Bhoot Mela: Unique ghost fair held in India | భూత్ మేళా!
భూత్ మేళా! TELUGU VOICE
దేవీ నవరాత్రులలో దయ్యం పట్టిన వారు మాత్రమే వచ్చే దేవీ ధామ్ ఆలయం!
మనం కొత్తగా ఒక ఊరికి వెళ్ళినప్పుడు, అదీ దేవీ నవరాత్రుల సమయం అయితే, అమ్మవారి ఆలయాలలో ఎంతో వైభవంగా ఆ తల్లి పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉండడం చూస్తుంటాము. ఆ 9 రోజులలో ఏదో ఒక రోజు దగ్గరలో ఉన్న అమ్మవారి అలయానికి వెళ్ళి, ఆ తల్లిని దర్శించుకుని, ఆమె అనుగ్రహాన్ని పొందాలని అనుకోవడం సర్వ సాధారణం. ఒకవేళ ఈ లోపు మనకు దగ్గరలో ఒక పురాతన దేవీ ఆలయం ఉందని తెలిస్తే, మన అడుగులు ఆ ఆలయం వైపుకు ఖచ్చితంగా పడతాయి. దేవీ నవరాత్రుల సమయం, అందులోనూ పురాతన అమ్మవారి ఆలయం అన్నప్పుడు, ఆలయం చుట్టూ కోలాహలం ఉండడం సహజమే.. ఎటు చూసినా జనాలు బారులు తీరి ఉండటమూ మామూలే.. మనం చెప్పుకోబోతున్న ఈ ఆలయం దగ్గర కూడా అదే విధంగా ఉంటుంది కానీ, అక్కడి వాతావరణం కాస్త వింతగా అనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఆలయంలోకి అడుగు పెడితే, అక్కడి జనం ముఖాలలో ఆలయ సందర్శనానికి వచ్చిన ఆనందం కనిపించకపోగా, జుట్టు విరబోసుకుని, కోపంగా చూస్తూ, ఒక విధమైన భయానక రూపాలలో ఉంటారు. అర్చకుడు అమ్మవారికి హారతి ఇవ్వడం మొదలు పెట్టగానే, గర్భగుడి బయటి జనాలందరూ బిగ్గరగా, భయంకరంగా అరుస్తూ, కాళ్ళు, చేతులూ కొట్టుకుంటూ, తల అటు ఇటు ఆడిస్తూ, ఎర్రటి కళ్ళతో, మామూలు మనుషులలా కాకుండా వింతగా ప్రవర్తించడం చూసి అయోమయంగా అర్చకుడిని ప్రశ్నిస్తే, నవరాత్రుల సమయంలో అక్కడికి వచ్చే భక్తులంతా దెయ్యం పట్టినవారే అన్న సమాధానం ఆయన చెబుతున్నప్పుడు గుండెలు జారిపోతాయి.. వెన్నులోంచి వణుకు పుడుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆలయంలో ఈ తతంగం మనం ప్రతి ఏడాదీ దేవీ నవరాత్రులలో చూడవచ్చు. అసలు ఈ ఆలయం ఎక్కడుంది..? దెయ్యం పట్టిన వారంతా దేవీ నవరాత్రుల సమయంలోనే అక్కడకి ఎందుకు చేరుకుంటున్నారు..? ఆ తరువాత అక్కడ ఏం జరుగుతుంది? వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Y91WoDf3PXw ]
ఈ అమ్మవారి ఆలయం గురించి తెలియాలంటే, Jharkhand రాష్ట్రానికి వెళ్ళాల్సిందే. ఆ రాష్ట్రంలోని Palamu జిల్లాలో గల Haidarnagar లో ఉన్న Devi Dham మందిరం గురించే మనం మాట్లాడుకుంటున్నది. ఈ ఆలయంలోని అమ్మవారిని దేవీ భగవతి అనే పేరుతో పిలుస్తారు. ఎక్కడయినా అమ్మవారి ఆలయాలకు సామాన్య భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటే, ఈ దేవీ ధామ్ మందిరానికి మాత్రం, దెయ్యం పట్టిన వారి తాకిడి ఎక్కువగా ఉంటుందని అర్చకులు చెబుతున్నారు.
ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక పెద్ద అగ్ని గుండం ఉంటుంది. ఆ గుండం చుట్టూ దెయ్యం పట్టిన వారు కూర్చుని అరవడం, జుట్టు విరబోసుకుని ఊగడం, వింత వింతగా ఎగరడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ ఆలయ పరిసరాలలో కూడా దెయ్యం పట్టిన వారితో, వెంట వచ్చిన వారి బంధువులతో నిండి ఉంటుంది.
మరీ ముఖ్యంగా దేవీ నవరాత్రుల సమయంలోనూ, చైత్ర మాసంలో వచ్చే నవ రాత్రుల సమయంలోనూ దేవి ధామ్ మందిరానికి దెయ్యం పట్టిన వారు అధికంగా వస్తారు. అర్చకులు చెబుతున్నదాని ప్రకారం, ఈ రెండు సమయాలలో ప్రతి రోజూ వేల మంది భక్తులు దేవి ధామ్ మందిరాన్ని సందర్శించుకుంటారని తెలుస్తోంది. Jharkhand రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా, మధ్య ప్రదేశ్, ఒరిస్సా, బీహార్, మహా రాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తారని తెలుస్తోంది.
నవరాత్రుల సమయంలో దేవీ ధామ్ మందిరానికి వచ్చే భక్తులు ఎక్కువగా దెయ్యం పట్టినవారే కావడంతో, ఆ ఆలయ ప్రాంగణం అత్యంత భయానకంగా ఉంటుంది. ఆలయ అర్చకులు చెబుతున్నదాని ప్రకారం, అక్కడికి వచ్చే దయ్యాల బాధితులలో కొంతమందికి ఒకటి రెండు రోజులలో నయమైతే, మరికొంతమందికి 9 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. అలా రోజుల తరబడి అక్కడ ఉండవలసిన వారంతా, ఆలయానికి సమీపంలోనే చిన్న చిన్న టెంట్లు వేసుకుని ఉంటారు.
ఇక దెయ్యాన్ని వదిలించే పూజ మొదలు పెట్టిన తర్వాత, మేకులతో చేసే ఓ తతంగం ప్రత్యేకంగా ఉంటుంది. పూజ పూర్తయ్యాక, దెయ్యం పట్టిన వ్యక్తి ముందు అద్దాన్ని ఉంచి, ఆ వ్యక్తి లోని ఆత్మను ఆ అద్దంలో బంధిస్తాడు మంత్రగాడు. ఆ తర్వాత ఆ అద్దంపై కొద్దిగా బియ్యం పోసి మంత్రాలు చదివి, మిగిలిన బియ్యం మొత్తం కిందకి వదిలేస్తాడు. ఇలా చేసిన తర్వాత కొన్ని బియ్యం గింజలు ఆ వ్యక్తికి అంటుకుని ఉండిపోతాయి. అద్దంలోకి వెళ్ళిన దెయ్యం అలా ఉండిపోయిన బియ్యపు గింజలలోకి చేరినట్లుగా భావిస్తారు. అలా ఉండిపోయిన బియ్యపు గింజలను సేకరించి, ప్రత్యేకంగా తయారు చేసిన గొట్టం లాంటి మెకులలో పోసి, దానిపై సీల్ వేస్తారు. ఇక దెయ్యాన్ని పోగొట్టే తతంగంలో చివరి ప్రహసనం, దేవి ధామ్ ఆలయనికి సమీపంలో ఉన్న అత్యంత పురాతనమైన రావి చెట్టు మొదలుకు ఆ మెకును దిగగొట్టడం. దీనితో ఆ దెయ్యాన్ని పూర్తిగా బంధించినట్లని ఆలయ అర్చకులు చెబుతున్నారు.
ఎక్కడా లేని విధంగా, కేవలం దేవీ ధామ్ ఆలయానికి మాత్రమే ఇంతమంది దెయ్యాల బాధితులు ఎందుకు వస్తున్నారనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే, ఆలయ విశిష్టత, చరిత్ర గురించీ తెలుసుకోవాలని అర్చకులు చెబుతున్నారు. ఆ వివరాల ప్రకారం, దేవీ ధామ్ మందిరంలో కొలువైన తల్లి సప్త మాతృకలలో ఒకరు. ఆమె ఉగ్ర స్వరూపిణి, దుష్ట శక్తి సంహారిణి, ఆవిడకు ఉన్న ప్రత్యేకమైన శక్తుల కారణంగా, దెయ్యాలు ఆ తల్లి ముందు నిలవలేవనీ అర్చకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా దేవీ నవరాత్రుల సమయంలోనూ, చైత్ర మాసంలో వచ్చే నవరాత్రుల సమయంలోనూ, దేవీ ధామ్ ఆలయంలోని అమ్మవారికి శక్తి ద్విగుణీకృతమై ఉంటుందని అంటున్నారు. ఆ సమయంలో దెయ్యాలను వదిలించే క్రతువులు చేస్తే, ఫలితం త్వరగా దక్కుతుందని భక్తుల విశ్వాసం. అందుకే నవరాత్రుల సమయంలో అక్కడ భూత్ మేళాను విశేషంగా నిర్వహిస్తారు.
ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం ఏ కాలం నాటిదో చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. ఆలయాన్ని మాత్రం 1877లో నిర్మించినట్లు తెలుస్తోంది. బీహార్ లోని Aurangabad జిల్లాలో గల Jamhaur అనే గ్రామానికి చెందిన ఒక జమీందారు, అనుకోకుండా ఒకనాడు ఇప్పుడున్న దేవీ ధామ్ ఆలయ పరిసరాలలో గుడారం వేసుకుని సేద తీరుతుండగా, ఆయనకు కలలో అమ్మవారు సాక్షాత్కరించి, సమీపంలోని ఒక పుట్టలో విగ్రహ రూపంలో తానున్నాననీ, ఆ విగ్రహాన్ని వెలికి తీసి పూజలు చేయించి, దెయ్యం ఆవహించి బాధపడుతున్న ఆయన కూతురిని తీసుకువచ్చి తనకు పూజ చేయిస్తే ఆమెకు నయం అవుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. మర్నాడుదయం ఆ జమీందారు ఊరి జనాలతో ఆ పరిసరాలలో వేతికించగా, కలలో అమ్మవారు చెప్పినట్లుగానే విగ్రహం దొరికింది. ఆ తల్లి చెప్పినట్లే చేయగా, ఆయన కూరతురికి నయం అయ్యింది. వెంటనే జమీందారు అమ్మవారికి అక్కడే ఆలయాన్ని నిర్మింపజేశాడు. అదే ఈ నాటి దేవీ ధామ్ ఆలయం.
ఇక దేవీ ధామ్ భూత్ మేళాగా ప్రసిద్ధి నొందిన ఉత్సవానికి, ఒకప్పుడు కేవలం దెయ్యాల బాధితులు మాత్రమే వచ్చేవారు. కానీ గత కొన్నేళ్లుగా ఈ వింతను చూడటానికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆలయ అర్చకులు చెబుతున్నారు.
🚩 ॐ శ్రీమాత్రే నమః 🙏
Comments
Post a Comment