anjore Brihadeeswara: Ancient Secrets Revealed | 1000 ఏళ్ల క్రితం ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి?


1000 ఏళ్ల క్రితం ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి?
నీడ నేలపై పడని అతి పెద్ద ఆలయ రహస్యం!

ఆది మానవుడి పుట్టుక ఎప్పుడు సంభవించిందో తెలియదు కానీ, ముందుగా నాగరికత నేర్చి, మన దేశాన్ని విశ్వ గురువు స్థానానికి చేర్చిన ఘనకీర్తి పొందిన వారు మన పూర్వీకులు. నేడు భూమిపై అగ్ర రాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలలోని ప్రజలకు, కనీసం గుడిసెలు కట్టుకోవడం కూడా తెలియని సమయంలో, ఇక్కడ పెద్ద పెద్ద భవనాలూ, అద్భుతమైన మందిరాలూ నిర్మించబడ్డాయి. అలా ఆ నాడు కట్టబడిన అద్భుత నిర్మాణాలలో ఎన్నింటినో, గోరీ, బాబర్ వంటి ధూర్తులు నాశనం చేసినా, నేటికీ కొన్ని నిర్మాణాలు నాటి మనవారి నిర్మాణ కౌశలానికి సాక్షీభూతాలుగా నిలుస్తున్నాయి. అటువంటి కట్టడాలలో ఒక ఆలయం, మన దక్షణ భారత దేశంలోనే కొలువై ఉంది. మనకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకరం ఆ ఆలయ నిర్మాణం ఓ వింత అయితే, దాని గోపుర నిర్మాణ పద్ధతి, ఓ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ప్రపంచలో మరెక్కడా లేని విధంగా, 13 అంతస్తుల ఎత్తైన ఆ ఆలయ గోపురం నీడ భూమిపై పడదు. ఇన్ని వింతలకూ రహస్యాలకూ నెలవై వున్న ఆ ఆలయం, మన దక్షిణ భారత దేశంలో ఎక్కడ ఉంది? దానిని ఎవరు, ఎప్పుడు నిర్మించారు? అసలు ఆ ఆలయం పేరేంటి? ఆ ఆలయ నిర్మాణ మిస్టరీని ఇప్పటికీ ఎందుకని ఛేదించలేక పోతున్నారు? నిజంగానే అక్కడి గొపురం నీడ నేలపై పడదా - వంటి ఎన్నో సందేహాలు, మనలో చాల మందికి కలుగుతాయి. మరి అటువంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/eMYxF4J1Ic0 ]


ఎంతో ఘన చరిత్ర కలిగిన మన అఖండ భారతావనిని, యుగ యుగాలుగా ఎంతో మంది రాజులు పరిపాలించారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే, గొప్ప రాజులుగా చరిత్ర పుటలలో, మనష్యుల మనస్సులలో, చిరస్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి వారిలో, ఒకప్పుడు తమిళనాట కావేరీ నది ఒడ్డునుంచి మొదలు పెట్టి, ఇటు శ్రీలంకా, మాల్దీవుల నుంచి, అటు జపాన్ వరకు ఆక్రమించుకుని, సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన చోళ వంశానికి చెందిన రాజులను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, ప్రపంచ చరిత్రలో కొన్ని వేల ఏళ్ళపాటు మనుగడలో ఉన్న అత్యంత పురాతన రాజవంశంగా, చోళ వంశానికి పేరు ఉంది. అటువంటి గొప్ప వంశంలో పుట్టి, ఆ వంశానికే మరింత పేరు తెచ్చిన మొదటి రాజ రాజ చోళుడే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయాన్ని నిర్మింపజేశాడు.

చోళ వంశంలో పుట్టి, అధ్బుతమైన భుజ బలం, బుద్ధి బలం కలిగిన రాజుగా పేరు పొందిన మొదటి రాజ రాజ చోళుడు, ఒక ప్రక్క తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడంతో పాటు, మరో ప్రక్క ఎన్నో అద్భుతమైన నిర్మాణాలను నెలకొల్పినట్లు, చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విధంగా ఆయన కట్టించిన ఎన్నో గొప్ప కట్టడాలలో ఒకటి, తంజావూర్ లోని బృహదీశ్వరాలయం.

చోళుల ముఖ్య నగరాలలో ఒకటిగా, రైస్ బౌల్ అఫ్ తమిళనాడుగా పేరు పొందిన తంజావూర్ నగరంలో, దాదాపు వెయ్యేళ్ల క్రితం ఈ ఆలయాన్ని మొదటి రాజ రాజ చోళుడు నిర్మింపజేసినట్లు, చరిత్ర చెబుతోంది. సాధారణంగా, పురాతన కట్టడాలలో రాయికీ రాయికీ మధ్య బంధం దృఢంగా ఉండటానికి, బంక మట్టిని కానీ, వేడి సున్నాన్ని కానీ వాడేవారు. బృహదీశ్వరాలయ నిర్మాణంలో మాత్రం, ఇటుకలూ, బంకమన్ను, సున్నం వంటివి ఏవీ ఉపయోగించలేదు. వాటికి బదులుగా, కేవలం పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళను ఒకదానిపై ఒకటిగా పేర్చి, ఎంతో పకడ్బందీగా నిర్మించారని, నిపుణులంటున్నారు.

ఇక్కడ మరో వింత ఏమిటంటే, బృహదీశ్వరాలయ నిర్మాణం జరిగిన తంజావూరు పరిసరాలలో, కనీసం యాభై, అరవై కిలోమీటర్ల పరిధిలో, ఒక్క గ్రానైట్ కొండ కూడా లేదు. అయినా అంత భారీ ఆలాయ నిర్మాణాన్ని పూర్తిగా గ్రానైట్ రాళ్ళతో కట్టడం చాలా వింత అని, నిపుణులంటున్నారు. కొంత మంది పరిశీలకులు చెబుతున్నదానిని బట్టి, తంజావూరు నుంచి ఇంచుమించు డబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుక్కొట్టై అనే ఊరికి, దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో గ్రానైట్ కొండలు ఉన్నాయి. వాటిలోని రెండు కొండలను పూర్తిగా తొలిచి తంజావూరుకు తీసుకువచ్చి, బృహదీశ్వరాలయాన్ని నిర్మించి ఉంటారని అంటున్నారు. ఇక్కడ విచిత్రమేమిటంటే, దాదాపు 1000 ఏళ్ల క్రితం, Science ప్రకారం ఎటువంటి ఆధునిక పరిజ్ఞానమూ లేని ఆ కాలంలో, అంత పెద్ద కొండరాళ్ళను, అంత దూరం ఎలా తరలించి ఉంటారనే విషయం, అంతు చిక్కని రహస్యంగానే మిగిలి పోయింది.

ఈ విషయంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న నిపుణుల బృందం, ఆ రాళ్ళ తరలింపుకు అప్పటి మన వారు అనుసరించిన మర్మాన్ని కనుగొన్నారు. పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం, పొడవాటి చెట్లను నరికి, వాటిని గుండ్రంగా చెక్కి, అవి విడిపోకుండా ముడులు వేసి, వాటిపై ఈ రాళ్ళను పెట్టి, ఏనుగుల సహాయంతో తంజావూరుకు తరలించారని, తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా చర్చలు జరుగుతూనే వున్నా, ప్రస్తుతానికి ఈ సిద్ధాంతాన్నే నమ్మవలసిన పరిస్థితి. ఆ విధంగా గ్రానైట్ రాళ్ళ సాంధ్రతా, వాటి పరిమాణం ప్రకారం ఒక్కో రాయిని అమర్చి, దాదాపు పదమూడు అంతస్థుల ఎత్తు వుండే గోపురాన్ని నిర్మించారు.

ఇక ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ, ఆలయంపైనున్న రాతి గోపుర కలశం. ఇది దాదాపు ఎనబై టన్నుల బరువుండే ఏక శిలను చెక్కి, దానిని పదమూడు అంతస్థుల పైకి ఆ కాలంలో ఎలా చర్చారనేది, నేటి Science కి అంతుచిక్కని మిస్టరీనే. బృహదీశ్వరాలయంపై ఎన్నో పరిశోధనలు జరిపిన కొంతమంది పరిశోధకులు, ఎనభై టన్నుల బరువుండే కలశాన్ని గోపురంపైకి ఎలా చేర్చివుంటారనే విషయంపై ఓ సిధాంతాన్ని మన ముందుంచారు.

దాని ప్రకారం, బృహదీశ్వరాలయానికి ఇంచుమించు ఏడూ కిలోమీటర్ల దూరం నుంచీ ఏటవాలుగా ఓ మట్టి వంతెనను నిర్మించి, దానిపై ఈ రాయిని ఆలయం వరకు తీసుకు వచ్చి ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ సిద్ధాంతాన్ని చరిత్రకారులు పూర్తిగా ఏకిభవించలేకపోతున్నారు. ఎందుకంటే, చరిత్రలో బృహదీశ్వరాలయ పరిసరాలలో దొరికిన ఆధారాల ప్రకారం, ఆ మట్టి వంతెనకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళూ లభించ లేదు. మరి అంతపెద్ద రాయిని పదమూడంతస్థుల పైకి, అదికూడా వేయేళ్ళ క్రితం ఎలా చర్చారనేది, వీడని మిస్టరీయే.

బృహదీశ్వరాలయ నిర్మాణాన్ని మొదటి రాజ రాజ చోళుడు, సామాన్య శకం 1004 వ సంవత్సరంలో మొదలు పెట్టి, సామాన్య శకం 1009 లేదా 1010 వ సంవత్సరాల మధ్యకాలంలో పూర్తి చేయించినట్లు తెలుస్తోంది. అంటే, ఇంత పెద్ద ఆలయాన్ని, ఎటువంటి అధునిక పరికరాలూ, యంత్రాలూ లేకుండా, కేవలం ఐదు నుంచి ఆరు సంవత్సరాలలో పూర్తి చేయడం ఒక వింతయితే, వెయ్యేళ్ళు దాటినా చెక్కు చెదరకుండా ఉండటం మరో వింతగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, అలయంలోకి వెళ్ళే భక్తులు గర్భ గుడి ముందు నుంచుని ఎంతమంది మాట్లాడుకున్నా, వారి మాటల ప్రతి ధ్వని వినిపించకపోవడం ఇక్కడ మరో వింత.

ఇదిలా ఉంటే, బృహదీశ్వరాలయ వింతలూ, విశేషాల గురించి మాట్లాడుకునే క్రమంలో, స్థానికంగా అనేక కొత్త కొత్త కథలు పుట్టుకొచ్చినట్లు, నిపుణులంటున్నారు. అటువంటి వాటిలో, ఈ ఆలయానికి నీడ పడకపోవడం కూడా ఒకటి. నేటికీ చాలా మంది, బృహదీశ్వరాలయం నీడ భూమిపై పడదనే చెప్పుకుంటున్నారు. చరిత్రకారులు ఈ విషయంపై పరిశోధనలు జరిపి, దీనికి కారణాన్ని కనుగొన్నట్లు వ్యక్తంచేశారు.

ఆనాడు బృహదీశ్వరాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత, రాజ రాజ చోళుడు ప్రధాన వాస్తు శిల్పిని పిలిపించి, ఇంత పెద్ద ఆలయం పడిపోదుకదా? అని అడిగినప్పుడు, దాని నీడ కూడా పడదని పరిహాసంగా ఆయన సమాధానమిచ్చినట్లు చెబుతున్నారు. ఈ మాటే కాలగమనంలో నేడు జనబాహుళ్యంలో నానుతున్న మాటగా చరిత్రకారులంటున్నారు.

ఇక ప్రపంచ చారిత్రక కట్టడాలను చూసుకుంటే, దాదాపు వేయేళ్ళ క్రితం, ఇంత పెద్ద కట్టడం ఎవరూ నిర్మించ లేదని చరిత్రకారుల వాదన. పైగా కేవలం రాయిపై రాయిని పేర్చి నిలబెట్టిన ఇంతపెద్ద కట్టడం, ఇన్నేళ్ళయినా చెక్కు చెదరకపోవడం వింత మాత్రమే కాకుండా, నాటి మన వాస్తు శిల్పుల నిర్మాణ కౌశలానికి అద్దం పట్టేలా ఉందని, నిపుణులంటున్నారు. ఇన్ని వింతలూ, విశేషాలూ కలిగి ఉన్నది కాబట్టే, UNESCO వారు ఈ ఆలయాన్ని World Heritage Site గా గుర్తించారు.

🚩 ఓం నమః శివాయ 🙏

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home