గుడి! దేవుడు మనలోనే ఉన్నప్పుడు మరి గుడికి ఎందుకు వెళ్ళడం? Temple Secrets - Gudi - Aalayam


గుడి! దేవుడు మనలోనే ఉన్నప్పుడు మరి గుడికి ఎందుకు వెళ్ళడం?

దేవుడు అన్ని చోట్లా, అంతటా ఉన్నప్పుడు, మరి ప్రత్యేకించి దేవాలయాలకు వెళ్ళడం అవసరమా? ఈ ప్రశ్న నేటి తరం వారందరికీ కలుగుతుంటుంది.. ఆలయాలను దర్శించుకోవడం వెనుక ఎన్నో శాస్త్రీయ ప్రయోజనాలున్నాయి. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? ఈ విషయమై వేదాలు ఏం చెబుతున్నాయి? నేటి తరంలో చాలామందికి తెలియని ఇటువంటి అంశాలు ప్రతి హిందువూ తెలుసుకోవడం చాలా అవసరం.. ఈ వీడియోను అందరికీ చేరేలా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/gh0S2nYUMIM ]


మనదేశంలో చిన్నా పెద్దా ఆలయాలను చూసుకుంటే, వేలాది సంఖ్యలో ఉంటాయి. అయితే, అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దిష్ఠంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే, గురువులు పరిగణిస్తారు. అలాంటివే, అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే కానీ, కొన్ని ఆలయాలు మరింత పునీతమై, స్థలమాహాత్మ్యాన్ని సంతరించుకున్నాయి.

భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో, అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే, ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో, అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట, ప్రసిద్ధ దేవాలయాలున్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే, తనువూ, మనస్సూ ప్రశాంతతను పొందుతాయి.

దేవాలయ గర్భగృహంలో, ఉత్క్రుష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట, మూల విరాట్టును నిలిపిన ప్రదేశంలో, వేద మంత్రాలు రాసిన రాగి రేకును నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంటుంది. ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను, ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్ళి, మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటున్నవారికి ఆ తరంగాలు సోకి, అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా, గమనించ దగ్గ తేడా ఉండదు. కానీ, నిత్యం గుడికి వెళ్ళే వారిలో, పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.

ఇక గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక వైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల, గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర, పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై, మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా, చెప్పుకోదగ్గదే. ఆలయాలలో గంటలు మోగిస్తారు, వేద మంత్రాలు పఠిస్తారు, భక్తి గీతాలు ఆలపిస్తారు.. ఈ మధుర ధ్వనులు కూడా, అలౌకిక శక్తిని సమకూరుస్తాయి.

గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరు వత్తులు, గంధం, పసుపు కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు, శరీరంలో రసాయన చర్య జరపడం వల్ల, శక్తి విడుదలవుతుంది. మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు, గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరు వత్తులు, గంధం, పసుపు కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాలలో ఉండే ఔషధ గుణాలు, అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.

గుడిలో దేవుడికి కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంగా పెడతారు. ఆ కొబ్బరినీ, అరటిపళ్ళనూ భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల, శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి. తీర్థంలో పచ్చ కర్పూరం, యాలుకలు, సాంబ్రాణి  తైలము, తులసి పత్రాలు, లవంగాలు మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలన్నీ, ఔషధ గుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థం, ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

ఇప్పుడు చాలా మంది పాటించడం లేదు కానీ, పూర్వం ఆలయానికి వెళ్ళేటప్పుడు, పురుషులు చొక్కా లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు, వేగంగా పురుషుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని, అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయంగనుక, అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు. లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.

భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో, గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది. కర్పూర హారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి. తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై, భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి...

ఇక మన చానెల్ community లో post చేసిన ‘కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి క్షేత్ర పాలకుడు ఎవరు?’ అనే quiz కి సంబంధించిన వివరణలోకి వెళితే..

సాధారణంగా వైష్ణవ క్షేత్రాలకు శివుడు... శైవ క్షేత్రాలకు విష్ణువు క్షేత్ర పాలకులుగా వ్యవహరిస్తుంటారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల క్షేత్రంలో, శివుడు క్షేత్ర పాలకుడిగా వున్నాడు. ఈ స్వామియే తిరుమల క్షేత్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. అలాంటి క్షేత్ర పాలకుడైన శివుడు, తిరుమల ప్రధాన గర్భాలయం ఎదురుగా గల ధ్వజస్తంభం దగ్గర శిలగా, అంశ రూపంలోనూ... ప్రస్తుతం 'గోగర్భ క్షేత్రం' గా పిలువబడుతోన్న 'పాండవ తీర్థం' దగ్గర, పూర్ణ స్వరూపంతోనూ భక్తులకు దర్శనమిస్తున్నాడు.

అయితే, క్షేత్ర పాలకుడైన శివుడు, ఇలా శిలా రూపంలో రెండు ప్రదేశాలలో ఉండటానికి కారణం లేకపోలేదు. క్షేత్ర పాలకుడైన శివుడు పూర్వం, 'రాతి గుండు' రూపంలో రాత్రి వేళలో శ్రీవారి ఆలయం చుట్టూ తిరిగేవాడని పురాణ విదితం. పూజారులు ఉదయం వేళలో ఆలయం తలుపులు తీసేటప్పుడూ, రాత్రి వేళలో తలుపులు మూసేటప్పుడూ, తప్పని సరిగా క్షేత్రపాలక శిలకు తాళాలు తాకించి, ఆయన అనుమతి లభించినట్టుగా భావించి, ఆ పనులు చేసే వారు. ఇప్పటికీ ఇదే పద్ధతి కొనసాగుతుంది. అయితే, ఇప్పుడు తిరుమల ప్రధాన గర్భాలయంలో అంశావతారం మాత్రమే ఉండడానికి కారణం..

ఒకసారి పూర్ణశిల అంటే రాతి గుండు, రాత్రి సమయంలో ఆలయం చుట్టూ తిరుగుతూ వుండగా, ఒక చిన్న పిల్లవాడు ప్రమాదానికి గురయ్యాడని చెబుతారు. అప్పటి నుంచీ క్షేత్ర పాలక శిలయొక్క అంశావతారాన్ని మాత్రమే ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గర వుంచి, పూర్ణ స్వరూపాన్ని, పాండవ తీర్థం దగ్గర ఉంచారు. ప్రతి యేటా, 'మహా శివరాత్రి' పర్వదిన సందర్భంగా, శ్రీవారి ఆలయం నుంచి పాండవ తీర్థానికి చేరుకున్న పూజారులు, క్షేత్ర పాలక శిలకి, వెండి ఆభరణాలతో రూపురేఖలు కల్పించి, 'ఏకాదశ రుద్రాభిషేకం' చేస్తారు. ఈ సందర్భంగా, స్వామివారికి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి, వాటిని ప్రసాదంగా, అక్కడి భక్తులకు పంచుతారు. స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని వీక్షించిన వారికి మోక్షం లభిస్తుందని చెబుతారు.

🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home