మలో అనుభవించగా మిగిలిన కర్మ ఫలాన్ని, మరు జన్మలో అనుభవించక తప్పదు. జీవుల కష్ట సుఖాలకూ, లాభ నష్టాలకూ ఇతరులు కారణం కాదు. భార్యా బిడ్డలూ, బంధు మిత్ర, సంయోగ వియోగాలూ, పురాకృత కర్మ ఫలితాలే. అసలు నువ్వెవరు? బలీయమైన కర్మ సిద్ధాంతం ఏమిటి? అనే జీవిత సత్యాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/obtCjPk1svs ]


64 లక్షల జీవ కణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే, అందులో ఒకే ఒక్క జీవ కణం మాత్రమే, తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి, శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత, కేవలం 24 గంటలలో, అండాన్ని పట్టుకుని బ్రతకకపోతే, ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటానికి మనకు దేవుడిచ్చిన సమయం, కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా, బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావు.

అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది బయటికి వచ్చి, రూపాన్ని పొందుతుంది. కాళ్లూ చేతులూ కదప లేని, నోటితో చెప్పలేని స్థితి. ఏం చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహమూ పెరుగుతుంది. ఈ దేహం నేనే అంటాము. అసలు అలా అనటానికి, నీ దేహంలోని ఏ భాగం నీ మాట వింటుంది..? నిజానికి ఏ భాగమూ వినదు. వినాలని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. చిన్నప్పుడు రెండడుగులుగా ఉన్న దేహం, క్రమంగా పెరుగుతూ, ఆరడుగులవుతుంది. అందంగా మారుతుంది. క్రమంగా అందం మందగించి, ముదిరి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం చొప్పున క్రమంగా వేగాన్ని తగ్గించుకుని, అసలు పని చేయడానికి మొరాయిస్తాయి.

మరి ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది? ఈ దేహం నీదే అయినప్పుడు, ఎందుకు ఒకప్పుడున్న రూపం ఈ రోజు లేదు? దేహం నీదయినప్పుడు, నీ మాట ఎందుకు వినడం లేదు? దేహం నీదే అనుకున్నప్పుడు, చివరికి ఎందుకు వదిలేసి వెళ్లి పోతున్నావు..?
ఎందుకంటే, అసలు ఈ దేహం నీది కాదు. నీకు ఆ దేవుడిచ్చిన ఉపకరణం మాత్రమే. ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప, "ఈ దేహం నాదే, నేను శాశ్వతంగా ఉండిపోతాను" అనే భ్రమకి లోను కాకూడదు. ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు, నీకున్న బాధ్యతలను నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏం చెప్పాయో, వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో..

రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించి, రూపం పొంది, ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు. చివరికి ధరించిన రూపం ఇక్కడే వదిలి వెళ్ళిపోవాలి. నిజానికి ఇక్కడున్నది నువ్వు కాదు. నీకు ఆ పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే, ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. రూపానికి ముందు నువ్వున్నావు, రూపంలో  నువ్వున్నావు, రూపం వదిలేసిన తారువాతా నువ్వుంటావు. ప్రతి చోటా నువ్వు అనే వాడివి లేకపోతే, అసలు రూపమే ఉండదు.

ఈ దేహం దేవుడిచ్చిన ఓ అద్భుత వరం. ఆయనే ఆ దేహానికి ఏం కావాలో ఇస్తాడు. ఆయనే తయారు చేశాడు, సమయమవ్వగానే ఆయనే నాశనం చేస్తాడు. ఈ దేహాన్ని ధరించినంత కాలం, దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ  దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారం ఎవ్వరికీ లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ, పరమాత్మ ఆజ్ఞ ప్రకారమే నడుస్తాయి. అయన ఆగమన్నప్పుడు అన్నీ ఆగిపోతాయి. కాబట్టి, ఆ  నువ్వు ఎవరో తెలుసుకుని మసలుకునే ప్రయత్నం చెయ్యాలి.

ఇక కర్మ సిద్ధాంతం విషయానికి వస్తే, కర్మలకు దోషం వున్నప్పటికీ, జీవులు కర్మబద్ధులు. కర్మలు మానడం కంటే, కర్మలు చేయడమే మేలు. కర్మ చేయకపోతే, జీవయాత్ర జరగదు. జీవులు కర్మ చేయకుండా ఒక్క క్షణమైనా వుండలేరు. అయితే, కర్మల వలన ఫలం తప్పదు కాబట్టి, సత్కర్మలు చేయడం అలవరుచుకోవాలి. ప్రతిఫలాన్ని ఆశించకుండా, కర్మఫలాన్ని దైవానికి అర్పించడం ద్వారా, జీవుడు క్రమేణా జన్మరాహిత్యాన్ని పొందగలడని తీర్మానం చేసింది, మన సనాతనధర్మం. అజ్ఞానులు కర్మలలో మునిగి ఎలా పని చేస్తారో, జ్ఞానులు కూడా లోక శ్రేయస్సు కోరుతూ, అలాగే కర్మలు చెయ్యాలి. కర్మలలో మునిగిపోయిన వారిని ఆక్షేపించకుండా, వారు సత్కర్మలు ఆచరించేలా జ్ఞానులు ప్రోత్సహించాలి. అహంకారం వలన తానే అన్నింటికీ కర్తనని అనుకుంటాడు అజ్ఞాని. కానీ, గుణకర్మల యొక్క తత్వం తెలిసిన జ్ఞాని, ఆ చట్రంలో చిక్కుకోడు.

కర్మఫలితాన్ని కోరుకునే వాళ్ళు, దేవతలను ధూపదీపనైవేద్యాలతో ఆరాధిస్తారు. ఆరాధనలో తమ కోరికలను నెరవేర్చమని వేడుకుంటారు. కొన్ని కోరికలు తీరిన తరువాత, ఆరాధనలో కొంత ఆడంబరాన్ని పెంచుతారు. పది మందికీ తమ ఆడంబరతను చూపెట్టే ప్రయత్నం చేస్తారు. దేవుడు నా వాడే అని భావిస్తారు. కొన్ని జరగకపోతే, దేవుణ్ణి నిందించడం ప్రారంభిస్తారు. నెమ్మదిగా అహం చోటుచేసుకుంటుంది. మెల్లగా నమ్ముకున్న దైవాన్ని మార్చి, వేరే దైవాన్ని ఆశ్రయిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే!! అంటే, తాము చేస్తున్న కర్మలవలన, మనుజుల గుణము బయటపడుతోంది! వ్యక్తిలో దాగివున్న సత్వ, రజో, తమో గుణములు, కర్మలరూపంలో తేటతెల్లమవుతున్నాయి. ఎంత కపటమును ప్రదర్శించినా, అవి ఒకానొకప్పుడు బయటపడక తప్పదు.

కర్మలు శాశ్వతము కావు. ఎందుకంటే, కాలానుగుణంగా కర్మలు మారుతూ వుంటాయి. కాబట్టి, వాటి ఫలితాలు కూడా తాత్కాలికములే. అంటే, మనుజులు కర్మలు చేయటంగానీ, చేయకపోవటంగానీ ముఖ్యంకాదు. తమ మనస్సులోని మాలిన్యాలను తొలగించడమే ప్రధానమని తెలుస్తోంది. ఆ మాలిన్యాలను మనసా, వాచా తొలగించకుండా చేసే ఏ కర్మ అయినా, నిరుపయోగమే! అజ్ఞాని, ‘నేను’ చేస్తున్నానని భావించి, ఫలితముల యందు ఆసక్తితో కర్మలను చేసి, వాటి ఫలితాన్ని అనుభవించడానికి ఈ జన్మ చాలకపోతే, ఇంకొన్ని జన్మలు ఎత్తవలసి వుంటుంది. దానినే ప్రారబ్ధకర్మ అంటారు. జ్ఞానులు ఆత్మస్థితిలో వుండి, ఏ ఫలితములనూ ఆశించకుండా, దైవబుద్ధితో కర్మలు చేస్తారు. అది యజ్ఞంగా, యోగంగా మారి, బంధమును కలిగించదు. సాధనతో ఆత్మజ్ఞానమును పొంది, బంధము నుండి విముక్తి పొందుతారు. అంటే, అనాసక్తితో, ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి కోరికా లేక, అహమనే భావాన్ని త్యజించి చేసే ఏ కర్మ అయినా, "కర్మయోగము"గా మారిపోతుంది. కర్మయోగము వలన, బంధము కలుగదు. జ్ఞానము పరిపక్వత చెంది, సమాధి స్థితి కలిగినప్పుడు, కర్మలతో పనిలేదు. కొందరు లోక కల్యాణం కొరకు కర్మలు చేస్తారు, కొందరు చేయరు. వారు కర్మను అకర్మగా, అకర్మను కర్మగా భావిస్తారు. అంటే, వారు చేసే కర్మలు అసంగముగా చేస్తారు కాబట్టి, కర్మబంధము ఉండదు.

అష్టైశ్వర్యాలు, ఇంద్ర భోగాలను అనుభవించేవారిని కూడా, కాలరూపమనే మృత్యువు వెంబడించి కబళిస్తుంది. వారు సకల సౌభాగ్యాలూ అనుభవించడానికి, వారి పూర్వజన్మ సుకృతమే కారణమని మన పురాణాలు చెబుతున్నాయి. పురాకృత కర్మ ఫలాన్ని బ్రహ్మాది దేవతలు కూడా తప్పించుకోలేరు. అలనాడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని చంపగా, బ్రహ్మ హత్యా దోషం ఆయనను వెంటాడింది. దీనితో ఇంద్రుడు భీతచిత్తుడై పరుగెత్తి, మానస సరస్సులో, ఒక తామర తూడులో దూరి, సన్నని తంతువుల్లో కలిసిపోయి, వెయ్యి సంవత్సరములు అజ్ఞాతవాసం గడిపి, కర్మ ఫలాన్ని అనుభవించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇంద్రుని బ్రహ్మ హత్యా దోషాన్ని విభజించి, పాప విముక్తి కలిగించాడు. ఇంద్రుడు అశ్వమేధ యాగం చేసి, మళ్లీ తన సింహాసనంపై కూర్చోగలిగాడు.

దుర్లభమైన మానవ జన్మ లభించినప్పుడే, మానవులు మంచి పనులు చేయాలి. అది కూడా ఫలాపేక్ష లేకుండా చేయాలి. చేసిన మంచి పని తాలూకు ఫలితాన్ని, భగవదర్పణం చేయాలి. అప్పుడే, మోక్షం లభించి, జననమరణ చక్ర భ్రమణం నుంచి ముక్తి కలుగుతుంది. పుణ్య పాప కర్మలు మిశ్రమముగా పక్వానికి వచ్చినప్పుడు, జీవుడు మానవ జన్మ ఎత్తుతాడు. కర్మ ఫలముగా సుఖములను, దుఃఖములను అనుభవిస్తాడు. కర్మ ఫలమును అనుభవించటమే కాక, కొత్త కర్మలు కూడా చేసే అవకాశం, కేవలం మానవ జన్మలోనే కలుగుతుంది. పరమాత్మను అందుకోవడానికి కావలసిన కర్మలు చేసే అధికారం, జ్ఞానం వున్న ఈ మానవ జన్మ, ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది. “జంతూనాం నర జన్మ దుర్లభం” అని శంకరులు ‘వివేక చూడామణి’లో తెలియచేసారు. ఇలాంటి ఉత్తమమైన మానవ జన్మని సార్ధకం చేసుకోడానికి, ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. మానవులు పరమాత్మను చేరడానికి, కర్మ-జ్ఞానములు తప్పక అవసరము. ఇక్కడ "కర్మ అంటే, నిష్కామ కర్మ" అనే భావించాలి. దానివలననే జ్ఞానము ఉదయిస్తుంది.

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home