నేను దేవాలయానికి ఇక రాను!!!
నేను దేవాలయానికి ఇక రాను!!!
11 సంవత్సరాల ఒక పాప తన తండ్రితో కలిసి దేవాలయానికి వెళ్లింది. భగవంతుడికి నమస్కరించి వచ్చి ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో, తన తండ్రితో ఆమె ఇలా అన్నది. "నాకు ఇకపై ఆలయానికి రావాలని లేదు నాన్నా".. అని. తండ్రి ఎందుకని ఆడగగా ఆమె ఇలా అన్నది.. "భగవంతుడికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపటం కోసం మనం ఇక్కడకు వస్తున్నాము. కానీ, ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే కనిపిస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తరువాత కూడా వారు తమ మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి మనసు, దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమగ్నమై ఉంటోంది. చెడు మాటలు వినిపిస్తున్నాయి. వీరు కేవలం కపటులు మాత్రమే. వీరందరినీ చూసి చూసి నేను కూడా అలానే అవుతానేమో అనే భయం కలుగుతున్నది. అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలచుకోవడం లేదు" అని చెప్పింది కుమార్తె.
[ ప్రార్థించే మనస్సెలా ఉండాలి?: https://youtu.be/HYR6GJyUWUc ]
తండ్రి నిశ్శబ్దంగా విన్న తరువాత.. "సరే.. నాకోసం ఒక పని చేసి పెట్టు తల్లీ" అని అన్నాడు తండ్రి. ఆమె అలాగే అన్నది.. "ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకుని ఆలయం చుట్టూ 2 సార్లు తిరిగి రా. ముఖ్యంగా వీళ్లందరి మధ్యలో నుండి నడచి, నీరు క్రింద పడకుండా రావాలి. రాగలవా?" అన్నాడు తండ్రి.
కుమార్తె సరేనని చెప్పి, తండ్రి చెప్పినట్లుగానే తిరిగి వచ్చి.. చూశారా! ఈ గ్లాసు నిండుగా ఉంది. ఒక్క చుక్క నీరు కూడా క్రింద పడలేదు. మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేశాను" అన్నది ఆనందంగా..
అప్పుడు తండ్రి పాపను అభినందించి, ఆమెను 3 ప్రశ్నలడిగాడు..
1. ఈ సారి వెళ్లినప్పుడు, ఇందాక నీకు నచ్చని పనులు చేస్తున్నవారు ఏం చేస్తున్నారు?
2. ఎవరైనా చెడు మాటలు, ఇతర గాసిప్స్ చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారా?
3. కపట భక్తులేం చేస్తున్నారు?
అదుకామె.. "నేను అవేమీ చూడలేదు. నా దృష్టి గ్లాసు, మరియు దానిలోని నీటిపైనే ఉంది. నీరు ఒక్క చుక్క కూడా పోకుండా తీసుకు రావడంలో, మిగతా వారిని గమనించనే లేదు" అని చెప్పింది.
అప్పుడు తండ్రి ఆమెతో ఇలా అన్నాడు.. "నీవు దేవాలయానికి వచ్చినప్పుడు సరిగ్గా చేయవలసినది ఇదే. కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి, ఆయన గురించే ఆలోచిస్తూ, ఆయనతో మమేకం అవడానికి ప్రయత్నించాలి. అలాగనుక చేయ గలిగితే, ఎవ్వరూ నీ దృష్టికిరారు. పైగా నీవంటి వారిని చూసి వారు కూడా క్రమంగా తమ పద్ధతిని మార్చుకోవచ్చు. అచంచలమైన భక్తి, ఏకాగ్రత, నిరంతర సాధన మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి. జీవితంలో ఉన్నత పథంవైపుకు నడిపిస్తాయి".
దేవాలయంలో గడప వలసిన విధానం గురించి ఇంత చక్కగా చెప్పిన ఆ తండ్రి ధన్యుడు. పిల్లలకు ఇదే విధమైన ఏకాగ్రత అలవాటు చేయాలి అందరూ. దైవ సన్నిధిలో ఏకాగ్రతతో ఉండడం ఎంతో ముఖ్యం. దాని కొరకు సాధన చేయడంలోనే అర్థం పరమార్థం ఉన్నాయి.
🚩 ఓం శ్రీమాత్రే నమః 🙏
Comments
Post a Comment