'Chhava' Sambhaji Maharaj: The Forgotten Maratha Prince శంభాజీ అసలు చరిత్ర!


శంభాజీ అసలు చరిత్ర! TELUGU VOICE
21 ఏళ్లలో ఓటమి ఎరుగని 140 యుద్ధాలు! చివరకు బావమరిది కుట్రకు బలి!

శూరత్వం, వీరత్వం, త్యాగం కలగలిసిన ఒక మహాయోధుడి చరిత్రను ఈ రోజు తెలుసుకుందాము. తండ్రి స్థాపించిన హైందవ స్వరాజ్య సంరక్షణకై తన సర్వస్వాన్నీ ఒడ్డిన పులిబిడ్డ చరిత్ర ఇది. 9 ఏళ్ల వయస్సులోనే తండ్రితో పాటు వెళ్ళి, చావును వెక్కిరించి మరీ బయటకొచ్చిన ఒక ధీరుడి సజీవ గాథ. కేవలం 31 సంవత్సరాల తన జీవితకాలంలో, 140 కి పైగా యుద్ధాలలో పాల్గొని, ఒక్క యుద్ధంలో కూడా ఒడిపోని రణధీరుడి మరపురాని చరిత్ర. శత్రువులకు చిక్కి, 40 రోజుల పాటు చిత్రహింసలను అనుభవిస్తూ, కళ్ళు పీకేస్తున్నా, కాళ్ళు నరికేస్తున్నా, చర్మం ఒలిచేస్తున్నా, తాను నమ్మిన ధర్మాన్ని వదలనని దృఢ చిత్తంతో నిలబడి, చివరకు మృత్యువు ఒడిలో సేదదీరిన మహానీయుడి ఆవేదన. అతడే మరాఠా ముద్దు బిడ్డ.. హైందవ సామ్రాజ్య రక్షణకు పునాది వేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ కు పుట్టిన యువ సింహం, మరాఠా సామ్రాజ్యపు రెండవ ఛత్రపతీ, ధర్మవీరుడు శంభాజీ మహరాజ్. మరాఠా ప్రజలు ముద్దుగా ‘Chaava’ అంటే సింహం బిడ్డగా పిలుచుకున్న ఛత్రపతి శంభాజీ మహరాజ్ గురించి, ఇన్నేళ్లుగా మన కుహనా చరిత్రకారులు దాచేసిన అసలైన గాధను సవివరంగా తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ET5okujKS0U ]


చరిత్ర పుటలలో పృధ్విరాజ్ చౌహాన్ మరణానంతరం, భారత దేశంపై ఎడారి మతాల దురాక్రమణ పెచ్చుమీరింది. వీరిలో అనేక తెగలవారు ఉండగా, కేవలం మొఘల్ వంశస్థులు అత్యధిక భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా, సుదీర్ఘ కాలం పాటు పాలించారు. ఈ క్రమంలో ఢిల్లీ గద్దెనెక్కిన ప్రతి ముస్లిం పాలకుడూ, మన ఆలయాలను ధ్వంసం చేసి దేశ సంపదను దోచుకుంటూ, హిందువులను చిత్ర హింసలకు గురిజేసి చంపుతూ, అత్యంత హ్యేయమైన రీతిలో ఆడవారి మాన ప్రాణాలను హరించడం, ఇలా చెప్పుకుంటూ పోతే వారు చేసిన అకృత్యాలకు అంతేలేదు.

ఆ సమయంలో మన భారతీయ రాజులు ఎంతో మంది తమ రాజ్యాలనూ, ప్రజలనూ కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలు చేశారు. దేశం అటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు పుట్టుకొచ్చిన మహా వీరుడూ, భవానీ మాత ప్రియ సుతుడూ, ఛత్రపతి శివాజీ మహరాజ్. ఆ మహా యోధుడి గురించి మనం గతంలో చేసిన వీడియో లింక్ ను, చూడని వారి కోసం description లోనూ, i-cards లోనూ పొందు పరిచాను. తన చుట్టూ ఉన్న సామాన్యులనే తన సైన్యంగా ఎంచుకుని, అప్పటివరకూ ఎవ్వరూ ఎరుగని గెరిల్లా యుద్ధ తంత్రాన్ని తన ఆయుధంగా మార్చుకుని, హైందవ స్వరాజ్య స్థాపనకు మరాఠా గడ్డపై శంఖారావం పూరించిన యుగ పురుషుడు ఛత్రపతి శివాజీ మహరాజ్.

అలాంటి సింహానికీ, ఆయన మొదటి భార్య అయిన సైబాయి భోంస్లే కీ, 1657 మే 14వ తేదీన, అహ్మద్ నగర్ లో గల పురందర కోటలో జన్మించాడు, సింహాపు కూన వంటి శంభాజీ రాజే భోంస్లే. అయితే, ఆయన పుట్టిన రెండేళ్లకే తల్లి సైబాయి భోంస్లే చనిపోవడంతో, శివాజీ మహరాజ్ తల్లి అయిన జిజియాబాయి దగ్గరే పెరిగాడు. బహుశా ఇదే కారణం చేత, శంభాజీ కూడా శివాజీ మహరాజ్ అంతటి యోధుడయ్యి వుండవచ్చని, చరిత్రకారులంటున్నారు.

శంభాజీకి చావు భయం లేదని చెప్పడానికి, తన 9 ఏళ్ల వయసులో జరిగిన ఓ సంఘటన గురించి చరిత్రకారులు విశేషంగా చెబుతారు. పురందర్ యుద్ధ (Battle of Purandar) సమయంలో, ఔరంగజేబ్ తొత్తుగా పనిచేస్తున్న రాజా జై సింగ్ ఆధ్వర్యంలో, ఒక మహా సేనను శివాజీపైకి పంపించారు. కొద్ది రోజుల పాటు పోరాటం చేసిన ఛత్రపతి, యుద్ధం కంటే సంధి మంచిదని భావించి, జైసింగ్ ని మధ్యవర్తిగా పెట్టి ఔరంగజేబుతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా శివాజీ మహరాజ్ ఆగ్రా కోటకు వెళుతూ, కాబోయే రాజుకు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండాలనే తలంపుతో, 9 ఏళ్ల శంభాజీని కూడా వెంటపెట్టుకుని వెళ్లడం జరిగింది.

అయితే, వెన్నుపోటు నైజం నరనరానా నిండిన ఔరంగజేబ్, తన కుక్క బుద్ధిని ప్రదర్శించాడు. శివాజీ మహరాజ్ ని కొడుకు శంభాజీ తో సహా ఖైదు చేయించాడు. కోటలో పనిచేసేవారి తోడ్పాటుతో, కొడుకుతో సహా తప్పించుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకున్నారు, శివాజీ, శంభాజీ. సహజంగా 9 ఏళ్ల వయస్సు వారు అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటే, భయంతో బిక్కచచ్చిపోతారు. కానీ ఆ పులిబిడ్డ కళ్ళలో చిన్నపాటి బేరుకు కూడా లేదనీ, తండ్రి వేసిన ప్రాణాలికకు పూర్తిగా సహకరిస్తూ, అక్కడి నుంచి తెలివిగా బయటపడ్డారనీ, చరిత్రకారులు చెబుతున్నారు.

చిన్నతనం నుంచే నాయనమ్మ జిజియాబాయి దగ్గర పెరగడంతో, శంభాజీకి పురాణాలూ, ఇతిహాసాలతో పాటు, హిందువులపై జరుగుతున్న అకృత్యాలూ, వాటిపై తన తండ్రి చేస్తున్న పోరాటం, ఇలా అన్ని విషయాలూ చెబుతూ, అతని వ్యక్తిత్వం ఒక యోధుడిలా, రాజులా, వివేకవంతుడిలా మారేలా చేసింది, జిజియాబాయి. అంతేకాదు, ఎంతో మంది గురువుల దగ్గర గణితం, రాజకీయం, భాష, యుద్ధ విద్యలూ, యుద్ధ తంత్రాల వంటి ఎన్నో విషయాలలో శిక్షణ తీసుకున్నాడు. అతడి వీరత్వం ఎంతటిదంటే, కేవలం 16 ఏళ్ల వయసులోనే మొదటి యుద్ధంలో పాల్గొని, తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

శంభాజీ మహరాజ్ యొక్క 27 ఏళ్ల యుద్ధ ప్రయాణంలో, ఆయన కేవలం మొఘలులూ, దక్కన్ నవాబులూ, బీజాపూర్ సుల్తాన్ లనే కాకుండా, ఆనాడు హిందువులపై దౌర్జన్యాలు చేస్తూ, హిందూ ఆలయాలను నాశనం చేస్తూ, భలవంతంగా మతమర్పిడులు చేస్తున్న పోర్చుగీస్ వారిని కూడా సప్త సముద్రాల నీరు తాగించాడు. ఆ విధంగా కొంకణ ప్రాంతాన్ని, గోవా నగరాన్ని కూడా మరాఠా సామ్రాజ్యంలో కలిపేసిన ధీరుడు, శంభాజీ మహరాజ్.

ఇక ఈ పులి బిడ్డ కేవలం రణధీరుడే కాకుండా, భాషా పండితుడూ, కళా పిపాసి కూడా అని చరిత్ర చెబుతోంది. ఆయన మరాఠా, సంస్కృతంతో పాటు, 15 భాషలలో ప్రావీణ్యం పొందాడు. వాటిలో తెలుగు కూడా ఉండడం విశేషం. శంభాజీ కేవలం 14 ఏళ్ల వయస్సులోనే,  సంస్కృతంలో ‘బుధ్ భూషణ్’ అనే పుస్తకాన్ని రచించారు. అంతేకాదు, మరాఠాకీ హిందీకీ దగ్గర పోలికలు ఉండే ‘బ్రజ్’ భాషలో, నఖ్ శిఖ్, నాయికాభేద్, సాత్ శతక్ అనే పుస్తకాలను కూడా వ్రాశారు. అంత చిన్న వయసులో నాలుగు పుస్తకాలను రాయడమంటే, ఆయన విద్వత్తు ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు.

ఇక 17 ఏళ్ల వయస్సులో శంభాజీకి జీవుబాయి అనే కన్యతో వివాహం జరిగింది. ఎంతో యశస్సు కలిగిన ఆమె, యశు బాయి అనే పేరుతో ప్రసిద్ధురాలు. శంభాజీ వివాహం, ఛత్రపతి శివాజీ మహరాజ్ కి రాజకీయంగా చాలా పెద్ద ప్రయోజనం కలిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఆమె తండ్రి విభాజీ నాయక్, మరాఠా సామ్రాజ్యంలో ఓ ముఖ్య దళపతి గానే కాకుండా, సామంత రాజుగా, కొంకణ్ రాజులలో అతి ముఖ్యమైన వాడిగా కూడా ఉన్నాడు. ఈ పెళ్ళితో కొంకణ ప్రాంతం మొత్తం ఛత్రపతి శివాజీ చేతుల్లోకి వచ్చేసింది.

1680 వరకు, ఛత్రపతి శివాజీ ఒక పక్క మొఘలుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారిని చిత్తు చేస్తుంటే, మరో పక్క శంభాజీ తన అద్భుతమైన రణతంత్రంతో, మరాఠా సామ్రాజ్య విస్తరణ చేసుకుంటూ ముందుకు సాగాడు. అయితే, శివాజీ మహారాజ వ్యక్తిత్వం, శంభాజీ వ్యక్తిత్వం మధ్య చాలా తేడాలుండేవనీ, ఆ కారణంగా ఎన్నో సార్లు శివాజీ మహరాజ్ చుట్టూ ఉండే ముఖ్యమైన అనుచరులతో శంభాజీ వాగ్వాదాలు పడేవాడనీ, చరిత్ర చెబుతోంది. దానితో శివాజీ మహరాజ్ చుట్టూ ఉండే కొంతమంది మంత్రులూ, సామంతులలో కొంతమందీ, శివాజీ తర్వాత రాజుగా శంభాజీ కంటే, ఛత్రపతి రెండవ భార్య అయిన సోయరాబాయి కుమారుడు రాజారాం ను ప్రకటించాలని కుతంత్రాలు పన్నేవారు. వారి పన్నాగాలలో సోయరాబాయి హస్తం కూడా బలంగా ఉండేది.

కొంతమంది చరిత్రకారుల ప్రకారం, ఒకసారి సోయరాబాయి తన గూఢచారుల సహాయంతో శంభాజీకి విషం పెట్టి చంపడానికి కూడా ప్రయత్నించింది. ఈ గొడవల కారణంగానే, 1678 లో, శంభాజీ, రాజా రామ్ ల మధ్య వివాదం తారా స్థాయికి వెళ్ళిపోయి, ఇద్దరూ వేరు వేరుగా తమ బలాలను పెంచుకునే వరకూ వెళ్ళిపోయింది. ఒక పక్క అనారోగ్యం కారణంగా ఛత్రపతి మంచం పట్టడం, మరో పక్క అన్నదమ్ముల మధ్య గొడవలూ, ఇదే అదనుగా భావించిన ఔరంగజేబ్, ఎడతెరిపి లేకుండా మరాఠా సామ్రాజ్యంపై దురాక్రమణలకు పాల్పడుతూ వచ్చాడు.

ఈ క్రమంలో 1680, ఏప్రిల్ 3 న అనారోగ్యం కారణంగా శివాజీ మహరాజ్ కన్నుమూయగా, సోయరా బాయి తనకు అనుకూలంగా ఉన్న మంత్రులతో కలిసి, కేవలం 10 ఏళ్ల వయసున్న రాజా రామ్ ను, 1680, ఏప్రిల్ 16 న సింహాసనంపై కూర్చోపెట్టేసింది. అయితే వయసులో చిన్నవాడు, ఎటువంటి అనుభవం లేనివాడి చేతుల్లోకి మారాఠా రాజ్యం వెళ్తే, మొఘలులను ఆపడం అసాధ్యమని మొదటి నుంచీ చెబుతున్న శంభాజీ, అటువంటి దుస్థితి తమ రాజ్యానికి రాకూడదని భావించి, వెంటనే రాయ్ ఘడ్ కోటను ఆక్రమించుకుని, అధిక శాతం మరాఠా సర్దార్ లను తన వైపుకు తిప్పుకుని, 1680, జులై 20 న తాత్కాలిక రాజుగా సింహాసనంపై కూర్చున్నాడు.

ఈ తతంగంలో సోయరా బాయి కి అస్సలు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అప్పటి వరకు తనకు వెన్నుదన్నుగా నిలిచిన ఆమె సొంత అన్న హంబీర్ రావ్ మోహితే కూడా ఆమెకు వ్యతిరేకంగా పనిచేసి, రాజ్యం శంభాజీ చేతుల్లోకి వెళ్ళడానికి సహకరించాడు. దాంతో శంభాజీ మహరాజ్, సోయరా బాయినీ, తమ్ముడు రాజా రామ్ నీ, వారికి సహకరించిన వారినీ ఖైదు చేయించాడు. అయితే, ఇక్కడే కుహనా చరిత్రకారులు తమ కపట కలానికి పనిచెప్పారు.. సోయరాబాయినీ, ఆమె అనుచరులనూ, శంభాజీ మహరాజ్ అత్యంత దారుణంగా చంపించాడనీ, రాజా రామ్ చిన్నవాడు కావడంతో అతడిని మాత్రం వదిలేశాడనీ, పిచ్చి రాతలు రాశారు. వాస్తవానికి ఆ సమయంలో శివాజీ మహరాజ్ మరణ వార్త వినగానే, అతిపెద్ద మొఘల్ సైన్యం మరాఠా సామ్రాజ్యం వైపు అడుగులు వేసింది. అదే సమయంలో సోయరాబాయి, ఆమె అనుచరులూ, శంభాజీ మహరాజ్ ను అతడున్న పన్హాలా కోటలోనే బంధించి చంపాలని కుతంత్రం పన్నారు. దానిని పసిగట్టిన శంభాజీ మహరాజ్ అక్కడి నుంచి తప్పించుకుని, తన హక్కు అయినటువంటి సింహాసనాన్ని దక్కించుకున్నాడు. తనను చంపడానికి ప్రయత్నించిన వ్యక్తులు ఎప్పటికైనా ప్రమాదం అని భావించి, సోయరాబాయి మినహా తక్కిన వారిని చంపించాడనీ, పినతల్లి సోయరాబాయినీ, తమ్ముడు రాజా రామ్ నూ వేరే ప్రాంతానికి తరలించి జాగ్రత్తగా చూసుకున్నాడనీ, ఇది జరిగిన కొన్నేళ్లకే సోయరాబాయి జబ్బున పడి చనిపోతే, ఆమెకు అంత్యక్రియలు కూడా శంభాజీ దగ్గరుండి చేయించాడనీ వాస్తవ చరిత్ర చెబుతోంది.

ఆ విధంగా 1681, జనవరి 16న శంభాజీ రాజే భోంస్లే సింహాసనాన్ని అధిరోహించి, ఛత్రపతి శంభాజీ మహరాజ్ గా, మరాఠా సామ్రాజ్యపు రెండవ ఛత్రపతిగా మారాడు. సరిగ్గా ఆ సమయంలో ఔరంగజేబ్ కూ, అతని కొడుకులకూ మధ్య అధికారం కోసం తీవ్రమైన అలజడి చెలరేగింది. మరీ ముఖ్యంగా, అతని కొడుకు ముహమ్మద్ అక్బర్, తండ్రి ఔరంగజేబు చేస్తున్న అమానవీయ చర్యలపై వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాడు. ఇది తట్టుకోలేని ఔరంగజేబు, తన నాలుగవ కొడుకును అత్యంత కిరాతకంగా చంపి, అక్బర్ ను ఖైదు చేశాడు. అతన్ని కూడా చంపడానికి సన్నాహాలు మొదలుపెట్టగా, అక్బర్ తెలివిగా ఆగ్రా కోట నుంచి తప్పించుకుని, శంభాజీ మహరాజ్ ను శరణు వేడాడు.

అప్పటి నుంచి అక్బర్ శంభాజీకి దాసుడిగా మారిపోయాడు. ఒకానొక సమయంలో రాజా రామ్ ను ఎలాగైనా రాజును చేయాలని భావించిన కొంతమంది సామంత రాజులూ, నమ్మక ద్రోహులూ, శంభాజీ మహరాజ్ ని ఖైదు చేయడానికి తమకు సహకరించాలని కోరుతూ ఒక ఉత్తరం పంపారు. ఆ ఉత్తరాన్ని వెంటనే అక్బర్ శంభాజీకి పంపి, తన మిత్రత్వాన్ని నిలబెట్టుకున్నాడు. తనకు నమ్మక ద్రోహం చేయాలని చూసిన సామంతులను, వెంటాడి వేటాడి మరీ చంపేశాడు శంభాజీ.

ఇలా దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఒక పక్క మొఘల్ సైన్యంతో, మరో పక్క పోర్చుగీసువారితో, ఇంకో పక్క దక్కన్, బీజాపూర్ వంటి ముస్లిం రాజులతో పోరాటం చేస్తూనే, తన చుట్టూ తిరిగే నమ్మక దొరహులను ఏరిపారేసేవాడు శంభాజీ. అదే క్రమంలో మరాఠా సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించడమే కాకుండా, తన రాజ నీతితో సస్యశ్యామలమైన రాజ్యంగా మార్చాడు. ఈ క్రమంలో ఔరంగజేబు తన సేనలను పోగేసుకుని, మరాఠా నేలపై ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తూ, కొన్ని చిన్న చిన్న కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ముందుకు వస్తున్న ఔరంగజేబు సేనలను వెనక్కి పంపడానికి, శంభాజీ మహరాజ్ రాయ్ ఘడ్ ను వదిలి, సంఘమేశ్వర్ కోటలో నివసించడం మొదలు పెట్టాడు. అక్కడి నుంచి మొఘల్ సేనలకు చుక్కలు చూపిస్తూ, వారిని వెనక్కి తరిమి కొట్టడం మొదలు పెట్టాడు.

ఇదిలా ఉంటే, ఒక రోజు శంభాజీ మహరాజ్ తన సేనలతో రాయ్ ఘడ్ కు వెళ్లాల్సి ఉండగా, కొంతమంది గ్రామ ప్రజలు వచ్చి తమ సమస్యలను చెప్పుకోగా, వారి సమస్యలు తీర్చడానికి కేవలం 200 మందిని మాత్రమే తన దగ్గర ఉంచుకుని, తక్కిన సేనలను రాయ్ ఘడ్ కు పంపించేశాడు శంభాజీ. ఈ విషయం తెలుసుకున్న ఘనోజీ షిర్కె అనే మరాఠా సర్దార్, ఇతను ఎవరో కాదు. శంభాజీ భార్య యశుబాయికి స్వయానా సోదరుడు. గతంలో తను చేసిన ఒకానొక దుశ్చర్య వలన శంభాజీ చేత దండింపబడిన వాడు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి, శంభాజీ వివరాలను మొఘల్ సర్దార్ లలో ఒకడైన ముకర్రబ్ ఖాన్ కి తెలియజేసి, ఏకంగా 5 వేల మంది సేనలతో కేవలం మరాఠా వీరులకు మాత్రమే తెలిసిన రహస్య మార్గంగుండా వెళ్ళి, శంభాజీ ఉండే కోటను ముట్టడించారు.

5 వేల మంది సైన్యం ముందు 200 మంది సేనలు సరితూగలేక, శంభాజీ మహరాజ్ ఔరంగజేబు కి దొరికిపోయాడు. శంభాజీ మహరాజ్ జీవితంలో ఓడిపోయిన ఒకేఒక్క యుద్ధం ఇదే. ఇక అప్పటి నుంచి దాదాపు 40 రోజుల పాటు, హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం మతం స్వీకరించమని, ప్రతి రోజు ఔరంగజేబు శంభాజీని అత్యంత కిరాతకంగా, క్రూరాతి క్రూరంగా హింసించడం మొదలు పెట్టాడు. ముందు కాలుతున్న ఇనుప చువ్వలతో కళ్ళు పొడిపించాడు. తర్వాత నాలుక కోయించాడు. చర్మం ఒలిపించాడు. అప్పటికీ హిందూ ధర్మాన్ని తప్ప వేరే మతాన్ని అంగీకరించనన్న దృఢ సంకల్పంతోనే ఉన్న శంభాజీని దారి మార్చడానికి, రోజుకో అంగాన్ని నరుకుతూ వచ్చారు. ఇలా 40 రోజులపాటు, మానవమాత్రుడు భరించలేని నరకయాతనను చూపించిన తర్వాత, 1689, మార్చి 11వ తేదీన తల నరికి చంపించాడు. ఆ తర్వాత శంభాజీ మహరాజ్ శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికించి, షోలాపూర్ దగ్గరున్న భీమా నదిలో పారేయించాడు. ఇది తెలుసుకున్న మరాఠా వీరులు ఆ నదిలో వెతికి, దొరికిన కొన్ని భాగాలనే తీసుకెళ్ళి అంతిమ సంస్కారాలు జరిపించారు.

సజీవంగా ఉండగానే శరీరభాగాలు తెగిపడుతున్నా, ప్రాణం పోతున్నా, హైందవ స్వరాజ్యంపై ఉన్న శ్రద్ధ, హిందూత్వంపై ఉన్న అపారమైన గౌరవం, శంభాజీ మహరాజ్ లోని ధైర్యాన్ని కించిత్తు కూడా తొణక నివ్వలేదు. దేశం కోసం, ధర్మం కోసం, అత్యంత భయంకరమైన మరణాన్ని సైతం నవ్వుతూ ఆహ్వానించిన ఆయన విరత్వాన్ని చూసిన మరాఠా యోధుల రక్తం మరిగి పోయింది. వారి గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపింది. ఆ తెగువే, ఔరంగజేబు జీవితానికి నికృష్టమైన ముగింపు పలకడంతో పాటు, ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో సహా పెకలించి వేసేలా చేసింది.

🚩 జై భారత్ 🚩 జై హింద్ 🚩 జై భవాని 🙏

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess