శ్రీ కృష్ణుడి చిట్టచివరి ప్రసంగం! Last Message of Krishna on the day he left his body
శ్రీ కృష్ణుడి చిట్టచివరి ప్రసంగం!?
కృష్ణుడు తనువు చాలించే ముందు చెప్పిన ఆఖరి మాటలేంటి?
కడలి లోతులను గుర్తుకు తెచ్చేటంతటి చరిత్రగల మహాభారత గాధలలో, నేటికీ మనలో చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు నిబిడీకృతమై వున్నాయి. అటువంటి వాటిలో ఒకటి, ఆ శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిన చివరి మాటలు. ఆ స్వామి అవతార పరిసమాప్తికి ముందు చెప్పిన కొన్ని విషయాలు, ఆశ్చర్యం కలిగించక మానవు. ఇది ఆయన చిట్టచివరి ప్రసంగం. దీని తర్వాత ఇక ఆయన మాట్లాడ లేదు. ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు. ఇంతకీ శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిన ఆ చివరి పలుకులేంటి? చాలామందికి తెలియని ఆ విషయాలకోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/IkX39QAjEJw ]
‘ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అని చెప్పినట్లుగా, సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువే దిగివచ్చి, ద్వాపర యుగంలో కృష్ణావతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే. మానవ జన్మ అయినప్పటికీ, పుట్టినప్పటి నుంచీ ఒక పక్క ఎన్నో మహిమలను చూపుతూ, మరోపక్క అందరితో కలివిడిగా తిరగడం, తోటి స్నేహితులతో ఆటలాడటం, కొంటెపనులు చేయడం వంటి కార్యాలు చేస్తూనే వున్నాడు. అందువల్ల ఆయనంటే బృందావన వాసులు పంచ ప్రాణాలూ ఒడ్డే వారు. అటువంటి వారిలో, శ్రీకృష్ణుడి చిన్ననాటి స్నేహితుడైన ఉద్ధవుడు కూడా ఒకడుగా చరిత్ర చెబుతోంది. ఉద్ధవుడు వృష్ఠి వంశానికి చెందినవాడు. ఆయన సాక్షాత్తు దేవతలకు గురువైన బృహస్పతికి ప్రియ శిష్యుడు కూడా అని, భారతం చెబుతోంది. శాస్త్ర విజ్ఞానంలో మహా జ్ఞానిగా పేరు తెచ్చుకున్న ఉద్ధవుడు, శ్రీకృష్ణ పరంధాముడు రాజుగా పట్టాభిషక్తుడయిన కొద్ది రోజులకే, మథురా నగారానికి చేరుకున్నాడు. అప్పటి నుంచీ ఉద్ధవుడు కృష్ణ భగవానుడికి ఆంతరంగికుడిగా, ఆయన మంత్రులలో ఒకడిగా ఉండేవాడు.
కురుక్షేత్ర యుద్ధం తర్వాత, గాంధారి శాప ప్రభావంతో ద్వారకలో అనర్ధాలు సంభవిచడం కృష్ణ భగవానుడు గమనించి, ఇక తన అవతారం చాలించే సమయం ఆసన్నమయిందని నిర్ణయించుకున్నాడు. అంతంలో తాను చక్కబెట్టవలసిన కార్యాలన్నీ ముగించుకుని, తుది ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో, ఆయన చిన్ననాటి స్నేహితుడైన ఉద్ధవుడికి కబురు బెట్టాడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వచ్చి, ‘మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, కలిసి తిన్నాము, సంతోషంగా గడిపాము. అటువంటిది నీ అవతారం పరిసమాప్తమవుతోందంటే, జీర్ణించుకోలేక పోతున్నాను కృష్ణా. నాదొక ప్రార్థన.. నా మనస్సు శాంతించేటట్లూ, నిరంతరమూ నీతోనే ఉండిపోయేటట్లూ ఏదయినా ఉపదేశం చేయి’ అని ప్రార్థించాడు. దానికి పరంధాముడు చిరు దరహాసంతో, మనుష్యులు జీవితంలో పాటించవలసిన నియమాలనూ, రాబోయే కలియుగం యొక్క స్వరూపాన్నీ, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలనూ ముందుగానే ఉద్ధవుడితో చెప్పాడు. ఆ పలుకులే కృష్ణావతారంలో చివరి పలుకులని భాగవతం 10వ స్కంధంలో ఉంది.
పరమాత్ముడు ఉద్ధవుడితో చెప్పిన ఆ చివరి మాటల ప్రాకారం, ‘నేటికి సరిగ్గా ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవ రాత్రి లోపు ద్వారకా నగరం మొత్తం కడలి గర్భంలో కలిసి పోతుంది. దానితో ద్వారక వాసులందరూ మృత్యువు పాలవుతారు. ఆ తరువాత కలి ప్రవేశంతో కలియుగం ప్రారంభమవుతుంద’ని శ్రీ కృష్ణుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. కలియుగం ప్రారంభం కాగానే, కలి ప్రభావం మనుషులపై చూపడం మొదలై, మానవులలో అపారమైన కోర్కెలూ, విపరీతమైన కోపం పెరిగిపోతాయనీ, కలియుగంలో ఎవ్వరూ తమ తప్పులను తాము తెలుసుకునే ప్రయత్నం చేయక, ఈ రెండు కారణాల వల్లా వివిధ రోగాలకు గురై, వారి ఆయుర్దాయం క్రమక్రమంగా క్షీణించి పోతుందని, శ్రీకృష్ణుడు చెప్పాడు..
అలాగే, కలియుగంలో మనుష్యులకు వేదాలపై అవగాహన పూర్తిగా నశించిపోయి, వేద ప్రోక్తమయిన భగవన్మూర్తులను మరచి పోతారు. అందువల్ల వారు చేసే పూజలకు అర్ధం పర్ధం లేకుండా పోతుంది. దానిని అలుసుగా తీసుకుని, అవన్నీ మూఢ నమ్మకాలని చెప్పే వర్గాలవారు తయారవుతారు. వారిని నమ్మి చాలా మంది వేద విహిత కర్మలను విడిచి పెట్టేస్తారు. వేదాల చేత ప్రోక్తమయిన భగవన్మూర్తులను పూజించ వద్దని చెప్పిన మాటలు బాగా రుచించి, కోట్ల జన్మల అదృష్టం చేత వేదం ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదాన్ని వదిలి, తమంత తాముగా పాషండ మతాలను కౌగలించుకుని, అభ్యున్నతిని విడిచి వేరు మార్గాలలోకి వెళ్ళి పోతారు.
పూజలు తమ మనస్సును సంస్కరించు కోవడానికీ, ఆచారాలు తమంత తాము పాటించడానికీ ఏర్పడినవి. తక్కువ పదార్ధాలను తిని శరీరాన్ని నిలబెట్టుకుని, మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని, ఉపవాసమనే ఆచారం వచ్చింది. కలియుగంలో రానురానూ ఆచారాలను విడిచి పెట్టేయడానికే, ప్రజలు ఇష్ట పడతారు. ఆచారం లేని పూజ చేయడానికే సుముఖత చూపెడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏవేవి ఉంటాయో, వాటిపై మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోలేరు.
అంతః శ్శుద్ధి ఉండదు, చిత్త శుద్ధి ఏర్పడదు. ఆచారాలనూ, సంప్రదాయాలనూ విడిచిపెట్టిన పూజలపై మక్కువ చూపించి, అటు మొగ్గుజూపడం ప్రారంభిస్తారు. మంచి ఆచారాలు మనస్సును సంస్కరిస్తాయని తెలుసుకోవడం మానేసి, ఏ రూపాన్ని ఆశ్రయిస్తే, ఏ పూజజేస్తే ఆచారం అవసరంలేదని ప్రచారం ఉంటుందో, అటు వైపుకే అడుగులు వేస్తారు. కానీ దాని వలన తాము పొంద వలసిన స్థితిని పొందలేమని తెలుసుకోలేక పోతారని, శ్రీకృష్ణుడు వ్యక్త పరిచాడు.
అంతేగాకుండా, కలియుగంలో మానవులందరూ ఇంద్రియాలకు వశమై, దానివల్ల కలిగే సుఖాలే అసలైన స్వర్గమని అపోహపడి, వారి జీవితాలను నరక ప్రాయం జేసుకుంటారు. ఇంద్రియ సుఖాలకు లోబడి, పాప కర్మలను మూటగట్టుకుని, మరణాంతరం నరకానికి చేరుకోవడమే కాకుండా, ఆ పాప కర్మల వల్ల మరు జన్మలలో కూడా ఎన్నో కష్టాలకు లోవనవుతారు. ఇంద్రియ సుఖాల వల్ల తమకు అంత నష్టం జరుగుతున్నా, కలియుగ మానవులు వారి దారిని ససేమిరా మార్చుకోరు. కలియుగంలో ధనార్జనే మానవులకు ప్రధానంగా మారుతుంది. రాజులు ప్రజల సొమ్మును దోచుకుంటుంటే, ప్రజలు రాజుల మీద తిరగబడి, ప్రజా ఉద్యమాలు మొలకెత్తుతాయి. అయినా అందరూ ధనానికే ప్రాధాన్యతనిస్తారు. ఎవరికీ పాండిత్యాన్ని బట్టిగానీ, యోగ్యతను బట్టిగానీ గౌరవం లభించదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్న దానికన్నా, ఎంత వెనకేసుకున్నాడన్నదే ప్రధానమవుతుంది. ఐశ్వర్యవంతుడే పండితుడిగా కొనియాడబడతాడని, శ్రీకృషుడు తెలియజేశాడు.
కలియుగం గురించిన విషయాలన్నీ ఉద్ధవుడికి చెప్పిన తర్వాత, ఆ స్వామి ఆయనను వెంటనే ద్వారకను వదలి, బదిరకాశ్రమానికి వెళ్లిపొమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్లిన తరువాత, బంగారం, లేదా వెండి, లేదా కంచు వంటి లోహాలలో ఏదైనా ఒక లోహంతో తన ప్రసన్న మూర్తిని తయారుజేయించుకుని, దానిని పూజా మందిరంలో పెట్టుకుని నిత్యం పూజించమని చెప్పాడు. ‘విగ్రహారాధన’గా అన్యమతస్థులు ఎత్తి పొడిచే ఆ పద్ధతి గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాము. ఆ విధంగా ఓ సాత్విక మూర్తికి పూజలు చేయడం వలన, కొద్ది రోజులకు అతడు అర్పిస్తున్న పుష్పాలను భగవంతుడు స్వీకరిస్తున్నట్లూ, సమర్పించిన ప్రసాదం సేవిస్తున్నట్లూ అనిపిస్తుంది. అలా క్రమంగా అతడి అహంకారాన్ని ఆ మూర్తి హరించడం మొదలు పెడుతుంది. క్రమక్రమంగా అతడు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తాడు. మనస్సు తొందరగా నిలబడడానికి, ‘విగ్రహారాధన’ అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకు ప్రతి జీవి గుండెలలోనూ పరమాత్మ ఉన్నాడనే సత్యాన్ని గ్రహించ గలుగుతాడు.
అప్పుడు ఎక్కడ చూసినా అతడికి నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపాలతో దర్శనమిస్తాడు. అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు, జీవునిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. అతడు నన్నే చూస్తూ వెళ్ళిపోతాడు కాబట్టి, నా యందే చేరిపోతాడని, పరమాత్ముడు చెప్పాడు. ఆ విధంగా పరంధాముడు ఉద్ధవుడికి తన అమృత వాక్కులను వినిపించి, అవతార పరిసమాప్తి కోసం వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ఉద్ధవుడు కూడా బదరికాశ్రమం చేరి, తన శేష జీవితం మొత్తం, భగవన్నామ స్మరణలో గడిపి, కలి ప్రభావం నుంచి తప్పించుకుని ముక్తినొందాడని, భాగవతంలో చెప్పబడి ఉంది.
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
Comments
Post a Comment