గురు పౌర్ణమి - శ్రీ వ్యాస పూర్ణిమ / గురు పూర్ణిమ శుభాకాంక్షలు - Guru Paurnami 2024
ఈ రోజే '21 జులై, 2024' గురు పౌర్ణమి..
అందరికీ శ్రీ వ్యాస పూర్ణిమ / గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏🏻
శ్రీ వ్యాస స్తుతి..
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ ।
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ।।
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ।
నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ।।
నారాయణుడు, ఆయన నాభి కమలం నుండి జన్మించిన బ్రహ్మ, బ్రహ్మ మానస పుత్రుడు వశిష్ఠుడు, వశిష్ఠుని సంతానమైన శక్తి, శక్తి మహర్షి పుత్రుడు పరాశరుడు, పరాశరాత్మజుడు వ్యాసుడు, ఆయన కొడుకు పరమ భాగవతోత్తముడైన శుకుడు, ఆ పరంపరలో గౌడపాదాచార్యులు, గోవింద యోగి మొదలైన వారు మన గురువులు. ఇది ఆర్ష గురు పరంపర. వీరిలో వ్యాస మహర్షి సాక్షాత్ విష్ణు రూపుడే. ఆయనకు నాలుగు ముఖాలు లేవు కానీ, బ్రహ్మ స్వరూపుడే. అటువంటి వ్యాస భగవానునికి నమస్కారం 🙏🏻
పరమపావనమైన ఆషాఢ పూర్ణిమ పర్వదినం ఇది. పూర్ణిమ అనగానే ఆధ్యాత్మిక సాధనకి చాలా యోగ్యమైనది. అందునా ఈ ఆషాఢ పూర్ణిమకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది గురు పూర్ణిమ అని ప్రసిద్ధి. ఇక్కడి నుంచి చాతుర్మాసాలలో వచ్చే పూర్ణిమలు అన్నీ, జ్ఞాన ప్రధానమైనటువంటి పూర్ణిమలు. జ్ఞానము అనగానే, ఆధ్యాత్మ జ్ఞానమే జ్ఞానము. సృష్టిలో విద్యలు ఎన్నైనా ఉండవచ్చు గాక! కానీ, “ఆధ్యాత్మ విద్యా విద్యానాం” అని భగవద్గీతలో చెప్పినట్లుగా, విద్యలన్నింటిలోకీ ఆధ్యాత్మ విద్య చాలా గొప్పది. మిగిలినవన్నీ భౌతికమైన సుఖదుఃఖాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. జీవుడిని తరింప జేసే విద్య, ఆధ్యాత్మ విద్య. అందుకే ఆధ్యాత్మకం ఎవరు బోధిస్తారో, అతనిని సద్గురువుగా భావన చేసి, ఆరాధించాలి. అసలు ఒక్క అక్షరం నేర్పిన వాడినైనా గురువుగా గౌరవించవలసిందే అని, శాస్త్రం మనకి చెబతున్నది. అందుకు విద్యలు, పరా విద్యలు, అపరా విద్యలని రెండు విధములుగా చెప్పబడుతూ ఉంటాయి. అపరా విద్యలంటే, లౌకికమైన విద్యలన్నీ అందులోకి వస్తాయి. పరావిద్య అంటే, బ్రహ్మవిద్య, మోక్షానికి పనికివచ్చే ఆధ్యాత్మ విద్య. ఈ రెండు విద్యలు చెప్పేవాళ్లూ గురువులే. ప్రతి వారినీ గౌరవించాలి. అందునా పరా విద్యను చెప్పిన వారిని భగవంతునితో సమానంగా ఆరాధించుకోవాలి.
అందుకు గురువు ఆరాధనలో..
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ।।
నిజానికి ఈ శ్లోకం భారతీయులందరికీ ఇంచుమించు వచ్చు. అంత ప్రసిద్ధి చెందినది. దీనిని బట్టి గురువును ఎలా భావించాలి అంటే, బ్రహ్మవిష్ణుశివాత్మకమైన పరబ్రహ్మగా భావించి, ఆరాధించాలని దీని యొక్క భావం. అయితే, బ్రహ్మవిష్ణుశివ స్వరూపం గురువులో కనబడుతుంది. అందుకు భారతీయ సంస్కృతి ప్రకారం, సృష్టి స్థితి లయలకు హేతువైన పరమాత్మ ఒకడున్నాడు. ఆయననే పరబ్రహ్మ అంటారు. పరబ్రహ్మ అంటే, అన్నింటికీ అతీతమై, అన్నింటినీ మించిపోయి ఉండే తత్త్వము, పరబ్రహ్మ తత్త్వం. అదే సృష్టి, స్థితి, లయలు చేసేటప్పుడు, బ్రహ్మ విష్ణు శివాత్మకంగా ఉన్నది. కనుక వీరు ముగ్గురూ ఒకే పరబ్రహ్మము యొక్క స్వరూపము. అలాంటి స్వరూపమే గురువు అని భావించాలి. ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటని మనం గమనించినట్లైతే, బ్రహ్మ అనగా సృష్టికర్త. విష్ణువు అనగా స్థితికర్త. రుద్రుడు అంటే లయకర్త, లీనము చేయువాడని అర్థం. అంటే, మరుగు పరచు వాడు, లీనము చేయువాడని. ఏదైనా పని ప్రారంభించడం సృష్టి అనుకుంటే, ఆ పనిని చక్కగా కొనసాగించడం స్థితి అనుకుంటే, దానిని పూర్తి చేసి లయం పొందటం లయం. ఈమూడూ ఒకపనిలో మూడు భాగాలు. ఆ మూడూ ఒకే చైతన్యం వల్ల నడుస్తాయి. కానీ, ఆ పనియొక్క స్థితిని బట్టి, మూడు పేర్లు.
అదేవిధంగా, మామూలు మానవుణ్ణి వివేక వైరాగ్యాలు కలిగించి, జ్ఞానాన్ని ఇచ్చి, ఒక జ్ఞాన శరీరాన్ని సృష్టిస్టారు గురువులు. అప్పుడతడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే, మనలో జ్ఞానాన్ని సృష్టించాడతను. ఆ సృష్టించిన వివేకాన్ని, జ్ఞానాన్ని, క్రమంగా మార్గం చూపిస్తూ పెంచి పోషిస్తాడు. ఆ జ్ఞానానికి స్థితి కల్పిస్తాడు. అప్పుడతను విష్ణువు. క్రమంగా ఈ జ్ఞానం ద్వారా ఈ జీవుడిని పరమాత్మలో లయం చేయిస్తాడు. ఆ లయం చేసేటప్పుడు అతడే శివుడయ్యాడు. కనుక జ్ఞానాన్ని పుట్టించి, పెంచి పరమాత్మలో లయం చేసేటటువంటి గురువు, బ్రహ్మ విష్ణు శివాత్మకుడని భావించాలి. ఇది మన శాస్త్రం చెబుతున్నటువంటి గొప్ప భావం. అందుకు ఈ శ్లోకం ప్రసిద్ధి చెందింది. అయితే, అలాంటి బ్రహ్మవిష్ణుశివాత్మకమైన గురు స్వరూపం ఎవరు? అంటే, వ్యాస భగవానుని ఆవిధంగా చూపించారు..
అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః ।
అఫాల లోచనః శంభుః భగవాన్ బాదరాయణః ।।
అని వర్ణించారు. వ్యాస భగవానునికి అసలు పేరు కృష్ణుడు. ఆయన పుట్టినప్పుడు ఆ తల్లి సత్యవతి పెట్టినటు వంటి పేరు కృష్ణుడు. పరాశర మహర్షి తపస్సు చేస్తుండగా, నారాయణుని తేజస్సు ఆయనలో ప్రవేశించి, నారాయణ ప్రేరణ చేత ఒక అప్సర కాంత సత్యవతి అనే స్త్రీగా అవతరించినపుడు, నారాయణుడు అవతరించడానికి తగిన క్షేత్రం అది అని ప్రేరణ గ్రహించి, పరాశర మహర్షి ద్వారా ఆ తేజం ఆ తల్లిలో ప్రవేశింప జేయబడి, అప్పటికప్పుడు సద్యోగర్భంగా, ఒక తపః ఫలంగా ఆవిర్భవించి, ఒక దీవియందు ఉద్భవించాడు, వ్యాస దేవుడు. పుడుతూనే ఒక యోగ్యమైన స్వరూపంతో ఆయన వ్యక్తమయ్యాడు. అందుకు ఆయనకు కృష్ణుడు అని పేరు. ద్వీపమునందు ఉద్భవించాడు కనుక, ద్వైపాయణుడని పేరు. నల్లని కాంతులతో ఉంటాడట ఆయన. మేఘము వలె ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే..
ప్రాంశు పయోద నీల తను భాసితు నుజ్జ్వల దండధారు పిం
గాంశు జటాచ్ఛటాభరణు నాగమ పుంజపదార్థ తత్త్వ ని
స్సంశయ కారు కృష్ణ మృగ చర్మ కృతోత్తర కృత్యు భారతీ
వంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యవతేయు గొల్చెదన్ ।।
అంటారు తిక్కన గారు, భారతంలో వ్యాస దేవుడికి నమస్కారం చేస్తూ.. నీల మేఘ ఛాయతో ప్రకాశిస్తూ, తేజోమయమైన రూపంతో, వర్చస్సుతో ఉంటారు వ్యాసుల వారు. అందుకు ఆయన పేరు, శరీర కాంతికి తగ్గట్లుగా, కృష్ణ అని వచ్చింది. ద్వైపాయణుడు అని కూడా పేరున్నది. ఆయన వేదములను వ్యాసం చేసి వ్యాస దేవుడయ్యారు. పైగా ఆయనకు బాదరాయణుడు అని కూడా పేరున్నది. బదరికాశ్రమంలో సాధన చేసి గ్రంథ రచన చేసినందుకు, నిరంతరం బదరికాశ్రమంలో నేటికీ ఉంటారని శాస్త్రంలో ప్రసిద్ధి. ఇప్పటికీ బదరికాశ్రమం దగ్గర వ్యాస గుహ అని ఉంటుంది. అందుకు బాదరాయణుడు అన్న పేరు కూడా ఆయనకు ఉన్నది. వ్యాసుడే మనందరకూ అసలైన గురువు. ఎందుకంటే, ఈ రోజు మనం ఒక సంస్కృతి, సంస్కారం, ఒక ధర్మం, వేదాంతం, విజ్ఞానం, ఉపాసన, ఇవన్నీ మాట్లాడుతున్నాము అంటే, ఇవన్నీ మనకు లభించింది వ్యాసుని ద్వారానే. కావలసినవన్నీ వ్యాసమహర్షి మనకు అమర్చి పెట్టాడు. దానిని సరియైన గురువుల ద్వారా మనం గ్రహించాలి. వ్యాసుడి విజ్ఞానాన్ని మనకు ఎవరు బోధిస్తారో వారిని మనం వ్యాస రూపంతో, గురు రూపంతో ఆరాధించుకుని, వ్యాసునికి నమస్కరించాలి..
శ్రీ గురుభ్యో నమః 🙏🏻
Comments
Post a Comment