అంతిమ యాత్ర! ‘గరుడ పురాణం’ Garuda Puranam - Antim Yatra
అంతిమ యాత్ర! జీవిత సత్యాలు..
‘గరుడ పురాణం’ ప్రకారం వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన పనులు!
మన సనాతన ధర్మం ప్రకారం, ఆత్మ జనన-మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎనభై నాలుగు లక్షల యోనుల్లో మనుష్య జన్మ శ్రేష్ఠత - మనిషి ఏకమాత్ర కర్తవ్యం ‘ధర్మం’ గురించి మన గత వీడియోలో తెలుసుకున్నాము. అటువంటి ఉత్తమమైన జన్మ అంత్య కాలంలో, సశాస్త్రీయంగా చేయాల్సిన విధులను, పాశ్చాత్య పోకడలలో పడో, పద్ధతులు తెలియకో, Secular మూర్ఖుల ప్రభావం వలన ఇవన్నీ మూఢ నమ్మకాలుగా భావించో, అంతిమ యాత్రకు సంబంధించిన విధి విధానాలను విస్మరిస్తున్నాము. అందరూ ఈ వీడియోను చివరిదాకా చూసి, అసలైన పద్ధతులను తెలుసుకుంటారనీ, మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారనీ ఆశిస్తున్నాను.. ప్రతి హిందువూ తెలుసుకుని, తప్పక పాటించాల్సిన ఇటువంటి అత్యవసర విషయాలను అందరికీ చేరేలా ప్రయత్నిద్దాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/1s3K7fXEf_A ]
శ్రీమహావిష్ణువును గరుత్మంతుడు ఇలా అడుగుతున్నాడు.. “హే భగవన్! మృత్యువు ఆసన్నమైనప్పుడూ, వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన కర్మలను వివరంగా వినాలని వుంది. కరుణించండి” అని ప్రార్ధించాడు.. దానికి విష్ణు భగవానుడు ఇలా చెప్పనారంభించాడు.. జీవాత్మ తన కర్మ భోగ కారణవశాన, తన వర్తమాన శరీరాన్ని వీడిపోతున్నప్పుడు, ఆ వ్యక్తిని పేడతో బాగా అలికిన భూమిపై, తిలలనూ, కుశాసనాన్నీ పరచి, దానిపై పరుండ బెట్టాలి. నోటిలో బంగారాన్ని పెట్టి, సమీపంలో తులసి మొక్కనూ, సాలగ్రామ శిలనూ తెచ్చిపెట్టాలి. ఆ వ్యక్తి మృత్యువును వీలైనంత వరకూ ముక్తి దాయకం చేయడానికి, ఒక పద్ధతిలో సూక్తాలను పఠించాలి. తరువాత చిన్న చిన్న బంగారు రేకులను, మరణించిన ప్రాణి ముఖంపై, ముక్కు ఇరు కన్నాలలో, కన్నులపై, చెవులపై, లింగంపై అంటించాలి. రెండు చేతులలోనూ, కంఠ భాగంపైనా, తులసి దళాలను ఉంచాలి. శవాన్ని రెండు వస్త్రాలలో చుట్టి, కుంకుమతో, అక్షతలతో పూజించిన తరువాత, పూలమాలతో అలంకరించాలి. అప్పుడు పుత్రులు, బంధు బాంధవులంతా కలసి, ఆ శవాన్ని పుత్రులు భుజంపై పెట్టుకుని మోస్తుండగా, పురజనులతో కలసి, రెండవ ద్వారం గుండా బయటకు తీసుకు వచ్చి, శ్మశానం వైపు సాగి పోవాలి. అక్కడ పుత్రులే, తూర్పు వైపుగానీ, ఉత్తరాభిముఖంగా గానీ చితిని నిర్మించి, అందులో చందన, తులసి, పలాశాది కర్రలను వేయాలి.
మరణాసన్న వ్యక్తి ఇంద్రియాలన్నీ వ్యాకులమైపోయి, చైతన్యం పోయి, శరీరం జడమైపోతుండగా, ప్రాణం అనబడే ఆత్మ, యమదూతలతో కలసి వెళ్ళిపోతుంది. అప్పుడు మృతునికి దివ్యదృష్టి ప్రాప్తిస్తుంది. దాని ద్వారా అతడు ప్రపంచాన్నంతటినీ చూడ గలుగుతాడు. దీనికి ముందు ప్రాణం పోవడం అనేది, అందరికీ ఒకేలాగా జరగదు. కొందరికది గొంతుదాకా వచ్చి చిక్కుకుపోయి, నానాబాధలూ పెడుతుంది. శరీరం భీభత్సంగా, ముఖం వికృతంగా కదులుతాయి. కొందరికి నోటి నుండి నురగ కారుతుంది. వీరంతా పాపాత్ములు. కాబట్టి, వీరిని యమదూతలు పాశంతో కొడతారు. అప్పుడా పాశానికి ప్రాణం తగులుకుంటుంది. పుణ్యాత్ముల విషయంలో ఇవేవీ జరగవు. మృతుడు నిద్రిస్తున్నట్టే వుంటాడు. ముఖంలో ఒకరకమైన ప్రశాంతతా, వెలుగూ కనిపిస్తుంటాయి. ఆ ప్రాణి దృష్టికి యమదూతలు దేవదూతల లాగా, యమధర్మరాజు విష్ణురూపునిలాగా కనిపిస్తారు. అదే యమధర్మరాజు, పాపులకు కాటుక కొండలాగా ఎలా కనిపిస్తాడో ఇది వరకే విన్నావు కదా!
మరణం తరువాత మానవశరీరం, అస్పృశ్యమై పోతుంది. వెగటును కూడా కలిగిస్తుంది. పుణ్యాత్ముని శవం కూడా, కొంతసేపటికి దుర్గంధయుక్తమై పోతుంది. ఈ అందమైన శరీరంపై ఇతరులకుండే భ్రమలు కూడా, తాత్మాలికంగా తొలగిపోతాయి. గరుడా! ఈ అసత్ శరీరం ద్వారా జరిగే విత్త దానం, ఆదరపూర్వక వాణి, ధర్మం, కీర్తి, పరోపకారం లాటివే అందంగా వుండి, లోకానికి ఆనందాన్ని కలిగిస్తాయి. మానవ జీవితానికి సారభూతం, ఆ పుణ్యమే.
దుష్టులను తోలుకుపోతున్న యమదూతలు, వారిని అడుగడుగునా, అన్ని విధాలా హింసిస్తుంటారు. ఓరీ దుష్టాత్మా! పద నిన్ను కుంభీపాకంలో పడేస్తాము. అదెలాగుంటుందో తెలుసా?” అంటూ దానిని అతి భయంకరంగా వర్ణిస్తారు.
గరుడా! పదకొండవ రోజున సముచితమైన స్థలంలో శ్రాద్ధం పెట్టాలి. ప్రాణం పోయినప్పటి నుండి అప్పటిదాకా, క్రమంగా ఆరు పిండదానాలు చేయాలి. మృత స్థానం, ద్వారం, నలుబాటల కూడలి, విశ్రామ స్ధలం, చితి, అస్థిచయన స్ధానం అనే స్థలాలలో వాటిని పెట్టాలి. వీటినెందుకు పెట్టాలంటే, మనిషి పోయిన చోట అంటే, ఇంటిలో పెట్టేదానిని, ‘శవ పిండమని అంటారు’. దీనివల్ల ఆ గృహ వాస్తు దేవతలు ప్రసన్నులౌతారు. భూదేవీ, ఆమె కొలువులో ఉండే దేవతలు కూడా ప్రసన్నులౌతారు. రెండవ పిండాన్ని, ద్వారంపై పెట్టాలన్నాను కదా! దానికి ‘పాంథ’ అని పేరు. దాని వల్ల ద్వారస్థ గృహ దేవతలు ప్రసన్నులవుతారు. కూడలిలో పెట్టబడే ‘ఖీచరి’ నామక పిండం వల్ల, భూతాది దేవయోనులు శాంతిస్తాయి. విశ్రామ స్థలంలో చేసే ‘భూతి’ పేరిటి పిండ దానం వల్ల, పిశాచ, రాక్షస, యక్షాది గణాలూ, అన్య దిగ్వాసి దేవతలూ, దహనంలో సహకరిస్తాయి. చితా స్థలంపై, ఆ పేరుతోనే చేసే పిండదానం, ప్రేతత్వాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీని తరువాత, ‘ప్రేత’ నామంతో చేసే పిండదానం వల్ల, శవం అగ్నికి ఆహుతయ్యే యోగ్యతను పొందుతుంది.
మరొక మూడు పిండదానాలను, ప్రాణం పోయిన చోట, స్మశానానికి సగం దూరంలోనూ, చితి మీదా చేయాలి. వీటివల్ల క్రమంగా, విధాత, గరుడధ్వజుడూ, యమదూతలూ ప్రసన్నులవుతారు. మూడవ పిండ దానం ముగుస్తుండగానే, మృతవ్యక్తి, శారీరక దోషాలనుండి ముక్తుడవుతాడు. తరువాత చితిని ప్రజ్వలింపజేయడానికి ఒక వేదికను నిర్మించి, దానికి ఉల్లేఖన, ఉద్ధరణ, అభ్యుక్షణాదులను చేసి, విధి పూర్వకంగా అగ్నిని స్థాపించి, పుష్ప అక్షతాదులతో, క్రవ్యాది నామాలతో, అగ్నిదేవుని పూజించి, ఇలా ప్రార్థించాలి...
త్వం భూత కృజ్జగద్యోనే త్వం లోక పరిపాలకః
ఉపసంహారకస్త స్మాదేనం స్వర్గం మృతం నయ (ధర్మ... 15/44, 45)
ఇలా అగ్నిని పూజించి, శవానికి నిప్పంటించాలి. మృతుని శరీరం సగం కాలాక, నేతిని ఆహుతి చేయాలి. ‘లోమభ్యః స్వాహా’... అనే మంత్రంతో, యథావిధి హోమం చేయాలి. యమ, అంతక, మృత్యు, బ్రహ్మ, జాతవేద నామాలతో ఆహుతులిచ్చి, ఒక ఆహుతిని ప్రేత ముఖంపై ఇవ్వాలి. ముందుగా అగ్నిని పై భాగంలో జ్వలింపజేసి, దానిని తెచ్చి చితియొక్క తూర్పు భాగాన్ని మండించాలి. క్రింది మంత్రాలచే అభిమంత్రితమైన తిలమిశ్రిత ఆజ్యాహుతులను, చితిపై వేస్తునే వుండాలి.
అస్మాత్ త్వ మధిజాతోఽసి త్వదయం జాయతాం పునః
అసౌ స్వర్గాయ లోకాయ స్వాహా జ్వలిత పావకః (ధర్మ... 15/49)
ఈ విధంగా తిల మిశ్రిత సమంత్రక ఆజ్యాహుతినిచ్చి, మృతకుని పుత్రుడే శవదహనం చేయాలి. ఈ సమయంలో మాత్రమే, అతడిలోని దుఃఖమంతా పోయేలాగా వెక్కి వెక్కి ఏడవాలి. ఆ దృశ్యం ప్రేతానికి సుఖాన్ని కలిగిస్తుంది. శవం పూర్తిగా కాలిపోయాక, ఆ స్థలంలోనే అస్థి-సంచయనం చేయాలి. తరువాత ప్రేతానికి దాహజన్య క్లేశ శాంతికై, పిండ దానమివ్వాలి.
దహన సంస్కారానంతరం, పుత్రులు సచేల స్నానం అంటే, వస్త్ర సహితంగా స్నానం చేసి, నామ గోత్రోచ్చారణ సహితంగా, తిలోదకాలివ్వాలి. అంతట అక్కడున్న గ్రామ ప్రజలందరూ గట్టిగా చప్పట్లు చరుస్తూ, విష్ణునామ సంకీర్మనాన్ని కొంత సేపు చేసి, తరువాత మృతకుని గుణగణాలను చర్చించుకుంటూ, అతని, లేక ఆమె ఇంటికి వచ్చి, ద్వారపు దక్షిణ భాగంలో గోమయాన్నీ, తెల్ల ఆవాలనూ ఉంచాలి. మనస్సులో వరుణ దేవుని ధ్యానించుకుంటూ, వేపాకులను నమలి, నేతి చుక్కను నోట్లో వేసుకుని, ఎవరింటికి వారు పోవాలి.
సూర్యాస్తమయమైనాక, మృతుని పుత్రుడు ఇంటి బయటగానీ, ఏకాంత ప్రదేశంలో గానీ, మృతుడు రోజూ చూసిన నలుదారుల కూడలిలోగానీ, మట్టిపాత్రలతో పాలు, నీరు పెట్టాలి. ఇలా మూడు రోజులు చేయాలి. కొన్ని మూఢ హృదయ జీవాత్మలు, ఆ మూడుచోట్లా తిరుగుతుంటాయి. పదవరోజు దాకా ప్రతిరోజూ, ప్రేతానికి పిండదానాన్నీ, జలాంజలినీ ఇస్తూనే వుండాలి. పదవ రోజుదాకా, రోజుకి కొంత పెంచుతుండాలి.
ఈ ఔర్ధ్వదైహిక సంస్కారాన్ని పుత్రుడు చెయ్యాలి, లేని పక్షంలో, భార్య, లేక భర్త చెయ్యాలి, లేకుంటే శిష్యుడు, కాకుంటే సోదరుడు చెయ్యాలి. పిండ దానాన్ని స్మశానంలో గానీ, అన్య తీర్ధంలో గానీ చేయవచ్చు. పిండ ప్రదానంలో కూర, ఉప్మా, తీపిముద్ద అన్నంతో బాటు, ఏదైనా పెట్టవచ్చు గానీ, తొలిరోజు పెట్టిన పదార్థాలనే, పదవరోజు దాకా రోజూ పెట్టాలి.
ఈ పిండం నాలుగు భాగాలుగా విడిపోతుంది. రెండు భాగాలు మృతుడి శరీర నిర్మాణానికీ, ఒక భాగం యమదూతలకీ పోగా, మిగిలినదే మృతుని నోటికందుతుంది. తొమ్మిది పగళ్ళూ, రాత్రులూ గడిచే సరికి, మృతుడికొక శరీరం ఏర్పడుతుంది. అది పదవ రోజు మహా ఆకలితో ఆవురావురుమంటుంటుంది.
పదవ రోజు పార్వణాది శ్రాద్ధాలలో నిర్దేశింపబడిన పిండ విధి, మంత్ర, స్వధా, ఆవాహన, ఆశీర్వాద ప్రయోగాలేవీ వుండవు. ఆ నాటి కర్మ కేవలం మృతుని నామ గోత్రోచ్చార పూర్వకంగా చేయబడుతుంది. ఇంతవరకు పెట్టిన పిండాల వల్ల, రోజుకొక అంగంగా, క్రమంగా తల, మెడ, భుజాలు, గుండె, వీపు, నాభి, కటి, గుహ్యం, తొడలు, కాళ్ళు ఏర్పడతాయి. పదవ రోజు చేసే పిండదానం, పెద్ద యెత్తున వుండాలి. ఆ రోజు మృతకునికి ఆకలి, అతని అలవి మీరినదై వుంటుంది. ఆతడు లేక ఆమె బతికున్నప్పుడు ఇష్టంగా తిన్న పదార్థాలన్నిటినీ వండించి పెట్టాలి.
ప్రేతాలు బాగా భోజనం చేసేది, పదకొండు, పన్నెండవ రోజులలోనే. ఆ రోజులలో ప్రేత శబ్దాన్ని, స్త్రీ పురుషలిద్దరికీ వాడాలి. ఇక నామ గోత్రాలకి బదులుగా, మంత్రాలతో బాటు, ప్రేత శబ్దాన్నే వాడుతుండాలి. పదమూడవ రోజు, ప్రేత నరకయానం ప్రారంభమవుతుంది. అది ఎవరికెలా జరుగుతుందో, ఎన్ని నగరాలను ఎలా విలపింపజేస్తూ దాటిస్తుందో వినివున్నావు కదా!” (అధ్యాయాలు 15, 16) ఈ వీడియోను మనం గతంలో చేసి ఉన్నాము. చూడనివారు తప్పక చూడండి..
సర్వేజనాః సుఖినోభవన్తు! లోకాః సమస్తా సుఖినోభవంతు!
Comments
Post a Comment