BARBARIK the Ancient Indian AI Robot బర్బరీకుడు! - 18 రోజుల మహాభారత యుద్ధాన్ని ఒక్కడే ఒకే నిమిషంలో ముగించగల పాండవ వీరుడి మరణాన్ని కృష్ణుడు ఎందుకు కోరాడు?


18 రోజుల మహాభారత యుద్ధాన్ని ఒక్కడే ఒకే నిమిషంలో ముగించగల పాండవ వీరుడి మరణాన్ని కృష్ణుడు ఎందుకు కోరాడు?

ఒకే ఒక్క నిముషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించ‌గ‌ల వీరుడూ, అభిమన్యుడికంటే చిన్నవాడైనా, భీమార్జునులను మించిన మహాయోధుడూ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బర్బరీకుడు. మరి అంతటి మహావీరుడిని, పైగా పాండవుల సంతతికి చెందినవాడిని, పాండవ పక్షపాతిగా ముదరింపబడిన శ్రీకృష్ణుడు  ఎందుకు వధించాడు? తన తలను శ్రీ కృష్ణుడికి సమర్పించి ప్రాణ త్యాగం చేసికూడా, బ‌ర్బరీకుడు అమ‌రుడెలా అయ్యాడు? కృష్ణ పరమాత్ముడి చేత వధింపడిన అతడు, ‘ఖాటూశ్యాం బాబా’గా భారతదేశంలో పూజలు అందుకోవడం ఏమిటి? అసలు ఎవరీ బర్బరీకుడు? అత‌ని చరిత్రేమిటి? మహా భారతంలో బర్బరీకుడి చావుకూ, అతని ముందు జన్మకూ ఉన్న కర్మ బంధం ఏమిటి? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/fgnxOIlHXL0 ]


నేటికి సుమారు 1000 సంవత్సరాల క్రితం, అంటే, సామాన్య శకం 1027 వ సంవత్సరంలో, రాజస్థాన్ లోని ఒక ప్రాంతంలో ఒక ఆవు ప్రతి రోజూ వచ్చి, ఎవరి ప్రమేయమూ లేకుండా తనంత తానుగా ఒక చోట తన పొదుగునుండి పాలను ధారగా విడిచేది. అది గమనించిన స్థానికులు అక్కడ త్రవ్వకాలు జరపగా, సుమారు 30 అడుగుల లోతున‌ లోహంతో చేయబడిన ఒక పేటిక లభించింది. గాలి కూడా చొర‌బ‌డ‌లేనంత ప‌క‌డ్బందీగా మూయబడి ఉందది. ఆ పేటికపై "బర్బరీక" అని వ్రాయబడి ఉంది. దానిని తెరిచి చూడ‌గా, అందులో వారికి ఒక మానవ కపాలం క‌నిపించింది. అది మామూలు పుర్రెల మాదిరిగా ఎముకలతో కాక, ఒక రకమైన లోహంతో నిర్మితమైనట్లుగా అనిపించింది వారికి. ఆ పుర్రెలోని క‌ళ్ళు చెక్కు చెదరకుండా, మ‌నిషి క‌ళ్లలాగే ఉన్నాయి. దానిని చూసిన స్థానికులు బిత్తరపోయి, వెంటనే ఆ విషయాన్ని నాటి రాజు రూప్ సింగ్ చౌహన్ కు తెలియజేశారు. ఆసక్తి కలిగిన రాజు వివరాలు తెలుసుకోగోరాడు. దక్షిణాదినుంచి వచ్చిన ఒక పండితుడు, బ‌ర్బరీకుని చ‌రిత్రను రాజుకు వివ‌రించాడు.

బర్బరీకుడు ‌సాధారణ వ్యక్తి కాదు. ధర్మపరులూ, దైవాంశ సంభూతులూ అయిన పాండ‌వ వంశీయుడూ, సాక్ష్యాత్తూ భీముడి మ‌నుమడూ, స్వయానా ఘటోత్కచుడూ, మౌర్విలకు కలిగిన సంతాన‌మే బర్బరీకుడు. అమిత బలసంపన్నుడైన బర్బరీకుడు, పసివయస్సులోనే యుద్ధ విద్యలలో ఆరి తేరాడు. అతడి తల్లి మౌర్వే, బ‌ర్బరీకుడికి సకల విద్యలూ నేర్పింది. ఒకానొక సమయంలో విజయుడు దేవీ దీక్షను నిరాటంకంగా ముగించ‌డానికి బ‌ర్బరీకుడు స‌హాయం చేయ‌గా, అతడు చేసిన స‌హాయానికి కృతజ్ఞతగా యజ్ఞ భస్మాన్ని ఇచ్చి, దానిని శత్రువుల పై జల్లితే వారు భస్మమ‌వుతారని దీవించాడు విజయుడు. కానీ, ప్రతిఫలాపేక్షతో తాను ఆ పని చేయలేదని చెప్పి, బర్బరీకుడు ఆ భస్మాన్ని తిరస్కరించాడు. ఆ స‌మ‌యంలో ఆకాశవాణి, రాబోయే కాలంలో కౌరవులు, పాండవుల మధ్య జరగబోయే కురుక్షేత్ర సంగ్రామాన్ని గురించి చెప్పి, ఆ భస్మం కౌరవుల హస్తగతమయితే, ధర్మపరులైన పాండవ నాశ‌నానికి వినియోగిస్తారు గనుక, అది అతడి ద‌గ్గర ఉండ‌డ‌మే లోక శ్రేయ‌స్కరమని తెలిపింది. అలా సిద్ధి వలన భస్మాన్ని పొందాడు కాబట్టి, బర్బరీకుడిని 'సిద్ద సేనుడ'ని కూడా పిలిచేవారు. అలాగే ఒకానొక సందర్భంలో తెలియక భీముడితో యుద్ధం చేసి ఓడించి, సంహరింప జూసిన సమయంలో, పరమేశ్వరుడు ప్రత్యక్షమై బర్బరీకుడిని వారించి, వారి మధ్య ఉన్న రక్త సంబంధం గురించి తెలియజేశాడు. ప‌శ్చాత్తప్త హృద‌యంతో బర్బరీకుడు ప్రాణ‌త్యాగం చేయ‌బోగా, పరమేశ్వరుడు అడ్డుకుని స‌ర్ది చెప్పాడు. స్పృహలోకి వచ్చిన భీముడు, ప‌రాక్రమ‌వంతుడైన బర్బరీకుడు స్వయానా తన మనుమ‌డ‌ని తెలుసుకుని అక్కున చేర్చుకున్నాడు. ఆ తరువాత బర్బరీకుడు చేసిన ఘోర తప‌స్సుకు మెచ్చిన శివుడు, మూడు అమిత శక్తివంతమైన బాణాలను అతడికి ప్రసాదించాడు.

కురుక్షేత్ర సమరం ఆరంభమవుతున్న తరుణంలో, తాను ఎవరి ప్రక్కన నిల‌బ‌డాలని బర్బరీకుడు తల్లిని అడుగగా, బలహీనుల పక్షాన పోరాడమని చెప్పిందామె. తల్లి మాట మేర‌కు పాండవుల తరుపున యుద్ధం చేయడానికి సిద్ధ పడ్డాడు బ‌ర్బరీకుడు. ఒకనాడు పాండవుల మధ్య, కురుక్షేత్ర యుద్ధం ఎవరు ఎన్ని రోజులలో ముగించగలరనే చర్చ రాగా, భీముడు 20 రోజులూ, అర్జునుడు 28 రోజులూ, ఇలా ఒకొక్కరు ఒకొక్క స‌మాధానం చెప్పారు. బర్బరీకుడు మాత్రం, ఒక్క నిముషంలోనే యుద్ధం ముగిస్తానని చెప్పి అంద‌రినీ ఆశ్చర్యప‌రిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్న బ‌ర్బరీకుడి ద‌గ్గర‌కు, అతడిని పరీక్షించదలచిన శ్రీ కృష్ణుడు మారువేషంలో ఒక బ్రాహ్మణుడిలా వెళ్లాడు. అతడి దగ్గరున్న అస్త్రాలను గురించి అడుగగా, శివుడు తనకు ప్రసాదించిన మూడు బాణాలను చూపించాడు, బర్బరీకుడు. వాటిని చూసి మాయా శ్రీ కృష్ణుడు నవ్వి, మూడు బాణాలతో కురుక్షేత్ర యుద్ధాన్ని ఎలా ముగించగలవని అడిగాడు. ఒక బాణం శత్రువులను, రెండవది మిత్రులనూ గుర్తిస్తుంది. మూడవ‌ది, ఆ గుర్తించిన శత్రువులను హతమారుస్తుందని వివ‌రించాడు, బర్బరీకుడు. ఆ బాణాల గొప్పద‌నం తనకు చూపించమ‌న్నాడు, బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడు. బర్బరీకుడు త‌న అస్త్రాన్ని ఒక చెట్టు ఆకులకు సంధించ‌గా, అది ఆ చెట్టు ఆకులన్నింటినీ ఛిద్రం చేసి, శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరుగ‌డం మొద‌లుపెట్టింది. అప్పుడు బర్బరీకుడు, ‘మహానుభావా.. మీ కాలి క్రింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దానిని ఛేదించనిదే, నా బాణం వెనుకకు రాదు. దయచేసి మీ పాదాన్ని ప్రక్కకు జరపండ’ని కోరగా, శ్రీ కృష్ణుడు త‌న కాలిని తీసిన వెంట‌నే ఆ ఆకును ఛేదించి, తిరిగి బర్బరీకుని అమ్ముల పొదిలోకి చేరిందది.

‘నీ తల్లి నిన్ను బలహీన పక్షాన యుద్ధం చేయమని అన్నది కదా? నీవు ఎవరి ప‌క్షాన‌ పోరాడబోతున్నావ’ని, ఏమీ తెలియనివాడిలా బర్బరీకుని అడిగాడు మాయా కృష్ణుడు. త‌న త‌ల్లితో ర‌హ‌స్యంగా చ‌ర్చించిన విష‌యం కూడా తెలిసిన ఆ వ్యక్తి సామాన్యుడు కాద‌ని గ్రహించి, తన నిజ స్వరూపం చూపించమని కోరాడు, బర్బరీకుడు. సాక్ష్యాత్తు శ్రీ కృష్ణుడిని దర్శించిన బర్బరీకుడు అమితానంద భరితుడై, ‘మీ కోరిక ఎటువంటిదైనా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాన’ని వాగ్దానం చేశాడు. ‘నీవు ఏ పక్షాన చేరితే అది బలపడుతుంది. నీ తల్లి మాట ప్రకారం, మళ్ళీ నీవు బలహీన పక్షానికి మారాలి. అది లోక శ్రేయస్కరం కాదు. లోక క‌ల్యాణార్థం నీ శిర‌స్సును నాక‌ర్పించి, నువ్వు నాకిచ్చిన మాటను నిల‌బెట్టుకో’ అన్న శ్రీ కృష్ణుడి మాట‌ల‌కు సంతోషంగా అంగీక‌రించాడు బర్బరీకుడు. తనకు సంగ్రామంలో పాల్గొనే అవకాశం లేకపోయినా, చివరిదాకా చూసే అదృష్టాన్ని ప్రసాదించమని, త‌న తుది కోరిక‌గా ప్రార్థించి, తన శిరస్సును తానే ఖండించుకున్నాడు. శ్రీకృష్ణుడు బర్బరీకుడి తలను ఒక ఎత్తైన‌ పర్వత శిఖరంపై నిలబెట్టించి, మహా భారత సంగ్రామాన్ని ఆద్యంతం తిలకించే ఏర్పాటు చేయించాడు.

మహాభారత యుద్ధానంతరం, ఎవరు ఎంత మందిని చంపివుంటారన్న చర్చ మొదలై శ్రీకృష్ణుడిని అడుగగా, తాను కూడా యుద్ధంలో పాల్గోన‌డం వల్ల గమనించలేదనీ, ఆద్యంతం వీక్షించిన బర్బరీకుని శిరస్సునడగమనీ చెప్పాడు, శ్రీకృష్ణుడు. ‘వారిలో ఎవరూ ఎవరినీ చంపినట్లుగా తనకు కనిపించలేదనీ, అందరినీ శ్రీ కృష్ణుని చక్రాయుధమే సంహ‌రించిన‌ట్లు తనకు గోచరించింద’నీ చెప్పాడు బ‌ర్బరీకుడు. గీతలో గీతాచార్యుడు చెప్పిన‌ట్లుగా, ‘చంపేదీ, చంపించేదీ, సమస్తాన్నీ న‌డిపించేదీ ఆ ప‌ర‌మాత్ముడే’న‌ని అందరికీ తేటతెల్లమయ్యింది మరోసారి.

కురుక్షేత్ర సంగ్రామం తరువాత బర్బరీకుడి తలను పెట్టెలో భద్రపరచి రూపవతీ న‌దిలో విడిచారు. కాలగమనంలో నేడు లభించినదదేనని, దక్షిణాదినుంచి వచ్చిన పండితుడు రూప్ సింగ్ చౌహన్ మహారాజుకు వివ‌రించాడు. ఆ పెట్టె దొరికిన ‘ఖాటూశ్యాం’ అనే ఊరిలోనే బ‌ర్బరీకుని పుర్రెను ప్రతిష్ఠించి, మందిరాన్ని స్థాపించారు. ఆ గుడి ప్రాంగణంలోనే ‘రూప్ కుండ్’ అనే పేరుతో ఒక కోనేటిని నిర్మించారు. అందులో స్నానం చేస్తే శుభాలు కలుగుతాయని స్థానికుల నమ్మిక. ద్వాపరయుగంలో ప్రాణత్యాగం చేసిన బ‌ర్బరీకుడి తల ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండ‌డంతో, అందులోని శ‌క్తులు అలాగే ఉన్నాయ‌న్న నమ్మికతో, భక్తులు ఆయ‌న‌ను దైవాంశ సంభూతునిగా నేటికీ కొలుస్తున్నారు.

ఇక అంతటి మహావీరుడైన బర్బరీకుడు, శ్రీ కృష్ణుడి ఉపాయంతో అర్ధాంతరంగా ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితికి, అతడు ముందు జన్మలో చేసిన ఓ తప్పు కారణమనే విషయం, చాలా మందికి తెలియకపోవచ్చు. అతడి ముందు జన్మ గురించిన ప్రస్థావన, వ్యాస విరచిత జయకావ్యంలో ఎక్కడా లేక పోయినా, స్కాంద పురాణంలో పేర్కొన బడినట్లు పౌరాణికులు చెబుతున్నారు. దాని ప్రకారం, భూమిపై మానవుల మనుగడ సక్రమంగా సాగటానికి, రాక్షస సంహారం తప్పదని తెలిసన దేవతలు, యుగయుగాలుగా వారు తలపెట్టిన ధర్మ కార్యాలను నిర్విరామంగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా త్రేతాయుగం వచ్చేటప్పటకి, రాముడు రావణ సంహారం చేసే సమయంలో, నాడు భూమిపై ఉన్న ఎన్నో రాక్షస జాతులను సమూలంగా నాశనం చేశాడు. దానితో మానవ ప్రగతికి దారులు సుగమంకావటంతో పాటు, నాడు ఉన్న జ్ఞాన సంపదను అందిపుచ్చుకుని, రాజులు మరింత శక్తి వంతులయ్యారు. రామ రావణ యుద్ధంలో బ్రతికి బట్టగట్టిన అతి కొద్ది మంది రాక్షసులను కూడా రాజులు దాదాపుగా అంతం చేసేశారు. తమకిక అడ్డు అదుపు లేదని గ్రహించిన నాటి మానవులు, ముఖ్యంగా రాజులు, అధర్మం వైపుకు మొగ్గు చూపడం మొదలయ్యింది. ఇది గమనించిన దేవతలూ, గంధర్వులూ, యక్షులూ, భూమిపై నాడున్న పరిస్థితి అలాగే కొనసాగితే, సమస్త జీవకోటి అంతమయ్యే అవకాశం ఉందని చర్చించుకుని, ఆ విషయం బ్రహ్మ దేవుడికి నివేదించారు.

దేవతలు చెప్పిన మాటలు విని, తనకు భూమిపై జరుగుతున్న పరిణామాలు తెలుస్తున్నాయనీ, ఆ సమస్యకు పరిష్కారం కేవలం ఆ శ్రీ మహా విష్ణువే చూపిస్తాడానీ చతుర్ముఖుడన్నాడు. అనుకున్నదే తడవుగా దేవతలూ, గధర్వులూ, యక్షులతో సహా, బ్రహ్మ దేవుడు కూడా వైకుంఠానికి వెళ్ళి, విష్ణు మూర్తికి భూమిపై జరుగుతున్న పరిణామాలు తెలియజేసి, ఆ సమస్యకు పరిష్కారం చూపించమని వేడుకున్నారు. భూమండలంపై ప్రక్షాళన కార్యక్రమానికి తానే స్వయంగా మానవ జన్మ ఎత్తి, కరుక్షేత్ర సంగ్రామంతో అనుకున్న పనిని పూర్తి చేస్తానని తెలియజేశాడు, శ్రీ మహా విష్ణువు.

ఆ మాటలు విన్న వారందరూ హర్షించారు. కానీ, వారిలో ఒక యక్షుడు వెంటనే, ‘ఈ మాత్రం దానికి సాక్ష్యత్తు విష్ణు మూర్తే అవతారం ఎత్తడం అవసరమా? తుచ్ఛ మానవులను సంహరించడానికి తానొక్కడే సరిపోతాన’ని పొగరుగా అన్నాడు. అది విన్న బ్రహ్మ దేవుడికి కోపం వచ్చి, “భూమిపై ఉన్న దుష్టులనందరినీ సంహరించాలంటే, దేవతలకు పెద్ద పని కాకపోవచ్చు. కానీ, ధర్మ సంస్థాపన చేయడం, సాధారణ విషయం కాదు. యక్షుడవై ఉండి, అటువంటి ధర్మ సూక్ష్మాలు గ్రహించలేక, సాక్ష్యత్తు శ్రీ మహా విష్ణువు ముందు ఇలాంటి మాటలు మాట్లాడటం సముచితంకాదు. ఈ తప్పిదానికి నీవు మానవ జన్మ ఎత్తి, దుష్టులను సంహరించే అవకాశం వచ్చినప్పుడు, ముందుగా నీవే ప్రాణత్యాగం చేస్తావు” అని శపించాడు. ఆ విధంగా బ్రహ్మ దేవుడి శాపం పొంది, ఆ యక్షుడు బర్బరీకుడిగా జన్మించడం, సరిగ్గా కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కృష్ణుడికి ఎదురుపడి, రణరంగానికి బలిగా మారిన ఘటనలు, మనం ఇదివరకు చెప్పుకున్నవే.

ఇక మరోకోణంలో, బర్బరీకుడు భీముడి మనుమ‌డు కాద‌నే వాదనా లేకపోలేదు. అతడు భీముడి మనుమ‌డైతే, వ్యాస‌ భారతంలో ఆ వివ‌ర‌ణ‌ ఉండి ఉండేద‌‌ని వారి భావన. బర్బరీకుడు కేవలం మానవాతీత శక్తులు కలిగిన ఒక మహావీరుడు మాత్రమేన‌నీ, శ్రీ కృష్ణుడు పాండవులను కాపాడటానికే, అత‌డిని యుద్ధంలో పాల్గొనకుండా వారించి, అతడి తలను ఒక యంత్రంలా వాడి, కురుక్షేత్ర యుద్ధ ఘట్టాలను అతడి మెద‌డులో భద్రపరిచి ఉండవచ్చనీ వారి అభిప్రాయం. కురుక్షేత్రానికి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న సంజయుడు, ధృతరాష్ట్రుడూ, గాంధారిలకు యుద్ధ విశేషాలను ఎలా వివరించి ఉంటాడు? బహుశా బర్బరీకుడు తన అద్భుత శక్తులతో మహాభారత యుద్ధాన్ని వీక్షిస్తూ, వేరే ప్రదేశాలలో ఉన్న వ్యక్తులకు ప్రసరింపజేసే వాడేమో! ఏది ఏమయినప్పటికీ బ‌ర్బరీకుడి తలలో మహాభారత యుద్ధ ఘ‌ట్టాలన్నీ నిక్షిప్తమై ఉన్నట్లుగా భావించ‌వ‌చ్చు.

🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home