గ్రహాంతర జీవులు! – ఇది నిజమా? Is there life outside of Earth? Existence of Aliens
గ్రహాంతర జీవులు! – ఇది నిజమా?
ఇతర గ్రహాలలో కూడా మనిషిలాంటి మేధో జీవులున్నారా? అనే ప్రశ్న, సామాన్యుడి నుండి శాస్త్రజ్ఞుల వరకూ, ఒక చిక్కుముడిగా ఉండిపోయింది. చాలా కాలం నుండి ఇతర గ్రహాలకు చెందిన జీవులు, ఎగిరే పళ్ళాలు, లేదా Flying Saucers అనబడే అంతరీక్ష విమానాలలో భూమిపైకి వచ్చి, కొందరిని అపహరించుకుని వెళ్ళినట్లు వార్తలు వింటూ ఉంటాము. ఇతర గ్రహాల నుండి వచ్చే గుర్తు తెలియని ఆకాశ ప్రయాణ సాధనాలనే U.F.O. లు, లేదా Un-Identified Flying Objects గా శాస్త్రజ్ఞులు పేర్కొంటారు.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/R90vO1zWUy0 ]
చాలా దేశాలలో ఈ UFO లను చూసినట్లు, అక్కడి స్థానికులు చెప్పటం మనలో చాలామంది వినే ఉంటారు. కొందరు విజ్ఞానుల అభిప్రాయం ప్రకారం, ఈ UFO లనేవి, Galaxies గా పిలువబడే ఇతర పాలపుంతల నుండి భూమి మీదకు వచ్చిన గ్రహాంతర జీవులనీ, భూమిపైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందని ప్రాచీన కాలంలోనే, పిరమిడ్ల వంటి భారీ నిర్మాణాలు జరిపించింది, గ్రహాంతర జీవులేననీ, కొందరి నమ్మకం.
ఇందుకు ఒక ఉదాహరణగా, తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం భీమేశ్వర ఆలయాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో, ఆ చుట్టుపక్కల లభించని భారీ పరిమాణంలోని రాళ్ళను ఎక్కడినుంచో తెచ్చి అక్కడ చేర్చి, క్రేన్ లలాంటి పరికరాలు లేని సమయంలో, అంత ఎత్తున పేర్చడం జరిగింది. పురావస్తు శాఖ వారి అభిప్రాయం ప్రకారం, ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం, ఆరు వేల సంవత్సరాల నాడు కట్టబడింది. మరి ఆనాడు, అంత భారీ శిలలను వాడి, ఆ ఆలయాన్ని ఎలా నిర్మించారు? అన్న ప్రశ్నకు సమాధానంగా, ఇది మానవులకన్నా చాలా ముందుగా సాంకేతిక పరిజ్ఞానం సంపాదించుకున్న గ్రహాంతర వాసుల వల్ల సాధ్యపడి ఉండొచ్చు. అందువల్లనే, ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని అంటారు.
1979-80 వ సం॥ల మధ్య, ఆంధ్రదేశంలో ఒక రోజు సాయంకాలం, ఆకాశంలో రంగు రంగుల వృత్తాలు ఏర్పడ్డాయి. అవి చాలా భారీ పరిమాణంలో ఆకాశంలో కనిపిస్తూ, మళ్ళీ మాయమవటం జరిగిందనే విషయం చాలామందికి తెలుసు. తర్వాత ఈ ఆకాశ వృత్తాలన్నీ వార్తా పత్రికలలోనూ ప్రచురించ బడ్డాయి. అవి శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం చేసిన ప్రయోగాల వలన వచ్చాయని ప్రచారం జరిగింది. గ్రహాంతర జీవుల అంతరీక్ష నౌకల తాలూకు కాంతి పుంజాలు ఆ నాడు ఆకాశంలో కనిపించాయన్న విషయాన్ని, ఉద్దేశ్య పూర్వకంగా ప్రభుత్వమే తొక్కిపెట్టి, ఏవో కబుర్లు చెప్పిందని కొందరు విజ్ఞానులు అభ్యంతరం వ్యక్తపరిచారు.
రాకెట్ ప్రయోగం జరిగితే, ఒక సరళ రేఖ ఆకారంలో, పొగ ఆకాశంలో ఏర్పడుతుందని అందరికీ తెలుసు. కానీ, వృత్తాల రూపంలో కొన్ని వందల మైళ్ళ వరకూ విస్తరించిన ఆ రంగుల వలయాలు, UFO లు కాదా? ఎందుకని ప్రభుత్వం ఇలా వాస్తవాలను దాచింది? ప్రజలు భయాందోళనకు గురికాకుండా ఉండటానికి, అతీంద్రియ మరియు అంతరీక్ష శక్తుల ఉనికిని కొట్టిపారేసి, రహస్యంగా ఆ అంశాలపై ప్రయోగాలు చెయ్యటం, ప్రభుత్వ బాధ్యత కావడం వలన అలా చేసిందని అనుకోవాలి!
1947లో తొలిసారిగా, Arnold అనే వ్యాపార వేత్త తన సొంత విమానంలో వాషింగ్టన్ గగన వీధుల్లో విహరిస్తుండగా, అతనికి ఒక డిస్క్ అంటే సాసర్ ఆకారంలో ఆకాశంలో ఎగురుతున్న గుర్తుతెలియని ఆకారాలు కనిపించాయి. ఆ UFO లు, గంటకి 1800 కి.మీల వేగంతో ప్రయాణించాయని, అతడు తెలిపాడు. “ఆర్నాల్డ్” అనుభవాలు అమెరికా వార్తా పత్రికల్లో Headlines లో వచ్చాయి. తర్వాత చాలా మంది, గ్రహాంతర వాసులను చూశామని చెప్పిన విషయాలు, దేశం నాలుగు మూలల నుండీ వార్తా కథనాలు వెలువడ్డాయి. గ్రహాంతర వాసులు పారదర్శక దుస్తులు ధరించారనీ, 8 అడుగుల ఎత్తు వరకూ ఉన్నారనీ కొందరు చెప్పారు. ముగ్గురు గ్రహాంతర వాసులను అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, ఆ నాడు వార్తలు వెలువడ్డాయి. మరి వారిని అమెరికా, బాహ్య ప్రపంచానికి తెలియకుండా, అత్యంత భద్రత నడుమ ఉంచిన తమ ‘Area 51’ అనే రహస్య ప్రదేశంలో ఉంచి ప్రయోగాలు చేస్తోందా? ఇందులో నిజానిజాలు ఎంతవరకూ అనేది, ఇంకా తేలాల్సి ఉంది.
UFO లు కనిపించాయన్న వార్తలు పెరిగి పోవటంతో, అమెరికా వాయుసేన విభాగం ఇందులో నిజానిజాలు తేల్చటానికి, ఒక Astrophysics Professor అధ్యక్షతలో, మరో నలుగురు వైమానిక రంగ నిపుణులు సభ్యులుగా, ఒక కమీషన్ ని ఏర్పాటు చేసింది. ఈ ఆపరేషన్ కి “ప్రాజెక్ట్ బ్లూ బుక్” అనే పేరు పెట్టింది. దాదాపు 20 సం॥లు UFO ల ఉనికిపై ప్రయోగాలు జరిగాయి. కానీ, ఏమీ తేలలేదు. అయితే, ఆ కమీషన్ అధిపతి సిఫార్స్ పై, ప్రభుత్వం ఇల్లినాయిస్ రాష్ట్రంలో, “Evanston” అనే ప్రాంతంలో, UFO అధ్యయన కేంద్రం ఏర్పరచింది. అంటే, గ్రహాంతర జీవులున్నాయని, ఆ శాస్త్రజ్ఞులు భావించారు. కనుకనే, 20 సం॥ల పరిశోధన తర్వాత, UFO అధ్యయన కేంద్రం ఏర్పాటుకు సిఫార్సు చేశారు.
1970 లో “ఇధియోపియా” అనే దేశంలో ఎగిరే పళ్ళాలు దర్శనమిచ్చాయి. అందులో ఒక UFO, ఎర్రటి అగ్నిగోళంలా ఉంది. అది ఆ ప్రాంతంలోని నివాసాలపైన ఆకాశంలో, బాగా క్రిందగా, గాలిలో చెక్కర్లు కొట్టింది. హెలికాఫ్టర్ ఎగిరేటప్పుడు వచ్చే భీకర శబ్దం, ఈ UFO ఎగురుతున్నప్పుడు వచ్చిందని, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ అంతరీక్ష నౌక చేసిన విన్యాసాల వేగానికి, ఆ ప్రాంతంలోని భారీ వృక్షాలు కూలి పోయి, వంతెనలు విరిగి పోయాయి. అయితే, ఆ సమయంలో ప్రాణాంతక వ్యాధులైన కాన్సర్, క్షయలాంటి వ్యాధులతో బాధ పడుతున్న కొందరికి, ఆ వ్యాధి నివారణ జరిగింది. UFO నుండి వెలువడిన గుర్తు తెలియని కిరణాల వల్ల, ఆ రోగులకు స్వస్థత చేకూరి ఉండ వచ్చని, దాక్టర్లు భావించారు. ఈ మధ్య గ్రహాంతర జీవులు ఒక నిండు గర్భిణీ స్రీ ని అపహరించాయన్న వదంతి, జపాన్ దేశంలో ప్రబలింది. ఇందులో నిజానిజాలు తేలాల్సి ఉంది.
1978 లో, ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక మానసిక శాస్త్రవేత్త ఆధ్వర్యంలో, నలుగురు సభ్యుల కమిటీని, UFO ల పరిశోధనకు ఏర్పాటుజేసింది. ఆ కమిటీ సభ్యులు, UFO లను చూశామన్న 12 మంది వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేశారు. అయితే, వాళ్ళెవరూ UFO ల గురించి స్పష్టంగా వివరించ లేక పోయారు. ఇంకో ఆసక్తికరమైన సంఘటన, 1979 వ సంవత్సరంలో, అమెరికాలో జరిగింది. “ఆల్బర్ట్ బెండర్” అనే వ్యక్తి, అమెరికాలోని కనెక్టికట్ ప్రాంతంలో, "అంతర్జాతీయ ఫ్లయింగ్ సాసర్ బ్యూరో” అనే సంస్థను స్థాపించాడు. ఆయన "స్పేస్ రివ్యూ” అనే పత్రికను కూడా స్థాపించి, UFO ల గురించి తనకు తెలిసిన విషయాలను ఎప్పటికప్పుడు, ఆ పత్రికలో ప్రచురిస్తూ వచ్చాడు.
అయితే, అతడు తన పరిశోధనలు ప్రారంభించిన నాలుగు నెలలకు, ముగ్గురు గ్రహాంతర వాసులు అతడి దగ్గరకు వచ్చి, UFOల గురించిన అతని పరిశోధనలను వెంటనే ఆపేయాలని తీవ్రంగా హెచ్చరించారు. వారు పారదర్శక ముసుగులను ధరించి ఉండటంతో, వాళ్ళ ముఖాలను గుర్తు పట్టలేక పోయాడని తెలుస్తోంది. ఏది ఏమైనా, “ఆల్బర్ట్” గ్రహాంతర వాసుల బెదిరింపులకు భయపడి, తన ప్రయోగాలను హఠాత్తుగా, అర్ధాంతరంగా నిలిపివేశాడు. మరి మనుషులు గ్రహాంతర జీవులపై పరిశోధనలు చేసి, వారి రహస్యాలను తెలుసుకోకుండా అడ్డుకోవడం వెనుక అసలు కారణం ఏమిటి? గ్రహాంతర జీవుల ఉనికి రహస్యంగా ఉంచడంలోని మర్మం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం, ఆ గ్రహాంతర వాసులకే తెలియాలి!
UFO లు కనిపించిన తర్వాతే, ఈ అంతరీక్ష జీవులు మానవులకు కనిపించటం జరుగుతోంది. అంటే, ఎగిరే పళ్ళాలవంటి అంతరిక్ష విమానాలలో ప్రయాణించి, గ్రహాంతర జీవులు భూమిపైకి వస్తున్నారని భావించటం వాస్తవం. కొందరి వాదన ప్రకారం, గ్రహాంతర వాసులు కుజ గ్రహ నివాసులనీ, ఆ గ్రహంలో భయంకర అణుయుద్దాలు జరిగి, అక్కడి వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదనీ, అందుకే నివాస యోగ్యంగా ఉండే మరో గ్రహం కోసం అన్వేషణలో భాగంగా, ఆ గ్రహాంతర వాసులు భూమిపైకి కూడా వస్తున్నారనీ తెలుస్తోంది.
21 ఆగస్టు, 2007 న, కెనడాలోని Alberta లో, ఒక ఇంటి గోడలపై గ్రహాంతర జీవుల చిత్రాలు ముద్రించ బడ్డాయి. ఒక గోడపై ఇద్దరు అంతరిక్ష వాసుల తలలు కనిపించాయి. ఆ గ్రహాంతర జీవుల ముఖాలపై రెండు కళ్ళున్నాయి. తలపైన Antenna ల వంటి పరికరాలున్నాయి. ఆ చిత్రాలను వేలాది మంది చూశారు. ఆ చిత్రాలు అంతర్జాతీయ పత్రికలలో కూడా వచ్చాయి. తమ చిత్రాలను గ్రహాంతర జీవులే ఆ ప్రదేశంలో చిత్రించారా? అలా ఎందుకు చేశారు? అన్నది ఈ నాటికీ సమాధానం లభించని ప్రశ్నగానే మిగిలి పోయింది.
ఇక దేవుడున్నాడా? పునర్జన్మలు నిజంగా ఉన్నాయా? అతీత శక్తులు వాస్తవమేనా? లాంటి ప్రశ్నలు, బుద్ధి జీవులైన మానవులను చాలా కాలంగా వేధిస్తున్నాయి. ఈ పురాతన కాల ప్రశ్నలకు తోడుగా, ఇంకో ప్రశ్న నాగరిక మానవులను తీవ్రంగా కలవర పెడుతూ వుంది. అదే, గహాంతర జీవులు నిజంగా ఉన్నాయా..?
[ దేవుడున్నాడా? - https://youtu.be/kQTqwv8rNck ]
ఆక్సిజన్, నీరు ఉన్న చోటనే, ప్రాణులు జీవించగలవు. ఈ అంశాలు భూ గ్రహంపై సమృద్ధిగా ఉండటం వల్లనే, భూమిపై అనేక రకాల జీవజాలం మనుగడ సాగిస్తోంది. మరి కార్బన్ డయాక్సయిడ్ అధికంగా ఉండే గ్రహాలలో జీవరాశి ఉండే అవకాశముందా? అనే ప్రశ్నకు, కొందరు శాస్త్రవేత్తలు చెప్పే సమాధానం.. మనుషులు, జంతువులు ఆక్సిజన్ పీల్చి కార్బన్ డయాక్సయిడ్ ను బయటికి వదిలితే, ఆ వాయువును వృక్షాలు పీల్చుకుని, ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. దేవుడు చేసిన అత్యంత సంక్లిష్టమైన ఏర్పాటు ఇది. సకల జీవరాశీ చెట్లపైన ఆధార పడుతుంది. ఇక్కడ కార్బన్ డయాక్సయిడ్ ను పీల్చుకుని జీవించే వృక్షాలలాగానే, గ్రహాంతర జీవులు తమ గ్రహాలలోని కార్బన్ డయాక్సయిడ్ ని పీల్చుకుని జీవించే అవకాశం లేకపోలేదు.. ఆయితే, చాలా మంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, భూమిని మినహాయించి, మన సౌరకుటుంబంలోని ఏ గ్రహంలోనూ, జీవులుండే ఆస్కారం లేదని తేల్చి చెబుతున్నారు. కానీ, కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, మనిషి నేటి వరకూ కనీసం సౌరకుటుంబంలో ఉన్న సూర్యుడి దాకా కూడా వెళ్ళ లేక పోయాడు. అలాంటిది, ఈ అనంత విశ్వంలో ఉన్న కోటానుకోట్ల గ్రహాలలో, జీవులు లేరని ఏ ఆధారాలతో చెప్ప గలం?
ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్ మీడియా చాలా అభివృద్ధి చెందింది. అనేక టీ.వి. ఛానెల్స్, Social Media మాద్యమాలూ ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా, క్షణాలలో వీడియోతో సహా, ప్రపంచం మొత్తం ప్రదర్శించ గల పరిజ్ఞానం ఏర్పడింది. కనుకనే, గ్రహాంతర జీవుల వివరాలూ, అప్పుడప్పుడూ కనిపించే గ్రహాంతర జీవుల అంతరీక్ష నౌకల ఫొటోలూ, ప్రపంచమంతటా అందించ బడుతున్నాయి. 'నిప్పు లేనిదే పొగ రాదు' అని ఒక సామెత ఉంది. ఏ ఆధారాలూ లేకుండా, గ్రహాంతర జీవులు లేరనీ, అవన్నీ ఎవరో పని లేని వారి కల్పనలనీ, కొందరు ఎందుకు వాదిస్తున్నారు?
నిజంగా గ్రహాంతర వాసులు ఉన్నారా? UFO లు గా పిలువబడుతున్న గ్రహాంతర వాసుల అంతరీక్ష వాహనాలు, చాలా మందికి, చాలా దేశాలలో కనిపించిన మాట నిజమేనా? ఏ కారణాలతో పాశ్చాత్య ప్రభుత్వాలు గ్రహాంతర జీవుల సమాచారాన్ని ఉద్దేశ్య పూర్వకంగా తొక్కి పెడుతున్నాయి? గ్రహాంతర జీవులతో సంబంధాలు పెట్టుకునీ, వారికున్న అపార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునీ, ప్రపంచాన్ని శాసించాలని నాడు అడాల్ఫ్ హిట్లర్ వంటి వారూ, అమెరికా వంటి దేశాలూ ప్రయత్నించిన మాట వాస్తమేనా? కొన్ని నిజాలు కాలమే నిరూపించాలి. ఇలాంటి కొన్ని అసాధారణ ప్రశ్నలకు సమాధానంగా, మనం ఇది వరకు చేసిన "తిరుమల శిలాతోరణం మరో గ్రహానికి వెళ్లే ద్వారమా?" అనే వీడియోను తప్పక చూసి, మీ అభిప్రాయాలను comment చేస్తారని ఆశిస్తున్నాను. ఆ వీడియో లింక్, క్రింద పొందు పరుస్తున్నాను.
[ శిలాతోరణం మరో గ్రహానికి వెళ్లే ద్వారమా? - https://youtu.be/Hi4qJn2xAoA]
🚩 ఓం నమో వేంకటేశాయ 🙏
Antique Art by Legendary Artist Late Sri. BG Sharma
Comments
Post a Comment