అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai


అష్టదిగ్బంధనం! అష్టదిక్పాలకుల బంధనంలో అరుణాచలం!
తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడు అష్టలింగాలతో దిగ్బంధనం చేయబడ్డాడా?

సనాతన సాంప్రదాయంలో అష్ట దిక్కులకూ, ఆ దిక్కులను పాలించే అష్ట దిక్పాలకులకూ ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం అలా ఎనిమిది దిక్కులలోనూ ఎనిమిది మంది ఉప దేవతలైన దిక్పాలకుల శక్తిని నిక్షేపించి, ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచడమే, ‘అష్టదిగ్బంధనం’. సాధారణంగా ఒక ప్రదేశానికి రక్షణ ఏర్పాటు చేయడానికి, రత్నాధ్యాయ క్రియను వినియోగిస్తారు. అంటే, ఎనిమిది దిక్కులలో ఎనిమిది గ్రహాలకు చెందిన జాతి రత్నాలను, కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను పఠిస్తూ భూమిలో నిక్షిప్తం చేస్తారు. తద్వారా ఆ రత్నాలు Receivers లా పనిచేస్తూ, అంతరీక్షంలోని ఆ రత్నాలకు చెందిన గ్రహాల యొక్క శక్తిని ఆకర్షించి, ఆ ప్రదేశాన్ని చెడునుంచి రక్షిస్తూ, నిత్యం ఉత్కృష్టమైన Positive Energy ని ప్రసరింపజేస్తుంటాయి. అటువంటిది, సాక్షాత్తూ ఆ దిక్పాలకులే దిగివచ్చి, అరుణాచలేశ్వరుడి చుట్టూ వారి వారి స్థానాలలో ప్రతిష్ఠితమైన అరుణాచల క్షేత్రం గురించి ఇక వేరే చెప్పాలా! అంతటి అరుణాచలేశ్వరుడి విశిష్ఠతను వివరిస్తూ, గతంలో చేసిన వీడియోను కూడా తప్పక చూడండి. మరి అరుణాచలేశ్వరుడి అష్టదిగ్బంధనం వివరాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nyo3QJQ28AU ]


తమిళనాడులోని తిరువణ్ణామలై క్షేత్రంలో, పర్వత పాదం వద్ద స్వయంభువుగా వెలసి, అరుణాచలేశ్వరుడిగా ప్రసిద్ధి గాంచిన లింగ స్వరూపానికి చుట్టూ, ఎనిమిది దిక్కులలో ఎనిమిది శివలింగాలుండటం విశేషం. అరుణాచల పర్వతంపైనున్న అరుణాచలేశ్వరునికి ప్రదక్షణం చెయ్యాలనుకునే వారు, ఆ పర్వతానికి ఎనిమిది దిక్కులలో, భూమి మీద వెలసిన అష్టలింగాలను వరుసగా పూజించుకుంటూ ముందుకు వెళ్ళడం ఆనవాయితీ.

అరుణాచల గిరి పాదం వద్ద నిర్మించబడిన అరుణాచలేశ్వర ఆలయం, భారత దేశంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి. సా.శ. 1502 - 1529 మధ్య కాలంలో, నాడు విజయ నగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయులు, ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయాన్ని నిర్మించినట్టుగా, శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడున్న ఆలయంలోని గర్భగుడి, 11వ శతాబ్దంలో నిర్మించబడింది. పంచభూత లింగాలలో ఒకటైన ఈ గుడిలోని శివలింగం, అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. అరుణాచలేశ్వర ఆలయం, 24 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించివుండి, అందంగా చెక్కబడిన 13 అంతస్తుల గోపురాలుంటాయి. ఆలయంలోకి ప్రవేశిస్తుండగా, తూర్పు వైపున ఆలయ ప్రాంగణంలో, వేయి స్తంభాలతో నిర్మించబడిన ఒక భవనం ఉంటుంది. ఇక సకల జీవరాశి శ్రేయస్సుకై వెలసిన అరుణాచలేశ్వర శక్తిని నిత్యం కాపుగాస్తూ, అరుణ గిరి చుట్టూ ఆ దిక్పాలకులు స్వయంగా ప్రతిష్ఠించి, అష్టదిగ్బంధనం చేసిన అష్టలింగాల వివరాలలోకి వెళితే..

తూర్పు.. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పుదిక్కుకు అధిపతి, ‘ఇంద్రుడు’. కనుక ఆ దిక్కున ఇంద్ర లింగం ఉంది. నేటి తిరువణ్ణామలై పట్టణంలోని రధం వీధిలో, ఈ ఇంద్రలింగం కనిపిస్తుంది. మన పురాణాల ప్రకారం, ఇంద్రుడు దేవతలకు రాజు. ఆయన భార్య ఇంద్రాణి. వారిద్దరూ నాలుగు దంతాలుగల అపూర్వమైన ఐరావతమనే ఏనుగుపై, ముల్లోకాలలో సంచరిస్తారు. ఇంద్రుడు ఏనుగుపై కూర్చుని చేతిలో వజ్రాయుధాన్ని ధరించి ఉంటాడు. ఈయన మానవులలో ఉన్న అజ్ఞాన తిమిరాంధత్వాన్ని తొలగించి, విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.

ఆగ్నేయం.. వాస్తు శాస్త్రం ప్రకారం, ఆగ్నేయ దిక్కుకు అధిపతి, ‘అగ్ని’. అగ్ని దేవుడు ఏడు హస్తాలను, ఏడు నాలుకలను కలిగి ఉంటాడు. అగ్ని మానవులకూ, మరియు దేవతలకూ మధ్య అనుసంధాన కర్తగా ఉంటాడు. మానవులు యజ్ఞ యాగాదులు చేసినపుడు ఉత్పన్నమైన హవిస్సులను, దేవతలకు అందజేసే బాధ్యత అగ్ని దేవుడిదే. అగ్ని భట్టారకుడి వాహనం, మేక. ఈ మేకను సంస్కృతంలో అజమని పిలుస్తారు. దీనికి పొడవాటి కాళ్ళు, వెచ్చటి దేహం ఉంటాయి. యజ్ఞాలలో మేకలను పవిత్రమైనవిగా భావించి, బలి ఇవ్వటం జరుగుతుంది. తిరువణ్ణామలైలోని శేషాద్రి వీధిలో, ఈ అగ్ని లింగం కనిపిస్తుంది. చంగం రోడ్డు మీద ఉన్న శేషాద్రి ఆశ్రమానికి దగ్గరలో, శేషాద్రి వీధి ఉంటుంది.

దక్షిణం.. దక్షిణ దిక్కు విషయానికి వస్తే, ఆ దిక్కుకు యమధర్మరాజు అధిపతి. ఆయన మృత్యు దేవత. ఈ క్షేత్రంలో యముడి యొక్క శిల్పం, మహిషుడనే పేరుగల ఒక భారీ దున్నపోతు పైన కూర్చుని, భూతాల వంటి రెండు కుక్కలను ప్రక్కన పెట్టుకుని ఉంటాడు. యముడి చేతిలో యమపాశం ఉంటుంది. జీవులకు ఈ లోకంలో ఉండే సమయం పూర్తవ్వగానే, యమ పాశం వాటికి తగులుకుని, వాటిని యమ లోకానికి తీసుకు వెళుతుంది. యమధర్మరాజు నిరంకుశంగా, అమానుషంగా జీవుల ప్రాణాలు తీస్తున్నట్టు కనపడినప్పటికీ, ఆయనలో ఎంతో సమధర్మం, కర్తవ్య పాలనా, కొట్టవచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒకప్పుడు మార్కండేయుడనే 16 సంవత్సరాల బాలుడు, నిత్యం శివ పూజలో నిమగ్నమై ఉన్నప్పుడు, అతని ఆయుర్దాయం తీరిపోయింది. అందువలన యముడు తన వాహనంపై భూలోకంలో, ఆ బాలుడు ఉన్నచోటుకు వచ్చి, అతడి ప్రాణాన్ని తియ్యటానికి యమపాశాన్ని ప్రయోగించాడు. యముడ్ని చూసి భయపడిన మార్కండేయుడు గజగజలాడుతూ, ప్రాణ భయంతో శివ లింగాన్ని కౌగలించుకున్నాడు. యముడు తన ధర్మాన్ని నిర్వర్తించటంకోసం, శివలింగాన్ని అంటుకుపోయి ఉన్న మార్కండేయుడి ప్రాణాలను హరించాలని మొండిగా ప్రయత్నించినప్పుడు, పరమశివుడు అక్మడ ప్రత్యక్షమై, మార్మండేయుడి ప్రాణాలను తియ్యాలని చూసిన యముడిని భస్మంచేశాడు. సాక్షాత్తు మరణానికి అధిపతియైన కాలుడిని సంహరించివ ఈశ్వరుడు, ఆనాటి నుండి కాలసంహారమూర్తి అనేపేరును పొందాడు. అంటే, మృత్యువును నాశనంజేసేవాడని అర్ధం. ఆనాటి యమలింగం, తిరువణ్ణామలై పట్టణంలోని చెంగం రోడ్డు మీద ఉన్న శ్మశానానికి ప్రక్కన ఉంది. శ్మశానానికి అధిపతియైన యమలింగం శ్మశానానికి దగ్గరలో ఉండటం ఇక్కడ విశేషం.

నైఋతి.. వాస్తు శాస్త్ర సూత్రాల ప్రకారం, ఈ దిక్కును నైఋతి అనే రాక్షస రాజు, తన మిత్రుడైన యమ ధర్మరాజుతో కలసి పరిపాలిస్తుంటాడు. ఈ నైఋతి మానవులలోని రాగద్వేషాలకూ, కామక్రోధాలకూ కారణమవుతాడు. వీటి కారణంగానే జీవులు జనన మరణ చక్రంలో చిక్కుకుని, నిరంతరం జన్నిస్తూ, మరణిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో వెలసిన నైఋతి లింగాన్ని ఆరాధించిన వారికి, భవ బంధాలు తొలగిపోతాయనీ, మనశ్శాంతి లభిస్తుందనీ, ప్రాజ్ఞులు వక్కాణిస్తారు. ఈ లింగం తిరువణ్ణామలై పట్టణంలోని సోనాగిరి, మరియు శాంతిమలై కాంపౌండ్స్‌ దాటిన తరువాత, కుడివైపున గిరివలం మార్గం మీద ఉంటుంది.

పశ్చిమం.. పశ్చిమ దిక్కునకు వరుణ దేవుడు అధిపతి. ఈయన వర్షాలను కురిపిస్తాడు. మూల్లోకాలలోనూ జలాలను ప్రవహింపజేస్తాడు. మానవులలోని సుఖ లాలసతకు కారకుడు వరుణ దేవుడు. వరుణ దేవుడు మొసలి వాహనంపై శరవేగంతో ప్రయాణిస్తాడు. మొసలి భూమిపైన, మరియు నీటిలోనూ నివసించగల ఉభయ చరి. ఈ మొసలిని వాహనంగా కలిగిన వరుణ దేవుడు, మానవునియొక్క కర్మలను నిరంతరం గమనిస్తూ ఉంటాడు. అదే విధంగా, అదుపు తప్పిన మానవులను జలంలో విలీనంజేస్తాడు. అంటే, పాపాలు పెరిగిపోయినప్పుడు, వరదలూ, తుఫానులూ వచ్చి, పాపాత్ములైన జనాలను తుడిచి పెడతాయి. చాలామందికి తెలియని ఒక శాస్త్ర రహస్యమేమిటంటే, సూర్యుడు వరుణ దేవుడి యొక్క కన్ను అని. సూర్య దేవుడు వరుణ దేవుడి వాహనమైన మకర రాశిలో ఉన్నప్పుడు, మకర సంక్రాంతి అని పిలువబడే పుణ్యకాలం సంభవిస్తుంది. జనవరి నెల మధ్య భాగంలో వచ్చే మకర సంక్రాంతి, అత్యంత పుణ్యప్రదమైనదని చెప్పబడుతుంది. ఈ వరుణ లింగం, ఆదిఅణ్ణామలై అనేగ్రామానికి ముందు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న గిరివలం మార్గంలో ఉంది.

వాయవ్యం.. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ దిక్కుకు, పంచభూతాలలో ఒకడైన వాయు దేవుడు అధిపతి. వాయు దేవుడు నాలుగు హస్తాలను కలిగి ఉండి, శరవేగంతో ప్రయాణించే జింకను వాహనంగా చేసుకుని, ప్రపంచమంతటా వాయు వేగంతో పర్యటిస్తూ ఉంటాడు. మానవులకు పాణప్రదాత వాయు దేవుడే. ఈ వాయు లింగం, గోశాలై అనబడే గ్రామానికి ప్రక్కన, గిరివలం మార్గం వద్ద ఉంది. ఈ లింగం యొక్క విశేషం ఏమిటంటే, ఈ ఆలయంలో ఎప్పుడూ ఈదురుగాలి వీస్తూ ఉంటుంది. అంటే, వాయుదేవుడు నిరంతరమూ అక్కడ వెలసి ఉన్న వాయులింగాన్ని పూజిస్తున్నాడని తెలుస్తుంది.

ఉత్తరం.. సమస్త సంపదలకూ అధిపత్తి అయిన కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి. యక్షరాజైన కుబేరుడు, దేవతల యొక్క సంపదలను కాపలా కాస్తూ ఉంటాడు. కుబేరుడు శివుడికి ఆప్తమిత్రుడు. కుబేరుడికి మూడుకాళ్ళు, నోటిలో ఎనిమిది పళ్ళూ ఉంటాయి. బాగా బలిసిన ఒక ఆడమేక, కుబేరుడికి వాహనంగా ఉంటుంది. కుబేరుడు హిమాలయాలలో, తనభార్య అయిన యక్షితో కలసి నివసిస్తూ ఉంటాడు. తిరువణ్ణామలై పట్టణానికి చేరటానికి ముందు వచ్చే గిరివలం మార్గం కొస భాగంలో, ఈ కుబేర లింగం ఉంటుంది.

ఈశాన్యం.. శివుడికి చెందిన సప్త రుద్రులలో ఈశాన్యుడు ఒకరు. ఈశాన్యుడు జడలు కట్టిన జుట్టుతో, క్రోధ పూరితమైన కన్నులతో, పులి చర్మంపై ఆశీనుడై ఉంటాడు. ఈయన శరీరంపై విభూతి పూయబడి ఉంటుంది. చుట్టూ భూత, ప్రేత పిశాచాలు ఆవరించి ఉంటాయి. తలపై నెలవంక, జుట్టు కొప్పుపై గంగ ఉంటుంది. ఈయన శరీరాన్ని వందలాది పాములు చుట్టలు చుట్టకుని ఉంటాయి. చేతులలో ఢమరుకం, మరియు శూలం ఉంటాయి. ఈ ఈశాన్య శివలింగం, తిరువణ్ణామలై పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రక్కనున్న పాత శ్మశానానికి ప్రక్క రోడ్డుపై ఉంది.

ఇంతటి పవిత్రమైన, మహిమాన్వితమైన అరుణాచలేశ్వరుడి కృపా కటాక్షాలు అందరిపై ప్రసారించాలని మనసా, వాచా, కర్మణా ప్రార్ధిస్తున్నాను..

🚩 ఓం అరుణాచలేశ్వరాయ 🙏

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home