ఎవరు గొప్ప! కర్ణుడా - అర్జునుడా? Who is more powerful - Karna or Arjuna


ఎవరు గొప్ప! కర్ణుడా - అర్జునుడా?
ద్రౌపది మనస్సులో కర్ణుడిని కామించిందనడంలో ఎంతవరకూ నిజం ఉంది?

వేదవ్యాసుడు చెబుతుండగా, గణపతి రచించిన మహాభారతం, పంచమ వేదంగా పరిగణించబడే భారత ఇతిహాసం. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం, మహాభారత కావ్యం, వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000 సంవత్సరాల కాలంలో, దేవనాగరి లిపి అయిన సంస్కృత భాషలో రచించబడింది. 18 పర్వాలతో, లక్ష శ్లోకాలతో, 74,000 పద్యాలతో లేక సుమారు 18 లక్షల పదాలతో, ప్రపంచంలోనే అతి పెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో, కవిత్రయంగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగులోకి అనువదించారు. అటువంటి మహాభారతంలోని అర్జునుడూ, కర్ణుడి గురించి తెలియనివారుండరు. ఇక ప్రభాస్ నటించిన కల్కి వంటి చిత్రాలు చూసినప్పుడు, వీరిలో ఎవరు గొప్ప అనే సందేహం మెదులుతూ ఉంటుంది చాలామందిలో. విశ్లేషణాత్మకంగా ఈ విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/xKPQS3XGcWg ]


కర్ణుడు గొప్పా, అర్జునుడు గొప్పా అనేది తెలుసుకునే ముందు, వ్యాస విరచిత మహాభారత కావ్యంలోని కొన్ని పాత్రల వైశిష్ట్యం, కొన్ని సంఘటనలూ తెలుసుకోవడం తప్పనిసరి. దానం విషయంలో కర్ణుడికి సాటి ఎవరూ లేరన్న పేరుంది. కర్ణుడు అంగరాజ్యానికి రాజయ్యాక చేసిన దానాలన్నీ, దుర్యోధనుడు ఇచ్చినవే కావచ్చు. కానీ, బాల్యం నుండీ కర్ణుడికి దానగుణం హెచ్చని, భారతం చెబుతుంది. అలాగే, కర్ణుడి దానాలలోకెల్లా గొప్ప దానం, కవచ కుండలాల దానం. ఎందుకంటే, అవి దుర్యోధనుడు ఇచ్చినవి కావు. కర్ణుడి స్వంతం, అతడికి పుట్టుకతో సంక్రమించినవి. కవచ కుండలాల దానం, కర్ణుడికి మహత్తర కీర్తిని తెచ్చిపెట్టింది. కానీ, ఇక్కడ గమనించాల్సింది, కవచ కుండలాలను దానం చేసి, అంతకంటే గొప్పదైన 'శక్తి' ఆయుధాన్ని ప్రతిఫలంగా పుచ్చుకున్నాడు. ప్రతిఫలం పుచ్చుకున్న దానికి, దాన ఫలం మిగలదు. కర్ణుడు తన పూర్వజన్మలో సహస్ర కవచుడిగా, 1000 కవచాలూ, కుండలాలతో వున్నప్పుడే, నరనారాయణుల ముందు నిలువలేక పోయాడు. ఇక ఈ జన్మలో, కేవలం ఒక్క కవచంతో, నరనారాయణులు అంటే, కృష్ణార్జునుల ముందు నిలువగలడా? ఆ కవచం బలం ఎంతో కర్ణుడికి తెలుసు. అందుకే దాన్ని ఇచ్చేసి, అర్జునుణ్ణి చంపగల శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు. అంటే, ఈ విషయంలో మోస పోయింది కర్ణుడు కాదు, ఇంద్రుడే అనేది తేటతెల్లమవుతుంది. ఈ దానం సందర్భంలో, కర్ణుడు అంతటి చాకచక్యం చూపించాడు.

ఇక భీష్ముడు తన తండ్రి కోసం, రాజ్యాన్ని వదులుకున్నాడు. తండ్రి కోసం ఆయన చేసిన త్యాగమది. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం, ఆ రాజ్యం భీష్ముడి స్వంతం కాదు, స్వార్జితమూ కాదు. అప్పటికి ఇంకా భీష్ముడు రాజు కాలేదు. యువరాజు మాత్రమే. ఆ రాజ్యం అప్పటికీ ఆయన తండ్రి అయిన శంతనుడిదే. శంతనుడి రాజ్యాన్ని శంతనుడికే వదిలేశాడు. ఒక విధంగా ఆ త్యాగం అసంపూర్ణం. అతను రాజ్యాన్ని వదిలేసి, దానికి ప్రతిఫలంగా, తాను కోరుకున్నప్పుడే మరణించే వరాన్ని పొందాడు. అంటే, ఈయనా తన త్యాగానికి ఫలితాన్ని పొందాడు. పైగా, సత్యవతి కుమారులు పెరిగి పెద్దయ్యే వరకూ, సుమారు 25 సంవత్సరాలు మకుటం లేని మహారాజుగా, రాజ్యపాలన చేశాడు. అనంతర కాలంలోనూ, చివరి వరకూ బ్రహ్మాండమైన రాజభోగాలను కూడా అనుభవించాడు.

ఈ విధంగా కర్ణుడూ, భీష్ముడూ, తగిన ప్రతిఫలాలను పొందడం వలన, వారి చర్యల్లో చెప్పుకునేంత గొప్పదనం ఏమీ మిగలదు. వీరిద్దరికంటే గొప్ప దాతగా, త్యాగశీలిగా, ధర్మరాజును చెప్పుకోవచ్చు. ఎందుకంటే, అరణ్యవాస కాలంలో, తమకే తిండి తిప్పలు కరువైన రోజుల్లో కూడా, తమనే నమ్ముకుని, తమతోబాటు అరణ్యాలకు వచ్చిన వేలాది మంది అమాయక ప్రజల కోసం, సూర్యునికై తపస్సుజేసి, అక్షయపాత్రను సంపాదించి, ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా, వేలాది మందికి ప్రతిరోజూ అన్నదానాలు చేశాడు. ఎక్కడో హిమాలయాలకు వెళ్లి, అక్కడ భూమిలో నిక్షిప్తమైవున్న నిధులను స్వయంగా సాధించుకు తెచ్చి, అశ్వమేధ యాగ సమయంలో వేలాది మందికి, వారు కోరినంత, స్వార్జితమైన బంగారాన్ని దానం చేసిన ధర్మరాజు, కర్ణ భీష్ముల కంటే గొప్పవాడని నిరూపితమవుతుంది.

కర్ణుడిలో కొంత దానగుణం తప్ప, ఇక ఏ ఇతర మంచి గుణాలూ లేవు. అందుకే వ్యాసభగవానుడూ, తిక్కన, కర్ణుడిని దుష్టచతుష్టయంలో చేర్చారు. అంగరాజ్యమిచ్చి దుర్యోధనుడు ఆదరించాడనే విశ్వాసంతోనే, దుష్టకార్యాలు చేశాడని కొందరు భ్రమపడుతుంటారు. కానీ అది నిజం కాదు. అంత విశ్వాసం వుంటే, పంతాలకు పోయి, కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళకుండా, పది రోజుల పాటు దుర్యోధనుణ్ణి వదిలేస్తాడా? అంటే, దుర్యోధనుడికంటే, అతనికి తన స్వంత పంతాలే ముఖ్యం. అంతేగాక, కర్ణుడు అసూయ, మోసం, ద్వేషం, అన్నీ మెండుగా కలిగివున్న వాడు. అతడు పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నదే, మోసంతో. మొట్టమొదట కురు పాండవ యుద్ధవిద్యా ప్రదర్శనలో, తానూ పాల్గొనాలని వచ్చాడు. కానీ, అతడు క్షత్రియుడు కాదని కొందరు అభ్యంతరం వెలిబుచ్చారు. ఆ సమయంలో అర్జునుడు గొప్ప అస్త్ర నిధిగా పొగడబడుతున్నాడు. అదే, కర్ణుని అసూయకు నాంది. దుర్యోధనుడి పుణ్యమా అని ఆ అస్త్ర విద్యా ప్రదర్శనలో పాల్గొన్నాడు. అయితే, కౌరవులు తప్ప అతడిని అర్జునుడి కన్నా మిన్న అని అక్కడ ఎవ్వరూ పొగడలేదు. అందుకే ఏనాటికైనా అర్జునుణ్ణి ఓడించాలని అనుకున్నాడు. కానీ, ద్రౌపదీ స్వయంవరం, ఘోష యాత్ర, ఉత్తర గోగ్రహణం లాంటి సంఘటనలు తీసుకుంటే, అనేకసార్లు అర్జునుడి ముందు ఓడిపోయాడు. అందుకే భూమిపై తానో, అర్జునుడో, ఎవరో ఒక్కరే వుండాలని నిర్ణయించుకుని, అర్జునుడి పై పగబట్టాడు.

నిజం చెప్పాలంటే, అర్జునుడేమీ కర్ణుని అంతగా అవమానించిన సందర్భం లేదు. అస్త్ర విద్యా ప్రదర్శన నాడు కూడా, కర్ణుని భీముడే అవమానించి మాట్లాడాడు. దుర్యోధనుడికి ముఖ్య శత్రువు భీముడు. స్నేహితుని శత్రువు గనుక, పగబడితే భీముడిపై పగబట్టాలి కర్ణుడు. కానీ, అర్జునుడిపై పగబట్టింది, కేవలం అసూయ వల్లనే. అందుకే పాండవులలో ఎవరు దొరికినా చంపను, అర్జునుడిని మాత్రం వదలనన్నాడు కుంతీ దేవితో. అర్జునుడిని చంపడానికి నాగాస్త్రం సంపాదించాడు. ఇంద్ర 'శక్తి' ఆయుధం తీసుకున్నాడు. యుద్ధంలో అర్జునుడు అలసిపోయే వరకూ, 10 రోజుల పాటు తాను విశ్రాంతి తీసుకుని, కురుక్షేత్రానికి వచ్చాడు. అతని గురి కేవలం అర్జునుడే..

కర్ణుడి జన్మ రహస్యం ధర్మరాజుకు తెలిస్తే, ఆయన తనకున్నదంతా కర్ణుడికే ఇచ్చేసే వాడు. అలా జరిగితే, పాండవులంతా అతని అనుచరులుగా వుండేవారు. కానీ, కర్ణుడికి కావలసింది, భ్రాతృ ప్రేమో, మాతృ ప్రేమో కాదు. పెద్దన్నయ్యగా గౌరవాదులూ కాదు. అర్జునుడిని ఓడించాలి. తానే గొప్ప వీరుడిగా కీర్తించబడాలి. అందుకు అర్జునుడిని చంపేయాలి. పాండవులతో కలసి జీవిస్తే, తన అసూయా పూరిత దుష్టాశయం నెరవేరదు కాబట్టి, అతడు ఆజన్మాంతం పాండవ విరోధిగానే మిగిలిపోయాడు.

ఇక కర్ణుడి దానశీలతను ఆసరాగా తీసుకుని, ఇంద్రుడు అతని కవచకుండలాలను కాజేశాడనీ, కురుక్షేత్రంలో కర్ణుడిని శల్యుడు తన మాటలతో కుంచింపచేశాడనీ, రధచక్రం భూమిలో క్రుంగిన సమయంలో, అర్జునుడు అతడిని చంపేశాడనీ, ఇటువంటి ఘటనలు జరిగివుండకపోతే, కర్ణుడి చేతిలో అర్జునుడు ఓడిపోయే వాడనీ కొందరు అంటూ ఉంటారు. మరి ఆ విషయాలలోకి వెళితే.. ఏ విధంగా చూసినా, అర్జునుడి వీరత్వం ముందు, కర్ణుడు దిగదుడుపే. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే, ఈ కలియుగంలో కలి ప్రభావంచేతనో ఏమోగానీ, ఈ మధ్య విలన్స్‌కి అభిమానులు పెరుగుతున్నారు. అంతటితో ఆగకుండా, డబ్బున్న మారాజులు కొందరు విలన్స్‌ను గొప్పవారిగానూ, ధర్మపరులను అల్పులు గానూ చిత్రించి, సినిమాలూ, టి.వి. సీరియల్స్‌ తీసి ప్రదర్శిస్తున్నారు. ఆ పుక్కిటి కథలనే నిజమని నమ్మడం వల్లే, ఇటువంటి సందేహాలు పుట్టుకొస్తున్నాయి.

‘రావణుడు రాముడికన్నా మిన్న’ అంటాడు ఒకడు. ‘ద్రౌపది, మనస్సులో కర్ణుడిని కామించింద’ని అంటాడు ఇంకొకడు. ‘ధర్మరాజుకు రాజ్య పిపాస హెచ్చ’ని అంటాడు మరొకడు. ‘కీచకుడు మంచివాడే.. అతడిని రెచ్చగొట్టింది ద్రౌపదే’ అని వేరొకడంటాడు. కీచకుడిపై గెలవలేక, భీముడు రహస్యంగా దాచుకున్న కత్తితో పొడిచి చంపేశాడనీ, ద్రౌపదీ స్వయంవరంలో కర్ణుడే మత్స్య యంత్రాన్ని కొట్టేసేవాడు కానీ, ద్రౌపదే అతడిని కించ పరచి, పోటీలో పాల్గొన నీయలేదనీ, అసలు మత్స్య యంత్రాన్ని జరాసంధుడు కొట్టేసేవాడు కానీ, ద్రౌపది అతడిని వేడుకుని, బ్రతిమాలి, పోటీ నుండి తప్పించిందనీ, ఇలా ఎన్నెన్నో.. ఇవన్నీ మన సినిమాలలో, టి.వి. సీరియల్స్‌లోని మాయా జాలాలు. ఈ సంఘటనలేవీ, కృతికర్త వ్యాసుల వారు చెప్పినవి కావు. కర్ణుడు వీరుడే.. కానీ అర్జునుడితో ఏ మాత్రం సరిసమానుడు కాడు. ద్రౌపదీ స్వయంవరంలో, కర్ణుడు అర్జునుడిచేత ఓడించబడ్డాడు. ఘోష యాత్రలో కర్ణుడిని ఓడించిన చిత్రరధుడు, అర్జునుడి చేతిలో ఓడి పోయిన వాడే. ఉత్తర గోగ్రహణంలో కర్ణుడిని పడగొట్టి, అతని తలపాగా కుచ్చును తీసుకు పోయాడు అర్జునుడు. కురుక్షేత్రంలో ఒకే రోజున అయిదు సార్లు భీముడి చేతిలో ఓడిపోయి, పారిపోయాడు కర్ణుడు. అభిమన్యుడి చేతిలో చావుదెబ్బలు తిని పారిపోయి, మరో ఐదుగురు దుర్మార్గులతో కలసివచ్చి, అన్యాయంగా అభిమన్యుణ్ణి చంపిన భీరువు కర్ణుడు. కర్ణుడి కుమారుణ్ణీ, సైంధవుణ్ణీ చంపుతానని చెప్పిమరీ, కర్ణుడి కళ్ళముందే వారిద్దరినీ చంపేశాడు అర్జునుడు. ఘటోత్కచుడి చేతిలో చావుదెబ్బలు తిని, గత్యంతరం లేక, తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం, అర్జునుణ్ణి చంపడానికి దాచుకున్న ఇంద్రశక్తిని ప్రయోగించి, ఘటోత్కచుణ్ణి తుదముట్టించిన భయస్థుడు కర్ణుడు. ఇదీ, కర్ణుడి వీరత్వం.

వేయి కవచాలు కలిగి ఉన్ననాడే, కృష్ణార్జునులు నరనారాయణుల రూపంలో కర్ణుడిని, అంటే సహస్ర కవచుడిని చావగొట్టి, 999 కవచాలను ఛేదించారు. చేసేది లేక పారిపోయాడు కర్ణుడు. ద్రౌపదీ స్వయంవరం, ఘోషయాత్ర, ఉత్తర గోగ్రహణం సమయాలలో, కర్ణుడికి చివరి కవచ కుండలాలున్నాయి. అయినా, అర్జునుడే గెలిచాడు. అందుకే ఆ కవచ కుండలాల శక్తి ఏ పాటిదో కర్ణుడికి అర్ధమై, ఇంద్రుడు అడిగిన వెంటనే వాటిని ఇచ్చేసి, బదులుగా, అర్జునుడిని చంపగల శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు, దాన కర్ణుడు. ఇక శల్యుడు తన మాటలతో కర్ణుడి మనస్సు పాడు చేయటం సంగతి ఎలావున్నా, ఒక సంఘటనలో, కర్ణుడి ప్రాణాలను రక్షించాడు శల్యుడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజున, కర్ణుడు ధర్మరాజును దూషించిన విషయం తెలుసుకున్న భీముడు వెళ్ళి, కర్ణుడితో యుద్ధం చేసి ఓడించి, మూర్చబోయేటట్లుజేశాడు. అన్నగారిని తిట్టిన నాలుకను కోసి పారేస్తానని ముందుకురికాడు, భీముడు. అప్పుడు శల్యుడు భీముణ్ణి శాంతపరచి, మూర్చలో వున్న వారి నాలుక కోయడం తగదని నచ్చజెప్పి, కర్ణుడిని రక్షించాడు.

ఇక రధ చక్రం కృంగి పోయినప్పటి సంగతికొస్తే, చక్రాన్ని కర్ణుడు ఎత్తుతుండగా అర్జునుడు అతన్ని చంపడం వాస్తవం కాదు. క్రుంగిన రధ చక్రాన్ని ఎత్తడానికి ఎంత ప్రయత్నించినా రాకపోవటంతో, శాపవశాన ఆ చక్రం ఇక రాదనీ, మరో రధం తెచ్చుకున్నా, అదే గతి పడుతుందనీ తెలుసుకున్న కర్ణుడు, ఆ పై ఇక నేలపై నిలబడే యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలోనే కర్ణుడు మరణించాడు. ఇక్కడ అర్జునుడు రధంపైనా, కర్ణుడు నేలపైనా వున్నందువల్లనే, కర్ణుడు ఓడిపోయాడని అనుకోవడం సరికాదు. ఎందుకంటే, అదే కర్ణుడిని ఓడించిన చిత్రరధుడు రధంపై వుండి యుద్ధం చేయగా, నేలపై నిలబడి పోరాడిన అర్జునుడే గెలిచాడు. అందువల్ల మనం గమనించవలసింది, శాపాలు వగైరాలు లేకపోయినా, కర్ణుడు అర్జునుడిపై గెలవగలగడం అసంభవం.

🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ఏది శాకాహారం – ఏది మాంసాహారం? Story of Dharmavyadha and his curse - Varaha Purana