దయ్యాలు కట్టిన భారీ శివాలయం Forgotten Shiva Temple Built by Ghosts in One Night
ఒకే రాత్రిలో ‘దయ్యాలు కట్టిన భారీ శివాలయం’!
Forgotten Shiva Temple Built by Ghosts in One Night
మన దేశంలో ఎంతో అద్భుత శాస్త్ర పరిజ్ఞానంతో నిర్మించబడిన ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. ఎటువంటి క్రేన్ లూ, ఆధునిక పరికరాలూ లేని కాలంలోనే మన పూర్వికులు, ఎంతో అద్భుతమైన ఆలయాలను నిర్మించారు. అటువంటి ఆలయాలను చూడటానికీ, ఆ నిర్మాణ నైపుణ్యంపై పరిశోధనలు చేయడానికీ, మన దేశం నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా శాస్త్రవేత్తలు వస్తుంటారు. కానీ, కొన్ని శతాబ్దాల క్రితం మన దేశంలో నిర్మింపబడిన ఓ ఆలయాన్ని, ఏ శాస్త్రవేత్త తాకే ప్రయత్నం చేయడంలేదు. కనీసం దాని దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడతున్నారు. ఎటువంటి ఆధునిక పరికరాలూ, సాంకేతికతా లేని ఆ కాలంలో, అంత భారీ ఆలయం కేవలం ఒక్క రాత్రిలో నిర్మించబడిందంటే నమ్మశక్యం కాదు. శాస్త్రవేత్తలకు ఆ ఆలయం జోలికి వెళ్ళాలంటే వెన్నులో వణుకు పుడుతుందని నిపుణులంటున్నారు. కొన్ని శతాబ్దాల క్రితం ఒక్క రాత్రిలో అంత భారీ ఆలయాన్ని ఎవరు, ఎలా నిర్మించారు? అంతటి అద్భుత కట్టడంపై పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు ఎందుకు భయపడుతున్నారు? ఇంతకీ ఆ ఆలయాన్ని మనుషులే కట్టారా? అసలు ఆ ఆలయం ఎక్కడ ఉంది? దాని చరిత్ర ఏమిటి - వంటి సందేహలెన్నో కలుగుతాయి. మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/6_HQMJgx3CY ]
విద్యకు పుట్టినిల్లు మన భారత దేశమని సగర్వంగా చెప్పుకోవచ్చు. అందుకే మన దేశం విశ్వ గురువు అనే పేరు గడించింది. నేటి అధునిక శాస్త్రవేత్తల దగ్గర కూడా లేని పరిజ్ఞానాన్ని, మన ఋషులు, మహర్షులు ఏనాడో సాధించారు. ఆ పరిజ్ఞానంతోనే, మన దేశంలో ఎన్నో అధ్బుతమైన కట్టడాలు కట్టారు. మరీ ముఖ్యంగా, మానవ సమాజం ధర్మ బద్ధంగా జీవించడానికి అవసరమయ్యే శక్తిని ఇచ్చే ఆలయాలను అద్భుతంగా నిర్మించడానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అందుకే ఏళ్ళు కరిగిపోయినా, శతాబ్దాలు గడిచిపోయినా, ఇప్పటికీ చెక్కు చెదరని పురాతన ఆలయాలు ఎన్నో, మన దేశంలో నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అటువంటి కట్టడాలలో ఒకటే, కకన్ మఠ్ ఆలయం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోరేనా జిల్లాలోని సిహోనియా అనే ఊరికి సమీపంలో, ఈ కకన్ మఠ్ ఆలయం ఉంది. ఇది కేవలం పురాతనమైన ఆలయమే కాకుండా, ఒకప్పటి మన మహర్షుల మహాద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభకూ, అంతకు మించి ఎన్నో రహస్యాలకూ నెలవు. ఇన్ని విశేషాలున్న ఈ ఆలయంపై పరిశోధనలు చేయడానికి, నేటి ఆధునిక శాస్త్రవేత్తలు సాహసం చేయడంలేదు. వారు ఎందుకని ఆ ఆలయాన్ని ముట్టుకోడానికి భయపడతున్నారో తెలుసుకోవాలంటే, ముందు ఆ ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలి.
ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం, 11వ శతాబ్దంలో ఆ ప్రాంతాన్ని పాలించిన కచ్చపఘాటా రాజ వంశానికి చెందిన కీర్తి రాజా, కకన్ మఠ్ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం మధ్య ప్రదేశ్ లోని పురాతన నగరాలలో ఒకటైన Gwalior లో దొరికిన ఒక శిలా శాశానంలో, ఈ కకన్ మఠ్ ఆలయం గురించిన వివరణ ఉంది. అందులో ఉన్న వివరాల ప్రకారం, కీర్తి రాజా అనే మహారాజు, సింహపానీయ అనే నగరం దగ్గర, పార్వతి పతి శివయ్య కోసం భవ్యమైన మహా ఆలయాన్ని నిర్మింపజేశాడు. ఇప్పటి సిహోనియా నగరాన్నే ఒకప్పుడు సింహపానీయ అని పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు.
ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందనే విషయంలో ఎటువంటి ఆధారాలూ లభించకపోయినా, దాదాపు 120 అడుగుల ఎత్తు ఉండే ఈ శివాలయం కేవలం ఒక్క రాత్రిలోనే నిర్మించబడిందని స్థానికంగా వినిపిస్తున్న కథల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, ఈ కకన్ మఠ్ ఆలయాన్ని నిర్మించాడానికి వినియోగించిన బలమైన గ్రానైట్ రాళ్ళు ఆ చుట్టుప్రక్కల ఎక్కడా దొరికేవి కావనీ, కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి అవి అక్కడికి తీసుకురాబడ్డాయనీ నిపుణులు చెబుతున్నారు. ఎంతో బరువుండే ఆ రాళ్ళను ఎటువంటి ఆధునిక పరికరాలూ, వాహనాలూ లేని ఆ కాలంలో, అంత దూరం నుంచి ఎలా తీసుకువచ్చారు? అలా తెచ్చిన వాటిని, అంత ఎత్తుకి ఎలా పేర్చారనే విషయాలు ఇప్పటికీ వీడని మిస్టరీయే. వీటన్నింటినీ మించి, ఇవన్నీ జరిగింది ఒక్క రాత్రిలోనే. కకన్ మఠ్ ఆలయ నిర్మాణంలో ఉన్న మరో వింత ఏమిటంటే, ఆ ఆలయ నిర్మాణంలో ఎటువంతో సిమెంట్, సున్నం లాంటి పదార్ధాలను వాడకుండా, కేవలం ఒక రాయిపై మరో రాయిని పేర్చి, బృహదీశ్వరాలయం నిర్మించిన పద్ధతిలోనే నిర్మించారు. అన్ని శతాబ్దాల క్రితం, ఇటువంటి అద్భుతమైన ఆలయాన్ని మనుషులు నిర్మించడమే కష్టం అయితే, ఒక్క రాత్రిలో నిర్మించడం అసాధ్యం అనీ, ఇది కేవలం అతీత శక్తులు కలిగిన వ్యక్తుల పనో, లేక శక్తి వంతమైన దెయ్యాలపనో అయ్యి ఉంటుందని స్థానికుల నమ్మకం. మన పురాణాల ప్రకారం శివుడిని కేవలం మానవులే కాకుండా, ఎన్నో రకాలైన శక్తులు ఆరాధిస్తూ ఉంటాయనీ, అందులో దెయ్యాలూ పిశాచాలూ కూడా అతీతం కావనీ చెప్పబడింది. స్మశాన వాసి అయిన ఆ పరమేశ్వరుడు, అక్కడ ఉండే దెయ్యాలను తన ఆధీనంలో ఉంచుకుని, మానవులకు ఎటువంటి హానీ కలగకుండా చేస్తాడని కూడా మన పురాణాలలో పేర్కొనబడింది. ఆ స్వామిపై ఉన్న భక్తి వల్లనే దెయ్యాలు, రాత్రికి రాత్రి మధ్యప్రదేశ్ లో కకన్ మఠ్ ఆలయాన్ని నిర్మించినట్లు అక్కడి జానపదాలలో వినిపిస్తుంది.
ఇక కకన్ మఠ్ ఆలయం పేరు వెనుక కూడా, కొన్ని కథనాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించిన సూరజ్ పాల రాజు భార్య అయిన కకనావతి పేరు మీదనే ఈ ఆలయానికి కకన్ మఠ్ అనే పేరు వచ్చిందని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది. రాణీ కకనావతి ఆ శివాలయంలో క్రమం తప్పకుండ విశేష పూజలు నిర్వహిస్తూ, ఆలయ అభివృద్ధికై ఎంతగానో కృషి చేసిందని అంటారు. అందువల్లనే ఆమె భర్త ఆ ఆలయానికి కకన్ మఠ్ అనే పేరు పెట్టాడని స్థానికులు చెబుతారు.
అయితే, ఈ గాధను చాలా మంది చరిత్రకారులు అంగీకరించడం లేదు. రాణీ కకనావతి పేరు మీద ఈ ఆలయానికి కకన్ మఠ్ అనే పేరొచ్చిందని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదని వారి వాదన. ఒకప్పుడు కకన్ మఠ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాకుండా, మఠం లాగా కూడా భాసిల్లింది. ఆ కాలంలో ఈ మఠాన్ని కనక్ మఠ్ అని పిలిచేవారని కొందరు చరిత్రకారులంటున్నారు. సంస్కృత భాషలో కనక్ అంటే బంగారం అని అర్ధం. బంగారం వంటి అమూల్యమైన జ్ఞానాన్ని అందించే ప్రదేశం గనుక, ఈ ఆలయాన్ని కనక్ మఠ్ అని పిలిచేవారనీ, ఆ పేరే కాలగమనంలో కకన్ మఠ్ గా మారిపోయిందనీ చరిత్రకారుల అభిప్రాయం.
మన దేశంపై ముస్లిం రాజులు చేసిన దండయాత్రలలో ఎన్నో ఆలయాలు ధ్వంసం అయిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే కకన్ మఠ్ ఆలయాన్ని కూడా వారు చాలా వరకూ నాశనం చేసినట్లు చరిత్ర నిరూపితం. మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని మొఘలులు ఆక్రమించుకునే సమయానికి, కకన్ మఠ్ ఆలయం ఎనలేని సంపదలతో తులతుగేది. దానితో మొఘల్ సేనలు కకన్ మఠ్ ఆలయాన్ని దోచుకుని, ధ్వంసం చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయితే, ఎంతో పటిష్ఠంగా నిర్మించబడిన కకన్ మఠ్ ఆలయాన్ని సాధారణ కత్తులూ, బరిసెలూ, గడ్డపారలతో కదలించలేకపోవడంతో, చివరకు ఆలయంపై ఫిరంగులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో అప్పట్లో కకన్ మఠ్ ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలను పూర్తిగా నాశనం చేసి, ప్రధాన ఆలయాన్ని మాత్రం కుల్చలేకపోయారని చరిత్రకారులంటున్నారు. అలా ఆ నాటి నుంచీ కకన్ మఠ్ ఆలయం ఒక శిధిలాలయంగా మిగిలిపోయింది.
నాడు ముష్కరుల దాడికి పాక్షికంగా ధ్వసం అయినా, నేటికీ ఆ ఆలయం కూలిపోకుండా అలాగే నిలబడి ఉండటం ఒక విశేషమయితే, ఎన్నో భారీ ప్రకృతి విపత్తులను సైతం తట్టుకుని కకన్ మఠ్ ఆలయం ఈ నాటికీ స్థిరంగా నిలబడి ఉండటం మరో అద్భుతంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారత పురావస్తు సర్వే సంస్థ (ASI) ఆధీనంలో ఉన్న కకన్ మఠ్ ఆలయం, మన దేశంలోని ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. మొఘలుల దాడులలో బాగా దెబ్బ తిన్న ఈ ఆలయం, తాము పరిశోధనలు చేసే క్రమంలో రాళ్ళను కదలిస్తే, పూర్తి నిర్మాణం కూలిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందువల్లనే కకన్ మఠ్ ఆలయాన్ని శాస్త్రవేత్తలు ముట్టుకోవడానికి భయ పడుతున్నారు.
అంతేకాదు, కేవలం శాస్త్రవేత్తలనే కాకుండా, సాధారణ ప్రజలను కూడా భయపట్టే మరో విశేషం కకన్ మఠ్ ఆలయంలో ఉంది. అదేమిటంటే, రాత్రి వేళల్లో ఈ ఆలయం దగ్గర ఎవరైనా పొరబాటునయినా ఉండిపోతే, తెల్లవారే సరికి భయంతో వారికి మతి భ్రమించడమో, లేక గుండె ఆగి చనిపోవడమో జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో కకన్ మఠ్ ఆలయం దగ్గర దెయ్యాలు తిరుగాడుతాయనీ, పోరబాటునో, గ్రహ పాటునో అక్కడ ఉండిపోయిన మనుషులను అవి భయంకరంగా వేధిస్తాయనీ స్థానికులంటున్నారు. రాత్రి వేళల్లో అక్కడ ఉండిపోయిన ఎంతో మందికి అటువంటి అనుభవం ఎదురయ్యిందని కూడా చెబుతున్నారు.
ఈ విషయంపై స్థానికంగా రెండు కథనాలు వినిపిస్తునాయి. ఒకప్పుడు ఆ గుడిని దెయ్యాలు నిర్మించడం వల్ల, రాత్రి వేళలలో దెయ్యాలు అక్కడికి వచ్చి శివయ్యకు సేవ చేసుకుంటాయనీ, అందువల్ల ఆ సమయంలో మనుషులు వెళ్తే, తీవ్ర ఇబ్బందులకు గురికావలసి వస్తుందనీ ఒక కథనమయితే, మరో కథనం ప్రకారం, పూర్వం మొఘల్ దుండగుల దాడుల సమయంలో, కకన్ మఠ్ ఆలయం దగ్గర తీవ్రమైన నరమేధం జరిగిందనీ, ఆ సమయంలో ఆలయం దగ్గర ఉన్న ప్రజలనూ, అక్కడ పూజలు నిర్వహిస్తున్న పూజారులనూ ఆ పాషాండ హృదయులు పరమ కిరాతకంగా చంపారనీ, అలా ఆనాడు చనిపోయిన వారి ఆత్మలే, నేటికీ అక్కడ రాత్రి వేళల్లో సంచరిస్తున్నాయనీ చెబుతారు. ఈ కారణాల వల్లనే నేటికీ కకన్ మఠ్ ఆలయానికి రక్షగా ఉండే సెక్యురిటి సిబ్బంది, రాత్రి వేళల్లో మాత్రం, దగ్గరలో ఉండే గ్రామాలలోకి వెళ్లి, తిరిగి సూర్యోదయం అయ్యాకే గుడి దగ్గరకు వస్తారని, స్థానికులంటున్నారు.
🚩 ఓం నమః శివాయ 🙏
Comments
Post a Comment