Is Gautam Buddha avatar of Lord Vishnu | దశావతారాలు! బుద్ధుడు విష్ణువు అవతారమా?


అందరికీ 'శ్రీకృష్ణ జన్మాష్టమి' శుభాకాంక్షలు 🙏 

బుద్ధుడు విష్ణువు అవతారమా? దశావతారాలలోని బుద్ధుడికీ, గౌతమ బుద్ధుడికీ సంబంధం లేకపోతే, మరి ఆ బుద్ధుడు ఎవరు?

శ్రీ మహావిష్ణువు ‘దశావతారాలు’ అనగానే, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, ఇలా చెప్పుకుంటూ పోతాము. ఈ వరుసలోనే, విష్ణుమూర్తి తొమ్మిదవ అవతారంగా, ఆయన బుద్ధుడిగా అవతరించాడని విశ్వసిస్తాము. కానీ, నిజంగా విష్ణువే బుద్ధుడిగా అవతరించాడా? బుద్ధుడు విష్ణువు అంశేనా? అసలు బుద్ధుడు ఎవరు? ప్రపంచ వ్యాప్తంగా ప్రచారంలో ఉన్న బౌద్ధమతానికి ఆది గురువైన గౌతమ బుద్ధుడేనా? ఈయనేనా ఆ విష్ణువు తొమ్మిదవ అవతారం? లేక దశావతారాలలోని బుద్ధుడు వేరెవరైనా ఉన్నారా? అసలు బుద్దుడి రహస్యం ఏమిటి?.. వంటి విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/aaXuYOOtaM0 ]


బుద్ధుడి రాకకు మునుపు, అప్పటిదాకా ప్రపంచం, ఒక మార్గంలో నడుస్తోంది, ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్లింది. ఆ మార్గంలో ఉన్న ముళ్లను తొలగించి, ఆ ధర్మంలో ఉన్న లోపాలను ఎత్తి చూపి, సరికొత్త మార్గాన్ని చూపించిన ఆధ్యాత్మిక గురువు, గౌతమ బుద్ధుడు. దాదాపు రెండువేల అయిదు వందల సంవత్సరాల క్రితం, మనకు తెలిసిన కాలంలో, మనకు తెలిసిన చరిత్రలో, ఈ భూమిపై నడయాడిన పుణ్యమూర్తి, బుద్ధుడు. హిందువులలో ఉన్న కొన్ని విశ్వాసాలతో విభేదిస్తూ, ఒక విధమైన విప్లవాత్మకమైన ధోరణితో దూసుకు వచ్చిన వాడు, బుద్ధ భగవానుడు.

ఇప్పుడున్న నేపాల్‌ లోని కపిలవస్తు నగరాన్ని ఏలిన మహారాజు సంతానంగా, శక్తిమంతుడైన మతాచార్యుడిగా అవతరించిన పుణ్య మూర్తి, గౌతమ బుద్ధుడు. జీవితం-చావుపుట్టుకల గురించి సిద్ధార్థుడనే రాకుమారుడికి తీవ్రంగా వచ్చిన సందేహాలు, అతడిని బుద్ధుడిగా మార్చేశాయి. ఊరూరా తిరిగి తిరిగి, అలసిపోయిన యువరాజుకు, గయలో ఓ బోధి వృక్షం ఆశ్రయమిచ్చి, జ్ఞానాన్ని ప్రసాదించింది. సందేహాలన్నింటినీ పటాపంచలు చేసింది. 375 జన్మలు ఎత్తిన వాడూ, ఆ తరువాత కూడా ఆచార్యుడిగా అవతరించిన వాడూ, అన్ని కాలాలలో ఉన్నవాడూ, అన్ని ధర్మాలకూ అతీతమైన ధర్మాన్ని లోకానికి అందించిన వాడు... ఈయనకూ విష్ణుమూర్తికీ సంబంధం ఏమిటి? విష్ణువు దశావతారాలతో ఉన్న అనుబంధం ఏమిటి? నారాయణుడే తన తొమ్మిదవ అవతారంలో, గౌతమ బుద్ధుడిగా అవతరించాడా? ఇది నిజమేనా? ఒకవేళ దశావతారాలలో ఉన్న బుద్ధుడికీ, గౌతమ బుద్ధుడికీ సంబంధం లేకపోతే, ఆ అవతారంలో ఉన్న బుద్ధుడు ఎవరు?

విష్ణువు దశావతారాలు కట్టు కథలు కావు. పుక్కిటి పురాణాలుగా వీటిని కొట్టిపారేయలేము. వీటి వెనుక పౌరాణిక వాస్తవాల విషయం అటుంచితే, సైంటిఫిక్‌ లాజిక్‌ మాత్రం అద్భుతంగా ఉంటుంది. భూమిమీద జీవరాశి పుట్టినప్పటి నుంచీ, దాని పరిణామ క్రమాన్ని వ్యక్తం చేసేది, దశావతార క్రమం. అందులో తొమ్మిదవ అవతారం, బుద్ధుడని మనం విశ్వసిస్తాము. అయితే, ఆ బుద్ధుడు గౌతమ బుద్ధుడేనా! అన్న విషయానికి వస్తే..

పురాణాల ప్రకారం విష్ణువు వందల అవతారాలు ధరించాడు. కానీ మనకు తెలిసినవి మాత్రం, పదే. అందులో తొమ్మిది ఇప్పటికే అవతరించాడు.. కలియుగాంతంలో రాబోయే పదవ అవతారమైన కల్కి అవతారం కోసం, అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక మన వీడియో విషయానికి వస్తే, గౌతమ బుద్ధుడే విష్ణుమూర్తి తొమ్మిదవ అవతారమనేది, అందరి విశ్వాసమూ. అద్వైత, విశిష్టాద్వైత మతాల మధ్య పోరూ, హిందువుల్లో సంక్షిష్టంగా మారిన విశ్వాసాలూ పెడదారి పట్టినప్పుడు అవతరించిన మూర్తే బుద్ధుడనేది, అందరి నమ్మకం. కానీ, మనకు తెలిసిన బుద్ధుడు విష్ణువు కాదనేది మరో వాదన. ఆ వాదన ప్రకారం, దశావతారాలలో ఉన్న బుద్ధుడు వేరే ఉన్నాడంటారు. దుష్టశిక్షణ సక్రమంగా జరిగేందుకు విష్ణువు, రామ, కృష్ణుల అవతారాల మధ్యలో, బుద్ధుడిగా ఆవతరించాడు.

మనకు తెలిసిన గౌతమ బుద్ధుడు మరో అవతార పురుషుడే కానీ, దశావతారాలలో ఒకరు కాకపోవచ్చు. సామాన్య శక పూర్వం, 568వ సంవత్సరంలో, భారతదేశంలో శైవ, వైష్ణవ, శాక్తేయ మతాలను ధిక్కరిస్తూ, అందులోని లోపాలను తిప్పికొడుతూ, గౌతమ బుద్ధుడు సమాజానికి కొత్త దిక్సూచి అయ్యి నిలిచాడు. ఇప్పుడు నేపాల్‌లో ఉన్న అప్పటి కపిలవస్తు నగరాన్ని ఏలుతున్న రాజు శుద్ధోధనుడు, మాయ దంపతులకు జన్మించిన సిద్ధార్థుడు, అందరు రాజకుమారుల లాగానే, సకల రాజభోగాలనూ అనుభవించిన వాడే. దాదాపు 29 సంవత్సరాలు అన్ని సుఖాలనూ అనుభవించాడు. వైవాహిక జీవితాన్ని అనుభవించి, ఒక కుమారుడికి తండ్రి అయ్యాడు. కానీ, ఆ తరువాతే ఆయన జీవితం మారి పోయింది. సందేహాల పుట్టగా మారి, చివరకు జీవించటమే నరకంగా భావించే పరిస్థితి నెలకొంది. ఇల్లు, సంసారం వదిలి బయటకు వెళ్లిన సిద్ధార్థుడు, కౌండిన్యుడనే యోగి దగ్గర కొంతకాలం శిష్యరికం చేశాడు. కానీ, ఆ శిష్యరికం కూడా సంతృప్తినివ్వలేదు, ఆయన సందేహాలు తీరలేదు. గురువును వదిలి, తిరిగి తిరిగి చివరకు గయకు చేరుకున్నాడు. అక్కడ ఓ రావిచెట్టు సిద్ధార్థుడికి ఆశ్రయాన్నిచ్చింది. ఆ చెట్టే ఆయనకు నివాసమైంది. ఆ చెట్టు క్రిందే జ్ఞానోదయమైంది. ఆ జ్ఞానంతో సిద్ధార్థుడు, గౌతముడయ్యాడు. గౌతముడు బుద్ధుడయ్యాడు. త్రిపీఠికలతో నూతన ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆది గురువై నిలిచాడు. ఆయన బోధనలు ప్రపంచానికి తలమానికమై నిలిచాయి. సత్యాహింసలు మహాస్త్రాలుగా తయారయ్యాయి. అందువల్లనే, ఆయనను విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. ఆయన బోధనలూ, ధర్మ రక్షణా మార్గం, ఆయనను అవతార పురుషుడిగా మార్చాయి.

బుద్ధుడిగా మనకు విడిగా కనిపిస్తున్న మరో రూపం, మన పౌరాణిక గాథల్లో ప్రముఖంగా కనిపిస్తుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. గౌతమ బుద్ధుడి మాదిరిగానే, పౌరాణిక బుద్ధుడికీ, రావిచెట్టుతో అనుబంధం ఉంది. పౌరాణిక బుద్ధుడూ విష్ణుమూర్తి అంశతోనే అవతరించాడు. యుగాలకు అందని పౌరాణిక గాధ ఇది.

జనాలను నానా అవస్థలూ పెడుతున్న త్రిపురాసురులనే రాక్షసులను, ఎవరూ జయించలేక పోయారు. త్రిపురాసురుల భార్యలు మహా పతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల, త్రిపురులు అజేయులయ్యారు. ఏం చేయాలో దేవతలకు అర్ధం కాలేదు. అప్పుడు ఆ శక్తిని ఉపసంహరింపజేయడానికి, లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం, శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. సమ్మోహనకరమైన రూపంతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి, మోహితులై, ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపురుల బలం క్షీణించింది. శివుని చేత హతులయ్యారు. ఇదే విషయం, "ఆపన్నివారక స్తోత్రం"లో ఉంది. "దైత్యస్త్రీమనభంజినే" అంటే, రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని భంగం చేసినవాడని అర్ధం.

ఇక్కడ అశ్వత్ధ వృక్షం అంటే మరేదో కాదు. రావిచెట్టే. ఇదే బోధి వృక్షం. ఇక్కడ పతివ్రతలకు వ్రతభంగం చేసినది శ్రీ మహా విష్ణువే. ఇతడే దశావతారాలలో మనకు కనిపించే బుద్ధుడనేది కొందరి వాదన. కాకపోతే, ఈ కథనానికి విష్ణుకథల్లో పెద్దగా ప్రాధాన్యత కనిపించదు. అశ్వత్థ వృక్షాన్ని పూజించడం, పతివ్రతల గొప్పదనాన్ని వివరించడం వరకే, ఈ కథనాన్ని చెప్పుకొచ్చారు.

నిజానికి దశావతారాలను ఒక క్రమ పరిణామంగా గనుక చూచినట్లయితే, గౌతమ బుద్ధుడిని, తొమ్మిదవ అవతారంగా గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే, విష్ణువు అవతారాలలో మొదటి అయిదు, అంటే, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవతారాలన్నీ, కృతయుగంలో జరిగాయి. ఆ తరువాత త్రేతాయుగానికి వచ్చేసరికి, పరశురామ, రామావతారాలు సంభవించాయి. ద్వాపరయుగంలో కృష్ణావతారం మనకు తెలిసిందే. శ్రీకృష్ణ నిర్యాణంతోనే, ద్వాపర యుగం ముగిసి, కలియుగం మొదలైంది. కలియుగంలో సనాతన ధర్మానికి సంబంధించినంత వరకూ అవతరించిన మహాపురుషుడు, గౌతమ బుద్ధుడొక్కడే. అందుకే దశావతారాల బుద్ధుడు, పౌరాణిక బుద్ధుడు కాకుండా, కపిలవస్తు నగరంలో జన్మించిన సిద్ధార్థుడేనని రూఢి అవుతోంది. ద్వాపర యుగాంతంలో కృష్ణ నిర్యాణానికీ, సామాన్య శక పూర్వం 568లో గౌతమబుద్ధుడు అవతరించటానికీ మధ్య సాగిన 2500 సంవత్సరాల కాలం, ప్రపంచ సమాజాన్ని అస్తవ్యస్తం చేసిన కాలం. అన్ని మతాల మధ్యనా సామరస్యం లోపించిన సమయంలో, అత్యున్నతమైన అహింస, ధర్మ పరిరక్షణ మార్గాలుగా మతాన్ని నిర్మించిన మహాపురుషుడు, గౌతమ బుద్ధుడు. విష్ణుమూర్తి అవతారమా కాదా అన్న ప్రశ్నను పక్కనబెడితే, ఆయన విశ్వానికి మార్గదర్శి. ఇదే సత్యం, ఇదే నిజం. గౌతమ బుద్ధుడు, జీవితం ఎలా గడపాలో నేర్పిన వాడు. మానవత ఆయన మతం, ధర్మం ఆయన మార్గం, అహింస ఆయన వ్యక్తిత్వం. అందుకే అందరికీ ఆయన శరణయ్యాడు.

🚩 బుద్ధం శరణం గచ్ఛామి 🙏

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home