గరుడ పురాణం - మనిషి పాపపుణ్యాలను లెక్కించే శ్రవణులు - Garuda Puranam
‘గరుడ పురాణం’ ప్రకారం.. మనిషి పాపపుణ్యాలను లెక్కించే ‘శ్రవణులు’!?
ఈ కలియుగంలో, అన్ని పురాణాలలోకీ ప్రముఖమైనవిగా పరిగణించబడేవి, మూడు. వాటిలో ప్రధానదీ, ప్రజలకు శుభాలనందించేదీ, శ్రీమద్ భాగవతం. అందుకే అన్ని పురాణాలలో భాగవతం, అత్యున్నతమైనది. తరువాత విష్ణు పురాణం, ఆ తరువాత, గరుడ పురాణంగా చెప్పవచ్చు. అటువంటి గరుడ పురాణంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను వీడియోలుగా, ఇది వరకు కొన్నింటిని అందించి ఉన్నాను. వాటి playlist ను, వీడియో క్రింద description లో పొందుపరుస్తున్నాను. మనిషి సన్మార్గంలో నడుచుకోవడానికి ఉపయోగపడే, శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి స్వయంగా తెలియజేసిన మరికొన్ని విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ATV1ynLPOGs ]
“జ్ఞానసాగరా! శ్రీ మహావిష్ణూ! యమలోకంలో శ్రవణులనే వారుంటారనీ, వారు సర్వజ్ఞులనీ విని ఉన్నాను. వారిని గూర్చి తెలుసుకోవాలని కుతూహల పడుతున్నాను.” అని అన్న గరుత్మంతుడితో విష్ణుభగవానుడు.. “గరుడా! ప్రాచీన కాలంలో సమస్త స్థావర జంగమాత్మకమైన సృష్టి ఏకాకారం చెందినపుడు, నేను దానిని ఆత్మ లీనం చేసుకుని, పాల సముద్రంలో శయనించాను. అప్పుడు నా నాభికమలం నుండి బ్రహ్మపుట్టి, కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి శక్తిమంతుడై, ఏకాకారం చెందిన సృష్టిలోని ప్రాణులను, నాలుగు ప్రకారాలుగా విడగొట్టాడు. తరువాత బ్రహ్మగావించిన సృష్టిని పాలించే బాధ్యతను నేను స్వీకరించాను. ఆ తరువాత సంహారమూర్తి రుద్రుడుదయించాడు. అనంతరం సమస్త చరాచర జగత్తులోనూ ప్రాణాధారమై ప్రవహించే వాయువూ, ఆత్యంత తేజస్వి సూర్యదేవుడూ, చిత్రగుప్త సహితుడై యమధర్మ రాజూ ప్రకటితులయ్యారు..”
సృష్టిలోని ప్రాణులను విడగొట్టిన బ్రహ్మ, మరల తపస్సు చేశాడు. కొన్ని వందల ఏళ్ళు ఆయన అలాగే, నాభి కమలంలో తపస్సమాధిలోనే ఉండిపోయాడు. సృష్టిని మాత్రం అలాగే కొనసాగించాలని, లోపలి నుండే ఆదేశించాడు. అప్పుడు బ్రహ్మతో విష్ణు రుద్రాదులు, తమకు లోక వ్యవహారమెలా నడుస్తుందో, ఎవరే పాప పుణ్యాలు చేస్తున్నారో తెలియదనీ, దానికి సంబంధించిన ఏర్పాటేదో బ్రహ్మయే చేయాలనీ విన్నవించారు.
తన మంత్రాన్ని చిరకాలం పాటు ఏకాగ్రతతో, సర్వశక్తులనూ కేంద్రీకరించి జపించాలనే సంకల్పాన్ని, బ్రహ్మ వారందరికీ కలిగించాడు. వారంతా అలా చాలాకాలం పాటు చేసిన తరువాత, బ్రహ్మ తన పుత్రులుగా పన్నెండు మంది అమిత తేజస్వులూ, విశాల నేత్రులూ అయిన దేవతలను సృష్టించాడు. వారికి ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా, ఎవరేం చేసినా, ఎవరు ఏమన్నా వినే శక్తినిచ్చాడు. ఈ విశేషజ్ఞానం వల్ల, ఆ బ్రహ్మపుత్రులను శ్రవణులన్నారు. వీరి నివాసం, ఆకాశం. అక్కడి నుండే అందరినీ చూస్తూ, వింటూ, అవసరమైనప్పుడు యమధర్మరాజు, లేదా చిత్రగుప్తల వద్దకు వచ్చి, వారికి కావలసిన వివరాలనందిస్తారు. ఆ సమయంలో వారి ద్వారా ప్రాణుల ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన సర్వకర్మల సారమూ, వివేచన సహితంగా, ధర్మరాజుకు సమర్పించ బడుతుంది.
ఓయీ వైనతేయా! సంసారానికి చెందిన ప్రాణుల ముందుండే మార్గాలు నాలుగే. అవే, ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు. ఉత్తమ ప్రకృతి గల ప్రాజ్ఞి, ధర్మ మార్గంలో నడుస్తాడు. ధనధాన్యాలను సంపాదించినా, దానానికే వినియోగించిన వారు, విమానంలో పరలోకాలకు చేరతారు. మోక్షాకాంక్షతోనే జీవితంలో ప్రతి పనినీ చేసిన వారు, తమ దేహాంతంలో హంసల విమానంపై పరలోకానికి పయనమవుతారు. ఉన్న దాని తోనే బ్రతుకుతూ, అప్పుడప్పుడైనా ఉన్నంతలో యాచకులను సంతోష పెట్టిన వారిని, దేవ దూతలు గుర్రాలపై తీసుకుని పోతారు. ఏ పుణ్యమూ, ధర్మమూ చేయకుండానే బ్రతుకు వెళ్లబెట్టిన వారిని, ఇది వరకు నువ్వ విన్నట్లుగా, యమదూతలు నడిపించుకుంటూ, ఏ అసిపత్ర వనానికో తీసుకు పోతారు. శ్రవణులను భక్తితో, పక్వాన్నం, వర్ధని, జలపాత్రల ద్వారా పూజించిన వారికి, నేను స్వయంగా ప్రసన్నుడనై, ఏ దేవతలూ ఇవ్వలేనన్ని వరాలను కురిపిస్తాను. (అధ్యాయం - 17)
పక్షింద్రా! ఈ శ్రవణులు చెప్పినదంతా విన్న తరువాత, చిత్రగుప్తుడు కొన్ని క్షణాలపాటు ధ్యాన నిమగ్నుడై, ఆ మనిషి రాత్రింబవళ్ళు గావించిన పాపపుణ్యాల ఫలాన్ని, యమధర్మ రాజుకు విన్నవిస్తాడు. గరుడా! మనిషి మాట, తనువు, మనస్సులతో చేసే ప్రతి కర్మకీ, ఫలాన్ని అనుభవించ వలసినదే. నేడు నీవు విన్న ఈ విషయాలను, రేపు ప్రపంచమంతా తెలుసుకుంటుంది. అన్నదానం, దీపదానం చేసిన వారు, మహామార్గంలో సుఖ పూర్వకంగా పయనిస్తారు.
కార్తీక కృష్ణ చతుర్దశి నాటి రాత్రి చేసే దీపదానం, సర్వసుఖకారి. ఇప్పుడొకసారి సంక్షిప్తంగా దాన ఫలాలను చెబుతాను విను.. వృషోత్సర్గ పుణ్యం వల్ల, మనిషి పితృలోకానికి వెళతాడు. జలపూర్ణ ఘట దానం వల్ల, యమదూతలు సంతోషిస్తారు. పదకొండవ రోజున శయ్యాదానం చేయడం వల్ల, మనిషి విమానమెక్కి, స్వర్గలోకానికి చేరతాడు. విశేషించి, పన్నెండవ రోజు అన్ని ప్రకారాల దానాలనూ చేయాలి. పదమూడు పద దానాలను చేసినవారు, పితరులూ, పుత్రులూ కూడా, వాటి సహాయంతో మహామార్గాన్ని సుఖంగా దాటి వెళ్ళగలరు. ఎవరి భాగ్యమెలా వున్నదో, వారి మార్గ సుఖమును బట్టి తేలిపోతుంది. తన కొడుకు తాను పోయినప్పుడెలాగూ చేస్తాడు కదా అని సరిపెట్టుకోకుండా, తానే, తన జీవిత కాలంలోనే, స్వస్థ చిత్తుడై, అన్ని రకాల దానాలనూ చేసినవాడు, సర్వత్రా సుఖ పడతాడు.
విష్ణు భగవానుడి ఈ మాటలు విన్న గరుత్మంతుడు, “భగవాన్! పదమూడు పద దానాలంటే ఏమిటో తెలియజేయండి” అని అడిగాడు. దానికి శ్రీ మహావిష్ణువు, “ఛత్రం, పాదుక, వస్త్రం, ముద్రిక, కమండలువు, ఆసనం, భోజన పాత్ర, మరొక ఆసనం, జలపాత్ర, అన్నం, భోజన సామగ్రి, నెయ్యి, యజ్ఞోపవీతం.. ఈ పదమూడింటినీ పద దానాలన్నారు. ఇవన్నీ మృతుని నారకీయ మార్గంలో ఉపయోగపడి, ప్రేతానికి సుఖాన్నిస్తాయి. అంతేగాకుండా, దానమిచ్చిన వానికి కూడా గొప్ప పుణ్యాన్ని కలుగజేస్తాయి.
గృహ్ణాతి వరుణో దానం మమహస్తే ప్రయచ్ఛతి |
అహంచ భాస్కరే దేవో భాస్కరాత్ సో అశ్నుతే సుఖం ॥ (18/27)
మృతుని బంధువు, అతని ఇంటి వద్ద చేసిన దానాన్ని, వరుణుడు స్వీకరించి విష్ణువు చేతిలో పెట్టగా, దానిని భాస్కరుడు సేకరించి, ప్రేతం సుఖించేలా చూస్తాడు. ఇది వరకే చెప్పబడిన పదహారు పురాలనూ దాటి, యమునికి దగ్గరగానున్న బహుభీతికర నామక పురంలో, అంతవరకు హస్తం పరిమాణంలో వున్న శరీరం, చిటికెన వేలంత అయిపోగా, జీవుడు గాలిలో ఎగురుతూ, అక్కడక్కడ శమీపత్రాలపై కూర్చుంటూ, యముని వద్దకూ, ఆ తరువాత ఆయనతో కలసి, చిత్రగుప్త పురీ చేరుకుంటాడు.
ఆ పురి ఇరవై యోజనాలలో పరుచుకుని వుంటుంది. అక్కడుండే కాయస్థులనే దేవయోని జనితులు, అన్ని రకాల ప్రాణుల పాప-పుణ్యాలనూ పూర్తిగా గ్రహించి వుంటారు. ఇది వరకూ నేను చెప్పినట్లుగానే, యమధర్మరాజు పాపులకొకలాగా కనిపిస్తే, పుణ్యులకు మరొక విధంగా దర్శనమిస్తాడు. దానములు చేసిన వారిని, ఆ యమధర్మరాజే లేచి నిలబడి గౌరవిస్తాడు.” అని గరుడుడికి శ్రీమహావిష్ణువు వివరించాడు. ఈ విషయాలన్నీ తెలుసుకుని, మనుష్యులందరూ సన్మార్గంలో నడుచుకోవాలన్నదే నా ఆకాంక్ష..
సర్వేజనాః సుఖినోభవన్తు! లోకాః సమస్తా సుఖినోభవంతు!
Comments
Post a Comment