Was being Kaikeyi easy? ‘కైకేయి’ది స్వార్ధమా? త్యాగమా?


‘కైకేయి’ది స్వార్ధమా? త్యాగమా?
రాముడు అడవుల పాలైనా.. భర్త మరణానికి ప్రత్యక్ష కారకురాలైనా..

రామచరితం రసరమ్య భరితం. రామాయణంలాగా లోక వ్యవహారాన్ని విస్పష్టంగా బోధించే కావ్యం మరొకటి లేదన్నది, ఆర్యోక్తి. ఆదికవి వాల్మీకి నుంచి నేటి వరకూ, రమణీయమైన రామగాధ, పలుభాషలలో, పలు రీతులలో రూపు దిద్దుకుంటూ, భారతావని లోనే కాకుండా, భారతీయుల సంస్కృతి ప్రసరించిన అన్య దేశాలలోనూ ప్రచార ప్రశస్తి పొందింది. రామాయణం ఆదికావ్యం. వాల్మీకి మహర్షి ఈ మహాకావ్యాన్ని రచించడానికి కారణం, బ్రహ్మానుగ్రహం. భారత దేశంలోనూ, భారతీయ వాఙ్మయంలోనూ, సీతారాములు ప్రతి అణువులోనూ, ప్రతి అక్షరంలోనూ ప్రకాశించే దైవదంపతులు. రామాయణాన్ని చదవడం వల్ల, తల్రిదండ్రుల పట్ల భక్తి, సోదర ప్రీతి, జ్యేష్టానువర్తనం, లోకమర్యాదానుసరణం, ప్రతిజ్ఞా పాలనం, ఆశ్రిత వాత్సల్యం, స్వామికార్య నిర్వహణం, స్వార్ధపరత్వ నివృత్తి, చిత్త శుద్ధీ, పరోపకార బుద్ధివంటి అనేక సద్గుణాలు అలవడడానికి ప్రోత్సహిస్తుంది. అటువంటి రామాయణ గాధలో, కైకేయి తన దాసీ అయిన మంథర మాటలు విని, రాముడిని ఆడవుల పాలుజేసి, భర్త మరణానికి కారకురాలై, అటు కన్నబిడ్డ ప్రేమకూ, ఇటు పెంచిన బిడ్డ మామకారానికీ దూరమైన అభాగ్యురాలిగా, మనలో చాలామందికి తెలిసిన విషయమే.. కానీ, ఆ తల్లి అలా చేయడం వెనుక చాలామంది ఊహించని మరో కోణం ఉంది.. వీడియోను చివరిదాకా చూసిన తరువాత మాత్రమే, మీ అభిప్రాయాలను comments ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/1Om0PMDewuQ ]


నూతన వీక్షకులకు మనవి: వీడియోను చూడకుండానే, Thumbnail చూసో, Title చూసో, అర్ధంపర్ధంలేకుండా చేసే comment లను నిర్మొహమాటంగా delete చేయడమే కాకుండా, ఇకముందు మన channel లో కామెంట్ చేసే పరిస్థితి లేకుండా block చేయడమనే తప్పనిసరి పరిస్థితులలోకి నన్ను తీసుకువెళ్లరని ఆశిస్తున్నాను. ప్రతి ఘటనకీ వేర్వేరు కోణాలు ఉన్నట్లే, రాముడి పినతల్లి కైకేయి విషయంలోనూ మరో కోణం కనిపిస్తుంది. అసలు కైక తన బిడ్డడు భరతుడిని దాసీకి వదిలేసి, సవతి కొడుకైన రాముడినే తన బిడ్డడిగా పెంచింది. ఇది చాలు ఆమెకు రాముడంటే ఎంత ప్రేమో తెలియజేయడానికి. రధాలు నడపటంలో, బాణాలు వదలటంలో ఆమె సాటిలేని మేటిగా చెప్పబడుతుంది. రాముడికి ధనుర్విద్యలో తానే మొదటి గురువుగా ప్రస్తావించబడింది. దశరధుడితో కలసి ఎన్నో దేవాసుర సంగ్రామాలలో పాల్గొనటం వల్ల, అసురులు ఎటువంటి వారో, ఎంతటి దుర్మార్గులో ఆమెకు బాగా తెలుసు. అటువంటి వారిని సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి, రాముడిని పసి వయస్సునుంచే సర్వసన్నద్ధం చేసిందామె. మరి అంతటి ప్రేమ మూర్తి, ఒక దాసి మాటలకు నిజంగానే తలవంచిందా?

మంథర కేకయ రాజు అంతఃపురం నుంచి, కైకేయితో వచ్చిన దాసి. వట్టి దాసీగాక, చెలికత్తెగా కూడా చెప్పబడింది. రామకథను అరణ్యం వరకూ నడపడంలో, ఈవిడ పాత్ర ముఖ్యమని అంటారు. ఆలోచిస్తే, రాక్షస సంహారానికై రాముడి వాంఛితార్ధం నెరవేరడానికి, ఈమె సూచనలు ఒకరకంగా ఉపయోగ పడినట్లే.. ఎందుకంటే, అనుకున్న ప్రకారం రామ పట్టాభిషేకం జరిగి ఉంటే, రామాయణమే లేదు! పట్టాభిషేక భంగానికి ప్రధాన హేతువు మంథరా? కైకేయా? లేక స్వయంగా రాముడేనా? అన్న విషయాలను పక్కన బెడితే, కైకేయి మనస్సును మంథర విషపూరితం చేసిందనేది మనం చదివిన వాస్తవం. తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయాలనీ, రాముడు నారబట్టలు కట్టి 14 ఏళ్లు అరణ్యవాసం చేయాలనీ, దశరధుడిని కోరింది కైక. నిజానికి ఆమెకు రాముడితో ఉన్న అనుబంధంలో వెయ్యవవంతు కూడా, దాసీకి అప్పగించిన తన బిడ్డడు భరతుడితో పంచుకోలేదు. ఇంతవరకూ జరిగినది ప్రతి హిందువుకూ తెలిసిన, చాలా పుస్తకాలలో చదివిన విషయమే. నిజానికి గ్రంధమో, పుస్తకమో అనగానే, పత్రుల పరంగానో, నిడివి పరంగానో, కొన్ని పరిమితులుంటాయి. ప్రతి విషయాన్నీ కూలంకషంగా ప్రస్తావించడం ఎంతటి రచయితకైనా, కవికయినా సాధ్యపడదు. కొన్ని ముఖ్య ఘట్టాలను, అవసరం, అవకాశం ఉన్నంత మేరకే పొందుపరచడం జరుగుతుంటుంది.

అలా చాలా గ్రంధాలలో ప్రస్తావించబడని విషయాలు చాలానే ఉంటాయి. రాముడి అరణ్య వాసం మొదలై, దండకారణ్యంలోకి అడుగు పెట్టినప్పటి నుంచీ, ముందుగా అక్కడి తపోధనులను హింసిస్తున్న 14 వేల మంది రాక్షసులను అంతమొందించి, మునిపుంగవులను విముక్తులను గావించాడు. ఇది ఎంతమందికి తెలుసు? ఆ సమయంలోనే నీలమేఘశ్యాముడిపై మనస్సుపడి, లక్ష్మణుడి చేత భంగ పడిన శూర్పణఖ, అతిలోక సౌందర్యవతి అయిన సీతమ్మను అతని వద్దకు చేర్చే ప్రయత్నంలో విఫలమై భంగపడినట్లు అబద్ధమాడి, తన అన్న రావణాసురుడిని రెచ్చగొట్టింది. ఆ తరువాత సీతాపహరణం, చివరకు రామ రావణ యుద్ధం, పెద్ద ఎత్తున రాక్షస సంహారం చేయడమనే విషయాలు తెలిసినవే.. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసినది, రాముడు అవతార పురుషుడు. రామావతార ముఖ్య ఉద్దేశం, ఆ యుగంలో ధరణిని పట్టి పీడిస్తున్న రాక్షస పీడనుంచి విముక్తినొందించమని భూదేవి శ్రీమహావిష్ణువును కోరగా, దశావతారాలలో ఏడవదయిన రామావతారం సంభవించింది. ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన కృష్ణావతారం లాగా, తన దైవీక శక్తులను రాముడు ఎన్నడూ వాడక పోయినా, రాముడికి తన జన్మ రహస్యం తెలియకుండానే ఉందంటారా? మరి అన్నీ తెలిసిన రాముడికి, తన పట్టాభిషేకం జరిగితే రాజ్యపాలన తప్ప, రాక్షస సంహారం జరుగదని తెలియకపోవడం నమ్మశక్యమేనా?

సింహాసనం ఎక్కితే రాముడు రాజ్యపాలన తప్ప మరో విషయాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదని తెలుసుకున్న కైకమ్మ, రాముడిపై తనకున్న ప్రేమను అణచుకుని, లోక నిందలను సైతం భరించడానికి సిద్ధపడి, భరతుడికి రాజ్యం ఇవ్వాలనే నిబంధననూ, రాముడిని అడవులకు పంపటానికి దశరధుడు అంగీకరించడుకాబట్టి, అరణ్యవాసపు నియమాన్నీ పెట్టి, తనొక మొండి రాక్షసిగా అపనిందలను కూడా భరించింది. రాముడికి ఈ విషయం తెలియబట్టే, ఆమె వాంఛితానికి తలవంచి, అడవికి వెళ్లాడు. తండ్రి మాట నిలబెట్టడానికని అందరూ అనుకున్నా,  అమ్మ ఆశయాన్ని అమలు పరచటం కోసమని, కొద్దిగా ఆలోచిస్తే అర్ధమవుతుంది. దేశక్షేమం కోసం, భర్తను చంపుకున్న అధమురాలిగా, సవతి బిడ్డడిని కానలకు పంపిన దుర్మార్గురాలిగా నిలిచిపోయిన ‘కైకమ్మ’, నిజానికి ఇవన్నీ రాముడిపై ప్రేమతోనే చేసిందనేది తేటతెల్లమవుతుంది. పిల్లల భవితకై తల్లులు పడే తపనకు, ఈ వీడియో అంకితం.. మాతృదేవోభవ.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, మంచిని మాత్రమే ప్రబోధించే మన సనాతన ధర్మానికి సాష్టాంగ ప్రాణామాలు..

జై శ్రీరామ!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home