Sabarimala: Original Ayyappa's Idol Vandalised? | శబరిమల అయ్యప్ప! దైవ స్థాపిత విగ్రహం ఏమయ్యింది?
శబరిమల అయ్యప్ప! దైవ స్థాపిత విగ్రహం ఏమయ్యింది!
నేడు భక్తులు దర్శించుకునే అయ్యప్ప స్వామి విగ్రహం పరశురాముడు ప్రతిష్ఠించినది కాదా?
స్వామియే శరణం అయ్యప్ప అంటూ ప్రపంచం దద్దరిల్లి పోతోంది. ఆ హరిహర సుతుడిపైనున్న నమ్మకం, ప్రేమ, భక్తికి గుర్తుగా, ఆయప్ప మాలను ధరించి, మండలం రోజుల పాటు దీక్షబూనుతుంటారు ప్రతి సంవత్సరం. కార్తీక మాసం మొదలవ్వగానే, మనకు ఎక్కడ చూసినా ఆ మణికంఠుడి మాల ధరించిన స్వాములే కనిపిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఆయప్ప మాల వేసుకుని వచ్చే కోట్లాది మంది స్వాములతో కిక్కిరిసి పోయి ఉంటుంది శబరిమల. ప్రతి సంవత్సరం కోట్లాది మంది దర్శించుకునే అయ్యప్ప స్వామి విగ్రహం, ఆనాటి దైవ స్థాపిత విగ్రహమేనా? అసలైన విగ్రహం పళనిలోని కుమారస్వామి ఆలయంలో ఉన్న నవ పాషాణ విగ్రహం లాంటిదా? మరి అసలైన విగ్రహానికి ఏమైంది..? ఇప్పుడున్న విగ్రహం అక్కడికి ఎలా చేరింది..? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Z1osWZdk17g ]
కార్తీక మాసంలోనే కాకుండా, ప్రతి నెల కొన్ని ప్రత్యేక దినాలలో కూడా ఆలయం తెరుస్తారు కాబట్టి, ఆ సమయంలో కూడా భక్త కోటి, స్వామి దర్శనార్ధం శబరిమలకు ప్రయాణమవుతారు. ఒక్కప్పుడు అలా ఉండేది కాదు. దాదాపు 1950 వరకు శబరిమలపై అయ్యప్ప స్వామి దర్శనం, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉండేది. అందుకు ప్రధానమైన కారణం, ఆ ఆలయం ఉన్న ప్రదేశం. కేరళలోని దట్టమైన ఆడవుల మధ్యలో ఉండడం వలన, భక్తులకు ఆ ప్రయాణం అంత సులభ తరం కాదు.
పురాణాల ప్రకారం, అయ్యప్ప జననం ఎలా జరిగింది, ఆయన చరిత్ర వంటి విషయాలు తెలిసినవే. ఆయనను పెంచి పెద్ద చేసిన Pandalam రాజ వంశం వారే, నేటికీ ఆలయ సంరక్షణ, నిర్వాహణ బాధ్యతలతో పాటు, ప్రత్యేకమైన పూజల విషయంలోనూ ఎన్నో నియమాలు పాటిస్తూ ఉన్నారు. కొన్ని వార్తల ప్రకారం, కొన్నేళ్ళ క్రితం అయ్యప్ప ఆలయం గురించిన వివరాలు తెలుసుకోడానికి, Pandalam వంశీయుల ఆధీనంలో వున్న గ్రంధాలయంలో వేతకగా, వారి దగ్గర సామాన్య శకం 1075 నుంచి మాత్రమే రికార్డ్స్ ఉన్నట్లు తెలిసింది. అంతకు పూర్వం రాసిన రికార్డ్స్ ఏమయ్యాయి..? అసలు ఉన్నాయా, లేవా..? అనే విషయాలు, వీడని మిస్టరీయే.
ఇదిలా ఉంటే, అందుబాటులో ఉన్న ఆ రికార్డ్స్ ని పరిశీలించినప్పుడు, సరిగ్గా సామాన్య శకం 1075వ సంవత్సరంలో, మొదటిసారి ఆలయంలో అతి పెద్ద అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. Pandalam రాజ వంశ శాసనాల ప్రకారం, ఆ మణికంఠుడిని పెంచి పెద్ద చేసిన రాజా రాజశేఖరుడు, స్వామి కోరిక మేరకు శబరిమల కొండలపై ఆలయం కట్టించి, తనతో పాటు, తన వంశం కొనసాగినంతవరకు, ఆలయ సంరక్షణ, నిర్వాహణ వంటి బాధ్యతలన్నీ తప్పనిసరిగా చూసుకోవాలని శాసించాడు. ఇక సామాన్య శకం 1070ల కాలం నాటికి, Pandalam రాజ వంశానికి రాజుగా, రాజా శ్రీ Moolam Thirunaal పాలిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం బంగారు తాపడంతో, మిగిలిన ప్రదేశాలు పక్కా నిర్మాణాలతో ఉంది. కానీ, అప్పుడు స్వామి వారి ఆలయంపై కేవలం రాగి తాపడం మాత్రమే ఉండేది. చుట్టుప్రక్కల నిర్మాణాలు కూడా అంత గొప్పగా ఉండేవి కాదు. దానికి తోడు వాతావరణ మార్పుల కారణంగా, రాగితాపడం పాడై చిల్లులు పడిపోవడంతో, వర్షం వస్తే ఆ నీరు ఆలయంలో ఉన్నవారిని కూడా తడిపేసేది. ఈ విషయాన్ని రాజుకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే భక్తుల కోసం, ఆలయంపై డబ్బులు ఖర్చుపెట్టే ఉద్దేశం లేదని చెప్పేవాడు. దాంతో ఆలయ పూజారులూ భక్తులూ చేసేదేమీ లేక, ఆలయం పై భాగాన్ని గడ్డితో అల్లి, వర్షం నీరు లోపలకి రాకుండా ఏర్పాట్లు చేసుకున్నారు.
సరిగ్గా సామాన్య శకం 1077లో, ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉండటంతో, ఆలయం పైనున్న గడ్డి భగ్గుమని, ఆలయం మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. ఆ సమయంలో స్వామి వారికి పూజలు చేస్తున్న ఆలయ అర్చకుడు, మంటలంటుకున్నాయనే విషయం గమనించగానే, స్వామి వారి విగ్రహాన్ని తీసుకుని బయటకు వచ్చేశాడు. ఈ విషయం రాజుకు తెలియడంతో, తాను చేసిన తప్పును మన్నించమని వేడుకుని, ఆలయాన్ని పుననిర్మింపజేశాడు. అప్పుడు రాగి తాపడంతో పాటు, ఇత్తడి తాపడాన్ని కూడా వేశారు. అలా ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత, సామాన్య శకం 1085 వ సంవత్సరం నుంచి, భక్తులకు తిరిగి స్వామివారి దర్శన భాగ్యం మొదలయ్యింది.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ సమయంలో ఆలయ అర్చకుడు రక్షించిన ఆ విగ్రహం, సామాన్యమైన విగ్రహం కాదు. కేరాళ రాష్ట్రాన్ని సముద్రం నుంచి వెలికి తీసి, మనుషులకు నివాస యోగ్యంగా మార్చిన పరశురాముడే, అయ్యప్ప స్వామి విగ్రహాన్ని నవపాషాణాలతో, తన శాస్త్రపరిజ్ఞానంతో స్వయంగా తయారు చేసి ప్రతిష్టించాడు. కేరళ రాష్ట్ర పుట్టుకకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మనం ఇదివరకు వీడియో చేసి ఉన్నాము. చూడని వారి కోసం ఆ వీడియో link, description లోనూ, పైన icards లోనూ పొందుపరిచాను. అలా పరశురాముడి చేత ప్రతిష్ఠించబడిన స్వామి వారి నవపాషాణ విగ్రహం, 1900వ సంవత్సరం వరకు పూజింపబడిందని చరిత్రకారులు చెబుతున్నారు. పరశురాముడు కనిపెట్టిన ఆ పరిజ్ఞానమే, కాలాంతరాళాలో మహర్షుల దగ్గరకు, అక్కడి నుంచి భోగ సిద్ధుడికీ చేరగా, దాని సహాయంతో ఆయన కుమారస్వామి విగ్రహాన్ని తయారు చేసి, తమిళనాడులోని Palani క్షేత్రంలో ప్రతిష్టించారు.
చరిత్ర ప్రకారం శబరిమల కొండపై చాలా అగ్ని ప్రమాదాలు జరిగాయి కానీ, అవన్నీ చిన్నాచితకా అవ్వడంతో, రికార్డ్స్ లోకి ఎక్కలేదని నిపుణులంటున్నారు. అయితే 1900వ సంవత్సరంలో, శబరిమల కొండపై చాలా పెద్ద విషాదమే సంభవించింది. అలా మరో మారు స్వామి వారి ఆలయం మంటలకు ఆహుతి అయ్యింది. ఇక్కడ మరింత విషాదం ఏమిటంటే, పరశురామ ప్రతిష్ఠిత మణికంఠుడి విగ్రహం కూడా పాక్షికంగా దెబ్బతిన్నది.
ఆలయం అగ్నికి ఆహుతైన రెండు రోజులకు అక్కడికి వచ్చిన పోలీసులు కొన్ని వైషయాలను కనిపెట్టారు. వాటిని బట్టి, ఆలయ గర్భగుడి ద్వారం దగ్గర పరిశీలించినప్పుడు, ఎవరో అక్కడ పదునైన వస్తువుతో పదే పదే దాడి చేసినట్లూ, అలా ఆలయ ద్వారం విరగగొట్టి లోపలికి ప్రవేశించినట్లూ తెలుసుకున్నారు. అలా వెళ్ళిన వ్యక్తులు ముందుగా స్వామి వారి విగ్రహాన్ని పాక్షికంగా విరగగొట్టి, ఆ తర్వాత మొత్తం ఆలయానికి నిప్పు పెట్టినట్లు గమనించారు. ఇక్కడ వింతైన విషయం ఏమిటంటే, ఆలయంలో ఉన్న ఒక్క విలువైన వస్తువును కూడా వారు ముట్టుకో లేదు. ఆ రోజుల్లో కేవలం మండల పూజ సమయంలో మాత్రమే, జనాలు ఆలయం దగ్గర ఉండేవారు. తక్కిన రోజులలో పెద్దగా జన సంచారం ఉండేది కాదు. ఎందుకంటే, ఆ రోజులలో శబరిమల వెళ్ళడం అంటే, ప్రాణాలపై ఆశలు వదులుకున్నట్లే అని, చరిత్రకారులు చెబుతారు. భీకరమైన అడవి మార్గంలో పెద్ద పులులు, చిరుత పులులు, ఏనుగులవంటి క్రూర ప్రాణులతో పాటు, కొన్ని అరుదైన, అత్యంత విషపూరితమైన కీటకాలూ, విష సర్పాలూ అక్కడ సంచరించేవి. అందుకే మండల పూజ సమయంలో తప్ప, ఏడాది పొడవునా మిగతా రోజులలో అక్కడికి ఎవరూ పెద్దగా వెళ్ళేవారు కాదు.
1900వ సంవత్సరంలో జరిగిన ఘటనను పరిశీలించిన పోలీసులు, ఆలయ ధ్వంసం కోసం వచ్చిన దుండగులు 5 గంటలపాటు అక్కడే ఉన్నట్లు గుర్తించారు. వారికి అక్కడున్న నగానట్రాపై పెద్దగా ఆసక్తి లేకపోవడం గమనించి, కేవలం ఆలయం అక్కడ ఉండటం ఇష్టంలేక అలా చేశారని తేల్చేశారు, పోలీసులు. ఈ క్రమంలో శబరిమల ఆలయం దగ్గర ఉండే కొన్ని ఆటవిక తెగల వారిని సందేహించినా, సరైన సాక్ష్యాలు లేక ఏమీ చేయలేకపోయారు. దానికితోడు ఆలయం అగ్నికి ఆహుతైన తర్వాత, అక్కడ వర్షం పడటంతో సాక్ష్యాలన్నీ తుడిచిపెట్టుకు పోయాయని, పోలీస్ రికార్డ్స్ లో ఉంది.
అయ్యప్ప స్వామి ఆలయంలో అలా తరచూ అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణాలను పరిశీలించిన పండితులు, స్వామి వారి విగ్రహం ఆగ్నేయం మూలన ఉండటమే అగ్నిప్రమాదాలకు మూల కారణమని గుర్తించారు. ఆ తర్వాత మరో కొత్త విగ్రహం కోసం వేతకగా, అప్పటికే కేరళలోని Chengannur అనే జిల్లాలో శివాలయ నిర్మాణం కోసం వచ్చిన Ayyappa Paniker, Neelaganda Panikar అనే ఇద్దరు శిల్పకారులు, శబరిమల ఆలయ పెద్దలకు ఎదురు పడ్డారు. వారిద్దరిదీ తమిళనాడులోని తంజావూరు కాగా, తమ ప్రాంతంలో నిర్మించబోయే ఆలయాలలో మంచి శిల్పకళాకారులు కావాలని, నాటి Chengannur రాజు వారిని కేరళకు పిలిపించాడు. పూర్వం నుంచి వారు అయ్యప్ప స్వామి భక్తులు అవ్వడంతో, స్వామి వారి విగ్రహం చేయడానికి సంతోషంగా ఒప్పుకుని, పంచలోహాలతో అయ్యప్ప విగ్రహాన్ని తయారు చేశారు.
అలా నాడు Ayyappa Paniker, Neelaganda Panikar అనే ఇద్దరు శిల్ప కళాకారులు చేసిన విగ్రహమే, నేడు సమస్త భక్తకోటి దర్శించుకుంటున్న శబరిమల అయ్యప్ప స్వామి ప్రధాన మూర్తిగా కొలువై ఉంది. ఇక్కడున్న కొంత అయోమయ పరిస్థితి ఏమిటంటే, కొన్ని రికార్డ్స్ ప్రకారం ఇదంతా జరిగింది 1900వ సంవత్సరంలో కాకుండా, 1950లో అని ఉన్నా, చాలా రికార్డ్స్ ప్రకారం 1900వ సంవత్సరంలో జరిగినట్లు చరిత్రకారులంటున్నారు.
🚩 స్వామియే శరణమయ్యప్ప 🙏
Comments
Post a Comment