అభిమన్యుడిని శ్రీకృష్ణుడు ఎందుకు కాపాడలేదు? Why Lord Krishna didn't save Abhimanyu


అభిమన్యుడిని శ్రీకృష్ణుడు ఎందుకు కాపాడలేదు?
అన్నీ తెలిసిన కృష్ణుడు 16 ఏళ్ల చిరు ప్రాయంలో అభిమన్యుడి మరణాన్ని ఎందుకు అడ్డుకోలేదు?

పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలోని వీర యోధులు అనగానే, ముందుగా అందరి మదిలో మెదిలే పేరు 'అభిమన్యుడు'. పాండవ మధ్యముడు అర్జునుడు, శ్రీకృష్ణుడి సోదరి సుభద్రాదేవిల ముద్దుల తనయుడు అభిమన్యుడు. అంటే, సాక్షాత్తు శ్రీ కృష్ణుడికి మేనల్లుడు. తల్లి కడుపులో ఉన్న సమయంలోనే తండ్రి నుంచి అస్త్రశస్త్ర విద్యలను అభ్యసించిన జ్ఞాని. పుట్టకముందే చక్రవ్యూహంలోకి ప్రవేశించే జ్ఞానాన్ని సంపాదించాడు. అయితే, ఆ చక్ర వ్యూహం నుంచి బయటపడే మార్గం తెలియక, 16 ఏళ్ల చిరు ప్రాయంలో మరణించాడు. అభిమన్యుడు యుద్ధంలో ఇలా వీర మరణం పొందడం వెనుక కారణం ఏంటి? ఎందుకు శ్రీ కృష్ణుడు కూడా తన మేనల్లుడు అభిమన్యుడిని కాపాడకుండా మిన్నకుండిపోయాడు? వంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/wKZGYNXa9V4 ]


మహాభారతం అనగానే మనకు గుర్తుకు వచ్చేది, కురుక్షేత్ర మహాసంగ్రామం. కురుక్షేత్రాన్నే ధర్మక్షేత్రం అని కూడా అంటారు. ఆ యుద్ధం, ధర్మాన్ని పరిరక్షించడానికి జరిగిన యుద్ధంగా పేర్కొంటారు. 'ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే' అని చెప్పినట్లుగానే, లోకంలో అధర్మం పెచ్చు మీరిన ప్రతి సారీ, శ్రీ మహా విష్ణువు అవతరిస్తుంటాడు. అలా ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు, ఆయనకు సహాయంగా ఇతర దేవతలు కూడా జన్మించడానికి సిద్ధపడ్డారు. వివిధ ప్రదేశాలలో ఎందరో దేవతలు జన్మించి, ధర్మాన్ని స్థాపించడంలో శ్రీ కృష్ణ భగవానుడికి సహాయం చేశారు. అందులో భాగంగానే, చంద్రుడి కుమారుడైన 'వర్చస్సు', అభిమన్యుడిగా జన్మించాడు.

అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, తండ్రి పద్మవ్యూహం గురించి చెబుతుండగా శ్రద్ధగా ఆలకించాడు. ఇక పద్మవ్యూహం నుంచి బయటపడటం ఎలాగో చెప్పబోతున్న సమయంలో, శ్రీకృష్ణుడు అర్జనుడిని అడ్డుకున్నాడు. కావాలనే శ్రీకృష్ణుడు అలా చేశాడు. దీనితో అభిమాన్యుడు, పద్మవ్యూహాన్ని ఛేదించడం మాత్రమే తెలుసుకుని, బయట పడటం తెలుసుకోలేకపోయాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జనుడు, శ్రీకృష్ణుడు లేని సమయంలో, పాండవులకు అండగా యుద్ధరంగంలోకి ప్రవేశించిన అభిమన్యుడు, కౌరవులను వీరోచితంగా ఎదుర్కొని, చివరకు పద్మవ్యూహం నుంచి బయటకు రాలేక, కౌరవుల చేతిలో అసువులు బాశాడు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా, శ్రీకృష్ణ పరంధాముడు మౌనంగా ఉండిపోయాడు.

ముందు చెప్పుకున్నట్లుగా దీనికి కారణం, గత జన్మలో అభిమన్యుడు చంద్రుడి కుమారుడు. మానవ జన్మ అయిన అభిమన్యుడిగా తన కుమారుడిని భూమి పైకి పంపడానికి ముందే, చంద్రుడు తన తనయుడు భూమిపై 16 ఏళ్లు మాత్రమే ఉంటాడని షరతు పెట్టాడు. ఆ మాట ప్రకారమే, 16 ఏళ్లకే అభిమన్యుడు మరణిస్తున్నా, కృష్ణ భగవానుడు చూస్తుండిపోయాడు. పైగా ఈ ఘటన, అర్జనుడు తన సోదరులపై యుద్ధం చేయడానికి వెనుకాడుతున్న సమయంలో జరిగి, వారు కుతంత్రం పన్ని తన తనయుడిని హతమార్చడంతో, వైరాగ్యం వీడి, అర్జునుడు పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగాడు. మహాభారతంలోని ఆదిపర్వంలో, భీష్ముడి సంశయాన్ని తీరుస్తూ, పులస్త్య మహాముని తెలియజేసిన వివరాలివి.

మరో కథనం ప్రకారం, అభిమన్యుడు పూర్వ జన్మలో అభికాసురుడనే రాక్షసుడిగా చెప్పబడింది. అతడు కృష్ణుడి మేనమామ కంసుడికి మిత్రుడు. కంస వధ తరువాత, అభికాసురుడు కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకోదలచాడు. విషయం గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్ముడు అతడిని కీటకంగా మార్చి, ఒక పెట్టెలో బంధించాడు. కాలక్రమంలో, కృష్ణుడి సోదరి సుభద్రా దేవీ, అర్జునుల వివాహం జరిగింది. ఒకనాడు అనుకోకుండా సుభద్ర ఆ పెట్టెను తెరచినప్పుడు, కీటకం ఆమె కడుపులోకి చేరి ప్రాణాలు విడిచింది. అభికాసురుడు అభిమన్యుడిగా, సుభద్ర కడుపున పునర్జన్మను పొందాడు.

విషయం తెలిసిన కృష్ణుడు బరువెక్కిన హృదయంతో తన మేనల్లుడి మరణానికి వేదికను సిద్ధం చేశాడు. అందుకే పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలిసిన అభిమాన్యుడి మరణాన్ని కావాలని అడ్డుకోలేదు. అర్జునుడు తన కుమారుడి మరణానికి దుఃఖిస్తూ కృష్ణుడిని నిందించినప్పుడు, పరమాత్ముడు అతడికి అభికాసురుడి గురించీ, అభిమన్యుడిగా అతడు పునర్జన్మనెత్తిన వైనాన్నీ వివరించాడు.

🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ఏది శాకాహారం – ఏది మాంసాహారం? Story of Dharmavyadha and his curse - Varaha Purana