Rules of Impurity (Sutaka or Ashoucha) as per Garuda Puranam గరుడ పురాణం ప్రకారం మృత్యు మైల!


మృత్యు మైల!? – గరుడపురాణంలో పరాశరుడు చెప్పిన ధర్మకర్మాలేమిటి?
ఏ వర్ణానికి ఎన్నాళ్ళు మృత్యు అశౌచము లేక మైల వుంటుంది?

అతి ప్రాచీన జోతిష్య శాస్త్రానికి ఆద్యుడూ, పరాశర హోర గ్రంథకర్త, వ్యాస భగవానుడి తండ్రి, పరాశర మహర్షి. అటువంటి మహనీయుడు చెప్పిన ధర్మసూక్ష్మాల విషయానికి వస్తే.. గరుడపురాణం ప్రకారం, నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మహామునులతో మాట్లాడుతూ, తన గురువైన వ్యాస మహర్షికి, ఆయన తండ్రి పరాశర మహర్షి వినిపించిన ధర్మకర్మాలను ఇలా చెప్పనారంభించాడు. “శౌనకాచార్యా! ప్రతి కల్పాంతంలోనూ, అన్నీ నశించిపోతాయి. కల్ప ప్రారంభంలో, మన్వాది ఋషులు వేదాలను స్మరించి, బ్రాహ్మణాది వర్ణాల ధర్మాలను మరల విధిస్తుంటారు. అంటూ ప్రారంభించి, మానవాళికి ఆయన వ్యక్తపరచిన విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/K0OBiPNIEsU ]


త్యజేద్దేశం కృతయుగే త్రేతాయాంగ్రామ ముత్సృజేత్‌ ।
ద్వాపరే కులమే కంతు కర్తారంతు కలౌయుగే ।।

కలియుగంలో దానమే ధర్మము. పాపమూ, శాపమూ సర్వాంతర్యాములుగా పరిఢవిల్లే ఈ కలియుగంలో, పాపాన్ని అంతంచేయలేము. పాపంచేసిన వారిని మాత్రమే పరిత్యజించవలసి వుంటుంది.

సత్య, లేక కృత యుగంలో పాపాత్ములుంటే, ఆ దేశాన్నే బుష్యాదులు త్యజించేవారు. అలా త్రేతాయుగంలో గ్రామాన్నీ, ద్వాపరంలో పాపి కుటుంబాన్నీ త్యజించారు. కలియుగంలో పాపం సార్వలౌకికమైపోతుంది కాబట్టి, పాపిని మాత్రమే త్యజించగలరు.

సదాచారం, శౌచాచారాల ద్వారానే, మనిషి అన్నీ పొందగలుగుతాడు. సంధ్య, స్నానం, జపం, హోమం, దేవపూజనం, అతిథి సత్కారం అనే ఆరు సత్మర్మలనూ, ప్రతి దినం చేయాలి. ఆచారవంతుడైన బ్రాహ్మణుడు గానీ, సర్వసంగ పరిత్యాగియైన సన్యాసిగానీ, కలియుగంలో దుర్లభం. బ్రాహ్మణులు తమ వర్ణ ధర్మాలను పాటించాలి. అధ్యయనాధ్యాపనాదులను వదులుకోరాదు. క్షత్రియులు దుష్టులైన శత్రువులను గెలిచి, ప్రజలను కన్నబిడ్డలలాగా చూసుకోవాలి. వైశ్యులు వ్యవసాయ, వ్యాపార, పశుపాలనాదికాలను చేయిస్తూ, న్యాయ సమ్మతంగానే ధనార్జన చేయాలి. శూద్రులు ఈ పై మూడు వర్ణాల వారికీ నిష్కపటంగా సహకరిస్తూ, దేశ సౌభాగ్యానికి ఊతమివ్వాలి.

తినకూడనివి తినడం, దొంగతనం, పోకూడని చోటికి పోవడం, మనిషి పతనానికి కారణాలవుతాయి. వ్యవసాయం చేసేవాడు, అలసిపోయిన ఎద్దును మళ్ళీ కాడికి కట్ట కూడదు, దాని చేత బరువులనూ మోయించకూడదు. ద్విజులు స్నానం, యోగం, పంచయజ్ఞాదులను మానకూడదు. బ్రాహ్మణులకు నిత్యం భోజనాలు పెట్టాలి. క్రూరకర్ముల విషయంలో, ముఖమాటానికీ, స్వార్ధానికీ తావివ్వకుండా ప్రవర్తించాలి.

నువ్వులనూ, నేతినీ అమ్ముకోకూడదు. పంచసూనాజనిత దోషం పోవడానికి, బలి వైశ్వదేవ హోమాన్ని నిత్యం చేయాలి. రైతు తన సంపాదన, లేదా పంటలోని ఆరవభాగాన్ని రాజుకీ, ఇరువదవ భాగాన్ని దేవునికీ, ముప్పది మూడవ భాగాన్ని బ్రాహ్మణులకీ ఇవ్వాలి. దీని వల్ల కృషి హింసా పాపం ప్రక్షాళితమవుతుంది. ఈ విధంగా ఇవ్వకపోతే, అంటే, పన్ను ఎగ్గొడితే, పాపం చుట్టుకుంటుంది. అదీ దొంగతనంతో సమానమైన పాపమే!

పరాశరుడు ఏ వర్ణానికి ఎన్నాళ్ళు మృత్యు అశౌచముంటుందో, యాజ్ఞవల్క్యుని లాగానే చెప్పాడు. బంధువులలో ఈ మైల నాలుగవ తరం దాకా పది రోజులు, అయిదవ తరంలో ఆరు రోజులు, ఆరవ తరంలో నాలుగు రోజులు, ఏడవతరంలో మూడు రోజులూ వుంటుంది. పరదేశంలో వున్న బాలకుడు పోతే, మృత్యు అశౌచం పెద్దగా వుండదు. వార్త వినగానే స్నానం చేస్తే, వెంటనే శుద్ధి అయిపోతుంది.

గర్భస్రావ, గర్భపాతాలలో బిడ్డ మరణించినపుడు, తల్లి ఎన్నవ నెల గర్భవతి అయివుంటుందో, అన్ని రోజుల అశుచి ఆ బిడ్డ బంధుగణానికి వుంటుంది. నాలుగవ నెల వరకూ జరిగే గర్భనష్టాన్ని గర్భస్రావమనీ, ఆరు మాసాలు నిండేలోగా గర్భనష్టం జరిగితే, గర్భపాతమనీ అంటారు.

శిల్పకారుడూ, మేదరవాడు, రాజూ, రాజ గురువూ, శ్రోత్రీయ బ్రాహ్మణుడూ, దాసదాసీ జనమూ, భృత్యులూ, వీరిలో ఎవరు పోయినా, వారి సంతానానికి తప్ప, మైల ఇతరులెవరికీ వుండదు.

పురుటి మైల అనగా, పిల్లలు పుట్టినపుడు కలిగే అశుచి, కన్నతల్లికే పది రోజుల పాటు వుంటుంది. తండ్రి స్నానం చేయగానే శుచి అవుతాడు. వివాహం, లేదా యజ్ఞం తలపెట్టి, అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక మృత్యువు, లేదా పురుటి వార్త తెలిసినా, ఆ ఉత్సవం చేసేవారికీ, అందులో పాల్గొనే వారికీ అశుచి వుండదు. అనాథ శవాన్ని మోసే వారికి, ప్రాణాయామ మాత్రాన శుద్ధి కలుగుతుంది. తెలిసీ, శూద్ర శవాన్ని మోసిన వారికి మాత్రం, మూడు రాత్రుల వరకూ అశుచి వుంటుంది.

మంచివాడు, సచ్ఛరిత్రుడు అయిన పతిని మదమెక్కి వదిలేసిన స్రీ, ఏడుజన్మల దాకా ఆడదానిగానే పుడుతుంది. అన్ని జన్మలలోనూ విధవగానే పోతుంది. అన్నపానాదుల విషయంలో భ్రష్టురాలైన స్తీ, మరుజన్మలో పందిగా పుడుతుంది.

ఔరసుడూ, క్షేత్రజ్ఞుడూ ఒకే తండ్రికి పుడితే, ఆ తండ్రి పోయినపుడు, రెండు రకాల వాళ్ళూ పిండదానం చేయవచ్చు.

పరివేత్త అంటే, అన్నకు పెళ్ళి కాకుండా తానే ముందు చేసుకున్న తమ్ముడూ, పరివిత్తి అంటే, తమ్ముడికి వివాహం జరిగిపోయి, తాను అది లేకుండా వుండిపోయిన అన్న.. ఈ రెండు రకాల వారికీ కృచ్ఛ్ర వ్రతం చేసుకునే దాకా శుద్ధి లేదు. తమ్ముని పత్ని కూడా కృచ్ఛ్ర వ్రతం చేయాలి. కన్యాదాత అతికృచ్ఛ్రం చేసుకోవాలి. ఇటువంటి వివాహాన్ని చేయించిన పురోహితుడు చాంద్రాయణ వ్రతం చేయాలి. అప్పుడుగానీ వీరికి శుద్ధి లేదు.

అన్న గూనివాడో, మరుగుజ్జో, నపుంసకుడో, నత్తివాడో, జన్మాంధుడో, ఇతర అంగ విహీనుడో అయితే మాత్రం, తమ్ముడు ముందుగా వివాహం చేసుకోవచ్చు. అప్పుడు ఎటువంటి దోషమూ లేదు.

నిశ్చితార్థంలో ఎవరికో వాగ్దత్త అయిన కన్య, ఆ వరుడు పరదేశం వెళ్ళి పోయి, ఇక రాడని తెలిసినా, మృతి చెందినా, సన్యాసం పుచ్చుకున్నా, నపుంసకుడని తెలిసినా, పతితుడై పోయినా, ఆ కన్య వేరొకరిని వరించి వివాహం చేసుకో వచ్చు. భర్తతోపాటు, సతీ ధర్మాన్ని అనుసరించి అగ్ని ప్రవేశం చేసిన స్త్రీ, తన శరీరంపై ఎన్ని రోమాలున్నాయో, అన్నేళ్లపాటు స్వర్గంలో నివాసముంటుంది. ప్రస్తుత రాజ్యాంగం ఈ సతీసహగమనాన్ని నిషేధించిందని గుర్తించాలి.

కుక్కకాటుకు గురైన వాడు, ఔషధ సేవనం గావించి, గాయత్రీ మంత్రాన్ని జపిస్తే అశౌచం పోతుంది. స్వయంగా దాన్ని జపించే అర్హత లేనివారు, బ్రాహ్మణులనెవరినైనా ఆశ్రయించి, ఆయన చేత ఈ జపాన్ని చేయించాలి. చండాలాదుల ద్వారా చంపబడిన బ్రాహ్మణుడు స్వయంగా అగ్నిహోత్రి అయితే, ఆయనను లౌకికాగ్నితో దహనం చేయవచ్చు. ఆయన అస్థికలను సేకరించి, మరల మంత్ర పూర్వకంగా, ఆయన యొక్క అగ్నిహోత్రశాల నుండి అగ్నిని తెచ్చి, అంతకు ముందే పాలతో శుద్ధి చేసిన ఆయన అస్థికలను అందులో దహనం చేయాలి. వ్యక్తి పరదేశంలో మరణిస్తే, ఇక్కడి పరిజనులు, తమ గృహాలలోనే కుశలతో ఆ వ్యక్తి శరీరాన్ని తయారు చేసి, అగ్నికి ఆహుతి చేయాలి. ఆ పరదేశ మృతుడు అగ్నిహోత్రి అయితే, మృగ చర్మంపై ఆరు వందల పలాశ ఆకులను అతని ఆకారంలో పరచి, శిశ్న భాగంలో శమీ, వృషణ భాగంలో అరణీ పెట్టి, కుడి చేతి స్థానంలో అన్నం కుండనూ, ఎడమ చేతి స్థానంలో యజ్ఞియ పాత్రనూ వుంచాలి. వక్షో భాగంలో, సోమరసం తయారీలో వాడే రాతినుంచాలి. ముఖ భాగంలో నేతిలో ముంచిన తిలలనూ, తండులాలనూ, నేత్రాల వద్ద నేతి కుండనూ ఉంచాలి. కనులు, చెవులు, ముక్కు, నోటి ప్రాంతాలలో, చిన్న చిన్న బంగారు ముక్కలనుంచే పద్ధతి కూడా వుంది. ఇలా అగ్నిహోత్రం యొక్క సమస్త ఉపకరణాలనూ వుంచి, ఆ అగ్నిహోత్రి ఊహాకల్పిత కళేబరాన్ని, ‘అసౌస్వర్గాయ లోకాయ స్వాహా’ అనే మంత్రాన్ని చదువుతూ, నేతిని ఒక ఆహుతి నిచ్చి, అగ్నికి ఆహుతి చేస్తే, ఆయనకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.

హంస, చిలుక, క్రౌంచం, చక్రవాకం, కోడి, నెమలులలో దేనిని వధించినా, ఒక పగలూ, ఒక రాత్రీ ఉపవాసం చేస్తే పాపం పోతుంది. గోవును కాకుండా, నాలుగు కాళ్ళ పశువును దేనిని వధించినా, ఒక రోజంతా నిలబడి, ఉపవసించి, గాయత్రిని జపిస్తే పాప శాంతి కలుగుతుంది.

శూద్రుని వధిస్తే, కృచ్ఛ్ర వ్రతం చేయాలి. వైశ్యుని హత్య చేస్తే, అతి కృచ్ఛ్ర వ్రతం చేయాలి. క్షత్రియుని చంపితే ఇరవై రెండూ, బ్రాహ్మణుని మృతి నొందిస్తే ముప్పదీ, ‘చాంద్రాయణ వ్రతాలు’ చేయాలి. (అధ్యాయం - 107)

🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home