సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుడిని ధర్మరాజడిగిన 6 ప్రశ్నలేంటి? 6 Questions of Yudhishtira to Bhishma
భక్తి! జ్ఞాన సముపార్జన!
సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుడిని ధర్మరాజడిగిన 6 ప్రశ్నలేంటి?
“స్వ స్వరూపానుసంధానం భక్తి రిత్యభిధీయతే” అని సూత్రీకరించారు, నారద మహర్షి. దానిని బట్టి, జీవాత్మను పరమాత్మతో చేర్చటమే ‘భక్తి’ అని తెలుస్తోంది. “సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం, హృషీకేణ హృషీకేశ సేవనం భక్తి రుచ్యతే” అని నారద పంచరాత్రం లోనూ, “అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం, ఆనుకూల్యేన కృష్టానుశీలనం భక్తి రుత్తమా”.. అని భక్తి రసామృత సింధువులోనూ విశదీకరింపబడి ఉంది. “మన ఇంద్రియాలన్నింటి ద్వారా, ఇంద్రియాలకు అధిపతి అయిన పరమాత్మను సేవిస్తూ ఉండడమే 'భక్తి'. జ్ఞాన కర్మాదులవైపు మనస్సు పోనీయకుండా, శ్రీ కృష్ణుని సంతృప్తి పరచడమే లక్ష్యంగా చేసే సాధన, ఉత్తమ భక్తిగా పరిగణింప బడుతుందన్నదే, వాటి తాత్పర్యం. మరి అంపశయ్యపై మృత్యు నిరీక్షణలో వున్న భీష్ముడు, భక్తి గురించీ, విష్ణు సహస్రనామం గురించి ఏం చెప్పాడు? అన్న విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/QI8rw_UOcco ]
ఉపాధిగతుడై ఉన్న పరమాత్మనే, ‘జీవుడు’అని అంటాము. అటువంటి జీవులు అనంతంగా ఉంటాయి. అంటే, ఆ పరమాత్మ, ఈ సువిశాల విశ్వమంతటా ఉన్న అన్ని ఉపాధులలోనూ, జీవ రూపంలో ఉన్నాడని అర్ధం. దానివల్ల, అన్ని ప్రాణులలో ఉండేవాడు ఆయన ఒక్కడే అని తెలుస్తోంది. ఆ సత్యాన్నే “ఏకో దేవః సర్వభూతేషు గూఢః” అని ఉపనిషత్తులూ, “క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు..” అని శ్రీ కృష్ణపరమాత్మా, వ్యక్త్రపరచటం జరిగింది.
అయితే, యిప్పుడు మన కర్తవ్య మేమిటి? అంటే, సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ శ్రీమహావిష్ణువును, విష్ణు సహస్ర నామస్తోత్ర రూపంలో ఉన్న“మహా మంత్రం” ఆధారంగా గుర్తించటానికి ప్రయత్నించటం. మనలో భక్తి అనేది దృఢంగా ఉంటే, తప్పకుండా సఫలమనోరథులమవుతాము. అందులో సందేహమేమీలేదు.
“శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం” అనే మహామంత్రం, శ్రీమన్మహాభారతంలో, అనుశాసనిక పర్వంలో ఉంది. మహాభారత యుద్ధ కాలంలో, ఒక వైపు కురు పితామహుడైన భీష్మాచార్యుడు ప్రాణోత్క్రమణ సమయం కోసం ఎదురు చూస్తూ, అంపశయ్య మీద ఉన్నాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అయిన శ్రీకృష్ణుని దర్శనం కోసం తహతహలాడుతున్నాడు. మరొక వైపు యుధిష్ఠిరుడు, తన రాజ్యకాంక్ష కారణంగానే యుద్ధం జరిగిందనీ, అందులో తన గురువులూ, బంధువులూ, మిత్రులూ అన్యాయంగా మరణించటం సంభవించిందనీ భావించి, అమిత వేదనను అనుభవిస్తూ, పాపభీతితో కుమిలిపోతున్నాడు.
ఇదంతా గ్రహిస్తున్న శ్రీకృష్ణ భగవానుడు, తన పరమ భక్తుడైన భీష్మాచార్యునికీ, ధర్మమూర్తి అయిన యుధిష్ఠిరునికీ, ఏకకాలంలో మనశ్శాంతి చేకూర్చాలని నిశ్చయించుకున్నాడు. ఆ కారణంగానే, ధర్మజుని తీసుకుని భీష్మాచార్యుని దగ్గరకు వెళ్ళాడు.
శ్రీ కృష్ణుని ఆగమనాన్ని గ్రహించిన భీష్ముడు, ఆనంద పరవశుడయ్యాడు. శ్రీ కృష్ణుని భక్తవాత్సల్యాన్ని అమితంగా ప్రశంసించాడు. ఆపైన శ్రీ కృష్ణుని ఆదేశానుసారం, ఆయన ప్రసాదించిన శక్తి ఆధారంగా, పాండవాగ్రజునికి అనేక ధర్మసూక్ష్మాలు బోధించాడు. ఆ ధర్మసూక్ష్మాలలో కొన్నింటిని, మనం ఇదివరకే వీడియోలుగా అందించివున్నాము. చూడనివారు తప్పక చూడగలరు. అలా ఆయన ధర్మరాజు ఆవేదనను ఉపశమింప చేయటానికి ప్రయత్నించాడు.
కానీ, ధర్మజుడికి సంపూర్ణమైన సంతృప్తి కలుగలేదు. తన గురు దేవుని ద్వారా తాను తెలుసుకో వలసిన అసలు విషయమేదో మిగిలి ఉన్నదన్న అభిప్రాయం, ఆయనను బాధిస్తూనే ఉంది. ఆ కారణంగానే ఆయన, సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుడిని ఉద్దేశించి, ఆరు ప్రశ్నలడిగాడు..
1. ‘కి మేకం దైవతం లోకే’ అంటే, ప్రపంచమంతటికీ ఏకైక ఆరాధ్య దేవత ఎవరు?
2. ‘కిం వా ప్యేకం పరాయణం’ అంటే, ప్రాణికోటికి ఏకైక పరమ లక్ష్యమేమిటి?
3. ‘స్తువంతః కం ప్రాప్నుయుర్ మానవాః శుభం’ అంటే, ఎవరిని స్తుతించడం ద్వారా మానవులకు మేలు కలుగుతుంది?
4. ‘కమర్చంతః ప్రాప్నుయుర్ మానవాః శుభం’ అంటే, ఎవరిని అర్చించడం ద్వారా మానవులకు సుఖమూ, శాంతీ లభిస్తాయి?
5. ‘కోధర్మః సర్వధర్మాణాం భవతః పరమోమతః?’ అంటే, మీ అభిప్రాయంలో ధర్మాలన్నింటిలోకీ విశిష్ఠమైన ధర్మం ఏది?
6. ‘కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్’ అంటే, ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ప్రాణికోటి, జనన-మరణ రూపమైన సంసారచక్రం నుండి విడివడగలుగుతుంది?
అన్న ఈ ఆరు ప్రశ్నలకు సమాధానాలను, భీష్మాచార్యుడు ఇలా చెప్పనారంభించాడు..
ప్రపంచమంతటికీ ఏకైక ఆరాధ్య దేవత ఎవరు? అన్న ప్రశ్నకు, ‘పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం, దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయః పితా’ అంటే, పవిత్రమైన వాటన్నింటికీ పవిత్రతను చేకూర్చే పరమ పవిత్రుడూ, సర్వశ్రేయాలకూ మూలమైన వాడూ, దేవతలందరికీ దైవతమైన వాడూ, సమస్త ప్రాణికోటికీ తండ్రి అయిన శ్రీ మహావిష్ణువే, ప్రపంచమంతటికీ ఏక్రైక దైవతం.
ప్రాణికోటికి ఏకైక పరమ లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్నకు, ‘పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః, పరమం యో మహద్ బ్రహ్మ పరమం యః పరాయణం’ అంటే, పరమ తేజస్వరూపుడూ, సర్వ నియామకుడూ, సర్వ వ్యాపకుడూ, సర్వేశ్వరుడూ, పరమాత్మా అయిన శ్రీ మహావిష్ణువే, ప్రాణికోటి అంతటికీ ఏకైక లక్ష్యం.
ఎవరిని స్తుతించడం ద్వారా మానవులకు మేలు కలుగుతుంది? అన్న ప్రశ్నకు, ‘జగత్ ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమం, స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః’ అంటే, ముల్లోకాలకూ ప్రభువూ, దేవతలకు కూడా దైవతమైన వాడూ, ఆది మధ్యాంత రహితుడూ అయిన పరమ పురుషుడిని, ఆయనకు సంబంధించిన అనంత నామాల ద్వారా స్తోత్రం చేయటంవలన, జీవులకు మేలు కలుగుతుంది.
ఎవరిని అర్చించడం ద్వారా మానవులకు సుఖమూ, శాంతీ లభిస్తాయి? అన్న ప్రశ్నకు, ‘తమేవ చార్చయన్ నిత్యం భక్ష్యాపురుష మవ్యయం, స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః’ అంటే, భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించడం, పూజించడం, సేవించడం ద్వారా, మానవులకు సుఖమూ, శాంతీ లభిస్తాయి.
చివరి రెండు ప్రశ్నలు.. ‘మీ అభిప్రాయంలో ధర్మాలన్నింటిలోకీ విశిష్ఠమైన ధర్మం ఏది? ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ప్రాణికోటి, జనన-మరణ రూపమైన సంసారచక్రం నుండి విడివడగలుగుతుంది? అన్న ప్రశ్నలకు, ‘అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం, లోకాధ్యక్షం స్తువ న్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్’ అంటే, జనన మరణాలకు అతీతుడూ, సర్వవ్యాపీ, విశ్వమంతటికీ ప్రభుడూ, సర్వసాక్షీ అయిన పరమాత్ముని అనంత నామాలను అనుదినమూ జపించడం ద్వారా, మానవులు దుఃఖ నివృత్తి చేసుకో గలుగుతారు.
ఈ విధంగా సమాధానమిచ్చిన తరువాత భీష్మాచార్యుల వారు, భగవంతుడికి సంబంధించిన అనంతనామాలైన శ్రీ విష్ణు సహస్రనామాలను ధర్మజుడికి వినిపించడం జరిగింది. నిరాకారుడైన భగవంతుడు, నామ రూపాలుగల ప్రపంచంగా వ్యక్తంకావడం వల్ల, ఆయనకు అనంత నామాలు ఏర్పడ్డాయి. ఆ నామాలన్నీ ఆయనవే అని గ్రహించడం, ఆ రూపాలన్నీ ఆయనవిగానే భావించడం, ప్రపంచంలోనూ, త్రికాలాలలోనూ శాశ్వతంగా ఉండేది ఆయన ఒక్కడే అని స్పష్టంగా తెలుసుకోవడం అన్నదే, ‘జ్ఞానం’. ఆ విధమైన జ్ఞాన సముపార్జనకు, విష్ణు సహస్రనామాలు అమితంగా సహాయపడతాయి.
ధర్మ సంరక్షణకోసం, అధర్మ నిర్మూలనకోసం, భగవంతుడు అప్పుడప్పుడూ అవతరిస్తూ ఉంటాడు. జ్ఞానులూ, భక్తులూ, సత్పురుషులూ మొదలయిన మహనీయుల రూపంలో, సామాన్యంగా వ్యక్తమవుతూ ఉంటాడు. ఆయా నమయాలలో ఆయన వెలువరుస్తూ ఉండే గుణాల ఆధారంగానే, మనం ఆయనదైన మహత్తర శక్తిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అంటే, అవ్యక్త శక్తిని అవగాహన చేసుకోవటానికి, వ్యక్త రూపాలను ఆధారం చేసుకోవాలి. ఉదాహరణకు, ఒక చిత్రపటాన్నో, శిల్పాన్నో దర్శించుకున్నా, ఒక మహాకావ్యాన్ని చదివినా, ఆ చిత్రపటం, శిల్పం, లేక కావ్యం ద్వారా, ఆయా చిత్రకారుల, శిల్పాచార్యుల, మహాకవుల శక్తి సామర్థ్యాలు కొంతవరకైనా మనకు అవగతమవుతాయి. అలాగే వివిధ రూపాలలో వ్యక్తమయ్యే భగవత్ సృష్టిని పరిశీలించడం ద్వారా, ఆ భగవత్ శక్తిని లేశ మాత్రమైనా అర్థంజేసుకోవడానికి మనకు వీలవుతుంది. మనకు ఆ విధమైన అనుభూతిని కలిగించేవే, ‘శ్రీ విష్ణు సహస్రనామాలు’.
అలాగే, ‘కలిదోష నివారకమైన మార్గమేమిటి?’ అని నారద మహర్షి ఒకసారి, చతుర్ముఖ బ్రహ్మని అడిగాడు. అప్పుడాయన, ‘సర్వ శృతి రహస్యం గోప్యం తత్ శృణు యేన కలి సంసారం తరిష్యసి, భగవతః ఆదిపురుషస్య నారాయణస్య నామోచ్ఛారణ మాత్రేన నిర్ధూత కలిర్ భవతి’ అని సమాధానమిచ్చాడు.
ఆ అభిప్రాయాన్నే ‘బృహన్నారద పురాణం’, ‘హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం, కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతి రన్యథా’ అని ఉద్ఘోషించింది. దానిని బట్టి, ‘కలియుగంలో మానవులకు హరినామం ఒక్కటే గతి. అంతకు మించి వేరే గతి లేదు..’ అని నిష్కర్షగా తేటతెల్లమవుతోంది. అటువంటి మహత్తర శక్తిగల నామాలు, ఈ ‘స్తోత్ర మహామంత్రం’లో వెయ్యి వున్నాయి.
జనన ధర్మంగల జీవులకు జన్మరాహిత్యాన్ని చేకూర్చేది, భగవన్నామ జపం ఒక్కటే. ఏ రూపంలో ఉన్నా, ఏ జాతికి, కులానికి, మతానికి చెంది ఉన్నా, భగవన్నామాన్ని జపించే అర్హత ప్రతి ప్రాణికీ ఉంది. ఆ సత్య నిరూపణకు, గజేంద్ర మోక్షం ప్రబల నిదర్శనం. జడ భరతుని గాథ ఒక తార్కాణం. వాల్మీకి, హరిదాసు మొదలైన వారి చరితలు, కొన్ని ఉదాహరణలు.
శ్రీ విష్ణు సహస్రనామాలలో ప్రతి నామం ఒక మంత్రమే. వీటిలో ఏ ఒక్క నామాన్ని జపించినా, ధన్యత్వం సిద్ధించి తీరుతుందంటారు ఆర్యులు.
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
Comments
Post a Comment