2024 'ధన్వంతరి జయంతి' శుభాకాంక్షలు
అందరికీ 'ధన్వంతరి జయంతి' శుభాకాంక్షలు 🙏 @Voice of Maheedhar
సూర్యుడికి గల 108 పేర్లలోనూ, శివుడికి గల 1008 పేర్లలోనూ 'ధన్వంతరి' ఒకటి!
క్షీర సాగర మధన సమయంలో, విష్ణు అంశతో సాగర గర్భం నుండి యువకుడిగా ఉదయించాడు 'ధన్వంతరి'. లేలేత బాహు దండాలు, విశాలమైన వక్షస్థలి కలిగివున్నాడు. పద్మాలవంటి ఎర్రని కన్నులతో, చిక్కనైన కేశజాలంతో, నీలగాత్ర తేజంతోనూ కనిపించాడు. పీతాంబరాలలను కట్టుకున్నాడు. మణికుండలాలతోనూ, పుష్పమాలాతోనూ సమలంకృతుడై ఉన్నాడు. అమృత కలశాన్ని ఒక చేత్తోనూ, వనమూలికల్ని మరొక చేత్తోనూ పుచ్చుకుని ఆవిర్భవించాడు.
ముక్కోటి దేవతలూ ఆ రూపాన్ని రెప్ప వాల్చకుండా చూశారు. "ఓం తత్పురుషాయ విద్మహే అమృత కలశహస్తాయా ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్..." అని ధన్వంతరీ గాయత్రి జపించారు. శరీరానికి ముసురుకున్న వ్యాధుల్నీ, మనసుకు పట్టిన జాడ్యాన్ని తొలగించే వాడు ధన్వంతరి. సూర్యుడికి గల 108 పేర్లలోనూ, శివుడికి గల 1008 పేర్లలోనూ ధన్వంతరి ఒకటని మహాభారతంలో ఉంది. భాగవత పురాణం ధన్వంతరిని విష్ణుమూర్తి 12వ అవతారంగా పేర్కొంది.
అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంతరే హరే... ఇది శ్రీ ధన్వంతరి ధ్యానమంత్రం. ఋగ్వేదంలో దేవభిషక్కులుగా అశ్వనీదేవతలే ప్రసిద్ధులు. పురాణకాలంలో ధన్వంతరి ఆవిర్భవించాడు. వ్యాస భారతం ఉద్యోగ పర్వంలోనూ, భాగవంతం నవమ స్కంధంలోనూ, హరి వంశం 29వ అధ్యాయంలోనూ, ధన్వంతరిని గురించిన ప్రస్తావనలున్నాయి. ఇంకా అగ్నిపురాణం, గరుడపురాణాలలో కూడా ఉంది. ధన్వంంతరి చారిత్రక వ్యక్తిగా భారతదేశంలో నడయాడాడనీ, ఆయనే ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందించాడనీ నమ్మేవారున్నారు.
అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత !
రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంతరే హరే !!
Comments
Post a Comment