ఈ రోజు 'మాస శివరాత్రి'.. ఎందుకు? ఎలా జరుపుకోవాలి? Masa Shiva Ratri - Masik Shivratri
ఈ రోజు 'మాస శివరాత్రి'.. ఎందుకు? ఎలా జరుపుకోవాలి?
ప్రతి నెలా అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్ధశి తిధిని, మాస శివరాత్రిగా జరుపుకుంటాము. అసలు శివరాత్రి అంటే శివుడి జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి.
[ నందీశ్వరుడు చెప్పిన శివరాత్రి మాహాత్మ్యం! https://youtu.be/YPCDlvLz5Sw ]
మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి?
మహా శివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, లయానికి (మృత్యువుకు) కారకుడు కేతువు. అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. 'చంద్రోమా మనస్సో జాతః' అనే సిద్దాంతం ప్రకారం, చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు, జీవుల పై ఈ కేతు ప్రభావం ఉండటం వలన, వారి వారి ఆహారపు అలవాట్ల పై ప్రభావం చూపడం వలన, జీర్ణ శక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సంయమనాన్ని కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకో కూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి, కొన్ని సమయాలలో తమకే కాకుండా, తమ సమీపంలో ఉన్న వారి యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణాలకు సైతం హాని తలపెట్టే ప్రయత్నం, తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. అందుకే మనం గమనించవచ్చు.. అమావాస్య తిధి ముందు ఘడియలలో కొందరి అనారోగ్యం మందగించండం, లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణం ఇదే అని చెప్పవచ్చు.
కాబట్టి, ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా, లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా, మనం అవకాశం ఉన్నంత మేర, ప్రతి మాసమూ ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉంది.
మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి?
ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసముండి, సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని, దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు, వారి శక్తి మేర 5, 11, 18, 21, 56, 108, ఇలా ప్రదక్షణాలు చేయవచ్చు. అలాగే, ఈ రోజు శివాలయంలో పూజలో ఉంచిన చెరకు రసాన్ని భక్తులకు పంచడం వలన, వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే, ఈ రోజు ప్రదోష వేళ శివుడికి మారేడు దళాలతో, లేదా కనీసం గంగా జలంతో అభిషేకాది అర్చనలు చేయడం మంచిది. ఇవేవీ చేయడానికి అవకాశం లేని వారు, ఆరోగ్యవంతులు, అలాగే గృహంలో అశుచి దోషం లేని వారు, ఈ రోజు ఉపవాసముండి, మూడు పూటలా చల్లటి నీటితో వీలయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి.
మాస శివరాత్రిని జరుపుకోవడం వలన కలిగే ఉపయోగాలు!
ప్రత్యేకించి ఈ రోజును సశాస్త్రీయంగా జరుపుకోవడం వలన, మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానలేమి సమస్యలనుండి విముక్తి లభిస్తుంది. వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు , అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్దకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత, వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి, దేవాలయానికి వెళ్ళే అలవాటు చేయించగలిగితే, వారిలో కాలక్రమంగా, ఖచ్చితంగా మార్పు వస్తుందని భావించవచ్చు. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
కాబట్టి, ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర, ప్రతి మాస శివరాత్రినీ సశాస్త్రీయంగా జరుపుకోవడం ద్వారా శుభాలను పొందవచ్చు..
Comments
Post a Comment