What is Cosmic Plan? | కర్మయోగం!
కర్మయోగం!
ఫలాన్ని ఆశించి చేసే 'కర్మ' వలన ఎటువంటి ఫలితాన్ని పొందుతాము?
ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడానికి, అంటే, నిష్కామకర్మకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరే, 'కర్మయోగం'. యోగం అంటే ఆసనాలు వేయడం, గాలి పీల్చడం అని మనం సాధారణ పరిభాషలో అనుకుంటూ వుంటాము. నిజానికి యోగమంటే కలయిక. ఫలానా వాడికి రాజయోగం పట్టింది, లక్ష్మీ యోగం పట్టిందని అనడం వింటూంటాము. లేనిదానిని పొందడం, పొందినదానిని రక్షించుకోవడమే, యోగమంటే. ఇక్కడ కర్మయోగం అంటే, కర్మ అనే ఉపాయాన్ని పట్టుకుని, మరొకదానిని సాధించడం. ఆ మరొకటే, 'ఆత్మజ్ఞానం'. ఆ విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/XycX4sTLnE8 ]
ఫలితం కోరకుండా పని చేసే వ్యక్తి మనస్సు, క్రమక్రమంగా పవిత్రంగా మారుతుంది. దీనినే చిత్తశుద్ధి అంటారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మంచిపనులు చేస్తున్నప్పుడు, మనస్సు ఎంత ప్రశాంతత, సంతృప్తిని పొందుతుందో, మనం స్వంతంగా ప్రయత్నం చేసి చూడవచ్చు. కర్మ మనస్సును శుభ్రపరచడానికి ఒక మార్గం. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తియే, ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేయగలడని ఉపనిషత్తుల సిద్ధాంతం.
కర్మయోగం గురించి చెబుతూ, శ్రీకృష్ణుడు ‘యోగః కర్మసు కౌశలం’ అన్నాడు. ‘కర్మయోగం అంటే, పనులు చేయడంలో నేర్పరితనం’ అని చెప్పాడు. ఏమిటి ఆ నేర్పరితనం అంటే, కర్మచేస్తూ ఉండి కూడా, దాని ఫలితం నుంచి తప్పించుకోవడం. అది ఒక దొంగ దొంగతనం చేసి తప్పించుకున్నట్లు కాకుండా, మంచి పని చేసి కూడా దాని ఫలితమైన పుణ్యాన్ని కోరకపోవడం.. ఇది ఆశ్చర్యంగా కనిపించవచ్చు. ఇందుకు ఉదాహరణగా ఒక సంఘటన చెప్పుకుందాము..
ఒకానొక సందర్భంలో కాశీలోని హనుమాన్ ఘాట్ దారి గుండా ఇద్దరు యువకులు వెళుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు యువతులు నీళ్ళలో మునిగిపోయే స్థితిలో ఉండటం యాదృచ్ఛికంగా గమనించారు వాళ్ళు. మరు క్షణమే ఆ ఇద్దరూ ముందూ వెనుకా చూడకుండా నీళ్ళలోకి దూకి, మునిగి పోబోతున్న ఆ ఇద్దరు యువతులనూ సురక్షితంగా కాపాడి, వడ్డుకు చేర్చారు.
తమను కాపాడిన ఆ ఇద్దరు యువకులకూ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నారు, ఆ యువతులు. కాపాడిన యువకుల్లో ఒకడు, తను కాపాడిన యువతితో తనను వివాహం చేసుకోమని అడిగాడు. అతడు “ఈ లోకమే సత్యం" అనే దృక్పథంగల వాడు. రెండవ యువకుడు, తనకన్నా వయస్సులో పెద్దవారైన స్త్రీలను తల్లి గానూ, సమ వయస్కులైన వారిని సోదరిగానూ, పిన్నలను పుత్రికలుగానూ భావించి మెలగేవాడు. కనుక అతడు, “సోదరీ, ఒక మంచి పని చేయడానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను నా కర్తవ్యాన్ని మాత్రమే చేశాను” అని తాను కాపాడిన యువతితో చెప్పాడు. అతడు "భగవంతుడు మాత్రమే సత్యం” అనే దృక్పథం గలవాడు.
బాహ్య స్థాయిలో చూసినప్పుడు, ఇద్దరు యువకులూ ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఒకే రకమైన కర్మనే చేశారు. కానీ వాస్తవ దృక్పథం ప్రకారం, ఇద్దరిలో వ్యత్యాసం ఉంది. ఆ కారణంగా, వారికి ఫలమూ విభిన్నంగానే దక్కింది.
కర్మయోగి కానివాడు, స్వంత అభ్యుదయం కోసం పనిచేస్తూ, జనన మరణ చక్రంలో తిరుగుతూ వుంటాడు. అతడికి మోక్షం ప్రాప్తించదు. అలాకాకుండా, 'కర్మయోగి' లోకం మేలు కోసం, ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తూంటాడు. ఈశ్వరార్పణ అంటే, తాను భగవంతుడి కాస్మిక్ ప్లాన్ లో ఒక భాగంగా, భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగా భావిస్తూ, పనిచేయడం. దీనివల్ల ప్రయోజనం, చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న మనస్సు, పరిశుభ్రమైన అద్దం వంటిది. ఒక అద్దంలో ఏదైనా వస్తువు ప్రతిబింబం ఏర్పడాలంటే, అద్దం శుభ్రంగా ఉండాలి. అలాగే, ఆత్మజ్ఞానమనే వెలుగును ప్రతిబింబించాలంటే, మనస్సనే అద్దం శుభ్రంగా ఉండాలని, వేదాంతం చెబుతుంది.
ఫలితాన్ని ఆశించి చేసే 'కర్మ', బంధానికి దారి తీస్తుంది. తనను భగవంతుని ఉపకరణగా భావించి కర్మను ఆచరించటమూ, దాని ఫలాన్ని భగవంతునికే అర్పించడమూ, 'ఆత్మ విముక్తి'కి దారి తీస్తుంది. పైగా, ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న వారు మాత్రమే, నిష్కళంక భావంతో లోకానికి సేవలు అందించగలరు. అలా కాని స్థితిలో, స్వార్ధం చోటుచేసుకోవడాన్ని నివారించలేము.
కర్మాచరణలో మాత్రమే నీకు అధికారం ఉంది. దాని ఫలాలలో ఎన్నడూ లేదు. కర్మ ఫలాలను రూపొందించే వానిగా అవ్వవద్దు. కర్మలు ఒనర్చకుండటంలో అనురక్తి కూడదు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోஉస్త్వకర్మణి || -గీత, 2.47
మనం మన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాలి. ఫలితాల గురించి చింతించకూడదు. మన కర్తవ్యాన్ని నిర్వర్తించే హక్కు మనకు ఉంది కానీ, ఫలితాలు మన ప్రయత్నాలపై మాత్రమే ఆధారపడి ఉండవు. ఫలితాలను నిర్ణయించడంలో, అనేక అంశాలు అమలులోకి వస్తాయి.. అవి మన ప్రయత్నాలూ, విధి, అంటే, మన గత కర్మలూ, భగవంతుని సంకల్పం, ఇతరుల ప్రయత్నాలూ, పాల్గొన్న వ్యక్తుల సంచిత కర్మలూ, స్థలమూ మరియు పరిస్థితి, అంటే, అదృష్టానికి సంబంధించిన విషయం, మొదలైనవి. మనం ఫలితాల కోసం ఆత్రుతగా ఉంటే, అవి మన అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు, ఆందోళనను అనుభవిస్తాము. కాబట్టి, ఫలితాల కోసం చింతించవద్దనీ, మంచి పని చేయడంపై మాత్రమే దృష్టి పెట్టమనీ, శ్రీ కృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చాడు. వాస్తవమేమిటంటే, ఫలితాల గురించి మనం పట్టించుకోనప్పుడు, మన ప్రయత్నాలపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతాము. ఫలితం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.
మరో కోణంలో భగవాన్ శ్రీరామకృష్ణులవారు ఇలా అన్నారు.. పడవ నీటి మీద తేలవచ్చు. కాని పడవలో నీరు ప్రవేశించ కూడదు. ఆ విధంగానే, మనిషి సంసారంలో ఉండవచ్చు కానీ, సంసారానురక్తి అతడిలో ప్రవేశించ కూడదు.
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
Comments
Post a Comment