RAVANA'S LANKA: The Landscape of a Lost Kingdom | సముద్ర గర్భంలో కలిసిపోయిన రావణ లంక!


సముద్ర గర్భంలో కలిసిపోయిన రావణ లంక!

కుబేర నిర్మితం, స్వర్ణ శోభిత భవంతులతో దేదీప్యమానంగా వెలిగిన ప్రదేశం, ఆ యుగం చూడని అద్భుతమైన శాస్త్ర పరిజ్ఞానం కలిగిన నగరం, రావణ ఆక్రమిత ‘లంక’. అసుర రాజు ఏలిన లంక.. సీత మాత కన్నీటితో మలినమైన లంక.. హనుమ దహించిన లంక.. రాముడి చేతిలో పరాజయం పొందిన లంక.. నేడు మనకు కనిపిస్తున్న శ్రీలంక కాదా..? మరి రావణ పాలిత లంక నేడు ఉన్న శ్రీలంక కానప్పుడు, అసలు లంక ఎక్కడ ఉంది..? అలాంటప్పుడు ధనుష్కోటి నుంచి శ్రీలంకను కలుపుతున్న రామసేతు, రాముడు నిర్మించినదెలా అయ్యింది? రావణ లంక కుమారీ ఖండంలో భాగమా..? మరి ఇప్పుడున్న శ్రీలంక ఏమిటి? అసలు శ్రీలంకను రావణ లంకగా ఎందుకు భావిస్తున్నారు..? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ZgGKSd_PD_Q ]


నేటి శ్రీలంక రావణ లంక కాదా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే, అసలు రామాయణం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయాలు స్పష్టంగా తెలియడానికి మనకు ముందుగా కనిపించే ఆధారం వాల్మీకి రామాయణం. అసలు త్రేతాయుగంలో రామాయణం జరిగిందని చెప్పడానికి ఉన్న ఏకైక ఆధారం, వాల్మీకి మహర్షి రచించిన రామాయణ కావ్యం. అయితే, అసలైన రావణ లంక గురించిన స్పష్టత రావడానికి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చరిత్ర, భౌగోళిక మార్పులు, ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంపై కూడా కాస్తంత పట్టు ఉండాలని నిపుణులంటున్నారు.

రామాయణం.. భారత దేశ చరిత్రలో ఓ ముఖ్య ఘట్టం. ప్రపంచ మానవాళికి ఆదర్శ ఇతిహాసం. అయితే, వాల్మీకి లిఖిత రామాయణంలో, సీతా రాములు, తక్కిన పాత్రల పుట్టుపూర్వోత్తరాలే కాకుండా, నాడు రామాయణం జరిగిన ప్రదేశాల గురించీ, నాటి ప్రపంచ స్థితిగతుల గురించీ, భౌగోళిక విశేషాల గురించీ, ఎంతో స్పష్టంగా తెలియజేశారు వాల్మీకి మహర్షి. నేడు ఉన్న సీరియల్స్, సినిమాల దయవల్ల, సీతా మాత అన్వేషణ కోసం సుగ్రీవుల వారు కేవలం ఆంజనేయుడు, జాంబవంతుడు, అంగదుడిని మాత్రమే పంపినట్లు అందరూ అనుకుంటారు. కానీ నిజానికి, వాల్మీకి రామాయణంలోని కిష్కింధ కాండను పరిశీలించినప్పుడు, ఆయన మొత్తం నాలుగు దళాలను సిద్ధం చేసి, నలు వైపులకూ పంపడం జరిగింది. ప్రతి దళంలో, తన దగ్గర ఉన్న అత్యంత శ్రేష్టులైన దళపతులను నియమించాడు. వారు బలంలో హనుమంతుల వారికి ఏ మాత్రం తీసిపోరు. ఒక విధంగా చెప్పాలంటే, అప్పటికి ఇంకా హనుమకు తన పూర్తి శక్తి తెలియదు కాబట్టి, ఆ సమయంలో ఆ దళపతులు ఒకింత హనుమకంటే బలమైన వారని, వాల్మీకి రామాయణంలో పేర్కొనబడింది. ఇది హనుమంతుల వారిని కించపరచే ఉద్దేశం కాదనేది మనం గమనించాలి. కేవలం ఆ సమయానికి హనుమ పూర్తి శక్తి ఆయనకే తెలియదు కాబట్టి, నాడున్న పరిస్థితీ, అప్పటి బాలాబలాల రీత్యా ఈ పొంతన వ్యక్త పరచడం జరిగింది.

ఇలా సిద్ధం చేసిన ప్రత్యేక వానర దళాలను భూమిపై నాలుగు దిక్కులకు పంపుతూ, వారి వారి దిక్కుల్లో ఎటువంటి ప్రదేశాలు వస్తాయి, ఎటువంటి ఆటంకాలు ఉంటాయి, అక్కడ బౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉండే ప్రజలు, వింతలు, విశేషాల వంటి అన్నిటి గురించీ సుగ్రీవ మహారాజు తన సేనలకు చెప్పి పంపాడు. ఈ క్రమంలో అంజనేయుడి దళాన్ని దక్షిణ దిక్కుకు వెళ్ళమని అజ్ఞాపించి, వారికి దక్షిణ దిక్కులో ఉన్న అన్ని ప్రదేశాల గురించీ స్పష్టంగా తెలియజేశారు. అందులో భాగంగా, మన ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తమిళ నాడు ప్రాంతాల గురించీ, అక్కడ ఉండే నదులూ, వింతలూ విశేషాల గురించీ చెబుతూ, ఆఖరున దాదాపు నూరు యోజనాల దూరంలో, సముద్రం మధ్యలో నూరు యోజనాల విస్తీర్ణం కలిగిన ప్రాంతంగా లంక గురించీ, దానిని రావణుడు పరిపాలిస్తుండడం గురించీ చెప్పారు.

అలా సుగ్రీవుడు చెప్పిన ఆనవాళ్ళను పట్టుకుని వెళ్ళిన హనుమంతుల వారి దళం, మన దేశానికి దక్షిణ దిక్కున ఉన్న ప్రతి ప్రాంతాన్ని అత్యంత వేగంగా జల్లెడ పడుతూ వెళ్ళి, ఆఖరికి తమిళ నాడు చివరన ఉన్న మహేంద్రగిరి పర్వత ప్రాంతంలో ఆగారు. ఇక అక్కడితో భూమి అంతమై, విశాలమైన సముద్రం కనిపించ సాగింది. సముద్రం మధ్యలో లంక అనే ప్రాంతం ఉందని తెలిసినా, అక్కడికి వెళ్ళే మార్గం లేక, సీతామాత జాడలు కనిపించలేదన్న నిరాశతో కూర్చున్నప్పుడు, ఆ తల్లి జాడలు తెలియజేసింది సంపాతి అనే పక్షి. సీతా మాతను అపహరిస్తూ, వాయు మార్గంలో పుష్పక విమానంపై వెళ్తున్న అసుర రాజును అడ్డుకునే ప్రయత్నంలో అసువులు బాసిన జటాయువుకు స్వయానా అన్న ఈ సంపాతి. ఈ వివరాలతో మనం గతంలో చేసిన వీడియో link ను, చూడని వారికోసం icards లోనూ, description లోనూ పొందుపరుస్తున్నాను.

ఆ సమయంలో ఆంజనేయుడు, జాంబవంతుడి ప్రోద్బలంతో తన శక్తిని తెలుసుకుని, మహేంద్రగిరి పర్వతం ఎక్కి, అక్కడి నుంచి దక్షిణ పశ్చిమ దిశలో ఉన్న రావణ లంకకు, నూరు యోజనాల మేర సముద్రాన్ని దాటి వెళ్ళినట్లు, వాల్మీకి రామాయణంలో పేర్కొనబడి ఉంది. ఇక్కడ ఒక యోజనం అంటే 12.8 కిలోమీటర్లు. ఆ విధంగా చూసుకుంటే, వంద యోజనాలంటే దాదాపు 1280 కిలోమీటర్ల దూరం. అలా హనుమంతుల వారు మహేంద్రగిరి పర్వతం నుంచి, 1280 కిలోమీటర్ల దూరం ఎగిరి లంకను చేరుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న శ్రీలంక, భారత భూభాగం నుంచి మహా అయితే 50 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అలా చూస్తే, నాడు హనుమంతుడు వెళ్ళింది నేటి శ్రీలంకకు కాదు.

నేటి శ్రీలంక నాటి రావణ పాలిత లంక కాదని చెప్పడానికి మరిన్ని ఆధారాలున్నాయి. మనం ముందు చెప్పుకునట్లు, సుగ్రీవుడు రావణ పాలిత లంక గురించి చెప్పినప్పుడు, దాని విస్తీర్ణం కూడా దాదాపు 100 యోజనాలు, అంటే, 1280 చదరపు కిలోమీటర్లు ఉంటుందని చెప్పుకున్నాము. ఆ విధంగా చూసుకున్నా, నేడు శ్రీలంకగా పేర్కొంటున్న ద్వీప దేశం విస్తీర్ణం, కేవలం 50 నుంచి 60 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ లెక్కన కూడా నేటి శ్రీలంక, ఆనాటి రావణ లంక కాదని అర్ధం అవుతూ ఉంది.

ఇక మూడవ ఆధారంగా, మన పురణాలతో పాటు, నేటి శ్రీలంక చరిత్రను పరిశీలిస్తే.. ఎక్కడా కూడా నాటి లంకను శ్రీలంక అని పిలవలేదు. ఆధునిక చరిత్రకారుల దగ్గరున్న ఆధారాల ప్రకారం చూసుకున్నా, సామాన్య శకం కంటే ముందు, అంటే, 266 బిసిలో, నేడు శ్రీలంకగా పిలవబడుతున్న ప్రాంతాన్ని, Devanampiya Tissa అనే మహారాజు ఆక్రమించుకుని చక్రవర్తిగా పేరుగాంచాడని తెలుస్తోంది. ఆ సమయంలో ఆ ప్రాంతం సింహళ దేశంగా పేర్కొన బడింది. మన పురాణాలలో కూడా సింహళ దేశం గురించి వివరింపబడివుంది. అలాగే శ్రీలంక గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్థావించబడింది. అప్పటి నుంచి బ్రిటీషర్లు, డచ్, ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడికి వచ్చే వరకు, నేటి శ్రీలంకను సింహళ దేశంగానే పిలిచేవారు. 80, 90 దశకాలవరకూ భారత దేశ Map ని పరిశీలిస్తే, శ్రీలంక పేరు సింహళ గానే ఉండేది. ఇదిలా ఉంటే, మన భాష లోని పేర్లను పలకడం రాని తెల్ల సన్నాసులు, సింహళను సిలోన్ గా పిలవడం మొదలు పెట్టారు. అధికారిక రికార్డ్స్ లో కూడా అదే పేరును పెట్టేవారు. నేటికీ మన దేశంలో చాలా గ్రామాలూ, పట్టణాల పేర్లు వింతగా మారిపోడానికి ఆ బ్రిటిష్ దొరల నాలుక మందమే కారణం.

అయితే, బ్రిటీషర్లు పోతూ పోతూ చేసిన వెధవ పనుల్లో ఒకటి, సిలోన్ ని కూడా ఓ ప్రత్యేక దేశంగా మార్చడం. ఇదిలా ఉంటే, స్వాంతంత్ర్యం పొందిన కొన్నేళ్లకే, అంటే 1950లలోనే, నాటి సిలోన్ ప్రభుత్వం తమ దేశం పేరును లంకగా మార్చుకోవడం జరిగింది. సంస్కృతంలో లంక అంటే, దీవి అని అర్ధం. సంస్కృతం నుంచి వచ్చిన ఈ పదాన్నే, మన దేశంలోని అనేక స్థానిక బాషలు కూడా ఇంజెక్ట్ చేసుకున్నాయి. ఉదాహరణకు మన తెలుగులో కూడా island ని లంక అని పిలుస్తాము. మన దేశంలో రెండవ అతిపెద్ద నది అయిన గోదావరిని పరిశీలిస్తే, ఆంధ్రపదేశ్ లోని రాజమహేంద్రవరం దగ్గరలో ఉన్న అఖండ గోదావరి మధ్యలో చాలా దీవులు కనిపిస్తాయి. వాటిలో కాస్త పెద్ద దీవులలో నేటికీ జనాలు నివాసముంటుంటే, వాటిలో కొన్నిటికి బొబ్బరలంక, పిచ్చుక లంక వంటి పేర్లను గమనించవచ్చు. దానిని బట్టి లంక అనే పదానికి అర్ధం island అని స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. అలానే నాటి సిలోన్ ప్రభుత్వం, 1950ల నుంచి తమ దేశాన్ని లంక అని పిలుచుకోవడం మొదలు పెట్టగా, 1972 లో.. శుభ సూచకంగా శ్రీ లంక అనే పేరును పెట్టుకున్నారు. అప్పటి నుంచి మాత్రమే, సింహళ దేశం శ్రీలంకగా మారింది. దీనిని బట్టి కూడా, నాటి రావణ పాలిత శ్రీలంక నేటి శ్రీలంక కాదని, స్పష్టంగా తెలిసిపోతుంది.

మరి అసలు లంక ఎక్కడుంది..? అనేదే ఇప్పుడు మనకు తెలియాల్సి వుంది.. దానికి సమాధానం కూడా, మన పురాణాలూ, చారిత్రక గ్రంధాలలోనే కాకుండా, భారతీయ ఖగోళ శాస్త్ర పండితులు లిఖించిన పుస్తకాలలో కూడా ఉంది. మన దేశంలో ఆది కాలంలోనే ఖగోళ శాస్త్రంపై లిఖించ బడిన గ్రంధం, సూర్య సిద్ధాంతం. నేటి ప్రపంచం, ముఖ్యంగా ఖగోళ శాస్త్రజ్ఞులు ఎంతగానో కొలిచే మన భారతీయ ప్రాచీన ఋషులైన ఆర్య భట్ట, వరాహమిహిర, బ్రహ్మ గుప్తుడు వంటి ఎంతో మంది రాసిన పుస్తకాలలో, ప్రత్యేకంగా చెప్పబడిన విషయం మధ్య రేఖ. దానినే నేటి కాలంలో, Prime Meridian Line అని పిలుస్తున్నారు. దాదాపు 150 ఏళ్ల క్రితం, ఈ Prime Meridian Line తమ దగ్గర నుంచి వెళ్తుందని బ్రిటిష్ వారు వాదించి ప్రచారం చేసుకున్నారు. దాంతో అప్పటి నుంచి ఆ Prime Meridian Line, లండన్ నుంచి వెళ్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కానీ, ఈ తెల్లదొరలకు అసలు భూమి ఏ షేప్ లో ఉందో కూడా తెలియని ఆ కాలంలోనే, ఖగోళ శాస్త్రాన్ని అవపోసన పట్టిన మన శాస్త్రవేత్తలు, మధ్య రేఖ మన దేశంలో ఉన్న కురుక్షేత్రం, ఉజ్జయిని వంటి ప్రదేశాల గుండా వెళ్తుందనీ, అదే లైన్ లో లంక ఉందనీ చెప్పడం జరిగింది. ఆ లెక్కన పరిశీలించినా నేటి శ్రీలంక, నాటి రావణ లంక కాదని మరోసారి రూఢీ అవుతుంది. ఎందుకంటే, మన పూర్వీకులు చెప్పిన ఆ మధ్య రేఖకూ, నేడు ఉన్న శ్రీలంకకూ చాలా దూరం ఉంది.

వాల్మీకి మహర్షి వివరణ ప్రకారం, మహేంద్రగిరి పర్వతం నుంచి దక్షిణ పశ్చిమ దిశలో, నూరు యోజనాల దూరంలో, మధ్య రేఖ మీదుగా వెళ్తున్న ఏకైక ప్రాంతం, నేడు మనకు తెలిసిన మాల్దీవ్స్ అనే ప్రాంతం. శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న ప్రకారం, నాటి రావణ లంక, నేటి మాల్దీవ్స్ కి అతి సమీపంలో ఉండేదనీ, ప్రస్తుతం అది సముద్ర గర్భంలో కలిసిపోయిందనీ భావిస్తున్నారు. అందుకే ఆ పరిసరాలలోని చాలా ప్రాంతాలలో అస్సలు లోతు ఉండదని నిపుణులు చెబుతున్నారు.

కొంతమంది పరిశోధకుల అంచనా ప్రకారం, రామాయణం జరిగి దాదాపు 11 నుంచి 12 వేల సంవత్సరాలు అయ్యి ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఇన్నేళ్లల్లో భూమిపై వచ్చిన చాలా మార్పుల కారణంగా, ఎన్నో తీర ప్రాంతాలూ, మరెన్నో దీవులూ సముద్ర గర్భంలో కలిసి పోయాయి. వాటిలో రావణ లంక కూడా ఒకటని తెలుస్తోంది. అంతేకాదు.. నాటి లంక కనుమరుగు కావడానికి అగ్ని పర్వతాలు కూడా కారణం అయ్యి ఉండవచ్చని ఒక అంచనా. ఎందుకంటే, దీవులలో ఉన్న అగ్ని పర్వతాలు భారీ స్థాయిలో విస్పోటనం చెందినప్పుడు, ఆ ప్రభావం కారణంగా దీవులు కూడా ముక్కలు ముక్కలై, నీటిలో కలిసిపోతాయని, ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ, 1883లో జరిగిన భారీ అగ్ని పర్వతం పేలుడును చెప్పుకోవచ్చు. కొన్ని వేల ద్వీపాల సమూహంగా ఏర్పడ్డ దేశం, ఇండోనేషియా అనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటికీ ఆ దేశంలోని ఎన్నో దీవులలో అగ్ని పర్వతాలున్నాయి. అయితే, వాటి వల్ల Krakatoa అనే దీవి 70 శాతం నాశనమై సముద్ర గర్భంలో కలిసిపోయింది. అదే విధంగా, నాటి రావణ లంక నీట మునగడానికి కూడా అలాంటి భయంకరమైన అగ్ని పర్వతాల పేలుళ్ళో, భారీ సునామీలో, భూమి పొరల్లోని Tectonic Plates కదలికల వంటి పలు కారణాలుండవచ్చని నిపుణుల అంచనా.

అయితే కొంతమంది చరిత్రకారులు, రావణ లంక ఒకప్పటి కుమారీ ఖండంలో భాగమా! అనే సందేహాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. చాలా మంది పాశ్చాత్య చరిత్రకారులు, కుమారీ ఖండం ఉనికిపై పలురకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ తమిళ ప్రాచీన చరిత్రలో, అక్కడి పల్లె పాటల్లో, కుమారీ ఖండం ప్రస్థావన ఉంటుంది. తమిళ భాషలో రాసిన ఎన్నో పురాతన గ్రంధాలలో కూడా కుమారీ ఖండం ప్రస్థావన ఉంది. ఉదాహరణకు, 2వ శతాబ్దంలో రాసిన Manimekalai అనే పుస్తకంలోనూ, 5వ శతాబ్దంలో రాసిన Silappathikaaram అనే పుస్తకంలోనూ, కుమారీ ఖండం గురించి ప్రస్థావించబడి వుంది. మన దేశ చరిత్రకారులు చాలా మంది, దాదాపు 25 వేల సంవత్సరాల ముందు వరకూ కుమారీ ఖండం ఉండేదనీ, తర్వాత ఆ ఖండం మొత్తం సముద్ర గర్భంలో కలిసిపోయిందనీ, అందులో మిగిలి పోయిన భాగమే నాటి రావణ లంక అయ్యి ఉండవచ్చనీ అంటున్నారు. అయితే ఈ విషయాన్ని నిరూపించడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి వుంది.

ఇదంతా విన్న తర్వాత, నేటి శ్రీలంక రావణ లంక కానప్పుడు, నేడు కనిపిస్తున్న రామ సేతు మానవ నిర్మితం కాదా? మరి అసలైన రామ సేతు ఎక్కడ ఉంది? అనే సదేహం కలుగుతుంది. దానికి సమాధానం, వాల్మీకి రామాయణంలోనే స్పష్టంగా చెప్పబడింది. రామ రావణ యుద్ధానంతరం, లంక నుంచి రాక్షసులు సులువుగా భారత దేశంలోకి రాకుండా కట్టడి చేయడానికి, స్వయంగా రాముడే రామ సేతును నాశనం చేశాడని ఉంది.

అయితే చరిత్రకారులు చెబుతున్నదాని ప్రకారం, ఇప్పుడున్న రామ సేతుని రావణుడి తమ్ముడూ, రామ బంటు అయినటువంటి విభీషణుడు, రాముడి జ్ఞాపకార్ధం, సింహళ ద్వీపం నుంచి ధనుష్కోటి వరకు కట్టించడం జరిగింది. ఆ విధంగా ఈ నిర్మాణానికి రామ సేతు అనే పేరు రావడంతో పాటు, ఆనాటి మన ఘన చరిత్రకు ఆనవాలుగా నిలిచింది. కొంతమంది చరిత్రకారుల పరిశోధనల ప్రకారం, ఒకప్పుడు రావణ రాజ్యం, నేటి మన మహారాష్ట్ర వరకు ఉండేది. దానితో సింహళ దేశం కూడా వారి ఆధీనంలోనే ఉండేది. భారత భూ భాగానికి అతి సమీపంలో ఉండటం చేత, ఆ కాలంలోనే రావణుడు, సింహళ దేశంలో ఓడ రేవులూ, తన పుష్పక విమానం దిగడానికి వీలుగా హేలీ ప్యాడ్ వంటివి నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. దానితో సింహళ దేశంలో నాటి నుంచి జనావాసాలు ఏర్పడ్డాయి. అయితే రావణ లంక అంతమైన తర్వాత, మిగిలిన కొద్దిమందినీ విభీషణుడు సింహళ దేశానికి తరలించినట్లూ, ఆ తర్వాత సేతు నిర్మాణం చేసి దానికి రామ సేతు అనే పేరు పెట్టినట్లూ భావిస్తున్నారు.

విభీషణుడు నిర్మించిన కాలంలో నేడు చూస్తున్న రామ సేతు చాలా పెద్దగా, బాగా విశాలంగా ఉండేది. కాల గమనంలో వచ్చిన మార్పుల వల్ల రామ సేతు కుచించుకుపోతూ వచ్చింది. దాదాపు 15, 16 శతాబ్దాల వరకూ రామ సేతుపై నడుచుకుంటూ సింహళ దేశం వెళ్ళడానికి అవకాశం ఉండేది. సిక్కు మత స్థాపకుడూ, సిక్కుల ఆది గురువూ, శ్రీరామ భక్తుడూ అయిన గురు నానక్ కూడా, 1511లో రామ సేతుపై నడుచుకుంటూ శ్రీలంక వెళ్ళడం జరిగినట్లు, సిక్కుల చారిత్రక గ్రంధాలలో పేర్కొనబడి ఉంది. చాలా ఏళ్లుగా ఆ ప్రాంతంలో సంభవిస్తున్న సైక్లోన్స్ కారణంగా రామ సేతు కొద్ది కొద్దిగా నాశనమవుతూ వస్తుండగా, 1964లో వచ్చిన భారీ సైక్లోన్ కారణంగా, పూర్తిగా నాశనమైనట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, 1964లో వచ్చిన సైక్లోన్ కారణంగా, అతి ప్రాచీనమైన ధనుష్కోటి పట్టణం కూడా పూర్తిగా నాశనం అయ్యింది.

నాటి తమిళనాడు ప్రభుత్వం, ధనుష్కోటిని మళ్ళీ బాగు చేయడం మానేసి, దాన్ని ఒక Ghost Town గా ప్రకటించి, చేతులు దులుపుకుంది. కానీ, హైందవ చరిత్రలో రామయణంతో ముడిపడి ఉన్న ధనుష్కోటి లేకపోతే, భావితరాలకు మన ఘన చరిత్ర తెలిసే అవకాశం లేదని భావించిన కొంతమంది హిందువులూ, కొన్ని హిందూ సంఘాల వారూ పూనుకుని, ధనుష్కోటిని కొంత వరకూ బాగు చేసి, అక్కడ ఉన్న వింతలను వెలికి తీశారు. నేడు మనం ధనుష్కోటిని చూడగలుగుతున్నాం అంటే, అది వారి చలవే అని చెప్పుకోవాలి.
ఎంతో ఘనమైన మన చరిత్ర నేటి యువతకు తెలియకపోడానికి కారణం, గడచిన వెయ్యి సంవత్సరాలుగా మనపై జరిగిన భౌతిక, సాంస్కృతిక దాడులే. నాటి ముస్లిం పాలకులు మన చరిత్రకు ఆలవాలంగా నిలిచే లక్షలాది ఆలయాలనూ, వేలాది గ్రంధాలయాలనూ నాశనం చేయడం వల్ల, మన అసలు చరిత్ర చాలా వరకూ మరుగున పడిపోగా, రెండువందల ఏళ్ల బ్రిటిష్ దొరల పాలన కారణంగా మరింతగా దారి మళ్ళింది.

అయితే, ‘నిజం నివురు గప్పిన నిప్పు’ అది ఎప్పటికైనా తెలిసి తీరుతుందనే నానుడిని నిరూపిస్తూ, నేడున్న ఆధునిక పరిజ్ఞానం సహాయంతో కొంతమంది చరిత్రకారులూ, నిపుణులూ అసలు చరిత్రను వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నంలో బయట పడిన వాస్తవాలే ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్. అయితే, అతి పురాతనమైన భారత దేశ చరిత్రను పూర్తిగా వెలికి తీసేంత వరకూ ఈ పరిశోధనలు కొనసాగాలనీ, దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహాయ సహకారాలు అందించాలనీ కోరుకుంటున్నాను.

🚩 జై శ్రీరామ 🙏

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home