When the soul enters mother's womb | పునర్జన్మ సిద్ధాంతం! పరకాయ ప్రవేశం!
పునర్జన్మ సిద్ధాంతం! పరకాయ ప్రవేశం!
ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశించక ముందు, తండ్రి శరీరంలో 3 నెలలు ఉంటుందా? జీవుడి 5 శరీరాలేమిటి?
సైన్స్ పరంగా మానవుడు ఎంతో పురోగతి సాధించినప్పటికీ, కొన్ని విషయాలు ఎప్పటికీ మన చేతులలో ఉండవు. అటువంటి వాటిలో చావు పుట్టుకలు ఒకటి. శాస్త్రాల పుణ్యమా అని, జనన మరణ వలయాన్ని గురించి కూడా సైన్స్ పరంగా కొంత తెలుసుకోగలిగాడు మానవుడు. మనిషి తల్లి గర్భం నుంచి బయటపడి జన్మనెత్తుతాడనేది, అందరికీ కనిపించే యధార్థమే! అలా కనిపించని యధార్థం మరొకటి వుందని మీకు తెలుసా!? మనిషి పుట్టడానికి ముందే, అంటే, 270 రోజులకు పూర్వమే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి, జన్మించడం జీవితానికి మొదలు కాదు. తల్లి గర్భంలో ప్రవేశించడమే ప్రారంభము. మనిషి, జన్మనెత్తడానికి పూర్వ దశ పిండ రూపంగా వున్నట్టే, శరీరంలోకి ప్రవేశించక ముందు కూడా, ఈ జననానికి పూర్వ దశ ఒకటుంది..! చాలామందికి తెలియని ఆ విషయాలకోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/LNLyArvxWjA ]
మనిషి మరణించిన వెంటనే శరీరాన్ని విడిచిపెట్టి బయటికి పోతున్నాడు. అంటే, మనిషి శరీరాన్ని విడిచిపెట్టి బయటపడ్డాక, కంటికి కనిపించని అపర దశ ఒకటి వుంది. ఆ దశలో, జీవాత్మ స్థితిలో, శరీరం లేకుండా గాలిలో సంచరిస్తుంటుంది. ఆ స్థితిని గురించి సైన్స్ కు ఏమీ తెలియదు. అప్పుడే మరణించిన జీవాత్మలను, Kirlian Photography ద్వారా ఫోటోలు తీసిన కొందరు విదేశీ సైంటిస్టులు, తమ పరిశోధనల ద్వారా, శరీరం లేని జీవాత్మలు ఎలా వుంటాయో కనుగొనడానికి ప్రయత్నించారు.
మన ప్రాచీన వేద ఋషులు, యోగాభ్యాసం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టి, 'పరకాయ ప్రవేశం', అంటే, ఒక శరీరంనుంచి బయటకువచ్చి, ఇంకొక శరీరంలోకి ప్రవేశించడమనే యోగ ప్రక్రియ సిద్ధిని పొందారు. ఈ పరకాయ ప్రవేశ విద్య లాగానే, సామాన్య మానవుడు నిద్రావస్థలో మరణించి, అపస్మారక స్థితి అంటే, Coma లో, తల్లి గర్భంలోకి ప్రవేశిస్తున్నాడు గనుక, అలాంటి వాడు తెలుసుకో లేని పునర్జన్మ విజ్ఞానమే, వేదాలూ ఉపనిషత్తులూ తెలిపే ‘పునర్జన్మ రహస్యము’. అదేమిటో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము.
మనిషి బ్రతికి వున్నప్పుడు, మనకు బైటికి కనిపించే ఆకారాన్ని, స్థూల శరీరం, లేదా Material Body అంటాము. అంటే, ఒక పదార్థంతో తయారైన శరీరమని అర్ధం. ఇది మనం తినే ఆహారంతో ఏర్పడుతుంది గనుక, అన్నశరీరం లేదా అన్నమయకోశం అంటాము. మరణించే సమయంలో మనిషి, ఈ అన్నమయ శరీరాన్ని వదిలేస్తాడు. సాధారణంగా మనం ఎలాగైతే స్నానం చేసి బట్టలు మార్చుకుంటామో, మరణాసన్న సమయంలో, అంటే, ఈ భూలోక యాత్రను ముగించే సమయంలో, శరీరాన్ని ఇక్కడే వదిలేసి, లోపలి జీవుడు బయటికి వస్తున్నాడు. అలా, మరణించాక బయటకు వచ్చే జీవాత్మను, ప్రాణమయ శరీరం అంటారు. అంటే, ఇది మనలోని ప్రాణశక్తితో తయారైన శరీరము.
ఈ ప్రాణమయ శరీరాన్ని, సెంయోన్ కిర్ణియన్ (Semyon Kirlian) అనే రష్యన్ సైంటిస్ట్, తాను కనిపెట్టిన ప్రత్యేక Camera ద్వారా, మరణించిన వారి శరీరాలనుంచి బయటకు వచ్చే జీవాత్మలనూ, వాటి చుట్టూ ప్రకాశించే ప్రాణ శక్తినీ ఫోటోలు తీసి, వివరించాడు. ఈ ప్రాణమయ శరీరమే, మనం అనుభవించే నొప్పులకూ, శరీర సౌష్టవానికీ కారణమయిన జీవాత్మ. అంటే, మనం ఎదుర్కొనే ఆకలి దప్పులూ, నీరసమూ, పుష్టీ, ఆరోగ్యమూ, అనారోగ్యమూ, శారీరక సుఖ దుఃఖాలూ, మొదలైన అనుభూతులన్నీ అనుభవంగా తెలిసేది, ఈ ప్రాణమయ శరీరం వల్లనే. ఇందుకు science పరంగా చెప్పుకోదగిన ఒక ఉదాహరణ, సహజంగా డాక్టర్లు ఆపరేషన్ చేసే ముందు, Patient కి Anesthesia అంటే, మత్తు మందు ఇస్తారు. అలా చేయడం వలన వారు, వారికి తెలియకుండానే ఈ ప్రాణమయ శరీరాన్ని వేరు జేస్తున్నారు. అందుకే Patient కి ప్రాణమయ శరీరం తెలిపే నొప్పి, బాధ, లేక ఏం జరుగుతున్నదో తెలిసే స్పృహ నశించిపోయి, అపస్మారక స్థితి కలుగుతోంది. ఇదే, మనిషి మరణించి, స్థూలశరీరం నుండి బయటపడే జీవము. దీనినే ఆత్మ, దయ్యం, లేక ప్రేతమని కూడా అంటాము.
మనిషి మరణించిన తరువాత రెండవ దశలో, ఈ ప్రాణమయ శరీరాన్ని కూడా వదిలి, తన ఆలోచనలూ, జ్ఞాపకాలూ, అనుభూతులూ నెమరు వేసుకునే మనోమయ శరీరంతో బయటకు వస్తాడు. ఇది మనిషి స్థూల శరీరం లోపల, ప్రాణమయ శరీరంలో నిగూఢంగా ఉంటుంది. ఉల్లి పొరల లాగా, మనిషి మరణానంతరం, ఈ శరీరాలు ఒక్కొక్కటీ బయట పడతాయి. మనోమయ శరీరాన్ని కూడా వదిలి జీవుడు బయటకు రాగానే, అంతవరకూ తాను ఆ జీవితంలో అనుభవించిన సంఘటనలూ, సుఖ దుఃఖాలూ, వాటికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ మరచిపోతాడు. అయినా ఆ మనోమయశరీరాన్ని యోగులు తమ దివ్యదృష్టితో వీక్షించి, మరణించిన జీవుడి పూర్వ జన్మ చరిత్రనంతా చదవ గలరు. నాడీ గ్రంధాలలోని పూర్వజన్మ చరిత్ర కూడా, అలాగే తెలుస్తుంది. మనోమయ శరీరాన్ని విడిచి బైటకు వచ్చిన జీవుడు, గతాన్ని మరచి పోతాడనే విషయాన్నే, విరజానదిని దాటడంతో గతం గుర్తులు నశిస్తాయని, మన సనాతనధర్మ గ్రంధాలలో తెలిపిన సత్యం..
ఇక మనోమయ శరీరం లోపల వుండే నిగూఢమైన 'జీవాత్మ'నే, ‘విజ్ఞానమయ శరీరం’ అంటారు. ఇది ప్రతి జన్మలోని అనుభవాలను సేకరించి, ఆ జన్మలో మనం అనుభవించిన సుఖ దుఃఖాలూ, సంఘటనలూ, వ్యక్తులూ, శత్రుత్వ మిత్రత్వాదుల వంటి జ్ఞాపకాలనూ విడిచి పెట్టి, అనుభవాల సారమైన జీవిత గుణపాఠాన్ని మాత్రం తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఈ అనుభవం దృష్ట్యా, తను పుట్టబోయే మరుజన్మలో ఏ రూపాన్ని పాందాలో, ఆ జీవాత్మయే నిర్ధారించుకుంటుంది. అంటే పై మూడు శరీరాలూ గతజన్మకు సంబంధించిన అనుభవాలకు ముద్రితాల వంటివి. విజ్ఞానమయ శరీరం మాత్రం, ఆ అనుభవాల సారాన్ని తీసుకుని, తిరిగి జన్మించే మనలోని సిసలైన జీవాత్మ, అంటే, Individual Soul. అయితే, వేదాలూ ఉపనిషత్తులూ ఉపదేశించేది, ఈ జీవాత్మ కూడా అనేక జన్మల పరిణామక్రమంలో, సక్రమంగా గనుక ముందుకు సాగితే, పొదగబడిన కోడిగుడ్డు పగిలినప్పుడు, అందులోనుంచి చైతన్య మయమైన కోడి పిల్ల వచ్చినట్టే, అజ్ఞానమనే జీవస్థితి పగిలి, అందులోనుంచి అంతర్యామి, లేక ఈశ్వరుడుగా ప్రస్తావించే, దైవ స్వరూపుడైన భగవదంశతో కూడుకున్న దివ్య స్వరూపం వెలికి వస్తుంది.
ఆ స్థితిలో ఇక మరి జన్మలు ఎత్తవలసిన అవసరం లేదు. ఆ స్థితిని చేరుకునేలోగా, జీవాత్మ ఎత్త వలసిన అనేక జన్మలూ, పాంద వలసిన అనుభవాలూ, సుఖ దుఃఖాలన్నిటినీ అనుభవించాల్సింది, ఈ విజ్ఞానమయ శరీరం, లేక జీవాత్మయే!
ఈ జీవాత్మయే, మరణించిన చాలా కాలానికి, తిరిగి బయట ఆకాశంలోకి ప్రవేశిస్తుంది. ఆకాశంలోని విద్యుత్తులో లీనమై పైకి ప్రయాణించి, చంద్రుడిలోనూ, సూర్యుడిలోనూ ప్రవేశించి, కొంత కాలానికి తిరిగి క్రిందకు ప్రయాణం చేస్తుంది.
మళ్ళీ సూర్యుని నుండి చంద్రునికీ, చంద్రుడిలోనుంచి ‘మెరుపు’ అంటే విద్యుత్తులోనికీ, వర్షపు బిందువులలోనికీ, తరువాత ప్రాణ చైతన్యంగా మొక్కలకూ, వాటిని తినే పశు పక్ష్యాదులకూ, ఆ పశువుల పాలను త్రాగే మానవ శరీరంలోకీ, అలా ప్రాణ స్వరూపంగా ప్రవేశిస్తుంది. ఈ ప్రాణ కళ, ముందుగా పురుషుడి శరీరంలో ఏర్పడి మూడు మాసాలుండి, అతడి సహస్రారం నుండి ఆజ్ఞాచక్రంలోకి దిగుతుంది. సంకల్పాలకు స్థానమైన ఆజ్ఞాచక్రంలోనుంచి, అభిమాన స్థానమైన హృదయంలోకి ప్రవేశించి, భార్యాభర్తల ప్రేమశక్తి ద్వారా భార్య హృదయంలోకీ, నాభి వద్ద మణిపూరక చక్రంలోకీ ప్రయాణించి, తల్లి యొక్క కుండలినీ శక్తి ద్వారా, ఆమె గర్భంలో ఒక శరీరాన్ని నిర్మాణం చేసుకుంటుంది.
అందుకే ఈ పునర్జన్మల చక్రానికి చంద్రుడూ, సూర్యుడూ ముఖ్యమైన సంబంధం. సూర్యుడికీ, చంద్రుడికీ మధ్య ఏర్పడే నక్షత్రాలూ తిథుల వల్లనే, మన జన్మ కాలంలోని తిథులూ, రాశి చక్రమూ, మన జీవితంలో రాగల ఫలితాలను సూచించే దశలూ, మన జన్మ నక్షత్రం నుంచే ఏర్పడుతున్నాయి. అందుకే మన సనాతనధర్మంలో, మనిషి పుట్టిన రోజు పండుగ అయిన నక్షత్రానికీ, మరణించిన తిథి నక్షత్రానికీ సంబంధించిన సంవత్సరీక, శ్రాద్ధ కర్మకూ, జీవునికీ, సంబంధం చెప్పబడింది. ఈ జన్మ నక్షత్రం, రాశి ద్వారానే, మన మహర్షులు యోగదృష్టి ద్వారా చూసి, ఆ జీవుని గత జన్మనూ, రానున్న జన్మలనూ, నాడీ గ్రంధాలలో ముందుగానే వ్రాసి పెట్టారు. దీనివల్ల జాతకంలోని గ్రహస్థితులకూ, ఆకాశంలో అవి ఏర్పడ్డ సమయానికీ, జీవుడు తల్లి గర్భం నుండి జన్మించే గ్రహస్థితికీ, జాతకంలో ఎందుకంత ప్రాముఖ్యత వున్నదో బోధపడుతుంది.
అలా తండ్రి శరీరంలో మూడు నెలలూ, తల్లి శరీరంలో 9 నెలలూ గడిపి, మొత్తం 12 రాశుల చక్రంలో జీవుడు ప్రయాణిస్తున్నాడు. ఇది, క్లుప్తంగా జనన మరణ చక్రం. దీనిని జాగ్రత్తగా విని అర్ధం చేసుకుంటే, అనేక రహస్యాలు బోధ పడతాయి.
శుభం భూయాత్!
Comments
Post a Comment