The purpose of human life | మనిషి జన్మ?
మానవ జన్మ?
కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం.. మధ్యన ఉన్న రెప్పపాటు కాలమే ఈ జీవితం!
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ।
ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే ।।
మరల మరల జన్మిస్తూ, మరల మరల మరణిస్తూ, తిరిగి తల్లి గర్భంలో శయనిస్తూ, ఈ సంసారజంఝాటం దాటలేక, నానా బాధలకూ గురౌతున్న నన్ను ఓ మురారీ! కృపతో తరింపజేయి తండ్రీ.. ఒక జీవితం ముగిసిన తరువాత, మళ్ళీ పుట్టడమే ‘జన్మ’. అలా పుట్టే జీవికి మళ్ళీ మానవ జన్మే లభిస్తుందనేది మాత్రం, ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేని విషయం. ఎందుకంటే, మళ్ళీ మనం పొందే జన్మ, గడిచిన జన్మలో మనం సంపాదించుకున్న జ్ఞానం, కర్మల మీద ఆధారపడి వుంటుంది. అన్ని జన్మలలోనూ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, అత్యంత దుర్లభమైనది. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తూవుంటాడు. చేసిన కర్మలకు ఫలితాలను తప్పనిసరిగా అనుభవించి తీరాలి. వాటినే కర్మ ఫలాలంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు, జీవుడితో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dNWbKKQMSjo ]
అన్ని పుణ్య కర్మల ఫలాలూ పక్వానికి వచ్చినపుడు, ఆ జీవుడు దేవలోకాలలో, దేవతా జన్మనెత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా, అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగ భూమిగనుక, అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం ఉండదు. అందువల్ల, పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలను ఆచరించే అవకాశమూ ఉండదు. తన కర్మఫలానుసారం భోగాలననుభావించాక, ఆ కర్మ ఫలాలు క్షయం కాగానే, ‘క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి’ అన్నట్లుగా, తిరిగి మర్త్య లోకమైన ఈ మానవ లోకాన్ని చేరవలసిందే. మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే. దేవ జన్మలో కేవలం మనోబుద్ధులుంటాయేగానీ, కర్మలు చేయటానికి సాధనమైన స్థూల శరీరం వుండదు. కనుక దేవజన్మ భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు.
ఇక పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు, ఆ జీవుడు జంతువులూ, పశుపక్ష్యాదులూ, క్రిమికీటకాదులూ మొదలైన జీవులుగా, నీచయోనులలో జన్మించాల్సివుంటుంది. ఆ జన్మలలో, తన పూర్వార్జిత కర్మఫలాల కారణంగా, అనేక బాధలూ, దుఃఖాలూ అనుభవించి, హింసింపబడతాడు. ఆ జన్మలలో అవి కర్మలు చేస్తున్నా, అవన్నీ బుద్ధిపరంగా కాకుండా, కేవలం ప్రకృతి ప్రేరణతో, పరతంత్రంగా చేస్తాయి. జంతు జన్మలలో శరీరం, మనస్సూ ఉంటాయిగానీ, బుద్ధి మాత్రం ఉండదు. కనుక ఆ జన్మలలో కూడా, కేవలం కర్మఫలాలు అనుభవించడమే గానీ, పరమాత్మను అందుకోవడానికి తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉండదు. అందుకే, భగవత్సాక్షాత్కారానికి జంతు జన్మ కూడా ఉపయోగ పడదు.
ఇక పుణ్య, పాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినపుడు, ఆ జీవుడు మానవ జన్మ ఎత్తడం జరుగుతుంది. ఈ మనవ జన్మలో, పుణ్య కర్మల ఫలంగా సుఖాలనూ, పాప కర్మల ఫలంగా దుఖాలనూ అనుభవిస్తాడు. అయితే, ఇలా కర్మఫలాలను అనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా, ఈ మనవ జన్మలో మాత్రమే వుంటుంది. ఎందుకంటే, స్వతంత్రంగా బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారమూ, జ్ఞానమూ పొందే అవకాశం ఉన్న మనవ జన్మ, ఉత్తమోత్తమమైనదీ, మరియు దుర్లభమైనదని అంటారు. 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ కావడంచేత ఈ మనవ జన్మను, ‘జంతూనాం నర జన్మ దుర్లభం’ అని శంకరాచార్యులవారు, “వివేక చూడామణి” అనే గ్రంధంలో తెలియజేశారు. ఇటువంటి అపురూపమైన, ఉత్తమమైన, మరియు దుర్లభమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ, దీనిని సార్ధకం చేసుకునే ప్రయత్నం చేయాలి.
ఇక జన్మల విషయం పక్కనబెడితే, మనం ఈ విధంగా మళ్ళీ మళ్ళీ ఎందుకు పుట్టవలసి వస్తోంది? పుట్టిన మన జన్మ లక్ష్యం ఏమిటి..? అనే విషయానికి వస్తే, జంతు జన్మలు పొందిన జీవుల లక్ష్యం అయితే ఒకటే.. అవి మానవ జన్మ పొందడానికి, కర్మలను ఆచరిస్తూ వుంటాయి. మరి మనిషిగా పుట్టిన మనం ఏం చేస్తున్నాము? మన లక్ష్యం ఏమిటి? అంటే, మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీనిని సార్ధకం చేసుకోవాలి. అలా సార్ధకం చేసుకోవడానికి ఏం చేయాలనేది మనం తెలుసుకోవాలి.
మానవుడు ఏ దు:ఖమూలేని నిత్యమైన ఆనందం మాత్రమే కోరుకుంటాడు. కానీ, లభిస్తున్నది మాత్రం దుఃఖాలతో, క్లేశాలతో కూడిన అనిత్యమైన ఆనందం. దాని కారణంగానే, అసంతృప్తి, అశాంతి, ఆవేదన, అలజడి రూపుదిద్దుకుంటుంటాయి. ఎందుకిలా జరుగుతోంది? బాగా చదువుకుని మంచి ఉద్యోగాలో, పెద్ద పెద్ద పదవులో చేపట్టి, బాగా సంపాదించి, భార్యబిడ్డలతో అనేక భోగాలను అనుభవించాలనేది, మానవ సహజ ఆలోచనా సరళి. అయితే, ఎన్ని సుఖాలూ, భోగాలూ అనుభవించినా, మనస్సుకు ఎదో ఒక వెలితి మిగిలే వుంటుంది. దీనికి కారణం, మనం అనుభవించేవి ఏవీ, నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు. ఇవన్నీ అనిత్యమైన వస్తువుల ద్వారా వచ్చే తాత్కాలిక సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన సుఖం కావాలంటే, అది నిత్య శాశ్వత వస్తువు ద్వారానే లభిస్తుంది. ఏమిటా నిత్యమైనటువంటి వస్తువు? “నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం” – నిత్యమైన వస్తువు ఏకమైన బ్రహ్మమే. అదే పరమాత్మ. పరమాత్మ కన్నా వేరైనవన్నీ, అనిత్యాలే అని ‘తత్త్వబోధ’లో తెలియజేశారు, శ్రీశంకరభగవత్పాదులవారు. అంటే, నిత్యమైన వస్తువు, ఏకమైన పరమాత్మ మాత్రమే గానీ, దానికి వేరుగా ఉన్నవన్నీ అనిత్యాలే. కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం, ఆనందం అందుకునే వరకూ, మానవుడికి తృప్తి ఉండదు, అసంతృప్తి తీరదు. అటువంటి శాస్వతానందాన్ని అందుకోవడమే, జన్మ సార్ధకత. ఆ శాస్వతానందాన్నే మోక్షం, ముక్తి అని కూడా అంటారు.
ఈ సృష్టిలో వున్న ప్రతి జీవీ భగవంతుడిలో ఐక్యమవ్వాలంటే, ఇక్కడ చేసిన అన్ని కర్మలనూ సంపూర్ణంగా నిర్మూలించుకోవాలి. అంటే, ఆత్మ స్వరూపుడవైన నీవు, వీటన్నిటినుండీ విముక్తిని పొందాలి. ఈ విధంగా విముక్తిని పొందటాన్నే, ముక్తి అని కూడా అంటారు. దానికి సరియైన జన్మ, ఒక్క మానవ జన్మ మాత్రమే. ముందు చెప్పుకున్న విధంగా, ఇక యే ఇతర జన్మలలోనూ సాధ్యం కాదు. మానవ జన్మలో మనిషికి దేవుడు ప్రసాదించిన బుద్ధి ద్వారా, శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన దానిని గ్రహించి, మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో తెలుసుకుని, మనస్సునూ, బుద్దినీ అదుపులో వుంచుకుని, పరమాత్మ తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకుని, ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించడమే జ్ఞానం. ఎప్పుడైతే నీలో దేవుడి గురించి తెలుసుకోవాలనే తపన మొదలవుతుందో, అప్పుడా దేవుడే నీకు మార్గాన్ని సుగమం చేయవచ్చు, లేదా అందుకు తోడ్పడే సద్గురువుకై మన అన్వేషణకి సహకరించవచ్చు.
అలా కాకుండా మనం అజ్ఞానంలో వుంటూ కర్మలను ఆచరిస్తూ, అన్నీ దుష్కర్మలే చేస్తే, ఖచ్చితంగా తరువాతి జన్మ, మానవ జన్మ పొందడం సాధ్యపడదు. అన్నీ చెడ్డ పనులే చేస్తే, గరుడ పురాణంలో చెప్పబడినట్టు, ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, నరకంలో వాటి ఫలితాలను అనుభవించి, మళ్ళీ ఈ కర్మ భూమిలో, నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా, నీకు ఎదో ఒక జన్మ లభిస్తుంది. మరి సత్కర్మలు ఆచరిస్తే మానవ జన్మ వస్తుందా? అంటే, 99% అవకాశాలున్నాయి. సత్కర్మలు చేస్తే, ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, వాటి ఫలితాలను స్వర్గంలో అనుభవించి, మళ్ళీ ఈ కర్మ భూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు జన్మ లభిస్తుంది. నీవు సత్కర్మలు ఆచరించి, కొద్దోగొప్పో దేవుడి గురించి తెలుసుకుని వుంటే, నీవు మంచి యోగుల కుటుంబంలో జన్మిస్తావు. ఈ విషయాన్ని భగవద్గీతలోని ధ్యాన యోగంలో, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇలా చెప్పాడు.. ఓ అర్జునా! ఎవరయితే నా జ్ఞానాన్ని గ్రహించి, కర్మ, జ్ఞాన, ధ్యాన యోగాలను అవలంభించి ఉంటారో, వారికి ఒకవేళ ఇంకా ఏవైనా కర్మలు మిగిలి వుంటే, ఖచ్చితంగా మంచి జన్మ, అదీ ఉన్నతమైన కుటుంబంలో లభిస్తుంది. ఇందులో ఎంత మాత్రమూ సందేహం లేదని, శ్రీ కృష్ణుడు వివరించాడు.
కాబట్టి, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం.. మధ్యన ఉన్న రెప్ప పాటు కాలమే ఈ జీవితమనే సత్యాన్ని గ్రహించాలి. కానీ మనం చేస్తున్నది? మంచితనాన్నీ, మానవత్వాన్నీ, దాతృత్వాన్నీ, ఆధ్యాత్మిక దృష్టినీ విస్మరించి, కేవలం స్వార్ధమే పరమావధిగా, అరిషడ్వర్గాలలో చిక్కుకుపోయి, విషయలోలురై, పాపపంకిలమైన జీవితం గడిపేస్తున్నాము. ఆ పరిస్థితిని అధిగమించి, జీవితం అంతా వట్టి భ్రమ, మాయా నాటకం అన్న పరమ సత్యాన్ని తెలుసుకుంటే, మానవ జన్మ తరించినట్లే.. ఆ పరబ్రహ్మమును చేరుకునే మార్గం గోచరించినట్లే..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment