STOP Ignoring the Power of Time and Karma - Scientific Proof You Won't Believe | కాలం! కర్మం! సైన్స్ పరంగా


సైన్స్ పరంగా - కాలం! కర్మం! MPL
40 లక్షల సంవత్సరాల తరువాత భూమికి తిరిగి వచ్చిన అతడికి ఏం తెలిసింది?

‘కాలం’, ‘కర్మం’ కలిసి రావడమో, లేక అడ్డుపడడమో అనే పద ప్రయోగం మనం నిత్యం వింటూ ఉంటాము. ఈ సువిశాల విశ్వంలో ఎంతో విలువైనదీ, అద్భుతమైనదీ, అంతుచిక్కని ఎన్నో రహస్యాల గనీ ‘కాలం’. కాలం యొక్క తీరుతెన్నులు తెలుసుకోవడానికి ప్రయత్నించే ఏ మనిషికైనా, ఆ కాలం చేసే మాయను చూసి నోట మాటరాదు. ఇక కర్మ గురించి చెప్పనవసరమే లేదు. ఆ కారణంగానే, ఆది కాలం నుంచీ మానవుడు, కాలం గురించీ, కర్మల గురించీ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నా, నేటికీ వాటి గురించి తెలిసింది కేవలం గడ్డిపోచ మొన భాగమంత కూడా లేదు. ఆధునిక మానవుడి మనుగడలో ఎంతో వ్యత్యాసం రావడంతో పాటు, నేటి పరిజ్ఞానం కూడా మానవ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఈ పరిజ్ఞానం సహాయంతోనే, కొన్ని దశాబ్దాల క్రితం, Albert Einstein అనే శాస్త్రవేత్త, The Theory of Relativity అనే సిద్ధాంతాన్ని మన ముందుంచారు. ఆ సిద్ధాంతం ప్రకారం, కాలం నడిచే తీరుతెన్నుల గురించి, వెయ్యిలో ఒకటో వంతు మానవుడికి తెలుసుకునే అవకాశం దక్కింది. ఈనాడు Einstein చెప్పిన ఆ సాపేక్ష సిద్ధాంతం, కొన్ని యుగాల పూర్వమే మన మహాపురుషులు కనిపెట్టి, దానితో ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. కేవలం మన పురాణాలలో రాయడమే కాకుండా, హిందువులు ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక పండగకీ, Einstein చెప్పిన సాపేక్ష సిద్ధాంతానికి కూడా సంబంధం ఉంది! అలాగే, Newton అనే శాస్త్రవేత్త 3వ సూత్రానికీ, కర్మ సిద్ధాంతానికీ సంబంధం ఉంది! మరి ఆ విషయాలు తెలుసుకోవడం కోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Nb12ylQ-zd0 ]


ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలలో ముందుగా, “ప్రతి చర్యా దానికి వ్యతిరేకమైన సమాన ప్రతిచర్యను కలిగి ఉంటుంది” - న్యూటన్‌ అనే శాస్త్రజ్ఞుని 3వ సూత్రం ఇది. కర్మ సిద్ధాంతం కూడా ఒక విధంగా ఇదే భావనను వ్యక్తం చేస్తుంది. ప్రతి కర్మా, దానికి తగ్గ సమాన ఫలితాన్ని తిరిగి ఇచ్చి తీరుతుంది. పాపకర్మ పాప ఫలాన్నీ, పుణ్యకర్మ పుణ్య ఫలాన్నీ ఇస్తుంది. దానిని ప్రతి జీవీ అనుభవించక తప్పదు. కర్మ ఫలం ఎప్పుడూ ఆ కర్మకు తగిన రీతిలో సమానంగానే ఉంటుంది. అందులో ఏ మాత్రం హెచ్చు తగ్గులుండవు. మనం అనుభవిస్తున్న సుఖానికీ, దుఃఖానికి కూడా ఒక విధంగా కారకులం మనమే. వివిధ జన్మలలో మనం చేసుకున్న కర్మలు వాటికి సరిపోయే సమాన ఫలితాలను ఆ తరువాతి జన్మలలో మనకు అందిస్తాయి. అంటే, ప్రతి కర్మా, దానికి తిరిగి ఎదురొచ్చే సమాన కర్మ ఫలితాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఇందులో న్యూటన్‌ 3వ సూత్రం, అచ్చంగా ప్రతిధ్వనిస్తుంది.

ఎవరి కర్మ ఫలం, వారికే చెంది తీరుతుందని కృష్ణ పరమాత్ముడు స్పష్టంగా వివరించాడు. అంటే, పుణ్య కర్మకు సౌఖ్యాన్నీ, పాప కర్మకు శిక్షనూ, ఎవరిది వారే అనుభవించి తీరాలని అర్ధం. అప్పుడే పాపభీతీ, దైవభక్తీ నిలుస్తాయి. విచ్చలవిడితనానికి అడ్డుకట్ట పడుతుంది. ఒకరి పాప భారాన్ని మరొకరు మోస్తారని భావించడం, వట్టి భ్రమ. గాయం చేసుకున్న వారికే రక్త స్రావం జరుగుతుంది గానీ, వారి ఆత్మీయులకు కాదు కదా! 'చేసుకున్న వారికి చేసుకున్నంత! ఎవరి కర్మ వారిదే! అనే విషయం సత్యం.. కర్మ సిద్ధాంతం గురించి, గరుడపురాణం, కఠోపనిషత్తు, భాగవత, రామాయణ, మహాభారతాలలోని ప్రస్థావనలతో, గతంలో మనం చాలా వీడియోలు చేసి ఉన్నాము. చూడని వారు తప్పక చూడండి..

ఇక Einstein చెప్పిన The Theory of Relativity కీ, మన పురాణాలూ, వేదాలలో చెప్పబడిన అంశాలకూ గల సంబంధం ఏంటో తెలియాలంటే, ముందు అసలు ఈ సాపేక్ష సిద్ధాంతం అంటే ఏంటో తెలియాలి. నేటి ఆధునిక యుగంలో గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరైన Einstein, కాలం యొక్క పోకడపై ఎన్నో ఏళ్లపాటు శ్రమించి, The Theory Of Relativity ని చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం, కాలం తీరు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంటుంది. అంటే, ఒక పది సంవత్సరాల వయస్సున్న పిల్లవాడిని, కాంతి వేగంతో ప్రయాణించే వాహనంలో కూర్చో పెట్టి, భూమికి ఇరవై ఐదు లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న Andromeda Galaxy కి పంపితే, తిరిగి వచ్చే సరికి అతడి వయస్సు, 56 సంవత్సరాలు పెరుగుతుంది. కానీ, అతడు భూమికి తిరిగి వచ్చేసరికి, దాదాపు, నలభై లక్షల సంవత్సరాల పైనే గడిచిపోయి ఉంటుంది. బాగా వేగంగా ప్రయాణించడం వల్ల, ఆ వాహనంలో ఉండే వ్యక్తి కాలం, బయటి వ్యక్తుల కంటే మెల్లగా కదులుతుంది. ఆ వాహనంలో ప్రయాణించే వ్యక్తికి ఆ విషయం తెలియదు. అందుకు కారణం, అతడు కూడా కాలంతో ప్రయాణించడమే. ఇక కాంతి వేగం అంటే, దాదాపు ఒక సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లని, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విధంగా కాంతి వేగంతో ప్రయాణించే వాహనంలో ఉండే వ్యక్తుల కాలం, భూమిపై జరిగే కాలం కంటే చాలా నెమ్మదిగా ఉంటుంది. అందులో ఉన్న వారికి ఆ వ్యత్యాసం తెలియదని పరిశోధకులు చెబుతున్నారు.

అదే విధంగా, మన galaxy ని దాటి ఇతర galaxy లలో ఉండే గ్రహాలకు చేరుకున్నప్పుడు, అక్కడ ఉండే gravity, మరియూ, ఆ గ్రహం రొటేటింగ్ టైం ఆధారంగా కూడా, ఆ గ్రహంపై జరిగే కాలానికీ, భూ గ్రహంపై జరిగే కాలానికీ చాలా వ్యత్యాసాలు ఉంటాయని, Einstein బలపరిచిన సాపేక్ష సిద్ధాంతం ద్వారా తెలుస్తోంది. ఈ theory ల ఆధారంగానే, మొన్నామధ్య Hollywood లో, ప్రముఖ దర్శకుడైన Christopher Nolan, ‘Interstellar’ అనే సినిమా తీశారు. ఆ సినిమాలో భూమిపై మానవ జాతి మనుగడ సంకటంలో పడే సమయానికి, కథానాయకుడు అతని బృందంతో కలిసి, మానవ మనుగడకు అనుకూలమైన గ్రహాలను వెతికే పనిలో, వేరే galaxy లో ఉన్న ఒక గ్రహానికి వెళతాడు. అలా వెళ్లిన హీరో బృందానికి, ఆ గ్రహంపై ఒక గంటసేపు గడిపితే, భూ గ్రహంపై ఏడు సంవత్సరాలు గడిచిపోతాయనే విషయం తెలుస్తుంది. ఆ విధంగా, హీరో తన Mission ని కొన్ని రోజుల్లోనే పూర్తి చేసుకుని, పలు నాటకీయ పరిణామాల మధ్య భూమికి చేరుకునేటప్పటికి, అతని వయస్సు 124 సంవత్సరాలు. అయినా తను నలభైలలో ఉన్న మనిషిలానే ఉంటాడు. తనకు ఎంతో ఇష్టమైన కూతురు మాత్రం బాగా ముసలిదయిపోయి, హాస్పిటల్ లో చావు బ్రతుకులమధ్య ఉందని తెలుసుకుంటాడు. ఈ సినిమా చూసిన వారికి, టైం చేసే మాయ ఏంటో అర్ధమవుతుంది.

కొన్ని దశాబ్దాల క్రితం Einstein బలపరిచిన సిద్ధాంతం ప్రకారం ఈ సినిమా రాగా, కొన్ని యుగాలకు పూర్వమే మన దేశంలో ఇలాంటి గాథలు జరిగినట్లు మన పురాణాలలో చెప్పబడి ఉంది. అందుకు ఒక ఉదాహరణ.. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రైవంతకుడనే యాదవ రాజుకు, రేవతి అనే కూతురుండేది. ఆమె దాదాపు ఎనిమిదిన్నర అడుగుల ఎత్తుకు పెరిగిపోవడంతో, రేవతికి వరుడు దొరకలేదు. కొన్నేళ్ల పాటు ఆమె పెళ్లి సంబంధాల గురించి వెతికి వేసారిన రైవంతకుడు, అంత పొడవైన కూతురునిచ్చిన బ్రహ్మదేవుడినే, ఆ సమస్యకు పరిష్కారం అడగాలని నిశ్చయించుకున్నాడు. రైవంతక మహారాజు మహా తపోశక్తి సంపన్నుడు. ఇక్కడ తపోశక్తి అంటే, శాస్త్ర పరిజ్ఞానం బాగా తెలిసినవాడని అర్ధం చేసుకోవాలి. ఆయనకున్న శక్తితో, అంతరీక్షయానానికి అవసరమయ్యే వాహనాన్ని సిద్ధం చేసుకుని, కూతురు రేవతితో సహా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అతను అక్కడికి చేరే సరికి, బ్రహ్మా సరస్వతీ దేవిల ముందు గంధర్వులు నాట్యం చేయడం చూసి, కొంత సమయం వేచివున్నాడు. ఆ తంతు పూర్తయ్యాక, తన కూతురితో సహా బ్రహ్మ దేవుడి ముందుకు వెళ్లి, తన సమస్యను చెప్పుకున్నాడు. దానికి బ్రహ్మదేవుడు, అతను తన కూతురిని తనతో పాటు తీసుకువచ్చి మంచి పని చేశాడని అన్నాడు. ఎందుకంటే, అతనక్కడికి వచ్చాక, అక్కడ జరుగుతున్న గంధర్వ నాట్యం ముగిసే లోపు, భూమిపై నలభై లక్షల సంవత్సరాలు గడిచిపోయాయని చెప్పాడు. అందుకు కారణం, బ్రహ్మలోకానికీ, భూలోకానికీ జరిగే కాలంలో వ్యత్యాసాలు ఉన్నాయని తెలియజేశాడు. ఒకవేళ అతని కూతురు అక్కడే ఉండి ఉంటే, ఆ పాటికి ఎప్పుడో చనిపోయి ఉండేదనీ, రేవతి కూడా అక్కడికి రావడం వలన, ఆమె వయస్సులో ఎటువంటి మార్పూ రాలేదనీ చెప్పాడు. అతడిని బయలుదేరి భూలోకానికి వెళ్ళమని ఆదేశించాడు. ఆ సమయంలో భూమిపై బలరాముడనే యాదవ రాజు ఉన్నాడని చెప్పి, ఆయన ఎత్తు దాదాపు పదడుగులు ఉంటుంది కాబట్టి, రేవతికి తగిన వరుడతడేనని రైవంతకుడికి చెప్పాడు బ్రహ్మదేవుడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన మహారాజు, క్షణం ఆలస్యం చేయకుండా, రేవతితో కలిసి భూమిపైకి వచ్చేశాడు. అలా వచ్చిన రైవంతకుడికి, భూమిపై పరిస్థితులన్నీ మారిపోయాయని తెలిసివచ్చింది. తన వారెవరూ లేరనే విషయం తెలిసి, ఆశ్చర్యపోయాడు. బ్రహ్మ దేవుడు చెప్పినట్లు, బలరాముడి వద్దకు వెళ్లి జరిగినది చెప్పి, తన కూతురినిచ్చి వివాహం జరిపినట్లు, భాగవతంలో ప్రస్థావన వుంది.

అంతేకాదు, ప్రతి సంవత్సరం, విష్ణు మూర్తి నిద్ర నుంచి లేచే రోజును, వైకుంఠ ఏకాదశి పేరుతో పండుగగా జరుపుకునే ఆచారం మన హైందవ ధర్మంలో ఉంది. ఇలా ప్రతి సంవత్సరం, శ్రీ మహా విష్ణువు లేచి ఉన్న కాలాన్ని ఉత్తరాయణం అని అంటాము. అది ఆరు నెలల పాటు ఉంటుంది. ఆ తర్వాత దక్షిణాయన కాలం వస్తుంది. అదొక ఆరు నెలలపాటు ఉంటుంది. ఆ కాలంలో విష్ణుమూర్తి పడుకుని ఉంటాడని మన వేదాలలో ప్రస్థావించబడివుంది. ఇక్కడ ఉత్తరాయణం, దక్షిణాయన కాలాలు, వైకుంఠంలో ఒక రాత్రి, ఒక పగలుగా చెబుతారు. అంటే, ఆ లక్ష్మీనాథుడికి ఒక రోజు, మనకి ఒక సంవత్సరంగా లెక్కించబడుతుంది. ఈ విధంగా కూడా ఆ స్వామి వారు ఉండే గ్రహానికీ, మన గ్రహానికీ మధ్య కాలంలో ఉన్న తేడాలను గురించి, ఎన్నో యుగాల పూర్వమే మన వేదాలలో చెప్పబడింది. ఆ విధంగా మన మహా ఋషులకూ, యోగులకూ, కాలం ప్రయాణించే తీరూ, దాని వల్ల పరిణమించే మార్పుల వంటి అన్ని విషయాలపై, ఎంతో అవగాహన ఉన్నట్లు మనం గుర్తించాలి. సనాతన ధర్మం అంటే కేవలం నచ్చిన దేవుడిని గుడ్డిగా, మూఢ నమ్మకంతో కొలవడం కాదు. ఇది శాస్త్ర, సాంకేతిక సమాహారమనీ, ఇదో జీవన విధానమనీ ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి.

ధర్మో రక్షతి రక్షితః!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home