The Journey to Hell - Story of Kathopanishad (Nachiketa) | కఠోపనిషత్ కథ - నచికేతుడి పితృభక్తి!


కఠోపనిషత్ కథ - నచికేతుడి పితృభక్తి!
యమధర్మ రాజు నుండి అతి రహస్యమైన విద్యను ఎలా పొందాడు?

పూర్వం వాజస్రవసుడనే సత్పురుషుడుండేవాడు. గౌతమవంశసంజాతుడైన అతడు, గౌతముడు, ఔద్దాలకుడు, ఆరుణి అనే పేర్లతోకూడా ప్రసిద్ధుడు. అతడొకసారి విశ్వజిత్ యజ్ఞం చేశాడు. ఆ బృహత్ యజ్ఞం చేసినవారు, యాగం చివరలో, తమ సర్వస్వాన్నీ దానం చేసేయాలి! వాజస్రవసుడు కూడా అలాగే తనకున్నదంతా దానం చేయసాగాడు. అనాదినుంచీ భారతీయులకు పశువృక్షాదులే ముఖ్యమైన సంపదలు. అందులోనూ, గో సంపద అతి ముఖ్యమైనది. మరకత మాణిక్యాలూ, హిరణ్య రజితాలకంటే గొప్పది గో సంపద. కాబట్టి, వాజస్రవసుడు ఋత్వికులకు గోదానాలు చేయసాగాడు. వాజస్రవసుడికి, మహాబుద్ధిశాలి, గుణసంపన్నుడు, పితృభక్తి పరాయణుడైన పుత్రుడున్నాడు. అతడి పేరు నచికేతుడు. చిన్న వయస్సులోనే సకల ధర్మ శాస్త్రాలనూ అభ్యసించాడు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/D9Uk9VwwZTs ]


ఆ సమయంలో నచికేతుడి దృష్టి, తన తండ్రి దానమిస్తున్న గోవుల మీద పడింది. ఆ గోవులు చాలావరకూ ముసలివి, పళ్ళు లేనివి, పాలివ్వడానికీ, ప్రసవించడానికీ శక్తిలేనివని గమనించిన నచికేతుడు, ఇలా అనుకున్నాడు.. “ఎవరైతే నిస్సారమైన గోవులను దానం చేస్తారో, వారికి సద్గతులుండవని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అయ్యో! మహనీయులైన మా తండ్రిగారు, విశిష్టమైన విశ్వజిత్ యజ్ఞము చేసికూడా, ఈ తామస దానము వలన పూర్ణఫలాన్ని పొందలేక పోతున్నారే” అని బాధపడి, చివరిలోనైనా తండ్రిగారికి హితవు చెబుదామని తలచి ఇలా అన్నాడు.. “తండ్రీ! ఈ యజ్ఞంలో మీకున్నవన్నీ దానం చేయాలి కదా? మరి నన్ను ఎవరికిస్తున్నారు?” అని అడిగాడు. బాలచేష్టగా భావించి, అతడి ప్రశ్నకు బదులివ్వలేదు వాజస్రవసుడు. “నన్నెవరికిస్తున్నారు నాన్నా?” అని నచికేతుడు మళ్ళీ అడిగాడు.

“సహనావవతు..” మొదలైన శాంతి మంత్రాలతో ప్రతిధ్వనిస్తున్న యాగశాలలో ఉన్న వాజస్రవసుడు, సహనం వహించాడు. తండ్రికి మహా పుణ్యాన్ని ఎలాగైనా కట్టబెట్టాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న నచికేతుడు, మూడవసారి కూడా అదే ప్రశ్న వేశాడు. ఇక సహనాన్ని కోల్పోయిన వాజస్రవసుడు, “నిన్ను యమునికిస్తాను” అని కోపంగా అన్నాడు! అలా మాట జారిన వాజస్రవసుడు, “అయ్యో! కోపంలో నేనెంత మాటన్నాను? ‘తన కోపమే తన శత్రువు’ అన్న సూక్తిని చిన్న నాటి నుంచీ వింటూ వచ్చినా, ఒక్క క్షణం సహనాన్ని కోల్పోయి, ఎంత తప్పుచేశాను!” అని బాధ పడ్డాడు.

అప్పుడు నచికేతుడు తన మనస్సులో, “దానమిచ్చేటప్పుడు, అది స్వీకరించేవారికి పనికివచ్చేదై ఉండాలి. నా వంటి సామాన్యుడు, ధర్మ ప్రభువైన యముడికి ఏ విధంగా ఉపయోగపడగలడు? అయినా, పితృవాక్య పాలనమే పుత్రుడి ధర్మం” అని అనుకుని, బాధపడుతున్న తండ్రిని చూచి ఇలా అన్నాడు.. “తండ్రీ! విచారించవద్దు. మన పూర్వీకులందరూ సత్యనిష్ఠాగరిష్ఠులు. అన్న మాట ఎన్నడూ జవదాటి ఎరుగని వారు. సత్యమే ఈ చరాచర సృష్టికి మూలాధారము. సత్యభ్రష్టుడైన వాడికి నరకం తప్పదు.. తండ్రీ! మీరు అన్న మాటను నేను సత్యము చేస్తాను. నా గురించి విచారించకండి. పండిన పంట ఎలా జీర్ణమయి పోతుందో, అదే విధంగా, పాంచ భౌతిక శరీరమూ, పుట్టి పెరిగి, మళ్ళీ ఆ పంచ భూతముల లోనే లీనమవ్వాలి.. కాబట్టి, ఈ శరీరం శాశ్వతం కాదు. సత్యమొక్కటే శాశ్వతము. సత్యమే భగవంతుడు. కనుక బాధ పడకుండా, యముడి దగ్గరకు పోవడానికి అనుజ్ఞ ఇవ్వండి.”

ఇలా తన అమృత వాక్కులతో సుధలను కురిపించాడు నచికేతుడు. దశరథ మహారాజు ఎలా అయితే శోకతప్త హృదయంతో రాముడిని ఆడవులకు పంపాడో, అలా వాజస్రవసుడూ, బాధాతప్త హృదయంతో నచికేతుడిని యముడి దగ్గరకు పంపాడు. ఆ యమపురికి వెళ్ళే దారి అత్యంత దుర్గమమైనది. ఎంతో పుణ్యం చేసుకున్న వారు కూడా అంత సులభంగా దాటలేని వైతరణీ నదిని, నచికేతుడు తన సత్యసంధత, పితృభక్తి ప్రభావాలతో సునాయాసంగా దాటి, యమపురికి చేరాడు. తను చేరే సమయానికి యమ ధర్మరాజు నగరంలో లేరని తెలుసుకుని, ద్వారం దగ్గరే నిరీక్షించాడు. అలా ఆ పసివాడు, మూడు రోజులు అన్నపానీయాదులు లేకుండా కాలుని కోసం నిరీక్షించాడు.

మూడు దినాల అనంతరం ధర్ముడు వచ్చాడు. మహా తేజస్సుతో అగ్నిలాగా వెలిగి పోతున్న నచికేతుడిని చూసి, “అయ్యో! తెలియక నా వలన ఎంత అపరాధం జరిగింది? ధర్మానికి రాజునైన నా ఇంటనే ఇంతటి అధర్మం జరిగినదే! ఇంట్లోని వారి వలన తప్పు జరిగినా, ఆ తప్పుకు బాధ్యత యజమానిదే! అగ్నితుల్యుడైన అతిథి ఎవరింట్లో పస్తుంటాడో, వాడి ఇష్టాపూర్తులూ, పుత్రులూ మొదలైన సంపదలు నశిస్తాయి! నిప్పును తెలిసి తాకినా, తెలియక తాకినా కాలక మానదు. అలాగే తెలిసి చేసినా, తెలియక చేసినా, చేసిన తప్పుకు శిక్షను అనుభవించక తప్పదు. ఈ అధర్మ కార్యానికి ఫలితము నాకు రాక మానదు.

ఇప్పటికైనా ఈ అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరిస్తాను” అని నిశ్చయించుకుని, యముడు నచికేతుడి వద్దకు వెళ్ళి, “అభ్యాగతః స్వయం విష్ణుః.. కావున చిన్న వాడివైనా నీకు నమస్కరిస్తున్నాను. నా నమస్కారమును స్వీకరించు. ఇంటికి వచ్చిన అతిథి అగ్ని దేవునితో సమానుడని తెలిసి కూడా, నిన్ను మూడు రోజులు నిరీక్షింపజేసినందుకు నన్ను క్షమించు. నాకు శుభం కలిగేటట్లు ఆశీర్వదించు. మూడు రోజులు నిన్ను కష్ట పెట్టినందుకు ప్రాయశ్చిత్తంగా, నీకు మూడు వరాలను ప్రసాదిస్తాను.. కోరుకో..” అని అన్నాడు.

వంశ దీపకుడైన నచికేతుడు, ధర్మదేవతతో ఇలా అన్నాడు.. “ఓ యమధర్మరాజా! మా తండ్రిగారు ఆందోళనా రహితుడు, శాంత చిత్తుడు అయ్యేటట్లు ఆశీర్వదించండి. నేను ఇంటికి చేరిన తరువాత, ఆయన నా పై కోపమును విడచునట్లు ఆశీర్వదించండి. నాకు అగ్ని విద్యను ఉపదేశించండి” అని కోరాడు. యముడు ఆ వరములను ప్రసాదించి, మూడవ వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు నచికేతుడు, “స్వామీ! ఆత్మ శాశ్వతమని కొందరు, కాదని మరికొందరు అంటున్నారు. ఈ సందేహము తీరేటట్లు, నాకు అతి రహస్యమైన బ్రహ్మ విద్యను ఉపదేశించండి” అని ప్రార్ధించాడు.

ఆత్మవిద్యను యోగ్యత, అర్హతలున్న వారికే బోధించాలి. అనర్హులకు బోధిస్తే, అది వారికీ, సమాజానికీ హానికారకమని తెలిసిన యమధర్మరాజు, నచికేతుడు జ్ఞానోపదేశానికి అర్హుడో కాదో తెలుసుకో దలచాడు. “ఈ విద్యను నేర్చుకోవడం చాలా కష్టము. ఇంకేదైనా వరం కోరుకో. ఉత్తమ సంతానం, ఏనుగులు, గుఱ్ఱాలు, ఆవులు, సిరిసంపదలు, ఇంకా మానవులకు దుర్లభమైన భోగభాగ్యాలు ఏవైనా కోరుకో.. వెంటనే తీరుస్తాను. ఈ భూమండలాన్నంతా కోరినా ఇచ్చేస్తాను. దీర్ఘాయువు, అమరత్వము కోరుకున్నా ప్రసాదిస్తాను.. ఆత్మవిద్య తప్ప” అని ప్రలోభ పెట్ట జూశాడు కాలుడు. ధీరుడైన నచికేతుడు, ఐహికార్థాలను తృణప్రాయంగా ఎంచి, ఆత్మవిద్యను నేర్చుకోవడానికే ఉత్సుకతను చూపించాడు. నచికేతుని పట్టుదలను చూసి సంతోషించి, ప్రలోభాలకు లొంగని అతడు ఆత్మవిద్యను నేర్చుకోవడానికి అర్హుడని నిశ్చియించుకుని, అతడికి తెలియజేసిన వివరణే కఠోపనిషత్ సారము..

ఇక ఈ కథలోని నీతి విషయానికి వస్తే.. దానమిచ్చే సమయంలో, మన వద్దనున్నవాటిలో మంచివీ, గ్రహీతకు ఉపకరించేవీ మాత్రమే ఇవ్వాలని, నచికేతుడు మనకు బోధించాడు. ఇదే ఉత్తమ దానం యొక్క లక్షణము. పితృ వాక్య పాలనం, పుత్రుల ప్రథమ కర్తవ్యం. అంతేగాక, తండ్రి అడగకుండానే, అప్రియమైనా, తండ్రికి హితవు చేయాలని తపించేవాడు, ఉత్తమ పుత్రుడు. శ్రీరాముడు, భీష్మ పితామహుడు, నచికేతుడు, ఈ కోవకు చెందిన వారు. తండ్రికి పూర్ణ దాన ఫలం ఇప్పించాలన్న దృఢసంకల్పం గలవాడు, నచికేతుడు. తండ్రి అన్న మాటను నిజం చేయటానికి, తన ప్రాణాలనే తృణప్రాయంగా ఎంచి, యమపురికి బయలుదేరాడు. ఇటువంటి పితృభక్తి పరాయణులు మనకు ఆదర్శ ప్రాయులు. క్షణికావేశం మనచేత ఎంతటి తప్పునైనా చేయిస్తుంది. పసివాడి మాటలకు విసుగు చెంది, సహనం కోల్పోయిన వాజస్రవసుడు, “యమునికిస్తాను” అని నోరు జారి, తరువాత పశ్చాత్తాప పడి ఏం లాభం? కాబట్టి, ఎప్పుడూ శాంత చిత్తంతో ఉండాలి.“అభ్యాగతః స్వయం విష్ణుః” అన్న సూక్తిని మనకు తెలియజేశాడు యమధర్మరాజు. అతిథిని నిరీక్షింపచేయవలసి వచ్చిందని ఎంతో బాధపడ్డాడు. దిక్పాలకుడయి ఉండి కూడా, తనను క్షమించమని ఒక పసి బాలునితో అన్నాడు! సకల శాస్త్రాలూ తెలిసి ఉండి కూడా నచికేతుడు, తన వంటి సామాన్యుడు యమునికి ఎందుకు పనికివస్తాడని అనుకుని, వినయంతో మెలగడం మనం నేర్చుకోవాలి.

సర్వేజనాః సుఖినోభవంతు!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home