The Aim of Human Life | మానవ జన్మ!
మానవ జన్మ! మనస్సును బుద్ధి నియంత్రణలో ఉంచగలిగితే!
మయుడు నిర్మించిన మయసభను మరిపించే భ్రమల సౌధాన్ని కల్పించేది ఏది?
జన్మలలోకెల్లా అత్యుత్తమమైన మానవ జన్మను పొంది కూడా, సంసారజీవితంలో పడి కొట్టుకు పోతూ వుంటారు చాలామంది అమాయకంగా. అంతా తమ ప్రమేయంతోనే, తమ మూలకంగానే నడుస్తుందనే అహంకారంతో ఉంటారు ఎక్కువగా. కేవలం కుటుంబ జీవితాన్ని గడపడానికీ, మన వారసత్వాన్ని ఈ ప్రపంచంలో మిగిల్చి వెళ్ళడానికీ, ఈ లోకంలోకి రాలేదు మనం. అది అటూ ఇటుగా అన్ని జీవరాశులూ చేసే పనే.. మానవులకే కాదు, అన్ని జంతు జాతులకూ వారసులూ, కుటుంబాలూ వుంటాయి. కానీ మానవ జన్మను ఎత్తిన మనం, భగవత్ చింతన కోసం ఈ లోకంలోకి వచ్చామని, ఎవరికి వారు తెలుసుకుని తీరాలి. యుక్త వయస్సులో ఉన్నట్లుగా, ముదిమి వయస్సులో కూడా ఇల్లేమైపోతుందో, భార్య ఏమైపోతుందో, బిడ్డలేమైపోతారో అని చింతిస్తూ కూర్చుంటే, అంతకు మించిన అవివేకం మరొకటి లేదు. మనకు మనమే కాకుండా పోయే రోజులు దగ్గర పడుతున్నా కూడా, ఇంకెవరో, ఏదో అయిపోతారని ఆందోళన పడుతున్నామంటే, అది అచ్చంగా అవివేకమే! మరి ఎలా..? అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/iRjJtNLEQAo ]
ఈ విషయాన్ని గురించి గౌతమ బుద్ధుడు ఇలా అన్నాడు..
పుత్రా మే సంతి ధనం మే అస్తి ఇతి బాలో విహన్యతే |
ఆత్మా హి ఆత్మనో నాస్తి కుతః పుత్రః కుతో ధనమ్ ||
'నాకు కొడుకులున్నారు, ధనం ఉంది' అని ఆసక్త చిత్తులైన అజ్ఞానులు, కష్టాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. తనకు తానే లేనప్పుడు, ఇక కొడుకులూ, ధనం, తనదెలా అవుతుందని ఇక్కడ ప్రశ్నించాడు, బుద్ధ భగవానుడు. కళకళ లాడుతూ కళ్ళముందు తిరిగే భార్యా, సకలభోగాలలో ఓలలాడించిన ధనం కూడా మిమ్మల్ని విడిచిపెట్టే రోజొకటి వస్తుందనీ, సమస్త కాలచక్రాన్నీ తన కనుసన్నలలో తిప్పే కారుణ్యమూర్తి ఒకరున్నారనీ మనషులు ఎన్నడూ మరచిపోకూడదు. అలాగని, ఆత్మీయులను వదిలించుకోమని చెప్పడంలేదు.. వారి గురించే రేయింబవళ్ళూ చింతిస్తూ వుండిపోకుండా, దైవ చింతన అలవరచుకోమని, ఇందులోని సారాంశము. ఈ సృష్టిలో మనిషి తప్ప, ఏ జీవీ, తరతరాలకు సరిపడా పోగు చేసుకోవాలని తాపత్రయ పడదు. కారణం, వాటికి ప్రకృతిపైనా, పరమాత్మపైనా ఉన్న పూర్తి విశ్వాసం.
పేరుకు పరిణతి చెందిన జీవిగా చెప్పుకుంటూ, మరోవైపు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా, పరమాత్మ ప్రణాళికకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మనిషి. పులి కూడా ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది. గుహ నిండా జింక మాంసాన్ని నింపుకుని, రోజుల తరబడీ తింటూ కూర్చోదు. పిల్లలను ఓ మూలన భద్రంగా కూర్చుండబెట్టి, తనే ఒళ్ళుగుల్ల చేసుకుని మాంసపు ముక్కలు తెచ్చి తినబెట్టదు. కానీ మనం మాత్రం, మునిమనుమళ్ళు కూడా ఏ చీకూ చింతా లేకుండా తింటూ కూర్చోవాలని, మనకున్న ఆయువునంతా హరింపజేసుకుంటూ, క్షణం తీరిక లేకుండా చింతిస్తూ, కాసులు కూడబెట్టుకుంటుంటాము.
ఇలాంటి సమయంలో ఎవరైనా మన పుణ్యం కొద్దీ వచ్చి, 'గుడికెళదామనో, ఏదైనా సంఘసేవ చేద్దామనో' అంటే, నాకు తీరిక లేదని చెప్పి తప్పించుకుంటూ వుంటాము. ఇలాంటి మన దుఃస్థితిని ముందే ఊహించిన ప్రహ్లాదుడు ఏనాడో.. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై, విషయ ప్రవిష్టులై, చచ్చుచు పుట్టుచున్ మరల చర్వితచర్వణులైన వారికిం జెచ్చెర బుట్టునే, పరులు సెప్పిననైన, నిజేచ్ఛనైన, నే మిచ్చిన నైన, కానలకు నేగిననైన, హరి ప్రబోధముల్? అని అన్నాడు. 'కొందరు గాఢమైన కారుచీకటి లాంటి ఈ మాయలో పడి, కోరికలను చంపుకోకుండా, సంసారం సాగిస్తూ ఉంటారు. అటువంటి మూర్ఖులకు, శ్రీహరిపై భక్తి దానంతట అదిగా పుట్టదు. ఒకవేళ ఇతరులు బోధించినా కలుగదు. ఏమైనా ఇచ్చి ఆశ చూపించినా, వారికి దేవుడి మీద భక్తి ఏర్పడదు. ఆఖరికి అడవులలోకి తీసుకు వెళ్ళినా, ఫలితం ఉండదు. భగవంతుడి మీదకు అంత త్వరగా మనస్సు పోతుందా!' అంటూ ఆవేదన పడ్డాడు ప్రహ్లాదుడు. కాబట్టి, మనిషికి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. అలాగే, ఎప్పుడూ పనులు అంటూ, భగవంతుడినే దూరం పెట్టేలా ఉండకూడదు.
మనస్సు, బుద్ధి నియంత్రణలో ఉంటే అది మంచి సేవకురాలు. మనసే బుద్ధిని నియంత్రిస్తే, అది ఒక నియంత. అది పాదరసం లాగా చురుకైనది. చేతికి దొరికినట్లే ఉంటుంది కానీ, తేలికగా జారిపోతుంది. భవ బంధాలకూ - మోక్షానికీ, రాగ - ద్వేషాలకూ, భయానికీ - ధైర్యానికీ, సంకల్ప - వికల్పాలకూ, శాంతికీ - అశాంతికీ, అన్నింటికీ మూలం మనస్సే. మనస్సును నియంత్రిస్తే, ప్రశాంతత, శాంతీ, సౌఖ్యాలూ లభిస్తాయి. నిజానికి అది అంత తేలిక కాదు. గట్టిగా ప్రయత్నిస్తే, కష్టమూ కాదు.
మచ్చికైన జవనాశ్వం రౌతు అధీనంలో ఉన్నట్లు, బుద్ధి అదుపులో మనస్సుండాలి. రౌతు కోరిన చోటుకు గుర్రం వెళ్ళాలిగానీ, అది తీసుకుపోయిన చోటుకు రౌతు వెళ్ళడం సరికాదు. మాలిమి చేసుకున్న మనస్సు మాత్రమే, బుద్ధి అధీనంలో నడుచుకుంటుంది. ‘మనస్సు’ మాయాజాలం, మాటలకు అందనిది. మయుడు నిర్మించిన మయసభను మరిపించే భ్రమల సౌధాన్ని కల్పిస్తుంది. తనది కానిదాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైనదాన్ని శాశ్వతమన్నట్లుగా భ్రమింపజేస్తుంది, మురిపిస్తుంది. బుద్ధిని సక్రమంగా ఉపయోగించి గానీ, ఆ మాయ నుంచి బయటపడలేము. రాగద్వేషాలతో నిండిన మనస్సు, ఉన్నది ఉన్నట్లుగా చూడనివ్వదు. అది ప్రసరింపజేసే రంగురంగుల కాంతిలో, గాజుముక్క కూడా వజ్రంలాగా కనిపిస్తుంది. బుద్ధి అనే సూర్యకాంతిలో మాత్రమే, వజ్రానికీ, గాజుముక్కకూ తేడా తెలుస్తుంది.
మనస్సు నిజ జీవితానికి భిన్నమైన గొప్ప ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అది విశ్వామిత్రుడి త్రిశంకు స్వర్గం కన్నా మిన్నయైనది. ఆ కాల్పనిక జగత్తులో మునిగితేలే వారు, నిజ జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు. కొంతమంది పలాయన వాదాన్ని చిత్తగిస్తారు, కొందరు మద్యపానాన్ని ఆశ్రయిస్తారు, కొందరు తమ బాధ్యతనూ, కర్తవ్యాన్నీ భగవంతుడిపై నెట్టేస్తారు. అటువంటి వారికి మద్యపానమైనా, భగవంతుడి ప్రార్థనలైనా, పెద్ద భేదం ఉండదు. ఎన్ని చూసినా, ఉపనిషత్తులు చదివినా, భగవద్గీతను కంఠస్థం చేసినా, వాటి సారాన్ని నిజ జీవితంలో అన్వయించుకుని ఆచరించగలిగితేనే, వాటికి సార్థకత.
మనిషి బలం, బలహీనత, రెండూ మనస్సే. మనిషిని దైవత్వానికి చేరువ చేసేది మనస్సే, రాక్షసుడిగా దిగజార్చేదీ మనస్సే. బలహీనమైన మనస్సు, ప్రతి అల్ప విషయానికీ ఉద్విగ్న భరితమవుతుంది. ప్రశంసలకు, ఆకాశంలో విహరిస్తుంది. విమర్శిస్తే, పాతాళానికి క్రుంగిపోతుంది. తాళం చెవి ఎడమవైపు తిప్పితే గడియ పడుతుంది, కుడిపక్కకు తిప్పితే గడియ తెరుచుకుంటుంది. అలాగే మనస్సు ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. భౌతిక సుఖాలకు వ్యతిరేకంగా తిప్పితే, ఆధ్యాత్మికత వైపుకు తిరుగుతుంది. మనస్సులోని వ్యతిరేక భావనలను తొలగించి, సానుకూలమైన, ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే, శారీరక రుగ్మతలూ దరిజేరవు. నేటి శాస్త్రవేత్తలు కూడా, చాలా రోగాలకు కారణం మనస్సే అనీ, మనస్సును హాయిగా ఉంచుకున్నవారికి, రోగాలు దరిజేరవనీ ధ్రువీకరించారు.
ధర్మబద్ధమైన కర్మలను నిష్కామంగా ఆచరిస్తూ, బుద్ధికి మనసును అప్పజెప్పి, జీవనయానాన్ని కొనసాగించాలి. ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ, మనస్సులో చెలరేగే ఆలోచనలనూ, ప్రలోభాలనూ, సంఘటనలనూ అవగాహన చేసుకుని, విచక్షణతో వాటి ప్రభావాన్ని కొద్దికొద్దిగా తగ్గించుకోవాలి. అప్పుడు కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ, దారి తప్పకుండా నడుచుకుంటాయి.
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
Comments
Post a Comment