MIND-BLOWING Secrets of HELL (Narakam) Punishments Revealed నరకము - శిక్షలు!
నరకము - శిక్షలు!
ఇక్కడే మనం ఇన్ని బాధలు పడుతున్నప్పుడు మళ్ళీ నరకము, శిక్షలు అవసరమా?
దైవం కరుణాసముద్రుడు. సకల ప్రాణికోటికీ ఆయన సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాడు. తాననుకున్న పనులను చేసుకుంటూనే సచ్చిదానందాన్ని పొందవచ్చు. ఎవరు ఎన్ని తప్పులు చేసినా, ఆ పరమేశ్వరుడు కోపగించుకోడు, ద్వేషంతో దండించడు. కానీ, ఆయన రచించిన వ్యవస్థలో, జీవులు తమ తప్పులకు తగిన దండనను అనుభవించ వలసి రావటం అనేది, భవిష్యత్తులో మనం ఎక్కువ యోగ్యతను పొందటం కోసమే. స్వర్గ నరకాల వ్యవస్థ ఈ దృష్టికోణంతో రచింప బడినదే. మృత్యువు తరువాత వెంటనే మరో దేహం ధరించటం వీలుకాదు. నూతన దేహ ప్రాప్తికి ముందు జీవి, మనోమయ, ప్రాణమయ దేహం చేత, సుకృత, దుష్కృత, సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. గరుడ పురాణంలో, కఠోపనిషత్తు వంటి గ్రంధాలలో చెప్పబడిన వివరణతో, గతంలో మనం కొన్ని వీడియోలు చేసి ఉన్నాము. చూడని వారు అవి కూడా చూస్తే మరికొంత అవగాహన వస్తుంది. ఇక వాస్తవంగా స్వర్గ నరకాలేమిటి, అక్కడి శిక్షలు, భోగాల వంటి విషయాలు తెలుసుకోవడం కోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/v67DQWZTpik ]
భగవంతుడి సృష్టిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నరకం అనే వ్యవస్థ ఎలాంటిదంటే, మన న్యాయ స్థానాలలో ఎవరికైనా జైలు శిక్ష విధించడానికి, న్యాయమూర్తి మనస్సులో అతని మీద ఉన్న ద్వేషం కారణం కాదు. అతడు చేసిన తప్పులకు పర్యవసానంగా శిక్షను అనుభవించి, తద్వారా నేరస్థునిలో మార్పు వచ్చి, అతడు ఉత్తముడిగా మారాలనేదే, ఇక్కడ ప్రధాన ఉద్దేశం. మృత్యువు అనంతరం జీవునికి స్వర్గం గానీ, నరకం గానీ ప్రాప్తిస్తాయి. దీనిని అన్ని మతాలూ అంగీకరించాయి. మృత్యువు, పునర్జన్మ మధ్య గడిచే కాలంలో, తప్పని సరిగా జీవుడు స్వర్గ నరకాలను అనుభవించ వలసిందే. ఈ వ్యవస్థ వలన, గతంలో చేసిన తప్పులనూ, పాపాలనూ ప్రక్షాళన చేసుకుని, భావి జీవితం నిరపాయకరంగా గడపాలన్నదే, భగవంతుడి కోరిక.
మరణానంతరం జీవుడు మూడు సంవత్సరాల కాలం గానీ, అంతకు ఎక్కువ తక్కువలతో గానీ, ఊర్ధ్వలోకాలలో అంటే, పరలోకంలోనే నివాసం చేయాలని అదృశ్య చేతన భావిస్తుంది. అందులో మూడవ వంతు నిద్రలోనే గడిచి పోతుంది. అందువలన జీవుడికి తగినంత విశ్రాంతి లభిస్తుంది. ఆ తరువాత జీవుడు ఆరోగ్యవంతంగా నిద్ర లేస్తాడు. అప్పుడు గతాన్ని గురించి ఆలోచన ప్రారంభమవుతుంది. మరో మూడవ వంతు కాలం, ఈ సింహావలోకనంలో గడచిపోతుంది. పూర్వం అతడు చేసిన పాపకర్మాదులూ, పుణ్యకార్యాలూ, అతడి చేతనలో పొరలు పొరలుగా ఏర్పడి ఉంటాయి. ఉల్లి పొరలలాగా ఒక్కొక్కటి ఊడిపోయి, చివరకు కర్మ ఫలాన్ని అనుభవించడానికి తగిన బీజం మాత్రమే మిగులుతుంది. మానవుడు తప్పులు చేసి మరచి పోతాడు. కానీ, సాక్షీ భూతమైన అతని ఆత్మ మాత్రం, వాటిని విస్మరించదు. ఉదాహరణకు, మనం దొంగతనం చేసేటప్పుడు అది తప్పని అంతరాత్మ హెచ్చరిస్తూనే వుంటుంది. కానీ ఆ హెచ్చరికను మనం పెడచెవిన పెట్టి, దొంగతనం చేస్తాము. ఎవరూ ఆ దొంగతనాన్ని చూడక పోవచ్చు. అందువల్ల దండన లభించకపోవచ్చు. కానీ ఆ దొంగతనం యొక్క బీజం, సారవంతమైన భూమిలో గోధుమ గింజ నాటబడినట్లు, ఆత్మక్షేత్రంలో అలా నిలిచిపోయి, నిదానంగా పెరిగి పెద్దదవుతుంది.
మన పురాణాలలో నరకం, అనేక రకాలుగా వర్ణించబడింది. ఒక్కో మత గ్రంధం దానిని ఒక్కో విధంగా వర్ణించింది. అంధకూపం, కుంభీ పాకం, వైతరణీ నది, రౌరవము, అలాగే జహన్నుం, హెల్ అన్నీ సత్యమే. ఒక అభిప్రాయం ప్రకారం, ఎవరి నరకం వారిది. ఎన్ని ప్రాణులుంటే అన్ని నరకాలుంటాయి. ఎవరి దృష్టి కోణం వారిది కావటమే అందుకు కారణం. అది ఎలా అంటే, ఒకరికి అంగ వైకల్యం దుఃఖ కారణం కావచ్చు. ఆ అంగ వైకల్యమే ఒక బిచ్చగాడికి వరము. అది తొలగిపోతే అతనికి భిక్ష లభించక, దుఃఖ కారణమవుతుంది. నెరస్థులకు వేసే ఉరిశిక్ష అంటే కొందరు భయ భ్రాంతులకు లోనవుతారు, కొందరు ఆనందంగా పాటలు పొడుతూ ఉరిశిక్షను అనుభవిస్తారు. కుంభీపాక నరక వర్ణన ప్రకారం, అది ఒక నుయ్యి వంటిది. అందులో కత్తులు ఉండి, కదిలినప్పుడల్లా శరీరాన్ని ఛేదిస్తూ, భాధకు గురిజేస్తాయి. అదే నరకం, కొందరి మానసిక పరిస్థితి వల్ల వారికి బాధ కలిగితే, కొందరు కొంతసేపు బాధ పడి, తరువాత నవ్వుకోగలరు. ఎవరి మానసిక పరిస్థితి వారిది.
మన పురాణాలలో వర్ణింప బడిన దానిని బట్టి, యమ దూతలు యమ పాశంతో జీవుని బంధించి, నరకానికి ఈడ్చుకు వెళతారు. ఆ యమ దూతలు స్వతంత్ర ప్రాణులు కారు. కేవలం జీవుని మానస పుత్రులు. జీవుడు నరకంలో ఉన్నంత వరకే వారు ఉంటారు. తరువాత నశిస్తారు. ఒకరి కొరకు జన్మించిన యమ దూతలు, మరొకరికి దండన విధించలేరు. నిజానికి ఊర్ధ్వలోకంలో భౌతిక జీవనం సమాప్తమై, ఆధ్యాత్మిక జీవనం మొదలవుతుంది. వైజ్ఞానికుల ప్రకారం, బాహ్య మనస్సు అంతరించిపోయి, అంతర్మనస్సు జన్మిస్తుంది. న్యాయవాదుల వాక్చాతుర్యము, పండితుల సాహితీ చర్చలూ ఇక్కడ మచ్చుకకైనా కనిపించవు. జీవించి ఉన్నప్పుడు బాహ్య మస్తిష్కంలాగా, జీవుని పాప ఫలం కొమ్మలు రెమ్మలతో, ఫల పుష్పాలతో నిండుగా వుంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములూ, పది ఇంద్రియములతో కూడిన సూక్ష్మ శరీరము, జీవించి ఉన్నవుటి గుప్త మస్తిష్కంలాగా అచేతనంగా వుంటుంది.
ఇంద్రజాలం అంటే Hypnotism చేసేటప్పుడు, బాహ్య మస్తిష్కం నిద్రిస్తుంది. అంతర మస్తిష్కానికి నీటిలో ఈదమని ఆజ్ఞాపిస్తే, నీటిలో ఈదుతున్న భావన కలుగుతుంది. నరకం యొక్క అనుభవం కూడా ఇదే విధంగా వుంటుంది. నరకమూ, యమ దూతలూ, ప్రత్యేకంగా వుండవు. ఊర్ధ్వలోకంలో న్యాయ వాదులూ, న్యాయమూర్తులూ వుండరు. ప్రతి రోజూ కోట్ల ప్రాణులు మరణిస్తూ వుంటాయి. వాటన్నిటికీ దండన విధించడానికి, అంతకు రెట్టింపు యమ దూతలు కావాలి. లక్షల, కోట్ల జైళ్ళు, నరకాలు కావాలి. అందువల్ల వాస్తవానికి జరిగేది, ఎవరి నరకాన్ని వాళ్ళు సృష్టించుకోవటమే. ఆ నరకం వారితోనే నశించి పోతుంది.
అంతరాత్మలో పేరుకుని వున్న పాప సంస్కారాలు ప్రకాశ రూపంలో ప్రత్యక్షమైనప్పుడు, ఎంతో శక్తి వంతంగా వుండి, సూక్ష్మ శరీరాన్ని బలవత్తరంగా ఆకర్షిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే, సర్పం కళ్లతో తీక్షణంగా చూచి, పక్షులను బలవత్తరంగా ఆకర్షించినట్లే ఇది కూడా. అటువంటి సమయంలో, వేరే ఏదో స్వతంత్ర శక్తి, యమ దూతల రూపంలో ఈడ్చుకు పోతున్నట్లు భావన కలగ వచ్చు. ఈ యమ దూతల రంగు, రూపం, ఆకారం, ఎవరి భావనలను బట్టి, వారికి ప్రత్యేకంగా వుండవచ్చు. హిందువులకు తిలకం పెట్టుకుని, గదను ధరించిన యమదూతలు ప్రత్యక్షం కావచ్చు. ఇంకొకరికి గడ్డంతో, టర్కీ టోపీతో ప్రత్యక్షం కావచ్చు. ఆంగ్ల యమ దూతలు, టోపీ, నెక్ టై ధరించి కనిపించ వచ్చు. వారు మాట్లాడటం కూడా ఆ భాషలలోనే ఉండవచ్చు. ఎవరి విశ్వాసాలను బట్టి, వారికి అనుగుణంగా ఈ యమదూతలు కనిపిస్తారు.
ఒకరికి కనిపించే యమ దూతలు, పెద్ద కోరలు కలిగివుండవచ్చు. మరొకరికి మిడిగుడ్లతో కనిపించవచ్చు. ఈ యమ దూతలను, చూచేవారి సంస్కార తేజంగా భావించవచ్చు. సూక్ష్మ శరీరం, తన కోరికకు విరుద్ధంగా దండనలు విధించ వచ్చు. అంతిమంగా దుష్కర్మల ఫలితం దుఃఖమే. సూక్ష్మ శరీరం, వేదనలు, బాధలు, కష్టాలు అనుభవించడానికి, అంతరాత్మ ఒక స్వతంత్ర నరకాన్ని నిర్మిస్తుంది. ఇందులో ఇనుప ముక్కుల కాకులు, గ్రద్దలు, దాటనలవి కాని వై తరణీ నది, చమురు బాండీలలో భారీగా వేయించడానికి ఏర్పాట్లు, ఇవన్నీ వుంటాయి. లేదా కేవలం అవమానాలు, అపహస్యాలు, తిట్లు పొందటంతో సరిపోవచ్చు. ఎవరి మానసిక పరిస్థితిని బట్టి, వారి అనుభవం ఉంటుంది. ఈ నియంత్రణ అంతా జీవుడు దుఃఖాన్ని అనుభవించటానికి మాత్రమే. తాము చేసిన పాపాలకి తగిన ఫలితం అనుభవించాలని, జీవుడు గ్రహంచాలి. తనను తాను సంస్కరించుకునేటంత వరకూ, జీవునికి ఈ నరక లోకానుభవం ఉంటుంది. ఉదాహరణకు, న్యాయమూర్తి చిన్నచిన్న అపరాధాలకు స్వల్ప దండన విధిస్తే, పెద్ద నేరాలకు దండన పెద్దదిగా వుంటుంది. దానికి కారణం, చిల్లర నేరాలు చేసే వారి మనో భూమి, శీఘ్రంగా పరిష్కరింప బడుతుంది. కానీ, హత్యలూ మొదలైన పెద్ద అపరాధాలు చేసే వారి మనో భూమి కఠోరంగా వుండి, సంస్కరింప బడటానికి చాలా కాలం పట్టవచ్చు. నరక దండనలు కూడా ఇదే విధంగా వుంటాయి. దుష్కర్మల ప్రభావం పొరలు పొరలుగా ఊడి నశించి పోతుంది. సూక్ష్మ శరీరానికి ఇంద్రియాలు, మనస్సు కూడా వుంటాయి.
ఇక శారీరక పాపాలకు శారీరక దండన, మానసిక పాపాలకు మానసిక దండన, విధింప బడుతుంది. చేసిన పాపాలకు తగిన శిక్షను ఆ జీవి అంతరాత్మయే విధిస్తుంది. ఇందులో మరొకరి ప్రమేయము ఉండదు. కొంత వరకు పాపానికి తగిన శిక్ష జీవిత కాలంలోనే అనుభవించ వలసి రావచ్చు. మిగిలిన దానికి ఫలితాన్ని పరలోకంలో అనుభవించవలసి ఉంటుంది. పరమాత్మ ఏర్పాటు చేసిన వ్యవస్థననుసరించి, తిరిగి జన్మ ఎత్తే ముందే పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం విధింప బడి, ప్రక్షాళనం చేయ బడుతుంది. తిరిగి జన్మించినపుడు, వాటి ప్రభావం చూపే అవసరం రాకుండా ఉండటానికే ఈ వ్యవస్థ. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్పితే, పాప ఫలమంతా ఊర్ధ్వలోకంలోనే అనుభవంలోకి వస్తుంది. నరక లోకానుభవం, పాప ఫలాన్ని అనుభవించి నశింపజేసుకోవటం మాత్రమే గాక, పాత అలవాట్లనూ, దుష్ప్రవృత్తులనూ మాని, మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి కూడా ఉద్దేశింపబడింది. దొంగతనం చేసేటప్పుడు దొంగ గొంతు పొడారిపోతుంది. దుర్మార్గం చేసేటప్పుడు, కాళ్ళు వణుకుతాయి. అదంతా గతంలో పాపాలకు పొందిన ప్రాయశ్చిత్తం యొక్క స్మరణ వల్లే జరుగుతుంది. కానీ, దురదృష్ట వశాత్తూ, అంతరాత్మ ప్రబోధాన్ని పెడ చెవిన బెట్టి, మనిషి పాప కర్మలకు ఉద్యుక్తుడవుతూనే వున్నాడు.
అందుకే మనిషి ధ్యానం, లేక Meditation ని తప్పనిసరిగా అలవరుచుకుని, మనస్సును స్వీయ నియంత్రణ చేసుకోవాలి. సత్యం లేదా వ్యక్తిగత ఆధీనం నుంచి ఎలాంటి ఆలోచనలూ మనలను పక్కద్రోవ పట్టించకుండా, ఇబ్బంది పెట్టే సమస్యల నుంచి మనస్సును ప్రశాంత పరిచే విధమైన స్థితిని అలవరుచుకుని, ఇప్పటివరకు మనం చెప్పుకున్న నరకము, శిక్షలు, తప్పించుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు. ఇక స్వర్గ లోకం, దాని వివరణా, మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము..
ధర్మో రక్షతి రక్షితః!
Comments
Post a Comment