నరబలి! ఏం నేర్పింది? Sacrifice of Satamanyu
నరబలి! ఏం నేర్పింది?
వేల సంవత్సరాల క్రితం గ్రంధస్థం చేయబడిన మన సనాతన ధర్మ గ్రంధాలలో చెప్పబడిన గాధలు, నేటికీ మనకు ఆదర్శదాయకాలే.. నేటి మన పరిస్థితులకు మార్గదర్శకాలే.. అటువంటి ఉత్తమ సన్మార్గ కథలలో కొన్ని ఇదివరకే మనము చెప్పుకుని ఉన్నాము. మరొక మంచి కథను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. వీడియోను చివరిదాకా చూసి, మీకు అనిపించిన మంచినీ, మీ అభిప్రాయాన్నీ comment చేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/VvQgufypfeI ]
ఒకప్పుడు ఒక రాజ్యంలో రెండేళ్ళ పాటు వానలు కురవలేదు. వర్షాలు లేని కారణంగా, కరవు కాటకాలు తాండవించి, జనులు అల్లల్లాడి పోయారు. చెట్లూ చేమలూ మోడువారాయి. ఎక్కడ చూసినా పచ్చదనం అనేది మచ్చుకకు కూడా లేకుండా పోయింది. తాగడానికి నీరు కూడా లభించక, జనులు నానా అవస్థలూ పడసాగారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే, ఇక మూగ జీవాల పరిస్థితి మరీ దారుణం. పశుగణాలు వేల సంఖ్యలో నేలకొరగ సాగాయి.
ఈ స్థితిలో జనులకు వాటిల్లిన కష్టాన్ని ఎలా తీర్చాలా! అని రాజు దీర్ఘంగా యోచించి, కరవు తీరడానికి ఏదైనా పరిహారం కనుగొనాలని నిశ్చయించుకున్నాడు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో రాజ గురువుతో పాటు, రాజోద్యోగులూ, పలువురు పండితులూ పాల్గొన్నారు. వారంతా కలసి, కరవు సమస్యకు పరిష్కారం గూర్చి కూలంకషంగా చర్చించారు.
చివరికి రాజగురువు ఆ సమస్యకు ఒక పరిహారం తెలియజేశాడు. కానీ, ఆ పరిహారం అంత సులభంగా నెరవేర్చ గలిగేది కాదు. ఆయన తెలియజేసిన పరిహారం ప్రకారం, “వర్షానికి అధిష్టాన దేవత ఇంద్రుడు. ఆ ఇంద్రుణ్ణి తృప్తి పరచి ప్రసన్నం చేసుకుంటే, వర్షం కురుస్తుంది. ఇంద్రుని తృప్తి పరచాలంటే, నరబలి ఇచ్చి యాగం చేయడం తప్ప, మరో మార్గం లేదు.” మరో మార్గం ఏదీ లేకపోవడం వలన, రాజుతో సహా అందరూ ఆ పరిహార సూచనను ఆమోదించాల్సి వచ్చింది. యాగానికి ఒక ముహూర్తం నిర్ణయించబడింది. రాజ్యం అంతటా దండోరా వేసి, యాగం గూర్చి ప్రకటించారు.
ఇంతలో యాగం నిర్వర్తించే రోజు రానే వచ్చింది. నాడు రాజధాని నగరంలో, ఇసుక వేస్తే రాలనంత జనం గుమిగూడారు. యాగం సవ్యంగా జరిగి వర్షం కురిసి కరవు తీరడానికి, నరబలికి తనను తాను సమర్పించుకోవడానికి ఎవరు ముందుకు రానున్నారో తెలుసుకోవడానికీ, యాగాన్ని తనివితీరా చూడడానికీ యావత్తు రాజ్యమే నాడు యాగశాలకు తరలి వచ్చింది.
నరబలి ఇవ్వవలసిన తరుణం ఆసన్నమయ్యింది. రాజ గురువు తన ఆసనం మీది నుండి లేచి నిలబడ్డాడు. జనులు కళ్ళప్పగించుకుని, ఆయననే తదేకంగా చూస్తున్నారు. రాజగురువు ఏం చెప్పబోతున్నాడో వినాలనే ఆత్రుతా, కుతూహలం, అందరి ముఖాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
అప్పుడు రాజగురువు, తండోపతండాలుగా తరలి వచ్చి, అక్కడ గుమిగూడి ఉన్న జనులను ఉద్దేశించి, ఇలా చెప్పనారంభించాడు.. “మహాజనులారా! మన రాజ్య సంక్షేమానికై ఈ యాగం నిర్వర్తిస్తున్నట్లు, మీ అందరికీ తెలిసిన సంగతే! యాగం సంపూర్ణంగానూ, సవ్యంగానూ నిర్వర్తింప బడినప్పుడే, రాజ్యంలో వర్షాలు కురిసి, కరవు తీరుతుంది. దీనిలో నరబలి ఇవ్వడం ఒక ముఖ్యాంశం. నరబలికి తనను తాను అర్పించుకుని, యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించే వారెవరైనా, ముందుకు రావచ్చు.”
రాజగురువు చెప్పడం ముగించగానే, అక్కడి మహాజన సందోహంలో, కటిక నిశ్శబ్దం రాజ్యమేలింది. తనను తాను బలిగా అర్పించుకోవడానికి ఎవరు ముందుకు వస్తారోనని, అందరూ అటూ ఇటూ చూడసాగారు. చిన్న త్యాగం అంటే, నిరాక్షేపణీయంగా చెయ్యవచ్చునేమో! కానీ, తనను తానే బలిగా అర్పించుకోవడమంటే..! ఇది సాధ్యపడే పనేనా? అక్కడ గుమిగూడి ఉన్న యావన్మందీ, కదలక మెదలక తమ స్థానాల్లో అతుక్కుపోయి నిలబడ్డారే తప్ప, ‘నన్ను నేను బలిగా అర్పించుకుంటాను!’ అంటూ ఎవరూ బలిపీఠం మీద నిలబడడానికి ముందుకు రాలేదు.
ఇంతలో అక్కడ నెలకొని వున్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ, ఒక పిల్లవాడి స్వరం బిగ్గరగా వినిపించింది. జనుల దృష్టి ఆ స్వరం వినవచ్చిన దిశగా తిరిగింది.. “మాతృదేశ సంక్షేమం కోసం బలి కావడానికి, నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను బలి ఇచ్చి యాగాన్ని పూర్తిచేయండి. తద్ద్వారా వానలు కురిసి, రాజ్యం సుభిక్షమవుతుంది.” పన్నెండేళ్ళ చిరు ప్రాయంలోని ‘శతమన్యు’ అనే బాలుడు ఇలా చెబుతూ, యాగశాల వైపుగా నడవనారంభించాడు.
అతడి పక్కనే ఉన్న శతమన్యు తల్లి, “నాయనా! నా అనుంగు శతమన్య్యూ! నిన్ను నేను కన్నప్పుడు పొందిన ఆనందం కన్నా, ఇప్పుడు నేను పొందుతున్న ఆనందం చెప్పనలవి కానిది” అంటూ, ఆమె తనయుణ్ణి ఆశీర్వదించి, బలిపీఠం వైపుగా పంపించింది. అవును, ఆమె నిజమైన భారతీయ మాతృమూర్తి కనుక, అలాగే చేయగలదు! శతమన్యు తండ్రి కూడా పక్కనే నిలబడి ఉన్నాడు. కుమారుడు తన కళ్ళ ముందే బలి కాబోతున్నాడని తెలిసినా, ఆయన ఏ రకమైన ఆవేదనకు గానీ, ఆందోళనకు గానీ లోనుకాక, తనయుణ్ణి ఆశీర్వదించి సాగనంపాడు!
గుమిగూడి ఉన్న జనులు అది చూసి విస్తుబోయారు. కలకలం చెలరేగింది. ఒక పిల్లవాడు, రాజ్య సంక్షేమానికై తనంతట తానే మరణానికి సంసిద్ధుడై ముందుకు వస్తున్నాడు! ఇలా కూడా జరుగుతుందా!? దగ్గరుండి, బలి కావడానికి పంపిస్తున్న అలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా!?
ఇంతలో శతమన్యు బలిపీఠం మీద ఎక్కి నిలబడ్డాడు. ఇక కొద్ది క్షణాలలో, ఆ బాలుని తల నేల మీద దొర్లిపడుతుంది. అందరిలో ఉత్కంఠత నెలకొంది. శతమన్యు తలను ఖండించబోయే తరుణంలో, అక్కడ ఒక అద్భుతం జరిగింది. శతమన్యు మీద గగనం నుండి పుష్ప వర్షం కురిసింది. అదే సమయంలో, వర్షానికి అధిష్టాన దేవతయైన సాక్షాత్తు ఆ ఇంద్రుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
యాగశాలలో ఉన్న యావన్మందీ దేవేంద్రునికి ప్రణమిల్లారు. అప్పుడు ఇంద్రుడు వారిని సంబోధిస్తూ ఇలా అన్నాడు: “రాజ్య ప్రజల సంక్షేమం కొరకై, తనను తానే బలి ఇచ్చుకోవడానికి ముందుకు వచ్చాడు శతమన్యు. ఆతడి మహోన్నత త్యాగమయ హృదయం నన్ను కూడా కదిలించి వేసింది. శతమన్యు వంటి త్యాగధనులను కన్న ఒక రాజ్యం, ఇంకా కరువులో అలమటించడం న్యాయం కాదు. కనుక నేడు నరబలి జరగకుండానే, నరబలి జరిగి యాగం పరిపూర్ణంగా సవ్యంగా నిర్వర్తించినట్లు నేను పరిగణిస్తున్నాను. అవసరమైన మేరకు వర్షాన్ని కూడా కురిపిస్తాను.”
శతమన్యు వంటి వారు జన్మించి జీవించి నదయాడి, జనుల సంక్షేమం కొరకు త్యాగాలు ఒనరించిన పుణ్య భూమి మన భరతభూమి. మనం వారి పరంపరకు చెందిన వారమే. ఈ విషయంలో మనం ఎంతైనా గర్వించవచ్చు. వారిని గురించి మనం గర్వించినట్లు, మనలను గురించీ మన తరువాత రాబోయే తరాల వారు కూడా గర్వించాలి కదా! అందుకు మనం ఏం చేయాలి?
ఎందరో పుణ్యాత్ములు ఈ నాటికీ, భరత మాత రక్షణకై, మనందరి క్షేమం కోరి, తమ పిల్లలనూ, తోబుట్టువులనూ, ఆత్మీయులనూ భారత సైన్యంలోకి పంపిస్తూనే ఉన్నారు. అటువంటి త్యాగధనులందరికీ సాష్టాంగ ప్రాణామాలు. మరొక్క విన్నపం.. ఇటువంటి త్యాగాలు అందరూ చేయలేకపోవచ్చు. కానీ, దేశ సంక్షేమానికీ, ధర్మ సంరక్షణకూ, కనీసం మనం చేయగలిగే, మన చేతులలో మటుకే ఉన్న అవకాశం, ‘ఓటు వేయడం’. మన ధర్మాన్ని పరిరక్షించే ఉత్తమ లక్షణాలున్న నాయకుడిని దృష్టిలో ఉంచుకుని, మే 13న, ఏ మాత్రం అలసత్వం చూపకుండా, బాధ్యతాయుతంగా, మనం ఓటు వేయడమే కాకుండా, మనకు తెలిసిన వారందరి చేతా తప్పనిసరిగా ఓటు వేయిద్దాము.. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే, ఇక భావితరాలకు చెప్పుకోవడానికి ఏమీ ఉండదు.
ధర్మో రక్షతి రక్షితః
Comments
Post a Comment