జంతుబలి! Pashu Bali - Animal Sacrifice: Ritual Mystification and Mythical Demystification in Hinduism
జంతుబలి!
Animal Cruelty vs Religious Sacrifice - Is Animal Sacrifice an Ethical Act?
ఆది నుంచీ మానవుడు అవలంభిస్తున్న ఓ పద్ధతి ‘శక్తి ఆరాధన’. నేల, నీరు, నింగి, నిప్పు, వాయువు అనబడే పంచ భూతాలతో పాటు, సృష్టికి వెలుగునిచ్చే సూర్య చంద్రుల వంటి వాటిని కూడా అపూర్వ దైవ శక్తులుగా భావించి, అనాదిగా భూమిపై మనుగడ సాగించిన మానవులందరూ కొలిచే వారని చరిత్ర చెబుతోంది. కోరకుండానే మంచి చేసే ఆ దేవతలను సంతృప్తి పరిచేలా పూజలు చేసి వరాలడిగితే వాటిని వెంటనే తీరుస్తారనే నమ్మకం, రాను రాను మనుష్యులలో బలంగా నాటుకు పోయింది. ఈ క్రతువులోనే జంతు బలుల ప్రక్రియ పుట్టుకొచ్చినట్లు చరిత్రకారుల వాదన. ఈ మాట వినగానే మనకి గ్రామదేవతల ముందిచ్చే జంతుబలులు గుర్తుకు వస్తాయి. నేడు చాలా మంది జంతుబలి ఇవ్వకూడదనీ, అది అనాగరిక చర్య అనీ వాదించడం కూడా మనం వింటూ ఉంటాము. మరి అసలు జంతుబలి ఇవ్వవచ్చా? మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? అసలు గ్రామ దేవతలకే ఎక్కువగా జంతుబలులు ఎందుకు ఇస్తూ ఉంటారు? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PzFTGZ3NNw0 ]
బలి అనగా దైవప్రీతి కోసం ఏదో ఒక జీవాన్ని చంపే ఒక క్రతువుగా మనకు తెలిసినదే. హిందూ మతంలో జంతు బలి ఆచారం, ఎక్కువగా వేద శ్రౌత ఆచారాలు, స్థానిక గిరిజన సంప్రదాయాలలో బలంగా పాతుకుపోయిన హిందూ జానపద ఆచారాలతో ముడిపడి ఉంది. అయినప్పటికీ జంతు బలులు భారత దేశంలోని పురాతన వైదిక మతంలో భాగంగా ఉన్నాయి. జంతుబలులనగానే, మన దేశంలోని గ్రామ దేవతలకు ఇచ్చే బలులు ముందుగా మనకు గుర్తుకు వస్తాయి. గురివింద గింజ తన క్రింద నలుపెరుగదన్నట్లు, ముక్క లేనిదే రోజూ ముద్ద దిగని పాశ్చాత్యులూ, Science పేరుతో వారు చెప్పే మాటలను గొర్రెలలా నమ్మి, నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడే మన కుహనా మేధావులూ, మన దేశంలో ఏ నాటినుంచో వస్తున్న సంప్రదాయాలను తప్పుగా చూపించడం ఫ్యాషన్ గా మారిపోయింది. అటువంటి వారి కోసమే కాకుండా, మన మందరమూ జంతుబలుల వెనుక ఉన్న అనేక వాస్తవాలను తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. జంతుబలులనేవి, కేవలం హిందూ ధర్మం పాటించే వారే కాకుండా, ప్రపంచంలో ఉండే ఎన్నో ఇతర మతాల వారు కూడా నేటికీ పాటిస్తూనే ఉన్నారు. అలా అని, తక్కిన మతాల వారు జీవ హింస చేయటంలేదా? అంటే, దానికి సమాధానం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.
ఇక మన దేశంలో కనపడే జంతు బలుల వెనుక చాలా పెద్ద కథే ఉంది. సంస్కృత భాషలో ‘బలి’ అంటే ఇవ్వటం అనే అర్ధం ఉంది. దేవతలకూ భూతగణాలకూ సమర్పించే ప్రసాదాన్ని కూడా ‘బలి’ అంటారు. దక్షిణ భారత దేశంలో కాస్త పెద్దగా ఉన్న ఏ ఆలయానికి వెళ్లినా, ఆ ఆలయం చుట్టూ చిన్న చిన్న రాళ్లను ఏర్పాటు చేసి, వాటిపై పెసరపప్పు, లేదా మినప్పప్పుతో వండిన అన్నాన్నిగానీ, లేదా పెరుగన్నాన్నిగానీ, సృష్టిలో ఉండే వివిధ గణాలను సంతృప్తి పరచడానికి, బలి అన్నంగా పెట్టడం ఆనవాయితీ. సాధారణంగా, మన కడుపులు నింపుకోవడం మనకి ఎంత ముఖ్యమో, ఈ సృష్టిలో జీవించే అన్ని జీవరాసుల కడుపులు నింపడం కూడా అంతే ముఖ్యమని, మన హైందవ ధర్మం చెబుతుంది. ఆ విధంగా దేవుడి పేరుచెప్పి, భూమిపై తిరిగే అనేక జీవరాశులకు ఈ బలి అన్నం ఆహారంగా పెట్టాలని, మన పెద్దల ఉద్దేశ్యం. ఇలా బలి అనే పద్ధతికి శ్రీకారం చుట్టారు మన పూర్వీకులు.
ఇక జంతుబలులు ఎందుకు ఇస్తారనే సందేహానికి కూడా మన వేదాలలో జవాబు ఉంది. సాధారణంగా మనకి ఎవరైనా ఏదైనా ఇస్తే, అందుకు కృతజ్ఞతగా వారికి తిరిగి ఏదైనా ఇవ్వడం మానవ సహజం. అలాగే, ఈ సృష్టిని ప్రారంభించి, అందులో మనలాంటి జీవరాశి మనుగడకు అవసరమయ్యే అన్ని వనరులనూ సమకూర్చిన ఆ దైవానికి కృతజ్ఞతగా మానవుడు, భక్తి పూర్వకంగా ప్రసాదం చేసి నివేదించడం, ముఖ్యంగా మన హైందవ ధర్మాన్ని పాటించే వారికి ఒక ఆచారంగా వస్తోంది. ఈ క్రమంలో ఆ దేవుడిని ఆర్ధికంగా బలపరచమనీ, మంచి నడవడికనూ, బుద్ధినీ ప్రసాదించమని కోరుకుంటూ ఉంటాము. ఈ సృష్టిలో ఒక్కో ప్రాణికి ఒక్కో గుణం ఉంటుంది. ఉదాహరణకు, కోడికి ఎక్కువగా భయపడే గుణం ఉంటుంది. గొర్రెలకు గుడ్డిగా ఎదుటి వాటిని నమ్మే గుణం ఉంటుంది. మేకలకు మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుందని విజ్ఞులు చెబుతారు. వాటన్నిటినీ దుర్గుణాలుగా ఎంచి, అటువంటి దుర్గుణాలు మానవుడి ఎదుగుదలకు అవరోధాలవుతాయని భావించి, వాటిని దేవుడికి బలిగా ఇస్తే, ఆయన మనకు మంచి గుణాలు ప్రసాదిస్తాడని వేదాలు చెబుతున్నాయి. అందువల్ల, మానవులలో ఉండే ఒక్కో అవలక్షణాన్నీ పోగొట్టుకోవడానికి, ఒక్కో విధమైన నియమ నిష్ఠలతో కొన్నేళ్ల పాటుండి, కొన్ని ద్రవ్యాలను భగవంతుడికి అర్పిస్తే, ఆయా లక్షణాలు పోయి మంచి గుణాలు అబ్బుతాయని, వేదాలలో స్పష్టీకరింపబడింది. ఆ విధంగా మొదలైన ఆచారాలూ, పద్దతులలో షార్ట్ కట్ ని పాటిస్తూ ముందుకు తెచ్చిన మరో పద్ధతే, ఈ జంతుబలులని పండితులంటున్నారు. కాల గమనంలో ఎన్నో పద్ధతులు పక్క దారులు పట్టినట్లు, ‘మనలోని జంతు ప్రవృత్తిని బలి ఇవ్వమని చెబితే, మనవారు ఆ జంతువులను బలి ఇవ్వడం మొదలు పెట్టినట్లు, పండితుల వాదన.
ఈ జంతు బలులు మొదలవ్వడానికి మరో కారణం కూడా ఉందని మన పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రామాలకు రక్షణగా నిలిచే గ్రామ దేవతల ఎదుట, జంతు బలులను సమర్పించడం చూస్తూ ఉంటాము. దానికి సంబంధించి వేదాలలో చెప్పబడిన విషయంతో పాటు, సగటు మానవుడి ఆలోచనా ధోరణి కూడా తోడవుతుంది. మన పురాణాల ప్రకారం, శక్తి స్వరూపంగా కొలిచే ఆ జగదాంబ యొక్క కళాంశలలో కొన్ని అంశలు, గ్రామ, కుల, ఇంటి దేవతలుగా మారి, ఆయా ప్రజలను రక్షిస్తూ ఉంటాయి. అందువల్ల మనకి మేలు చేసే అమ్మవార్లను తగిన విధంగా పూజించి, నైవేద్యాలు సమర్పించడం మన సంప్రదాయంలో ఒక భాగం. అయితే, పెద్ద పెద్ద ఆలయాలలో ఉండే అమ్మవార్లను పూజించేటప్పుడు, వేదాల ప్రకారం పూజలూ, నైవేద్యాలు సమర్పించడం పూర్వం నుంచీ వస్తోంది. బలుల గురించి యజుర్వేదం వంటి గ్రంథాలలో ప్రస్థావనలున్నాయి. ఇరవై ఒక్క వైదిక శ్రౌత యజ్ఞాలలో ఏడింటికి, జంతు బలి అవసరం. సోమ యాగంలో మేకను, అశ్వమేథ యాగంలో గుర్రాన్ని బలి యిస్తారు. అయితే, బలి ఇచ్చే వ్యక్తికి అతని వంశం, కులాన్ని బట్టి మాంసాన్ని తినడం, తినకపోవడం అనేది వర్తిస్తుంది. ఇల్వలుడు, వాతాపి ఉదంతం తర్వాత అగస్త్య మహర్షి శాపం కారణంగా, చాలా బ్రాహ్మణ కులాలు మాంసాహారాన్ని అర్పిస్తారు కానీ తినరు. దేవీ భాగవత పురాణం, కాళికా పురాణం వంటి పద్దెనిమిది ప్రధాన పురాణాలూ, వాటి ఉపపురాణాలూ, జంతు బలిని సూచిస్తున్నాయి. ఆది శంకరాచార్యుల సనాతన స్మార్త అద్వైత వేదాంత సంప్రదాయం, బ్రహ్మ సూత్రాలను అనుసరిస్తుంది. ఆ గ్రంధాల ప్రకారం జంతు బలి, బాధితుడి ఆత్మ విముక్తికి మార్గంగా పరిగణించ బడుతుంది.
పూర్వం చాలా గ్రామాలలో ఉండే గ్రామ దేవతలను పూజించడానికి, వేదాలు చదివిన పండితులు అందుబాటులో లేక పోవడంతో, ఆ చుట్టప్రక్కల నివసించే వారే తమకు తోచిన విధంగా ఆయా దేవతలను పూజించే వారు. వారిలో కొంతమంది పూర్తి శాకాహారులయితే, మరికొందరు మాంసాహారులవ్వడంతో, వారు ఎలాంటి ఆహారాన్నయితే తింటారో, అటువంటి వాటినే గ్రామ దేవతలకు నైవేద్యంగా సమర్పించేవారు. అలా మొదలైన పద్ధతులే, నేటికీ గ్రామ దేవతల సమక్షంలో ఓ ఆచారంగా జరుగుతూ ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
లక్షల సంవత్సరాల చరిత్రగలిగిన మన సనాతన ధర్మాన్ని అణగద్రొక్కాలనే దూరాలోచనతో, హిందువులను వారి మతాలవైపుకు తిప్పుకోవాలనే కుతంత్రంతో సాగే పాశ్చాత్యులు, మన సంప్రదాయాలనూ, ఆచారాలనూ తప్పు పట్టడం మొదలు పెట్టారు. వారానికోసారి వీకెండ్ పేరుతో తాగి తందానాలాడటమే కాకుండా, కొన్ని వేల జీవాల ప్రాణాలు తీసి పార్టీలు చేసుకోవడం వారికి తప్పుగా కనపడదు కానీ, నమ్మినవారిని చల్లగా చూడటమే కాకుండా, ఆయా గ్రామాలలోని ప్రజలు ధర్మం తప్పకుండా కాచే శక్తి స్వరూపాలకు భక్తితో ఇచ్చే బలులు తప్పుగా కనపడటం, నిజంగా శోచనీయం.
ధర్మో రక్షతి రక్షితః!
Comments
Post a Comment