The Varna and Caste System as per Garuda Puranam | శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన గరుడ పురాణం ప్రకారం కులము!?


కులము!? – గరుడపురాణంలో చెప్పబడిన వర్ణాశ్రమ ధర్మాలేమిటి?
శూద్రులు తపస్సు చేయడం? వేదాలు చదివి బ్రాహ్మణులవ్వడం? బ్రాహ్మణుల చేత పూజలందుకోవడం?

ఈ సువిశాల విశ్వం లాగానే, ఆది తెలియనిది, అంతం లేనిది, సనాతన ధర్మం. నాలుగు వేదాలను స్థంభాలుగా చేసుకుని సుస్థిరంగా నిలబడిన సనాతన ధర్మాన్ని నిష్ఠగా పాటించే హిందువులను గెలువలేక, పాశ్చాత్య ధూర్తులు పన్నిన ఒకానొక దౌర్భాగ్యపు పన్నాగం, 'కులం'! 1947 లో పేరుకు వారు వదిలి వెళ్ళినా, Secularism పేరిట హిందువుల ముసుగులో ఇప్పటికీ వారి ప్రయత్నాన్నీ, వారసత్వాన్నీ కొనసాగిస్తూనే వున్నారు కొందరు ద్రోహులు. మరి సాక్షియత్తు శ్రీమహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన విషయాలను, వ్యాస మహర్షి మనకందించిన అష్టాదశ పురాణాలలో ఒకటయిన గరుడపురాణంలో, ఆ పైత్యం గురించి ఏం చెప్పబడింది? వర్ణాశ్రమ ధర్మాలేమిటి? వంటి విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/yF1smKwsNqo ]


వర్ణమంటే కులం కాదు. పురాణ కాలంలో సమాజాన్ని నడిపించిన వర్ణానికీ, నేటి కలికాలంలో రాజకీయాలను శాసిస్తున్న కులానికీ పోలికే లేదు. ఎవరైనా పేర్లను బట్టి భ్రమపడినా, అది హస్తి మశకాంతరమే. వర్ణమంటే, వృత్తి.. వృత్తులను బట్టి ఆర్యావర్తంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు ఏర్పడ్డాయి. సృష్టి, స్థితి, లయ కారకులైన దేవతల భక్తి విషయంలో భేదాలు లేవు. ఎవరి పూజలు వారు చేసుకోవచ్చు. ధర్మాలు వేరైనా, హరి అన్ని వర్ణాలకూ హరియే.

యజన, యాజన, దాన, ప్రతిగ్రహ, అధ్యయన, అధ్యాపన అనే ఆరుకర్మలూ బ్రాహ్మణ ధర్మాలు. దానము, అధ్యయనము, యజ్ఞము, ఇటు క్షత్రియులకూ, అటు వైశ్యులకూ సమాన ధర్మాలు, సాధారణ కర్తవ్యాలు. ఇవిగాక పరిపాలన, దండన – క్షత్రియులకు.. వ్యవసాయం అంటే, పొలాల సేద్యం మాత్రమే కాకుండా, వ్యాపారమూ, వైశ్యులకు విద్యుక్త ధర్మాలు. పై మూడు వర్ణాల వారిని సేవించడం, శూద్రుల ధర్మం. ఈ సేవించడం అనే మాటను పట్టుకుని పెడార్థాలు తీసి, అపార్థాలు సృష్టించి, వర్ణం అనే మాటను అర్ధంతో సహా మరుగున పడేసి, ‘కులం’ అనే మాటను నృష్టించి, అనర్ధాలను ప్రేరేపించారు పాశ్చాత్యులు. ఆ విధంగా వారు హిందూ సంఘాన్ని విభజించి పాలిస్తే, వారి మానస పుత్రులైన కొందరు భారతీయ కుహనా మేధావులు ఈ కులతత్త్వాన్ని మరింత సాగదీసి, ముందుబడిపోయిన వారనీ, వెనకబడిపోయిన వారనీ, రెండు జాతులను సృష్టించి, పొరబాటున కూడా వారు కలవకుండా జాగ్రత్త పడుతూ, రాజకీయ లబ్దిని పొందుతున్నారు. ఈ సత్యాన్ని అందరూ అర్ధం చేసుకుని, ఇప్పటికైనా కళ్ళు తెరవాలి.

సనాతన ధర్మంలో ఆదియుగంనుంచీ కులాలు లేవు. శూద్రులు ఇతర వర్ణాలను నేవించాలంటే అర్ధం, వారికి చాకిరీ చేస్తూ బ్రతకమని కాదు. వివిధ కర్మలలో సహాయపడాలని మాత్రమే. శూద్రులు తపస్సు చేయడం, వేదాలు చదివి బ్రాహ్హణులవ్వడం, బ్రాహ్మణుల చేత పూజలందుకోవడం, మన పురాణాలలో కనిపిస్తుంది. నిజానికి ఈ గరుడ పురాణాన్ని శౌనకాది మునులకు చెప్పిన సూత మహర్షి ఎవరు???

అలాగే శూద్రులు రాజ్యాలేలడం, వస్తు విక్రయం చేయడం కూడా పురాణాలలో కనిపిస్తుంది. అంటే, శూద్రులే ఆయా వర్ణాల పనులలో సహాయపడి, ఆ పనిని బ్రహ్మాండంగా చేయడంతో, వారికి ‘వర్ణోన్నతి’ని కల్పించి, వారిని ఆ వర్ణం వారిగా గుర్తించి వుంటారు. కాబట్టి, హిందువులలో కులాలు లేవు. ఈనాటి కులపు లెక్కలు ఆ నాడు ఉండివుంటే, మాహాపద్మనందుడూ, చంద్రగుప్తుడూ, మగధ రాజులూ, భారత సామ్రాట్టులయ్యి వుండే వారు కాదేమో.. శ్రీకృష్ణుడిని భగవంతుడే కాదనే వారేమో! వర్ణాలు వర్ణాలే, కులాలు కులాలే అన్న సత్యాన్ని తెలుసుకుని, హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి.

శిల్ప రచన, పాకయజ్ఞ, సంస్థల నిర్వహణ కూడా శూద్రులు చేయాల్సిన పనులే. ఇవి, వర్ణధర్మాలు. ఇక ఆశ్రమ ధర్మాలలో, జీవితపు తొలినాళ్ళలో ‘బ్రహ్మచర్యాశ్రమాన్ని’ అందరూ పాటించాలి. భిక్షాచరణ, గురు శుశ్రూష స్వాధ్యాయము, సంధ్యావందనము, అగ్ని కార్యము, బ్రహ్మచారుల ధర్మాలు. బ్రహ్మచారులలో రెండు రకాల వారుంటారు. మొదటి రకం, ఉపకుర్వాణులు. అంటే శాస్రోక్తంగా వేదాదులనూ, ఇతర విద్యలనూ అధ్యయనం చేసి స్నాతకులై, గురుకులాన్ని వీడి, జనారణ్యంలోకి పోయి గృహస్థులయ్యేవారు.

రెండవ విధం, నైష్ఠికులు.. అంటే, స్నాతకులైన తరువాత కూడా గురుకులంలోనే వుండి చదువుతూ, ఆ చదువునే బోధిస్తూ, బ్రహ్మజ్ఞాన తత్పరులై, సాధకులై, మృత్యుపర్యంతమూ గురుకులంలో వుండిపోయే వారు. అగ్నిక్రార్యము, అతిధిసేవ, యజ్ఞ, దాన, దేవతార్చనలూ, గృహస్థుల సంక్షిప్త ధర్మాలు. గృహస్థులలో సాధకులనీ, ఉదాసీనులనీ, రెండు ప్రకారాల వారుంటారు. తన పరివారం యొక్క భరణ పోషణలలోనే నిమగ్నుడై వుండేవాడు, సాధకుడు. పితృ, దేవ, ఋషి ఋణాలను తీర్చుకుని, ఏకాకిగా ధర్మాచరణ చేస్తూ, గృహస్థుగా జీవించేవాడు, ఉదాసీన గృహస్థుడు. వీరిని మౌక్షికులంటారు.

ఇక వానప్రస్థం.. బాధ్యతలన్నీ తీరిన వారి స్థాయి ఇది. ఈ దశలో భూశయనం, ఫల, మూల ఆహారం, వేదాధ్యయనం, తపస్సు, తన సంపత్తిని తన వారికి యథోచితంగా పంచి ఇవ్వడం, ధర్మాలు. అరణ్యంలో తపస్సు చేసుకుంటూ, దేవార్చన, ఆహుతి ప్రదానం గావిస్తూ, స్వాధ్యాయాన్ని ఇష్టంగా చేస్తూ వుండే వానప్రస్థి, తాపసోత్తమునిగా పరిగణింప బడతాడు. తపస్సు ద్వారా శరీరాన్ని శుష్కింపజేసి, నిరంతరం భగవత్‌ ధ్యానంలో వుండే వానప్రస్థి, చివరి కాలంలో సన్యాసిగా గౌరవింప బడతాడు. వానప్రస్థి సన్యాసిగా మారి తనువు చాలిస్తాడు. ఇక్కడ సన్యాసాశ్రమం వేరు.

భిక్షుక వృత్తి ద్వారానే జీవిస్తూ, నిత్యం యోగాభ్యాసానురక్తుడై, బ్రహ్మప్రాప్తి కోసమే ప్రయాస పడుతూ, జితేంద్రియుడై జీవించేవాడిని, ‘పారమేష్ఠిక సన్యాసి’ అంటారు. ఇక్కడ పరమేష్ఠి అంటే, ‘బ్రహ్మ’ అని అర్ధం. ఎల్లప్పుడూ ఆత్మతత్త్వానుసంధానం పైనే అంటే, ప్రేమను చూపిస్తూ, నిత్యతృప్తులై, సంయమ నియమాలతో జీవిస్తూ, మహా మునులుగా, యోగులుగా ప్రతిష్ఠితులైన సన్యాసులను, ‘భిక్షు’ శబ్దంతో గౌరవిస్తారు.

భిక్షాచరణము, వేదాధ్యయనము, మౌనావలంబనము, తపము, ధ్యానము, సమ్యక్‌ జ్ఞానము, వైరాగ్యములు, సన్యాసాశ్రమి యొక్క సామాన్య ధర్మాలు. జ్ఞాన సన్యాసులనీ, వేద సన్యాసులనీ, కర్మ సన్యాసులనీ, పారమేష్ఠిక సన్యాసులు మూడు విధాలు. అలాగే యోగులలో కూడా ప్రారంభీ, భౌతిక, అంత్యాశ్రమి అనబడే స్థాయులున్నాయి. వీరందరికీ ఆరాధ్యమూ, ఆశ్రయమూ ఒక్కటే.. అదే, యోగమూర్తి స్వరూపుడైన పరమాత్మ.

మానవులకు ధర్మం ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. అర్ధం వల్ల కామమనే పురుషార్ధం సిద్ధిస్తుంది. ప్రవృత్తి, నివృత్తి, అనే రెండు విధాల కర్మలు వేదంలో చెప్పబడ్డాయి. వేద, శాస్త్రానుసారం, అగ్ని మొదలైన దేవతలనూ, గురు, విప్రాదులనూ ప్రసన్నం చేసుకోవడానికి చేయబడే కర్మలు ‘ప్రవృత్తి కర్మలై’తే, విధిపూర్వక కర్మానుష్ఠానం ద్వారా చిత్తశుద్ధినీ, ఆత్మజ్ఞానాన్నీ కలిగింపజేసేవి, ‘నివృత్తి కర్మలు’. క్షమ, దమ, దయ, దాన, నిర్లోభత, స్వాధ్యాయ సరలత, అనసూయత, తీర్థానుసరణ, సత్య, సంతోష, ఆస్తిక్య, ఇంద్రియనిగ్రహ, దేవార్చనలూ, మరీ ముఖ్యంగా బ్రాహ్మణ పూజనం, అహింస, ప్రియవాదిత, అరూక్షత, అపైశున్యం (దర్జా) వంటి గుణాలన్నీ, అన్ని ఆశ్రమాలలోనూ అందరికీ సామాన్య ధర్మాలు.

ఇప్పుడు ఈ చాతుర్వర్ణాలవారు చేరుకునే ఉత్తమ గతులను వినండి. వేద విహిత కర్మలన్నిటినీ ఆచరిస్తూ జీవించిన బ్రాహ్మణులు, ప్రాజాపత్య లోకప్రాప్తిని పొందుతారు. యుద్ధంలో పారిపోకుండా తమ ధర్మాలను పాటించిన క్షత్రియులు, ఇంద్రస్థానాన్ని పొందుతారు. నిత్యమూ తమ ధర్మంలో రతులై జీవించిన వైశ్యులు, మరుద్‌ దేవతల లోకాన్ని పొందుతారు. తమ వృత్తిని ప్రాణ సమానంగా ప్రేమించి జీవించిన శూద్రులకు, గంధర్వ లోకం ప్రాప్తిస్తుంది.

ఊర్థ్వ రేతస్కులై, బ్రహ్మనిష్టలోనే మొత్తం జీవితాన్ని గడిపి, వందల యేళ్ళ తపస్సు ద్వారా, బ్రహ్మలోకంలో ఒక ఉత్తమ స్థానాన్ని పొందిన బుషులు, ఎనభై ఎనిమిది వేలమంది మన భారతీయ పరంపరలో వున్నారు. ఆ స్థానమే, గురుకుల నివాసియైన బ్రహ్మచారికి లభిస్తుంది. వానప్రస్థి, దేహాంతంలో సప్తర్షిలోకాన్ని చేరుకుంటాడు. సన్యాసికి మోక్షం లభిస్తుంది. ఇక పునర్జన్మవుండదు. ఆ మోక్ష పదం, పరబ్రహ్మ వ్యోమమనీ, ఈశ్వర సంబంధిత పరమానంద నిలయమనీ, అమృత స్థానమనీ చెప్పబడింది. ఇదే ముక్తి పదం, అష్టాంగమార్గ సమ్యక్‌ జ్ఞానానుష్ఠానాల వల్ల కూడా ప్రాప్తిస్తుంది.

🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home