ఛత్రపతి శివాజీ జయంతి 2025 Chhatrapathi Shivaji Maharaj Jayanthi
అందరికీ 'ఛత్రపతి శివాజీ జయంతి' శుభాకాంక్షలు 💐 teluguvoice.in
స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన ఘనత, ఛత్రపతి శివాజీకే దక్కుతుందనడంలో అతిశయోక్తిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పోందిన శివాజీ రాజే భోంస్లే, 1630 ఫిబ్రవరి 19న షాహాజీ, జిజాబాయి పుణ్య దంపతులకు జన్మించాడు. శివాజీ తండ్రి, వ్యవసాయ బోస్లే కులానికి చెందిన వారు. అతను నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ, మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. తల్లి జిజాబాయి యాదవ క్షత్రియ వంశపు ఆడ పడుచు. శివాజీకి ముందు పుట్టిన వారందరూ మృతి చెందారు. దాంతో జిజాబాయి, తాను పూజించే పార్వతీ దేవి మరోపేరైన శివై పేరును కలిపి శివాజీకి పెట్టింది. ఆమె సంరక్షణలో పెరిగిన శివాజీ, రామాయణ మహాభారతాల విశిష్టతనూ, హిందూమతం యొక్క గొప్పతనాన్నీ తెలుసుకున్నాడు. పరమత సహనం, స్త్రీలను గౌరవించడం, శివాజీకున్న గోప్ప లక్షణం.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/it7JY1jp20A ]
దాదాజీ ఖాండ్ దేవ్ దగ్గర శిక్షణ తీసుకున్న శివాజీ, వీరుడిగా యుద్ద రంగంలో అడుగుపెట్టాడు. తండ్రి పరాజయాలకు గల కారణాలను క్షుణ్ణంగా తెలుసుకుని, యుద్దతంత్రంలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యా పారంగతుడైన శివాజీ, మరాఠా సామ్రాజ్య స్థాపనకు నడుం బిగించాడు. భవానిదేవి భక్తుడు అయినప్పటికీ, తన సామ్రాజ్యంలో ఉన్న అన్ని మతాల వారినీ సమానంగా చూసేవాడు శివాజీ. తన రాజ్యంలో కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా, ఎన్నో మసీదులను కట్టించిన ఘనత శివాజీకే సొంతం. ఆయన సైన్యంలో మూడొంతుల మంది ముస్లిములు ఉన్నారు. ఎందరో ముస్లిములకు, ఉన్నత పదవులు కట్టబెట్టారు శివాజీ. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికీ, ఇబ్రహీం ఖాన్ నావికాదళానికీ, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్ధిక్ అనే ఇద్దరూ కూడా ముస్లింలే. శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, ఆగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తీ, మదానీ మెహ్తర్ కూడా ముస్లిమే. తన రాజ్యంలోని, ఎంతో ముఖ్యమైన పదవులను సైతం, పర మతాల వారికి అప్పగించిన ఘనత, శివాజీకే దక్కుతుంది.
ఛత్రపతి శివాజీ, యుద్ద తంత్రాలలోనే కాదు, పరిపాలనా విధానాలు రూపోందించడంలో కూడా నిష్ణాతుడు. ప్రజలకోసమే ప్రభువు, అన్న సూత్రాన్ని అనుసరించి, వ్యక్తిగత విలాసాలను పక్కనపెట్టి, ప్రజల సంక్షేమం కోసం పాటు పడ్డ మహా వ్యక్తి. శివాజీ లౌకిక పాలకుడు. అన్ని మతాల వారికీ అనుకూలంగా ఉంటూ, అన్ని మతాల ప్రజలనూ ఆదరించేవాడు. మరాఠా సామ్రాజ్య స్థాపన కోసం, ఎంతో మంది ముస్లింలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసినప్పటికీ, ఆయన పాలనలో ఉన్న ముస్లింలను, తగిన విధంగా సత్కరించేవాడు. అనేక మసీద్ లు నిర్మించిన ఏకైన హిందూ రాజు కూడా ఛత్రపతి శివాజీనే. నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావంతో ఉండడం, మచ్చలేని ఆయన వ్యక్తిత్వమే, అనుచరులకూ, ప్రజలకూ, ఆదర్శంగా నిలిచాయి. మన భారతదేశాన్ని ఎందరో రాజులు పాలించినప్పటికీ, శివాజీలో ఉన్న ఈ లక్షణాలే అతన్ని చరిత్ర లో చిరస్మరణీయుడిగా చేసాయి. ఛత్రపతి శివాజీ, ఎన్నో విరోచితమైన యుద్దాలుచేసి విజయాన్ని సాధించి, మరాఠా రాజ్యాన్ని విస్తరించాడు.
17 ఏళ్ళ వయసులో, మొట్టమొదటి యుద్ధం చేసిన శివాజీ, బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన, తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. తరువాత మూడేళ్ళలోనే, కొండన, రాజ్‌ఘడ్ కోటలను కూడా సొంతం చేసుకొని, పూణే ప్రాంతాన్నంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తమ కోటలను సొంతం చేసుకున్నాడన్న కోపంతో, ఆదిల్షా సుల్తాన్, శివాజీ తండ్రి షాహాజీని, మోసపూరిత కుట్రతో బంధించాడు. అంతేకాదు, శివాజీనీ, బెంగుళూరులో ఉన్న అతని అన్న శంభాజీనీ పట్టుకోవడానికి, రెండు సైన్యాలను పంపాడు ఆదిల్షా. అయితే, అన్నదమ్ములిద్దరూ, ఆ సైన్యాలను ఓడించి, తమ తండ్రిని విడిపించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆదిల్షా, యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్‌ను, శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు. శివాజీ చేసిన మెరుపుదాడులూ, గెరిల్లా యుద్ధ నీతినీ తెలుసుకొన్న అఫ్జల్ ఖాన్, అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి, శివాజీని రెచ్చకొట్టే ప్రయత్నం చేసాడు. శివాజీకి ఇష్ట దైవమయిన భవానీ దేవి దేవాలయాలను కూల్చేశాడు అఫ్జల్.
ఆలయాలను కూల్చేశాడన్న విషయాన్ని తెలుసుకుని, తాను యుద్ధానికి సిద్దంగా లేననీ, అఫ్జల్‌ను చర్చలకు ఆహ్వానించాడు శివాజీ. దాంతో, ఇరు వర్గాల వారూ, ప్రతాప్‌ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ మోస బుద్ధి తెలిసిన శివాజీ, ఉక్కు కవచాన్ని ధరించి, పిడిబాకును లోపల దాచుకున్నాడు. ఇద్దరూ తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా, అఫ్జల్ ఖాన్ తన వెంట రహస్యంగా తెచ్చుకున్న కత్తితో, శివాజీ పైన దాడి చేసాడు. ఉక్కు కవచం ధరించడం వల్ల, శివాజీ తప్పించుకున్నాడు. వెంటనే లోపలికి రావడానికి ప్రయత్నించిన అఫ్జల్ ఖాన్ సైన్యాధికారులను, శివాజీ సైన్యం అడ్డుకుంది. శివాజీ, తనతోపాటు తెచ్చుకున్న పులి గోర్లతో, అఫ్జల్ ఖాన్ పొట్టను చీల్చేశాడు. గుడారం నుండి బయటకు పారిపోదామని ప్రయత్నించిన అఫ్జల్ తలను, ఒకే వేటుకు నరికేశాడు. ఇక మిగిలిన అఫ్జల్ సేనను కూడా, శివాజీ సేన మెరుపు దాడులు చేసి, వారిని అంతమొందించింది.
అఫ్జల్ ఖాన్ పై విజయంతో, శివాజీ పేరు మరాఠా యోధుడిగా, మహారాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిపోయింది. దీంతో, ఎలాగైనా శివాజీ పై పగ సాధించాలని వేచి ఉన్నాడు, బీజాపూర్ సుల్తాన్. అందుకోసం, యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పష్తున్ సైనికులను, శివాజీపై యుద్ధానికి పంపాడు. శివాజీ సేన, పష్తున్ లను కూడా మట్టికరిపించి, ఈ యుద్ధంలో కూడా విజయం సాధించింది. ఇక ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్ఠలు, భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచాడు శివాజీ మహారాజ్. పష్తున్ లపై శివాజీ విజయాన్ని సహించలేని బిజాపూర్ సుల్తాన్, అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ ల నుండి, మెరికల్లాంటి 10,000 మంది, కిరాయి సైనికులను తెప్పించాడు. వారిని శివాజీపై యుద్ధానికి పంపించాడు. అప్పుడు శివాజీ, తన వద్దనున్న 5,000 మంది మరాఠా యోధులతో కలసి, కొల్హాపూర్ వద్ద, వారి సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. 'హర హర మహాదేవ', అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృభించి, శతృవులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో, కేవలం సుల్తానులకే కాక, మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ కు సైతం, శివాజీ అంటే భయం పుట్టింది.
శివాజీ నుండి, ఎప్పటికయినా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబ్ భావించి, శివాజీని అంతమొందించడానికి, సన్నాహాలు మొదలు పెట్టాడు. ఔరంగజేబ్ తన మేన మామ Shaista Khan ను, శివాజీ పై యుద్ధానికి పంపాడు. రెండుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న Shaista Khan, మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి, అపారమయిన సైనిక, ఆయుధ బలగాలు అప్పగించి, కొల్హాపూర్ పంపించాడు. అప్పటికే కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్‌హాలా కోటలో, శివాజీ కొన్ని వందలమంది అనుచరులతో ఉన్నాడు. అయితే, సిద్ది జోహార్ విషయం తెలుసుకొన్న శివాజీ, ఎలాగయినా పన్‌హాలా కోట నుండి తప్పించుకొని, తన సైన్యం మొత్తం ఉన్న విశాల్‌ఘడ్ కోటకు చేరుకొని, సిద్దితో యుద్ధం చేయడానికి వ్యూహం రచించాడు. కానీ, అప్పటికే పన్‌హాలా కోట చుట్టూ శత్రుసైన్యం ఉండడంతో, తాను యుద్ధానికి సిద్దంగా లేననీ, దయ తలచవలసినదిగా సిద్ది జోహార్‌కు వర్తమానం పంపాడు శివాజీ. అది తెలుసుకొన్న సిద్ది జోహార్ సైనికులు, నిఘా సరళం చేసి, విశ్రాంతి తీసుకున్నారు. ఇక శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని, తన సైన్యం ఉన్న విశాల్ ఘడ్ కోటవైపు పయనించాడు. చివరిక్షణంలో ఇది తెలుసుకొన్న సిద్ది జోహార్, తన బలగాలతో శివాజీని వెంబడించాడు.
శివాజీ సేన కోటకు చేరుకొనేలోపు, శత్రువులు తమను సమీపిస్తున్నారన్న విషయాన్ని గ్రహించిన బాజీ ప్రభు దేశ్‌పాండే అనే సర్దార్, 300 మంది అనుచరులతో కలసి, తాము శత్రుసైన్యాన్ని ఎదుర్కొంటామనీ, శివాజీని తన అంగరక్షకులతో సహా ఎలాగయినా కోట చేరుకోమనీ చెప్పి, ఒప్పించాడు. శివాజీని కోట వైపు పంపిన వెంటనే బాజీ ప్రభు దేశ్‌పాండే, తన రెండు చేతులా ఖడ్గాలు పట్టుకొని, శత్రువులతో యుద్ధం చేశాడు. 300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి, అతి బలమయిన శత్రువులతో పొరాడి నేలకొరిగారు. వీరి యుద్ధం ముగిసే సరికి, శివాజీ తన కోట చేరుకున్నాడు.
కోటలో తన అనుచరులతో చర్చించిన శివాజీ, అనంతరం, తాము సిద్ది జోహార్ సైన్యాన్ని ఎదుర్కొనలేమని గ్రహించి, సంధికి అంగీకరించాడు. ఈ సంధిలో భాగంగా, శివాజీ సామ్రాజ్యం, స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా, పన్‌హాలా కోటను ఇచ్చాడు శివాజీ. తన యుద్ధనీతికీ, రాజనీతికీ గుర్తుగా, జూన్ 6, 1674 న, రాయఘడ్ కోటలో, వేద పఠనాల మధ్య, శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ, 'ఛత్రపతి’ అనే బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు, 50,000 బలగంతో, దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి, వెల్లూరు, గింగీ లను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి, హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి, సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ, మూడు వారాలపాటు తీవ్ర జ్వరంతో బాధపడుతూ, 1680, ఏప్రిల్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు, రాయఘడ్ కోటలో స్వర్గస్థులైనారు. శివాజీ తదనంతరం, ఆయన పెద్దకొడుకయిన శంభాజీ, రాజ్యాధికారాన్ని చేపట్టి, మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని, రాజ్యాన్ని పరిపాలించాడు.
ఈ శంభాజీ మహరాజ్ చరిత్ర ఆధారంగా నిర్మించిన 'చావా' అనే చిత్రాన్ని ఈ వారం విడుదల చేశారు. ప్రతి భారతీయుడూ తప్పనిసరిగా, కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా ఇది.. తెలుసుకో వలసిన చరిత్ర ఇది..
ॐ 🚩 జై భారత్ 🚩 జై హింద్ 🚩 జై భవాని 🚩జై జగదంబా 🙏
Comments
Post a Comment