ముసలం! కృష్ణుడి అంతిమ ప్రస్థాన సమయంలో ఏం జరిగింది? | The Mace and Annihilation Of the Yadavas - Krishna leaves the mortal world


ముసలం! కృష్ణుడి అంతిమ ప్రస్థాన సమయంలో ఏం జరిగింది?
ముసలం పుట్టి యాదవులు అంతరించిన తరువత ఆ శవాల గుట్టల మధ్య కృష్ణుడి మనోగతం ఏమిటి?

పుట్టిన ప్రతి జీవీ మరణించక తప్పదు. ఎంతటి కీర్తి ప్రతిష్ఠలుగల వారయినా, ఎంత సంపద, అధికారాలు పొందిన వారయినా, చివరకు దైవాంశ సంభూతులైనా, ఏదో ఒక రోజు మరణాన్ని ఆహ్వానించక తప్పదు. ఇది భగవంతుడేర్పరచిన విధి విధానం. ద్వాపర యుగంలో అవతరించిన కృష్ణ భగవానుడు కూడా, ఈ విధి విధానాన్ని స్వయంగా పాటించాడు. అది ఎలా..? అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. 

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/rrd3t9MiZ_Q ]


ద్వాపర యుగాంతం దగ్గర పడుతోంది. దుష్ట శక్షణ, శిష్ట రక్షణ జరిపి, భూ భారాన్ని చాలావరకూ తగ్గించాడు శ్రీకృష్ణపరమాత్ముడు. తన అవతార లక్ష్యం నెరవేరడంతో, అవతార పరిసమాప్తికి ఏర్పాట్లు మొదలు పెట్టాడాయన. అప్పటికి భూమిపై మిగిలిన ఉన్న యోధుల్లో, యాదవులు మహా బలవంతులు. వారి సైన్యం చాలా పెద్దది. శ్రీకృష్ణుడి అండతో యాదవ కులం, శత్రువులెవరూ కన్నెత్తి కూడా చూడలేనిదిగా, అజేయమైనదిగా అయ్యింది. ఈ కారణంగా, యాదవ వీరులకు అహంకారం పెరిగిపోయింది. బల గర్వంతో విర్రవీగుతున్నారు వారందరూ. వారు అంతరించి పోవలసిన సమయం ఆసన్నమయిందని గ్రహించాడు, శ్రీకృష్ణుడు. స్వయంగా తానే వారందరికీ రక్షకుడుగనుక, ఇతరులెవరూ వారిని నశింపజేయలేరని, ఆయనకు తెలుసు. అందుకే, వారిలో వారే కలహించుకోవడం ద్వారా, యాదవకులాన్ని నశింపజేయాలని తలచాడు, పరంధాముడు. మన జీవితాలలో జరిగే ప్రతి ఘటనకూ, ముందే బీజం పడి ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ. యదుకుల నాశనానికి బీజం ఏనాడో పడింది. ఒకానొక సందర్భంలో మునులూ, కురుక్షేత్ర యుద్ధానంతరం గాంధారీ ఇచ్చిన శాపాలు, శ్రీకృష్ణుని అభీష్టానికి అనుగుణంగా జరిగినవే అనేది, మనం గమనించాలి.

ఒకనాడు విశ్వామిత్రుడు, అసితుడు, కణ్వుడు, దూర్వాసుడు, భృగువు, అంగీరసుడు, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, వశిష్టుడు, నారదుడు మొదలైన మహామునులు, పిండారక క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఆటలాడుకుంటున్న యాదవ యువకులు కొంతమంది, కర్మవశాన ఆ మునులను ఆటపట్టించాలనుకున్నారు. జాంబవతి కొడుకైన సాంబుడికి ఆడవేషం వేసి, గర్భవతిగా ఉన్నట్లు కడుపుకు చీరలు చుట్టి మునులవద్దకు తీసుకువెళ్ళారు. తనకు ఏ బిడ్డ జన్మిస్తుందో అడగడానికి సిగ్గుపడుతోందనీ, ఈమెకు మగబిడ్డ పుడతాడా? ఆడబిడ్డ పుడుతుందా? అని పరిహాసం ఆడారు. యాదవ యువకుల నాటకం మునులకు అర్థమై, వారిలో కోపం పెల్లుబికింది. “ఓరీ మూర్ఖులారా! ఈమెకు పుట్టేది ఆడపిల్లాకాదు, మగపిల్లవాడూ కాదు. మీ కులనాశనానికి కారణమయ్యే ముసలం పుడుతుంది” అని శపించారు. ముసలం అంటే, 'ఇనుప రోకలి' అని అర్థం. వారి శాపానికి భయపడిన యాదవ యువకులు, జరిగినదంతా శ్రీకృష్ణుడితో చెప్పారు. ఇది విధి విధానం! మునులు చెప్పినట్లే జరుగుతుందన్నాడాయన.

మరునాడు సాంబుడి కడుపు నుండి ముసలం బయటపడింది. దాన్నిజూసి యాదవులు భయంతో వణికి పోతూ, విషయమంతా కృష్ణుడితో మొరపెట్టుకున్నారు. తమ కులనాశనానికి కారణంకానున్న ఆ రోకలిని,  పరంధాముడి సూచన మేరకు ముక్కలు ముక్కలు చేసి చూర్ణం చేశారు. ఆ చూర్చాన్ని సముద్రజలాల్లో కలిపేశారు. అక్కడితో సమస్య తీరిపోయిందనుకుని శాంతించారు. ఎన్ని ఉపాయాలు పన్నినా, రాబోయే వినాశనం ఆగదని, శ్రీకృష్ణుడికి తెలుసు. ఇదంతా ఆయన సంకల్పమే. యాదవులు ముసలాన్ని చూర్ణంజేసి సముద్రంలో పారవేసినప్పుడు, ఆ చూర్ణంలో ఒక ఇనుప ముక్క ఉండిపోయి, సముద్రంలోని ఒక చేప దానిని మింగింది. చేప మింగిన ఆ ఇనుపముక్క కారణంగా, శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ఎలా చాలించాడో చూద్దాము.

సముద్రంలో కలపబడిన మిగిలిన రోకలి చూర్ణమంతా, అలలతాకిడికి ఒడ్డుకు చేరి, పదునైన తుంగగడ్డిగా మొలిచింది. నిలువెత్తు పెరిగిన ఆ తుంగ, కరకు కత్తులలా తయారై, యాదవులను నాశనం చేసేందుకు సిద్ధంగా ఉంది. పితృ తర్పణాలు వదిలే నెపంతో, యాదవులందరినీ ప్రభాస తీర్థానికి తీసుకువచ్చాడు శ్రీకృష్ణుడు. ముసలం వల్ల పెరిగిన తుంగ, ఆ స్థలంలోనే ఉంది. అక్కడకు చేరుకున్న తర్వాత, విధి విధానాన్ని అనుసరించి, యాదవులకు మతి చెడింది. వారు అకారణంగా పరస్పర నిందలు చేసుకుంటూ, పోట్లాడుకున్నారు. తమ దగ్గరున్న ఆయుధాలు ధ్వంసం కాగా, అక్కడున్న తుంగను పెకలించి, దానితోనే ఒకరినొకరు కొట్టుకుని మరణించారు. చివరకు శ్రీకృష్ణ బలరాములూ, యాదవ స్రీలూ, వారి పిల్లలూ మాత్రమే మిగిలారు.

తన కళ్ళముందే తన వారంతా కొట్టుకుని చావడం, శ్రీకృష్ణుడికీ వ్యధను కలిగించక పోలేదు. ఎందుకంటే ఆయన అవతారం, మానవ, దైవత్వాల కలయిక. మనస్సులోని బాధను అణచుకుంటూ, చుట్టూ పరికించి చూశాడు. ఎటుజూసినా శవాల గుట్టలు. ఆందరూ తన వారే. తనంటే ప్రాణమిచ్చే అభిమానులే. కొద్ది క్షణాల క్రితం వరకూ వారంతా తనకోసం వున్నారు. ఈ క్షణంలో వారెవ్వరూ లేరు. తనను ఒంటరి వాడినిజేసి వెళ్లిపోయారు. చిన్న తనంలో తనను ముద్దుజేసి ఆడించిన పెద్దలూ, తన కుమారులూ, సోదారులూ, తనతో ఆటపాటల్లో, కష్టసుఖాల్లో కలిసి జీవించిన బంధుమిత్రులూ.. ఇలా మొత్తం అందరూ రక్తంలో మునిగి, విగతజీవులై పడి ఉన్నారు. శవాలపైబడి రోదిస్తున్న యాదవ స్త్రీలనుజూసి, ఆయనలోని మానవ లక్షణం, దైవతత్వం, క్షణకాలం పోటీ పడ్డాయి. బాధను మౌనంగా తట్టుకున్నాడు. మానవ లక్షణంపై దైవత్వం గెలిచింది. తనవారెవరు? పరాయివారెవరు? అందరూ తనలోని వారే.. తాను నడిపించే జగన్నాటకమే కదా ఇదంతా! అని సమాధాన పరచుకున్నాడు. తక్షణమే ఆయనలోని అభిమాన వ్యామోహాలు నశించాయి. భూ భారాన్ని తగ్గించవలసిన తన అవతార లక్ష్యం పూర్తిగా నెరవేరిందని తృప్తి చెందాడు.

యాదవ స్త్రీలను ద్వారకకు తీసుకు వెళ్లి, వసుదేవుని సంరక్షణలో ఉంచాడు. అప్పటికి ఏడవ రోజున ద్వారక సముద్రంలో మునిగిపోతుందని ఆయనకు తెలుసు. అందువల్ల ద్వారకలోని వారందరినీ, అక్కడినుండి తప్పించి రక్షించవలసినదిగా, అర్జునుడికి కబురుజేశాడు. అలా తన బాధ్యతను నెరవేర్చుకుని, తిరిగి ప్రభాస తీర్థానికి చేరుకున్నాడు. అక్కడ యోగమార్గం గుండా శరీరాన్ని వదలి వెళుతున్న బలరాముణ్ణి జూశాడు. మహావిష్ణువు శయనించే ఆదిశేషుడే, బలరామునిగా జన్మించాడనే విషయం, మనం గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నాము. బలరాముని ముఖం నుండి ఒక తెల్లని మహాసర్పం బయటకు వచ్చి, అది ఆదిశేషునిగా మారి, ఆకాశమార్గాన వెళ్ళిపోయింది. యాదవ కులనాశనం తర్వాత, తను వైకుంఠానికి చేరుకుంటానని బ్రహ్మదేవుడికీ, ఇంద్రాది దేవతలకూ ఇచ్చిన మాటను కృష్ణుడు గుర్తుకు తెచ్చుకున్నాడు.

శ్రీకృష్ణుడు కూడా యోగ మార్గంలోనే తన దేహాన్ని విడిచి, దివ్యంగా వెళ్ళిపోవచ్చు. కానీ, ఆయన అలా చేయలేదు. భూమిపై మానవ జన్మ తీసుకోవడం వలన, శరీర త్యాగం ద్వారానే తన అవతారాన్ని చాలించాలని, నిర్ణయించుకున్నాడు. యాదవులలో ఒకడైన తాను కూడా, ముసలం ద్వారానే అవతార త్యాగం చెయ్యాలని భావించి, అందుకు తగిన ఏర్పాట్లు ముందునుండీ చేసుకున్నాడు. అవేంటంటే, ముసలాన్ని చూర్ణం చేసి సముద్రంలో కలిపినప్పుడు, అందులో వాడియైన ఒక ఇనుప ముక్క ఉండిపోయిందనీ, దాన్ని ఒక చేప మ్రింగిందనీ, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ చేప ఒక కిరాతకుని వలలో చిక్కింది. వాడు దాన్ని కోసి, దాని కడుపులో దొరికిన ఇనుప ముక్కను, తన బాణానికి మొనగా చేసుకున్నాడు. ఆ బాణాన్నే, తన అవతార పరిసమాప్తి కోసం వినియోగించుకో దలచాడు, శ్రీకృష్ణుడు. ముసలం ద్వారానే తన అవతారాన్ని చాలించాలన్నదే కదా ఆయన సంకల్పం..

హుందాగా మరణాన్ని ఆహ్వానిస్తూ, ఒక రావిచెట్టు మొదట్లో నేలపై పవళించి, కుడి మోకాలి మీద ఎడమ పాదాన్ని ఠీవిగా పెట్టుకున్నాడు. అలా యోగనిద్రలోకి ప్రవేశించాడు. ముసలంలోని ఇనుప ముక్కతో బాణం తయారు చేసుకున్న కిరాతకుడు, అదే సమయంలో వేటాడుతూ, అటుగా వచ్చాడు. చెట్లచాటు నుండి శ్రీకృష్ణుని పాద పద్మాన్ని చూసి, అక్కడ ఏదో లేడి దాగున్నదని భ్రమించి, బాణాన్ని సూటిగా ప్రయోగించాడు. అది శ్రీకృష్ణుడి బొటన వ్రేలిలో దిగబడింది. కిరాతకుడు దగ్గరకు వెళ్ళిజూసి, తాను బాణం వేసినది కృష్ణపరమాత్ముడి పైనని తెలుసుకుని, తన మహాపరాధానికి ఎంతగానో విలపించాడు. తనను మన్నించమని ప్రార్ధించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతడిని ఓదార్చి, “నేను కోరుకున్న పనినే నువ్వు చేశావు, విచారించకు” అని చెప్పి, కిరాతకుడికి ముక్తిని ప్రసాదించాడు. ఈ విషయాన్ని విపులంగా వివరిస్తూ మనం గతంలో చేసిన వీడియోను చూడండి. ఆనంతరం శ్రీకృష్ణుడి శరీరం నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి, ఆకాశ మార్గాన వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆయన దివ్య రధమూ, గుర్రాలూ, గరుడ ధ్వజమూ, శంఖ చక్రాదులూ ఆయనను అనుసరించాయి. దేవ దుందుభులు మ్రోగాయి. దివి నుండి పూలవాన కురిసింది. కృష్ణావతార పరిసమాప్తిని బ్రహ్మాది దేవతలంతా కనుల పండువగా చూశారు.

ఇందులో ఒక విశేషాన్ని గమనించాలి. శ్రీకృష్ణుడు తన జీవిత కాలంలో, ఎన్నో యుద్ధాలలో నిలిచి, ఎన్నో ఆయుధాల దెబ్బలు తినివున్నాడు. ఆ గాయాల నుండి కారుతున్న రక్తధారలతో, 'పూసిన మోదుగవృక్షం'లా కనిపించేవాడు. అలాంటప్పుడు కూడా కాస్తయినా చలించేవాడు కాదాయన. అటువంటి వజ్రకాయుడు, కేవలం బొటన వ్రేలికి బాణం గ్రుచ్చుకున్నంత మాత్రాన ప్రాణాన్ని కోల్పోతాడా? యథార్ధానికి అది జరగని పని! అయితే, అవతారాన్ని ముగించేందుకు శ్రీకృష్ణుడే స్వయంగా సృష్టించుకున్న మిష ఇది. దీనిలో ఒక పరమార్థం ఉంది. శ్రీకృష్ణుణ్ణి గెలవడం, చంపడం ఎవరికీ సాధ్యం అయ్యే పని కాదు. పైగా ముసలం ద్వారానే తన మరణాన్ని ఆహ్వానించ దలచుకున్నాడాయన. అందువల్ల పూర్వజన్మ పుణ్యఫలం గల ఒక కిరాతకుని ఎన్నుకుని, ముసలంలోని ఇనుప ముక్క అతని చేతికి ఆయుధంగా వచ్చే ఏర్పాటు చేసుకున్నాడు. దాని ద్వారానే అవతారాన్ని చాలించాడు.

శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు, ద్వారకలోని వారందరినీ తరలించి తీసుకుపోయాడు అర్జునుడు. కృష్ణావతార పరిసమాప్తి జరిగిన వారం రోజులకు, సముద్రంలో మునిగిపోయింది ద్వారక. ద్వ్యాపరయుగంలో సముద్రంలో మునిగిన ద్వారకా పట్టణం, ఇటీవలి చారిత్రక పరిశోధనల్లో బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. భారతీయ సముద్ర గర్భ పురావస్తుశాఖ అధిపతి శ్రీ యస్‌. ఆర్‌. రావు గారు తన బృందంతో జరిపిన పరిశోధనల్లో, గుజరాత్‌ నమీపంలోని అరేబియా మహాసముద్రంలో మునిగివున్న ద్వారక అవశేషాలు బయటపడ్డాయి. ద్వారకా నగరానికి పూర్వ వైభవాన్ని కల్పించేందుకు, ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశ, విదేశాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం, ఈ దిశగా కృషి చేస్తోంది. సముద్రగర్భంలో వున్న ద్వారకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, మన ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

యతః కృష్ణస్తతో ధర్మో యతో ధర్మస్తతో జయః ||

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home