Rewriting Destiny - Influence of Rahu | మృత్యువును తప్పించిన దానం!
మృత్యువును తప్పించిన దానం! - ఒక చిన్న కథ..
కొన్ని ఆపదలను తప్పించుకోవడానికి మంచి పనులు చేయడమెలా మార్గం?
మంచి కథలు మనిషి జీవితాన్ని సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగపడతాయి. మంచితనం, గ్రహ దేవతలనూ, బ్రహ్మ రాతను సైతం మార్చేంత శక్తిని ఎలా కలిగి ఉంటుంది? వంటి విషయాలతో కూడుకున్న, అటువంటి ఒక మంచి కథను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. వీడియోను చివరిదాకా చూసి, ఈ కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారో comment చేసి చెబుతారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/1YDunsrZIio ]
ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను రోజూ అడవిలోకి వెళ్లి ఆకుకూరలు కోసుకొచ్చి, వాటిని అమ్ముకుని జీవనం గడుపుతుండేవాడు. ఉన్నంతలో అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేవాడు. అతను రోజూ అడవికి వెళ్లే దారిలో, ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి చిన్న విగ్రహం పెట్టుకుని, తులసి ఆకులతో అర్చన చేయడం గమనిస్తుండేవాడు. అది చూసి ఆ వ్యక్తి చాలా ముచ్చట పడేవాడు. తను కూడా అలా తులసి ఆకులతో పూజ చేయాలని నిత్యం అనుకుంటుండేవాడు. కానీ ఏదో ఒక కారణం చేత చేయలేక పోయేవాడు.
ఒక రోజు అతను అడవిలో ఆకుకూరలు కోస్తుంటే, తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి ఇలా అనుకున్నాడు.. “నేను ఎలాగూ పూజ చేయలేక పోతున్నాను. కనీసం ఇవి కోసుకెళ్లి ఆ బ్రాహ్మణుడికి ఇస్తాను” అని నిశ్చయించుకున్నాడు. కోసిన ఆకుకూరలతో పాటు, తులసి దళాలను కూడా కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. అతడికి తెలియని విషయం ఏంటంటే, నల్ల నాగు ఒకటి అందులో ఉన్నది.
ఆ వ్యక్తి వెళ్లి గుడిసె ముందు నిలబడగానే, ఎవరో వచ్చి నిలబడ్డారని గమనించి తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో, “అయ్యా, పూజకు తులసి దళాలు తెచ్చాను. నేను చేయలేక పోతున్నాను. అందుకే మీకు ఇస్తున్నాను” అని అన్నాడు.
ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడు తన దివ్యదృష్టితో, తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉండడం గమనించాడు. అతడితో, “నాయనా, నేను చెప్పేవరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు” అని చెప్పి, గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే, రాహువు ఆయన వద్దకు వచ్చాడు. రాహువుకు నమస్కరించి, ఎందుకు అతడి వెనుక వచ్చావని ఆయన అడగగా, రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి, “నేను ఈ రోజు అతడికి హాని చేయాల్సి ఉంది. అది విధి రాత. కానీ, అతను తన తలపైన తులసీ దళాలను మొస్తున్నాడు. అందుకే నేను నా పని చేయలేక పోతున్నాను. అతను అది దించగానే, నేను కాటేసి వెళ్ళిపోతాను” అని అన్నాడు.
ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలి వేసింది. ఎప్పుడూ రాని వాడు, ఆ రోజు పూజకు దళాలను తీసుకు రావడం.. అతడికి ఆపద ముంచుకు రాబోతోందని తెలియగానే, “ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా?” అని రాహువును అడిగాడు.
అందుకు రాహువు, “అయ్యా మీరు ఇన్ని రోజులూ చేసిన పూజల వలన సంపాదించుకున్న పుణ్యా ఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్టయితే, అతడిని ఈ గండం నుండి తప్పించ వచ్చు” అని చెప్పాడు.
బ్రాహ్మణుల వారు క్షణం కూడా ఆలోచించకుండా, అతడికి తను సంపాదించుకున్న పుణ్య ఫలాన్ని దానం ఇస్తున్నానని చెప్పడంతో, రాహువు ఆశ్చర్యపోయాడు. అంతటితో సంతోషించిన రాహువు, ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి, తిరిగి వెళ్ళి పోయాడు. వెంటనే పాము కూడా మాయమయ్యింది.
ఒక్క తులసీ దళంతో ఇంత అద్భుతమా! ఒక దానం ఇవ్వడం వల్ల, ఒక ప్రాణం నిలబడడమా! మనం సంపాదించుకున్న పుణ్య ఫలం ఇంత శక్తి గలదా! గ్రహ దేవతలనూ, బ్రహ్మ రాతను సైతం మార్చేంత శక్తి గలదా!
తరువాత బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, ఇక నుండి రోజూ తనకు తులసీ దళాలను తెచ్చి ఇవ్వమని చెప్పాడు. జరిగిన తంతు తెలియక పోయినా, ఆ వ్యక్తి సంతోషంగా అలాగేనని ఒప్పుకున్నాడు.
ఇక్కడ మనం గమనించాల్సింది, డబ్బు చేయలేని పనులను సైతం, మంచితనం చేస్తుంది. కొన్ని ఆపదలనుండి తప్పించుకోవడానికి, మంచి పనులు చేయడం ఒక్కటే మార్గం. మనిషిలో మంచితనాన్ని పెంపొందించే ఇటువంటి కథలను పదిమందికీ అందేలా చూసుకోవలసిన బాధ్యత మనందరిదీ..
లోకాః సమస్తా సుఖినోభవంతు!
Comments
Post a Comment