Humbling of Thondaman's pride | తొండమాన్ గర్వభంగం!


తొండమాన్ గర్వభంగం! భవిష్యోత్తర పురాణంలోని గాధ! 
అహంకారం గర్వం ఎంత కొంచమైనా నిలువునా దహించివేస్తుంది!

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేఙ్కటేశ్వరునికి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి పద్మావతీ దేవిని, కన్యాదానమిచ్చిన మహానుభావుడు, తొండమండలాధీశుడైన ఆకాశరాజు. ఆ ఆకాశరాజు సోదరుడే, తొండమానుడు. అతడు అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై, తిరుమల భవ్య మందిరమైన ‘ఆనందనిలయ’ నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వేఙ్కటపతిని సేవించుకునేది, తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే, నిత్యం స్వామితో నేరుగా సంభషణ చేసేవాడు! మరి అంతటి వాడికి గర్వభంగమా!? అసలేం జరిగిందో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను comment చేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/hAPcbmTx3F4 ]


అలా తొండమానుడు స్వామి వారితో అత్యంత సన్నిహితంగా మెలగుతూ, సేవలు చేసుకుంటుండగా, ఒకరోజు ఆకాశవాణి, “ఆహా! ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా! శ్రీనివాసుని ప్రతి కైంకర్యుమూ నీ చేతుల మీదుగా, శ్రద్ధా భక్తులతో, అంగ రంగ వైభవంగా చేయిస్తున్నావు. రాజా! నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా” అని అన్నది. అంత వరకూ స్వామి గురించి తప్ప, మరో ఆలోచన లేని తొండమానుడు, ఆకాశవాణి మాటలు విని, “నిజమే కదా! నా వంటి భక్తుడు మరొకడు లేడు” అని అనుకున్నాడు.

అహంకారమెంత దుర్భరమైనదో కదా? చివరకు మహనీయుడైన తొండమానుడిని సైతం విడువలేదు! అహంకారమే సకల దురుతాలకూ మూలం. అహంకారం, గర్వం ఎంత కొంచమైనా, అది ఉన్నవాడిని నిలువునా దహించి వేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా? ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణు వేడిన పరమ శత్రువునైనా అక్కున జేర్చుకుంటాడు. అలాంటిది, సర్వ సుగుణవంతుడు, మహాభక్తుడు అయిన తొండమానుడి పతనం జరుగనిస్తాడా? వెంటనే తొండమానుడికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి.

ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషిస్తూ, “నా వంటి భక్తుడు ఈ ముజ్జగాలలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజ భక్తులు ఎవరైనా ఉన్నారా దేవాది దేవా?” అని ప్రశ్నించాడు. జగన్నాటక సూత్రధారి అప్పటికి చిరు మందహాసంతో సమాధానమిచ్చి, తొండమానునికి గుణపాఠం నేర్పే నాటకానికి శ్రీకారం చుట్టాడు.

ఒకరోజు తొండమానుడు, రోజూలాగానే, ఉదయాన్నే స్వామి దర్శనం చేసుకుని, నిశ్చల భక్తితో ఆ పరమ పురుషుని ధ్యానించి, కలిదోష నివారణములైన శ్రీపాదాలను దర్శించాడు. శ్రీహరి పాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల లాగా ప్రకాశిస్తున్నాయి, తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కానీ ఆశ్చర్యం! కనులు మిరుమిట్లు గొలిపే అంతటి సువర్ణకాంతులలోనూ, రాజుకు వాడిపోయి, మట్టి అంటుకుని ఉన్న కమలాలూ, తులసీ దళాలూ కనిపించాయి. “ఏమిటీ చిత్రము? వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. అయినా ఈ సుమాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని సువర్ణ కమలాలతో తప్ప పూజించను కదా!” అని తర్కించుకుని, నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు. ఆ దయామయుడు చిరు మందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు.

“నాయనా! ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేద పల్లెలో, ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి, ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి, అందులో నా చెక్క బొమ్మ ఒకటి మలచి, అందులోనే నన్ను భావించుకుంటూ పూజిస్తుంటాడు. భక్తుడు ఎలా భావిస్తే, అలా కారుణించడం నా బాధ్యత కదా! ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు! పాపం భీముడికి మంత్ర తంత్రాలు, తపో యోగాలూ తెలియవు. త్రికరణ శుద్ధిగా, నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా, అన్నం తింటున్నా, ఎప్పుడూ నా ఊసే! నా ధ్యాసే! తన కులాచారం, ధర్మం, ఎల్ల వేళలా పాటిస్తాడు. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి, తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు పూర్తిజేసుకుని, నా పేరు స్మరిస్తూ, తులసీదళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే, నీకిక్కడ కనబడుతున్నాయి. అతనే కాదయ్యా.. వారి కుటుంబమంతా అంతే.. నా మాట, నా పాట తప్ప, వారికింకేదీ రుచించదు. నేను ఆ భీమకులాలుని భక్తి పాశాలకు బందీనయిపోయాను!”

స్వామి చెప్పిన మాటలతో, విషయం తెలిసి వచ్చింది తొండమానుడికి. భాష్ప పూరిత నయనాలతో, “ప్రభూ..!” అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి, “జగన్నాథా! నా తప్పును మన్నించు. నా వంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచమెంత? నా అనుభవమెంత..? నా పై దయతో, నా బుద్ధి దోషాన్ని పోగొట్టి, నిజమైన భక్తుడిని చేశావు తండ్రీ. ఇదుగో, ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనం జేసుకుని వస్తాను. నాకు సెలవు ఇప్పించండి” అని చెప్పి బయలుదేరాడు రాజు.

నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ |
మద్భక్తాః యత్రగాయంతి తత్ర తిష్ఠామి నారద! ||

అన్న సూక్తి ప్రకారం, భీముని దర్శనం తీర్థయాత్రగా భావించి, తొండమానుడు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలి నడకనే ప్రయాణము చేయాలనే నియమం ఉంది కదా! అలా రాజు భీముడి ఇల్లు చేరే సమయానికి, స్వామి భజనలతో మారు మ్రోగుతోంది భీముడి ఇల్లు. రాజు అతని పాదాలపై పడి, “అయ్యా! శ్రీ వేఙ్కటేశుని ద్వారా నీ మాహాత్మ్యాన్ని తెలిసుకున్నాను. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే, నీ భక్తిని కొనియాడాడు! నీ పాదధూళి తాకి, పునీతుడనవుదామని వచ్చాను” అని అన్నాడు తొండమానుడు. చక్రవర్తి అంతటి వాడు తన పాదలు తాకడం ఏమిటని భీముడు, వెనక్కు జరిగి చేతులు జోడించి, “రాజా! అంత పని చేయవద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావులు మీరు” అని అన్నాడు.

ఇంతలో గరుడారూఢుడైన వేఙ్కటేశుడు, లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు. భీముడి ఆనందానికి అంతులేకుండా పోయింది. “ఓ దయామయా! నా పూరి గుడిసెకు వచ్చారా! మీ లీలలే లీలలయ్యా.. మా తప్పులను ఎన్నక, దయావర్షం కురిపించే కాలమేఘం స్వామీ మీరు! నేను హనుమంతుని లాగా వారధి దాటి మిమ్మల్ని మెప్పించలేను.. శబరి లాగా భక్తి శ్రద్ధలు చూపి మిమ్మల్ని ఆకట్టుకోలేను.. జనకుని లాగా సీతమ్మను ఇవ్వలేను.. నారదుని లాగా, గంధర్వగానంతో మీ గుణగణాలను కీర్తించలేను.. జటాయువు లాగా మీ కోసం నా ప్రాణాలు ఇవ్వలేను.. అయినా, మిమ్మల్ని శరణువేడిన నన్ను కరుణించిన కరుణామూర్తులు మీరు” అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో అంటున్న మాటలను, వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి.

మహాభక్తురాలైన భీముడి భార్య తమాలిని కూడా, గద్గద స్వరంతో అమ్మను కీర్తించింది. ఆది దేవుడూ, మహాలక్ష్మీ స్వయంగా తమ యింటికి వచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదని బిడియ పడింది. అది గమనించిన శ్రీనివాసుడు, “తమాలినీ! నీ చేతులతో ఏది వండి పెట్టినా తింటానమ్మా” అని అన్నాడు. తమాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. తనకు పెద్దల ద్వారా తెలిసినంతలో, యథా శక్తిగా, శుచిగా, తామర తూడులతో వంటకాన్ని వండి, లక్ష్మీ నారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు అలమేలుమంగా, శ్రీనివాసులు. తొండమానుడు చూస్తుండగానే, దివ్య శరీరధారులై, వైకుంఠ ధామానికి చేరారు, భీమకులాల దంపతులు.

ఇదంతా ఆశ్చర్యంగా చూస్తుండిపోయిన తొండమానుడు, “ప్రభూ! మరి నా సంగతేమిటి?” అని ప్రాధేయ పడ్డడు. అప్పుడు జగన్నాథుడు, “రాజా! నీ తరువాతి జన్మలో, నీవు విరాగివై, నా ఏకాంత భక్తుడవవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది” అని చెప్పి, తొండమానుడిని ఊరడించాడు. ఇలా తొండమానుడికీ, భీముడికీ ముక్తిని ప్రసాదించాడు భక్త సులభుడయిన శ్రీ వేఙ్కటేశ్వరుడు.

ఇక ఈ కథలోని నీతి విషయానికి వస్తే, అహంకారం, గర్వం, ఎంతటి వారికైనా, ఎంత కొంచమైనా తగదు. మహనీయుడైన తొండమానుడికే, అహంకారం వలన భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మన సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి, ఎప్పుడూ వినయ విధేయతలతో మెలగాలి. కుల ధర్మం, కర్తవ్యం పాటిస్తూ, భగవంతుడిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని, ఆయన కరుణిస్తాడని నిరూపించాడు, భీముడు. కులం కన్నా, గుణం ప్రధానం అనేది మనం గమనించాలి.

ఓం నమో వేఙ్కటేశాయ!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home