Death: A Curse or a Blessing? | మనిషికి మృత్యువు ఎందుకు అవసరం?


మరణం! మనిషికి మృత్యువు ఎందుకు అవసరం?
ఆత్మ నిరంతర ప్రయాణంలో ఒక చిన్న మజిలీ అయిన ఈ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి?

'చిరంజీవత్వం' అన్నది సాధారణ విషయం కాకపోయినా, సాధ్యమే. ఎందరో మహనీయులు దానిని సాధించారు కూడా. ఎవరైతే మూల చైతన్యాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకుని, ఆ ‘మూలధనం’ లో వృద్ధి చెందుతూ వుంటారో, వారు అకల్పాంతం వరకూ, అంటే, ఎల్లప్పటికీ ‘పిన్న వయస్కులు’ గానే ఈ లోకంలో ఉండగలరు. ఈ విధంగానే అంజనేయస్వామి గానీ, మహావతార్ బాబాజీ కానీ, ఇంకా ఎంతో మంది యోగులు, ‘చిరంజీవులు’ గా ఇప్పటికీ భూమిపై నడయాడుతూ ఉన్నారు. అందరూ మరణాన్ని గురించి భయపడటం సహజమే. కానీ, జనన మరణాలు సృష్టి నియమాలు. ఈ రెండూ విశ్వం యొక్క సమతౌల్యతను కాపాడటానికి అత్యవసరం. లేకపోతే, మనుషులు ఒకరినొకరు అధిగమించే ప్రయత్నంలో, సృష్టి అల్లకల్లోలమవుతుంది. అది ఎలా..? అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/LrkjH4viRsU ]


మూల చైతన్యాన్ని తెలుసుకోలేని మానవుడు, సృష్టిలో అనివార్యమైన మరణాన్ని గురించి భీతిల్లుతుంటాడు. అవగాహనారాహిత్యం వలన, అది ఒక అంతు చిక్కని విషయంగా అనిపిస్తుంటుంది. మరణమనే సహజ పర్యవసానం ఉండడం వల్లనే, జీవితం ప్రకాశవంతమవుతుంది. ఆత్మ ప్రయాణంలో భాగంగా, మనం కేవలం కొద్ది కాలం మాత్రమే భూమిపై సజీవంగా ఉంటాము. ఎక్కువ కాలం మరణానంతర ప్రయాణంలో ఉంటాము. దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోలు చేశాను. చూడని వారు తప్పక చూడండి. జనన మరణ చక్ర భ్రమణంలోని ఈ నిగూఢ సత్యాన్ని తెలుసుకోలేక, భౌతికపరమైన ఆశలూ, కోరికలతో, కలకాలం జీవించి ఉండాలని కోరుకునే వారికోసం, ఒక చిన్న కథను చెప్పుకుందాము..

మరణాన్ని జయించి, చిరంజీవిగా ఉండిపోవాలని తలచిన ఒక రాజు, తన రాజ్యం వెలుపల మహారణ్యంలో వున్న ఒక మహర్షిని సందర్శించాడు. తనకు అమరత్వం సిద్ధించే మార్గం తెలియజేయమని, ఆయనను ప్రార్ధించాడు. రాజు మనోవాంఛితం తెలుసుకున్న మహర్షి, అక్కడికి కొంత దూరంలో ఉన్న రెండు కొండలను దాటిన తరువాత ఒక దివ్య సరస్సు ఉంటుందనీ, దాని నీరు త్రాగితే రాజు అమరత్వాన్ని పొందగలుగుతాడనీ చెప్పాడు. మహర్షి చెప్పినట్లుగానే రాజు ఆ రెండు కొండలనూ దాటిన తరువాత, దివ్య సరస్సును కనుగొన్నాడు. అతను దైవాన్ని తలుచుకుని నీరు త్రాగబోతుండగా, బాధను భరించలేక ఎవరో చేస్తున్న దీనారావాలు వినిపించాయి. బాధాకరమైన ఆ శబ్దాలు వినవస్తున్న దిశకు వెళ్ళిన రాజుకు, చాలా బలహీనుడైన ఒక మనిషి కనిపించాడు.

అటువంటి నిర్జన ప్రాంతంలో అతడిని చూసి ఆశ్చర్యపోయిన రాజు, కారణం అడగగా, అతడు ఇలా చెప్పనారంభించాడు. తాను ఆ దివ్య సరస్సులోని నీరు త్రాగి అమరత్వాన్ని పొందగలిగాడనీ, వంద సంవత్సరాల వయస్సు దాటిన తనను, తన కుమారుడు ఇంటి నుండి బయటకు పంపించేశాడనీ చెప్పాడు. అప్పటికి యాభై సంవత్సరాల నుండి ఆలనా పాలనా లేకుండా, తానక్కడే పడి ఉన్నాడని తెలియజేశాడు. తన కుమారుడు మరణించి, మనవళ్లు కూడా వృద్ధులై పోయారని చింతించాడు. తాను తినడం, త్రాగడం మానేసినా, ఇంకా బ్రతికే ఉన్నానని వాపోయాడు.  చిరంజీవిత్వం తన పాలిట శాపంగా ఎలా పరిణమించిందో మొరపెట్టుకున్నాడు. తనకు మృత్యువును ప్రసాదించమని భగవంతుడిని ప్రార్ధిస్తూ రోదించసాగాడు.

రాజు ఆలోచనలో పడ్డాడు. వృద్ధాప్యం, దయనీయమైనది. జవసత్వాలతో కూడిన యవ్వనం లేని అమరత్వం పొంది, ప్రయోజనం ఏమిటి? అప్పుడు అమరత్వంతో పాటు యవ్వనాన్ని కూడా పొందాలని నిశ్చయించుకుని, తిరిగి మహర్షిని సందర్శించి, తనకు అమరత్వంతో పాటు యవ్వనాన్ని కూడా పొందేందుకు మార్గం సూచించమని కోరాడు. చిరునవ్వు నవ్వుతూ మహర్షి, రాజు అంతకు ముందు చూసిన దివ్య సరస్సును దాటి ఇంకా కొంత దూరం ముందుకు వెళితే కనిపించే మరో కొండను అధిగమిస్తే, పసుపు రంగు పండ్లతో నిండిన ఒక దేవతా వృక్షం కనిపిస్తుందనీ, దాని పండును తింటే, అమరత్వంతో పాటు యవ్వనాన్ని కూడా పొందవచ్చనీ చెప్పాడు.

మహర్షి చెప్పిన విధంగానే రాజు ఈసారి మూడవ కొండను కూడా దాటి, పసుపు రంగు పండ్లతో నిండిన దేవతా వృక్షాన్ని చేరుకున్నాడు. అతను ఒక పండు కోసి తినబోతున్న సమయంలో, ఉన్నట్లుండి అక్కడికి సమీపంలోనుంచి ఏదో సవ్వడి వినిపించింది. జన సంచారం లేని ఆ ప్రాంతంలో వాదులాడుకునేవారు ఎవరై ఉంటారా అని ఆశ్చర్యపోయాడు రాజు. హుటాహుటిన శబ్దం వినవస్తున్న దిశకు వెళ్లి చూసిన రాజుకు, తర్జన భర్జనలు పడుతున్న నలుగురు యువకులు కనిపించారు. సమస్య ఏమిటని రాజు అడగగా, వారిలో ఒక యువకుడు, "నా వయస్సు 400 సంవత్సరాలు. నా కుడివైపున ఉన్న మనిషి నా తండ్రి. వయస్సు 450 సంవత్సరాలు. అతడు నాకు రావలసిన వాటా ఆస్తిని నాకు ఇవ్వడం లేదు." అని అన్నాడు చిన్నబుచ్చుకుంటూ.

అది విన్న రాజు ఆ కుడివైపున ఉన్న రెండవ మనిషిని అడగగా, అతను మూడవ వ్యక్తిని చూపిస్తూ, "ఈయన నాకు తండ్రి. వయస్సు 500 సంవత్సరాలు. తాను ఇంకా జీవించి ఉండడంవలన, నా భాగం ఆస్తి నాకు రాలేదు. నాది కానిది నా కుమారుడికి నేనెలా ఇవ్వగలను?" అని అన్నాడు. ఇక అతడు నాలుగవ వ్యక్తిని చూపించి, అతడిని తన తండ్రిగా చెప్పి, వయస్సు 550 సంవత్సరాలని చెప్పాడు. అతడిది కూడా అదే సమస్య. ఇలా వారు ఆస్తి కోసం నిత్యం ఘర్షణ పడుతుండడంతో విసుగు చెందిన గ్రామస్థులు, వారిని గ్రామం నుండి బహిష్కరించారు. అలా వారు ఆ నిర్జన ప్రదేశంలో చేరి, నిత్యం ఘర్షణలతో మనశ్శాంతిని కోల్పోయి, కాలం వెళ్లబుచ్చుతున్నారు.

ఇదంతా చూసి ఆశ్చర్యానికి గురైన రాజు తిరిగి మహర్షిని చేరి, తన అజ్ఞానాన్ని దూరంచేసినందుకూ, తనకు మరణం యొక్క ఆవశ్యకతను ఎరుకపరచినందుకూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. అప్పుడు మహర్షి చిరుదరహాసంతో ఇలా అన్నాడు.. "రాజా! మరణం ఉన్నందువల్లనే ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణాన్ని తప్పించడానికి ప్రయత్నించే బదులు, ప్రతి రోజూ, ప్రతి క్షణమూ సంతోషంగా గడపండి. సహజంగా అందరూ పొరబడే.. ‘నేనొక్కడిని మారితే ఏమవుతుంది!’ అని అనుకోకుండా, ముందు మీరు మారండి. అది చూసి మీ చుట్టూ ఉన్నవారు మారతారు. తదనుగుణంగా ప్రపంచం మారుతుంది." మార్పనేది, ఒక్కరితోనే మొదలవుతుంది..

మానవజన్మ విశిష్టతనూ, విలువనూ మనం గ్రహించాలి. అన్ని రాళ్లకంటె వజ్రం ఎలా విలువైనదో, అలాగే మానవజన్మ అన్ని జన్మలకంటే విలువైనది. ఇది మనకు అంత సులభంగా లభించలేదు. ఈ మానవ జన్మ లభించడానికి మనం ఎంతో పుణ్యం చేశాము. వజ్రం కోసం ఎంతో ధనాన్ని వెచ్చించినట్లే, మానవ జన్మకోసం మనం ఎంతో పుణ్యాన్ని వెచ్చించాము. అందుకే మానవ జన్మ కూడా వజ్రంలాగే ఎంతో విలువైనది. వజ్రాన్ని అలక్ష్యంచేసే వ్యక్తిని ఎలాగైతే మూర్ఖుడిగా భావిస్తామో, అలాగే, మానవజన్మను సక్రమంగా ఉపయోగించుకోకపోతే, మనం కూడా మూర్ఖులమే అవుతాము.

స్నానం చేస్తూ దేవుడి నామస్మరణ చేస్తే, అది పవిత్ర స్నానమవుతుంది..

తింటూ దైవ నామస్మరణ చేస్తే, ఆహారం ప్రసాదమవుతుంది..

నడుస్తూ భగవన్నామస్మరణ చేస్తే, అది యాత్ర అవుతుంది..

వంట చేస్తూ స్మరణ చేస్తే, ఆహారం దివ్యమవుతుంది..

నిద్రించే ముందు స్మరించుకుంటే, అది ధ్యాన నిద్రవుతుంది..

ఇంట్లో దివ్య నామస్మరణ చేస్తే, ఆ ఇల్లే దేవాలయంగా మారుతుంది..

నిత్య దైనందిన కర్మలు చేసుకుంటూ దైవాన్ని తలుచుకుంటే, అది భక్తి అయ్యి, మనలను భగవంతుడికి దగ్గరజేస్తుంది..

యతః కృష్ణస్తతో ధర్మో యతో ధర్మస్తతో జయః ||

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home