5000-year-old statue within a 1500-year-old temple | వింత ఆలయం!


వింత ఆలయం! TELUGU VOICE
గ్రహణ సమయంలోనూ మూయని గుడి! నైవేద్యం అలస్యమైతే శుష్కించిపోయే విగ్రహం!

ధర్మనిరతికీ ఎనలేని విజ్ఞానికీ పుట్టినిల్లు మన భారత దేశం అన్నది చారిత్రక వాస్తవం. అదే చరిత్ర, ఈ దేశం ఎన్నో అంతు చిక్కని మిస్టరీలకూ, ఆధునిక శాస్త్రవేత్తలకు సైతం అర్ధంకాని రహస్యాలకూ పుట్టినిల్లని చెబుతోంది. మరీ ముఖ్యంగా మన దేశంలో ఉన్న కొన్ని ఆలయాలు అటువంటి రహస్యాలకు కేంద్రంగా నిలుస్తున్నాయి. సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలన్నీ, గ్రహణ సమయంలో మూసి వేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయం మాత్రం ఆ సమయాలలో కూడా తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో ఆహార పదార్ధాలు విషపూరితమవుతాయని సైన్స్ పరంగా కూడా నిరూపితమయ్యింది. మనుషులు తీసుకోకపోవడమే కాకుండా, మనం పూజించే దేవతా విగ్రహాలకు కూడా ఆ సమయంలో ఎటువంటి ఆహారమూ నివేదించడం జరగదు. కానీ ఈ ఆలయంలోని స్వామివారికి మాత్రం పసందైన ఫలహారాలను వండి సమర్పిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరంలో 365 రోజులూ, గ్రహణం వచ్చినా, వరదొచ్చినా, సునామీయే వచ్చినా, ఈ ఆలయంలోని దేవతా మూర్తికి నైవేద్యం పెట్టడం మాత్రం మానరు. ఒకవేళ అలా గనుక పెట్టకపోతే, ఆ విగ్రహం వెంటనే బక్కచిక్కి పోతుందని అంటున్నారు. లోహపు విగ్రహం బక్కగా అయిపోవడమేమిటని ఆశ్చర్యం కలగవచ్చు. అవును, ఒక్క పూట సమయానికి నైవేద్యం పెట్టకపోతే, వెంటనే విగ్రహం బక్కగా అయిపోతుందని అంటున్నారు అర్చకులు. ఇక్కడ మరో విశేషమేమిటంటే, ఈ విగ్రహ చరిత్ర ఏకంగా 5000 ఏళ్లనాటి మహా భారత కాలానికి ముడిపడి ఉందని చెబుతున్నారు. మరి అటువంటి వింత ఆలయం ఎక్కడుంది..? అక్కడ ఎవరిని పూజిస్తారు..? ఎందువల్ల అక్కడ విగ్రహం ఆహారం లేకపోతే శుష్కించి పోతుంది..? వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/VyGhUyDsABQ ]


‘కేరళ’ అంటే, దేవ భూమి, God's Own Country అనే పేరుంది. అందమైన ప్రకృతి సోయగాలతో పాటు, ఎంతో పురాతమైన ఆలయాలకూ, సంప్రదాయ సంస్కృతులకూ, విద్యలకూ, కళలకూ పుట్టినిల్లు వంటిది, కేరళ. కేరళ చరిత్రకు సంబంధించి మనం గతంలో చేసిన వీడియోను తప్పనిసరిగా చూడండి.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వింత ఆలయం కూడా, సాక్ష్యత్తు పరశురామ నిర్మితమైన కేరళ రాష్ట్రంలోనే ఉంది. అదే.. తిరువరప్పు శ్రీకృష్ణ మందిరం.

ఈ ఆలయం కొట్టాయం నగరానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువరప్పు అనే ఊరిలో ఉంది. కేరళలో ఉన్న అతి ముఖ్యమైన విష్ణుమూర్తి అవతారాలకు చెందిన ఆలయాలలో, తిరువరప్పు శ్రీకృష్ణ మందిరం ముఖ్యమైనదిగా చెబుతారు. చరిత్రకారులూ, ఆద్యాత్మిక వేత్తలూ చెబుతున్నదాని ప్రకారం, ఈ ఆలయంలో ఉన్న శ్రీ కృష్ణుడి విగ్రహం కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదనీ, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడి ఆత్మ శక్తితో నిబిడీకృతమై ఉందనీ, అందుకే ఈ విగ్రహానికి సమయానికి నైవేద్యం అందకపోతే, మనుషులు తిండిలేకపోతే ఏ విధంగా శుష్కించి పోతారో, అదే విధమైన మార్పు ఈ విగ్రహంలో కూడా కనిపిస్తుందనీ తెలుస్తున్న వింత విషయం. ఇక్కడ స్వామి వారికి నైవేద్యం పెట్టే విధానాన్ని గమనించినా, దానికి వారు చేసుకునే సన్నాహాలు చూసినా నోట మాట రాదు.

సాధారణంగా మన దేశంలో ఉన్న ఇతర ఆలయాలన్నీ, ఉదయం 4 గంటలకో 5 గంటలకో తెరుస్తారు. కొన్ని ప్రముఖ పుణ్య క్షేత్రాలు మాత్రం 3 గంటలకు తెరిచి, ముందుగా ఆలయాన్ని శుభ్రం చేసుకుని, ఆ తరువాత స్వామివారికి అభిషేకం చేసి, ఆఖరున నైవేద్యం పెట్టి, పూజను ముగిస్తారు. ఈ తంతు మొత్తం పూర్తవ్వడానికి, దాదాపు గంట లేదా రెండు గంటల సమయం పడుతుంది. కానీ, తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం మాత్రం, తెల్లవారు జామున 2 గంటలకే తెరుస్తారు. ఆ వెంటనే ఒక బృందం ముందుగా వంట గదిలోకి వెళ్ళి, ఆక్కడి పాత్రలనూ, పరిసరాలనూ శుభ్రం చేసుకుని నైవేద్యం వండటం మొదలు పెడతారు. ఇక ప్రధాన అర్చకుడూ, ఆయనకు సహాయం చేసే పరివారం, స్వామి గర్భ గుడిని శుభ్రం చేసి, స్వామివారికి అతి వేగంగా అభిషేకం నిర్వహించి, అత్యంత వేగంగా ఆయన తలనీలాలను పూర్తిగా ఆరబెడతారు. తల ఆరగానే నైవేద్యం తెచ్చి స్వామి వారి చేతిలో కాస్త పెట్టి, ఆయన చేత ఆ నైవేద్యం ఆరగింప చేస్తారు. ఆ తర్వాత మాత్రమే తక్కిన శరీరంపై తడి లేకుండా తుడిచి, వాస్త్రాలూ, ఆభరణాలూ అలంకరించి, భక్తుల దర్శనానికి సిద్ధం చేస్తారు. ఇలా తెల్లవారు జామునే పెట్టే నైవేద్యాన్ని, ‘ఉషా పాయసం’గా పేర్కొంటున్నారు.

మిగిలిన క్షేత్రాలతో పోల్చి చూస్తే ఈ తంతు మొత్తం చాలా వింతగా అనిపిస్తుంది! ఇక్కడ మరో వింత ఏమిటంటే, ఒకవేళ ఏ కారణం చేతనయినా తెల్లవారు జామునే ప్రధాన ఆలయ ద్వారాలకు ఉన్న తాళం తెరుచుకోకపోతే, వెంటనే దాన్ని బద్దలు గొట్టే అధికారం, అక్కడి పూజారులకు ఉంది. ఏ కారణం చేతనయినా, ఇతర ఆలయాలలోని తాళాలు తెరుచుకొకపోతే, అవి తెరుచేంత వరకు వేచి వుంటారు. ఈ ఆలయంలో మాత్రం, తాళం తెరుచుకోవడంలో కాస్త అలస్యమైనా, వెంటనే దాన్ని బద్దలు గొట్టేస్తారు. అందుకోసం ప్రతి పూజారీ తమతో పాటు ఒక తాళం చేవీ, ఒక సుత్తిని కూడా వెంట తెచ్చుకుంటారు. ఎట్టి పరిస్థితులలోనూ స్వామి వారికి నైవేద్యం పెట్టడం ఆలస్యం కాకుండా చూసుకోవడమే వారి లక్ష్యమని, ఆధ్యాత్మిక వేత్తలంటున్నారు.

తిరువరప్పు శ్రీకృష్ణ మందిర పూజారులు ఇలా వింతగా చేయడం వెనుక ఒక చారిత్రక గాధ ఉందని, ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు. ఒకానొక సమయంలో, అన్ని ఆలయాలలో పాటించిన విధంగా, గ్రహణం వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కూడా మూసేసి, తల్లవారు జామునే వచ్చి ఆలయ ద్వారం తెరిచారు. అక్కడ కనిపించిన పరిణామం చూసి అర్చకుల కాళ్ళు చేతులు వణికి పోయాయి. ముందు రోజు రాత్రి వరకు ఎంతో అందంగా ఉన్న స్వామివారి విగ్రహం, తెల్లవారు జామున వచ్చి చూసేసరికి, చక్కటి రూపం పోయి, శుష్కించిపోయి కాంతి విహీనంగా కనిపించింది. అది చూసిన అర్చకులు కంగారు పడుతున్న సమయంలో, అక్కడికి వచ్చిన ఆది శంకరాచార్యుల వారికి పరిస్థితి వివరించి చెప్పారు. అప్పుడాయన అది సాధారణ విగ్రహం కాదనీ, సాక్ష్యత్తు శ్రీకృష్ణ పరమాత్ముడి ఆత్మ శక్తి అందులో నిక్షిప్తమై ఉందనీ, ఎట్టి పరిస్థితులలో ఆ విగ్రహానికి నైవేద్యం పెట్టడం ఆగకూడదనీ తెలియజేశారు. అసలు ఆ విగ్రహం అలా ఉండటానికి గల మూల కారణాన్ని కూడా వివరించారు.

ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు కంస వధ గావించి, తల్లితండ్రులయిన దేవకీ వసుదేవులను విడిపించి, రాజుగా పట్టాభిషిక్తుడైన విషయం తెలిసిందే. కంసుడు సాధారణ వ్యక్తి కాదు. మహా బలశాలి అవ్వడంతో పాటు, తంత్ర విద్యలలోనూ ఆమోఘమైన ప్రావీణ్యం పొందిన వ్యక్తి. అతడిని ఓడించడం సాధారణ వ్యక్తుల వల్ల అయ్యేపని కాదు. అలాంటి వ్యక్తితో బాల కృష్ణుడు పోరాడి ఓడించి వధించడం జరిగింది. అంతటి భీకర యుద్ధం తర్వాత కృష్ణుడు బాగా అలిసిపోవడమే కాకుండా, విపరీతమైన కోపంతో, ఆకలితో ఉన్నాడు. అయితే వెంటనే చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి, ఆ ఉగ్ర స్వరూపాన్ని ఒక విగ్రహంగా మార్చి, ఒక ప్రత్యేకమైన విధానంలో భద్రపరచడం జరిగింది. ఇప్పుడు తిరువరప్పులో ఉన్నది ఆ విగ్రహమే అనీ, అందుకే ఎట్టి పరిస్థితులలో స్వామికి నైవేద్యం పెట్టి తీరాలనీ, ఆది శంకరుల వారు అక్కడున్న అర్చకులకు తెలియజేశారు.

అప్పటి నుంచి స్వామివారికి నైవేద్యం పెట్టె విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు అర్చకులు. ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకే ఆలయాన్ని మూసివేసి, తిరిగి తెల్లవారు జామున 2 గంటలకల్లా తెరుస్తారు. ఈ నాటికీ స్వామి వారికి నైవేద్యం పెట్టడంలో క్షణాలు అలస్యమైనా, విగ్రహానికి కట్టి ఉన్న మొలతాడు వదులవ్వడం గమించవచ్చని అర్చకులు చెబుతున్నారు. అంతేకాదు, సాధారణంగా కృష్ణ విగ్రహాలన్నీ చిరు మందహాసంతో ఎంతో అందంగా ఉంటాయి. తిరువరప్పు ఆలయంలోని విగ్రహం మాత్రం, కోపంగా చూస్తున్నట్లుంటుంది. కంసవధ సమయంలో ఆవేశంతో పోరాడిన రూపం ఎలా ఉంటుందో, అచ్చుగుద్దినట్లు ఇక్కడ ఉన్న విగ్రహం కూడా అలాగే ఉంటుంది. సరిగ్గా గమనిస్తే, ఆయన కళ్ళలో కోపం, కండలు తిరిగిన శరీరాన్ని కూడా చూడవచ్చు. నాలుగు చేతులు కలిగిన ఆ విగ్రహంలో వెనుక వైపు ఉన్న రెండు చేతులలో శంఖ చక్రాలు ఉంటే, ముందు వైపు ఉన్న కుడి చెయ్యి నైవేద్యం తినడానికి అనువుగా ఉన్నట్లుండి, మరో చెయ్యి భక్తులను ఆశీర్వాదిస్తున్నట్లు ఉంటుంది.

ఇదిలా ఉంటే, అసలు మహా భారత కాలం నాటి ఆ విగ్రహం, ఎక్కడో మధురలో మొదటిసారి బయటపడి, దేశానికి మరో పక్కన ఉన్న కేరళ రాష్ట్రానికి ఎలా చేరింది..? ఇక్కడ పూజలు ఎలా అందుకుంటోంది..? అనే సందేహాలు కలుగుతాయి. ఆ విషయం తెలియాలంటే, పాండవ వనవాసం సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకోవాలని చరిత్రకారులు చెబుతున్నారు.

మహాభారత కాలంలో పాండవ వనవాసం గురించి తెలిసిందే. జూదంలో సర్వస్వం పోగొట్టుకున్న పాండవులు, అన్నీ వదిలి అడవులకు వెళ్లబోయే ముందు వారు శ్రీ కృష్ణుడిని ప్రార్ధించారు. వనవాస సమయంలో తమకు రక్షణగా ఉండమని కృష్ణుడిని వేడుకున్నారు. ధర్మ పరిరక్షకుడైన శ్రీ కృష్ణుడు, పాండవుల భక్తికీ, ధర్మ నిరతికీ మెచ్చి, కంస వధ సమయంలో తన శక్తిని భద్రపరచి ఉంచిన విగ్రహాన్ని ఇచ్చాడు. అందులో ఉన్న తన ఆత్మ శక్తి గురించి తెలియజేసి, ఆ విగ్రహాన్ని కొలిస్తే శత్రు భయం ఉండదు, అనారోగ్యం దరిచేరదు, ఆకాల మృత్యు దోషాలను తొలగిస్తుంది, అమితమైన బలాన్ని ఇస్తుంది, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. అలా పాండవులు వనవాసంలో ఉన్నంత కాలం ఆ విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో కొలిచారు.

ఇక వారి వనవాస సమయం పూర్తయ్యి, అజ్ఞాత వాసానికి బయలుదేరే సమయంలో జరిగిన ఓ సంఘటనే, కృష్ణ పరమాత్ముడి ఆత్మ శక్తి కలిగిన ఆ విగ్రహం కేరళ వరకు వచ్చి, నేడు భక్తకోటి పాలిట కొంగు బంగారంగా మారడానికి కారణమైందని, చరిత్రకారులు చెబుతున్నారు. పాండవులు వనవాస సమయంలో ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలలో ఉండటం జరిగింది. అలా వారు ఆఖరుగా ఉన్న ప్రాంతానికి దగ్గరలో, సముద్రం ఉండేది. దానితో అక్కడకి దగ్గరలోనే చేపలు పట్టుకునే వారి చిన్న గ్రామం ఒకటి ఉండేది. అక్కడి బెస్త వారు, మహా తేజోవంతులైన పాండవులకు పలు విధాలుగా సేవలు చేస్తూ ఉండేవారు. ఇక వన వాసం పూర్తయి వారు అక్కడి నుంచి వెళ్ళే సమయంలో, ఆ బెస్త వారు చింతించి, గుర్తుగా వారు నిత్యం పూజించే కృష్ణ విగ్రహాన్ని ఇవ్వమని కోరారు. ఆ మత్స్యకారుల కోర్కెను మన్నించిన పాండవులు, శ్రీకృష్ణుడి ఆత్మ శక్తిగల ఆ విగ్రహాన్ని ఇచ్చి, అజ్ఞాత వాసానికి వెళ్ళిపోయారు.

ఇది జరిగిన కొన్నేళ్లకు ఆ గ్రామంలో తీవ్రమైన కరవు రావడంతో పాటు, పదే పదే సముద్రం పోటెత్తి, గ్రామాన్ని ముంచెత్తుతూ ఉండేది. కొంత కాలానికి అటుగా ఒక ఋషి రావడంతో వారు తమ బాధలు చెప్పుకున్నారు. తన తపోశక్తితో ఆయన జరుగుతున్న పరిణామాలను గ్రహించి, వారి వద్ద ఉన్న విగ్రహం అమిత శక్తివంతమైనదనీ, దానికి వారు సరిగ్గా పూజలు చేయాలకపోవడం మహా దోషమనీ, వెంటనే ఆ విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. వారు ఆ ఋషి చెప్పినట్లే చేశారు. అలా ఆ నాడు శ్రీ కృష్ణుడి ఆత్మ శక్తి నిక్షిప్తమైన ఆ విగ్రహం సముద్ర గర్భంలో కలిసిపోయింది.

కొంతకాలానికి ద్వాపర యుగం ముగిసి, కలియుగం ఆరంభమైంది.. సముద్రంలో కలిసిన విగ్రహం నీటి ఆటుపోట్ల కారణంగా కొంతకాలానికి కేరళ సముద్ర తీరం సమీపానికి చేరింది. ఇదిలా ఉండగా, రమారమి 1500 ఏళ్ల పూర్వం ఒకనాడు బిల్వమంగళ స్వామి అనే మహా యోగి పడవలో వెళ్తుండగా, అళప్పురా నగరానికి సమీపంలోని సముద్ర తీరానికి రాగానే, పడవ కదలకుండా ఆగిపోయింది. పడవ నడుపుతున్న వ్యక్తి ఎంత ప్రయత్నించినా అది కదలకపోవడంతో, ఆయన తన తపో శక్తితో వీక్షించి, నీటిలో అతి శక్తివంతమైన విగ్రహం ఉందని గ్రహించాడు. వెంటనే నలుగురు వ్యక్తుల సహాయంతో నీటిలోంచి ఆ విగ్రహాన్ని తీయించి చూడగా, తేజోవంతంగా ప్రకాశిస్తూ 5 అడుగుల ఎత్తున్న శ్రీ కృష్ణుడి విగ్రహం కనిపించింది.

ఆ విగ్రహంతో తీరం చేరుకున్న యోగి Kottayam వైపు వెళుతూ, మార్గ మధ్యలో సంధ్యా వందనం కోసం విగ్రహాన్ని కిందకి దించి, దగ్గరలోని ఓ కొలనులో స్నానం చేసి, సంధ్యా వందనం పూర్తిజేసుకుని వచ్చిన తర్వత, విగ్రహం కదలలేదు. దానితో కృష్ణుల వారు అక్కడే కొలువై ఉండాలని తలచినట్లు భావించి, అదే స్థలంలో విగ్రహ ప్రతిష్ట చేసి, దానిపై కోవెల కట్టించాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న తిరువరప్పు శ్రీకృష్ణ మందిరం.

అయితే, కొంతమంది చరిత్రకారుల వాదన ప్రకారం, ఆ నాడు విగ్రహాన్ని ప్రతిష్టించినది బిల్వమంగళ స్వామి కాదనీ, పద్మపాదాచార్యుల వారనీ అంటారు. ఏది ఏమైనా, ఎక్కడో మధురలో మొదలై, పాండవ వనవాస సమయానికి గుజరాత్ తీరంలో గల అటవీ ప్రాంతానికి చేరి, ఆపై అరేబియా సముద్రంలో కలిసి, అక్కడి నుంచి కేరళ తీరానికి చేరి, సముద్ర తీరానికి దూరంగా ఉన్న తిరువరప్పు అనే చిన్న ఊరిలో స్థిరపడి, ప్రపంచాన్ని మొత్తం ఆ గ్రామం వైపు తిరిగి చూసేలా చేశాడు కృష్ణయ్య. అలా 1500 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో నేటికీ ఎంతో నిష్టతో, భక్తితో సమర్పించే పూజలందుకుంటూ, భక్తుల పాలిట కొంగు బంగారంగా మారాడు, కృష్ణ పరంధాముడు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో, విళక్కెడుప్పు అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ ఉత్సవాన్ని చూడటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులు అక్కడికి వస్తారు. కేరళ సంప్రదాయ పద్ధతిలో జరిగే ఆ ఉత్సవం అద్భుతంగా ఉంటుందని చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే చూడటానికి రెండు కళ్ళు చాలవని అంటారు. ఇంతటి ఘన చరిత్ర, శక్తి కలిగిన ఆ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒక్కసారైనా చూసి తరించాల్సిందే.

ॐ 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess