Reincarnation of Arjuna a Hagiography | కలియుగంలో అర్జునుడు ‘పునర్జన్మ – మోక్షం’!


ఆత్మీయ మిత్రులందరికీ 'భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు' 🚩🙏
పరమాత్ముడికై సంపూర్ణ శరణాగతీ, ఆత్మ నివేదనా ఎలా ఉండాలి?
కలియుగంలో అర్జునుడు ‘పునర్జన్మ – మోక్షం’!

పంచమ వేదంగా పేరుగాంచిన వ్యాస విరచిత జయకావ్యం - మహాభారతంలో, పాండవుల స్వర్గారోహణ గురించి వివరించబడివున్నది. 17వ పర్వమైన మహా ప్రస్థానిక పర్వం ప్రకారం, పాండవులు సర్వమూ త్యజించి, స్వర్గానికి పయనమైనట్లు చెప్పబడింది. ఆ విషయాలను వివరిస్తూ, 'పాండవులు స్వర్గానికి వెళ్లిన దారి ఎక్కడుంది?' అనే శీర్షికన గతంలో మనం వీడియో చేసి ఉన్నాము. చూడని వారు అదికూడా తప్పక చూడండి. అలా ఆ జన్మను ముగించిన పాండవ మధ్యముడు 'అర్జునుడి' మరుజన్మ వివరాలు ఏమిటి? అని తెలుసుకునే ముందు, ద్వాపరయుగంలో అర్జునుడు శివుడి గురించి తపస్సు చేయగా, పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు గానీ, మోక్షం ప్రసాదించలేదు ఆ పరమేశ్వరుడు. ‘కలియుగంలో బోయ వానిగా జన్మించి మోక్షం పొందుతావ’ని అర్జునుడికి శివుడు చెప్పినట్లు మన ఇతిహాసాలలో పేర్కొనబడింది. దాని ప్రకారం అర్జునుడు బోయవానిగా జన్మించి, శివుడి అనుగ్రహాన్ని పొందాడని ప్రతీతి. ఆ బోయవాడి పుట్టుపూర్వోత్తరాలనూ, ఆతడు కైవల్యాన్ని పొందిన వైనం వంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ZJHvEAzmeQk ]


బోయ రాజైన నాగప్ప, దత్త దంపతులకు, రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరులో జన్మించాడు తిన్నడు. తల్లిదండ్రులిరువురూ తెలుగు వారు, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు కావడంతో, అతడికి తిన్నప్ప అనే పేరు పెట్టారు. కొడుకు తిన్నప్పకు విలువిద్యాదులు నేర్పించి, రాజును చేశాడు తండ్రి నాగప్ప. కులధర్మం ప్రకారం వేటగాడైనా, జంతువుల పట్ల అపార కరుణను చూపేవాడు తిన్నడు. జంతువులలో పసివాటినీ, ఆడవాటిని, రోగాలతో ఉన్నవాటినీ వేటాడేవాడు కాదు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద మాత్సర్యాలను జయించాడు తిన్నడు. ఒకనాడు తిన్నడు వేటకు వెళ్లి అడవి పందిని బంధించబోగా, అది తప్పించుకున్నది. దానిని పట్టుకోవడానికి తన అనుయాయులైన నాముడూ, కాముళ్ళతో ఆ వరాహాన్ని తరుముకుంటూ వెళ్లాడు. పరుగెత్తి పరుగత్తి ఎట్టకేలకు దానిని చంపాడు. అలసిపోయిన తిన్నడు ఆ పందిని తీసుకుని స్వర్ణముఖీ నదీ తీరానికి వెళ్లాడు. ఆ ప్రక్కనే ఉన్న కాళహస్తి పర్వతంపై వెలసి ఉన్న ఆలయాన్ని చూసిన తిన్నడికి, అక్కడకు వెళ్లాలనే తృష్ణ కలిగింది. అనుకున్నదే తడవుగా ఆ కొండ ఎక్కనారంభించాడు.

ఆలయం సమీపించే కొద్దీ, తనకు అంతకుముందెన్నడూ అనుభవంకాని అలౌకికానందాన్ని అనుభూతి చెందుతూ, పరవశుడైపోసాగాడు. అది పూర్వ జన్మ సంస్కార ఫలితమే. తన మీదినుంచి ఏదో బరువు దిగిపోతున్నట్లు అనిపించసాగిందతనికి. దేహ స్పృహ కూడా మందగించ సాగింది. ఆ పరమేశ్వరుని మీద అనంతమైన ప్రేమ పెల్లుబికింది. లింగాన్ని కౌగలించుకుని ముద్దులు కురుపించి, ఆనందభాష్పాలు జాలువారుతుండగా, ‘ఈశ్వరా! ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉంటున్నావయ్యా? నీకు ఆహారమెలా అందుతోంది? నీకిక్కడ తోడెవరుంటారు?’ అని చింతాక్రాంతుడై అడుగుతూ.. ‘నేను నీతోనే ఉంటాను. అయ్యో! నా తండ్రికి ఆకలిగా ఉందేమో.. ఆహరం తీసుకు రావాలి.’ అని తనలో తానే అనుకుంటూ, శివయ్యాను వంటరిగా విడిచి వెళ్ళలేక వెళ్లాడు. స్వర్ణముఖీ నదిలోని నీటిని నోటితో పుక్కిలినిండా పట్టి, పువ్వులను తలపై పెట్టుకుని, చేతిలో మాంసాన్ని పట్టుకుని తిరిగి ఆలయానికి చేరుకున్నాడు. నోటిలోని నీటితో శివుణ్ణి అభిషేకించి, పువ్వులతో అర్చించి, మాంసాన్ని నైవేద్యంగా అర్పించాడు. ఆలయ ద్వారం వద్ద కూర్చుని ఏ జంతువూ లోనికి రాకుండా కాపలా కాస్తూ, ఆ శివయ్యనే చూస్తూ మురిసి పోయాడు..

తిన్నడు చేస్తున్న పనులు చూసిన అతని అనుయాయులు నాముడూ, కాముడూ ఆ విషయాన్ని అతని తల్లి దండ్రులకు ఎరుకపరిచారు. వారక్కడకు చేరుకుని, తిన్నడిని ఇంటికి తీసుకువెళదామని శత విధాలా ప్రయత్నించినా వారికి సాధ్యం కాలేదు. దానితో వారతనిని అక్కడే వదిలి వెళ్లక తప్పలేదు. ఉదయాన్నే లేచి వేటకు వెళ్లి మాంసాన్ని తీసుకురావడం, శివయ్యకు నోటి నీళ్ళతో అభిషేకం చేయడం, తలపై పెట్టుకు తెచ్చిన పూలతో అర్చించడం, మాంసాన్ని నివేదించడం వంటి పనులు చేస్తూ, అక్కడే ఉండిపోయాడు తిన్నడు. ఈ విధంగా అయిదు రోజులు గడిచి పోయాయి. ఆలయ అర్చకుడూ, పరమ శివ భక్తుడూ అయిన శివగోచారుడు, ప్రతి రోజూ ఉదయాన్నే ఆలయం చేరుకుని, తిన్నడు చేస్తున్న పనులను జూసి భరించలేక రోదించాడు. ‘ఈ ఘోర కలిని ఆపు స్వామీ’ అంటూ మొరపెట్టుకున్నాడు. ఆ నాటి రాత్రి అర్చకునికి కలలో శివయ్య కనిపించి, ‘నీవు రేపు లింగం వెనుక దాక్కుని ఏం జరగబోతోందో చూడు..’ అని చెప్పాడు. మరునాడు శివగోచారుడు, రాత్రి స్వామి కలలో చెప్పిన విధంగానే చేశాడు. రోజూ లాగానే తిన్నడు నీళ్ళూ, పూలూ, మాంసం పట్టుకుని ఆలయం చేరుకున్నాడు. తిన్నడు శివయ్యను చూసే సరికి, లింగం యొక్క కుడి కంటి నుండి రక్తం కారుతోంది. అది చూసి ఏడుస్తూ, తల్లడిల్లి పోయి, తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు తిన్నడు. అయినా లింగంనుంచి రక్తస్రావం ఆగక పోవడంతో, కంటికి కన్ను అనే సిద్ధాంతం గుర్తుకు వచ్చి, తన కంటిని పెకలించి, శివయ్యకు అమర్చాడు. రక్తం కారడం ఆగిందని సంతోషించే లోపుగా, లింగం యొక్క ఎడమ కంటి నుండి రక్తం కారండం ప్రారంభమయ్యింది.

వెంటనే తిన్నడు, ‘శివయ్యా, విచారించకు.. నా రెండవ కన్ను కూడా తీసి పెడతాను' అంటూ రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలితో ఆ కంటిని వత్తి పెట్టి, తన రెండవ కంటిని కూడా పెకిలించుకోబోతుండగా, అతడి అపార భక్తిప్రపత్తులకు కదిలిపోయిన శివుడు ప్రత్యక్షమై, తిన్నడిని వారించాడు. ‘తిన్నా.. నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. నీ కంటిని నాకు అర్పించినందుకు, ఇకపై నీవు కన్నప్పగా లోక ప్రసిద్ధుడవవుతావు. నిస్వార్థ భక్తుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతావు’ అంటూ శివసాయుజ్యం ప్రసాదించాడు. ఇదంతా గమనిస్తున్న శివగోచారుడు నిశ్చేష్ఠుడయ్యాడు. అలా తిన్నడు తన అపార భక్తితో ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని, కన్నప్పగా చీరస్మరణీయుడయ్యాడు. మహాభక్తుడైన తిన్నడు తన కళ్లను తానే పెకలించి శివునికి అర్పించడం, ఆ పరమాత్ముడిపై సంపూర్ణ శరణాగతీ, ఆత్మ నివేదనా కనిపిస్తాయి. దానిని మించిన భక్తి తత్పరత మరొకటి లేదు. వేదం, నాదం, యోగం, శాస్త్రాలూ, పురాణాలూ ఏమీ తెలియక పోయినా, అకుంఠిత భక్తి శ్రద్ధలతో ఒక సాధారణ వ్యక్తి, ఆ మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని, ‘భక్త కన్నప్ప’గా చరితార్థుడయ్యాడు.

మన పురాణాలలో చెప్పబడిన గొప్ప శివ భక్తులను ‘నాయనార్లు’గా పేర్కొనబడినది. వీరిలో 63 మంది ముఖ్యులు. ఈ నాయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవుల వరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తి తప్ప ఇంకేమీ కాదని, అంత్యకాలంలో మోక్షాన్ని పొందిన వీరి గాధలు నిరూపిస్తాయి. వీరిలో 19వ వాడు, తెలుగు వాడు, తిన్నడు.

🚩 హారహర మహాదేవ 🙏

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home