Ekasila Nagaram: Rama Idol Sculpted in Treta Yuga | హనుమంతుడు లేని రాముడా?
హనుమంతుడు లేని రాముడా!?
లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన అపురూప ఏకశిలా విగ్రహాలున్న ఆలయం ఎక్కడుంది?
‘తర్జనం యమ దూతానాం రామ నామేతి గర్జనం’, అనుక్షణం రామ నామ జపం చేస్తున్న వారి దరిజేరటానికి యమదూతలు సైతం భయపడతారు. అటువంటి రామ నామాన్ని సనాతన ధర్మంలో ప్రతినిత్యం ప్రార్ధించని నోరుండదు, తలవని మనస్సుండదు. యుగాలు గడచినా, తరాలు మారినా, ఆ త్రేతాయుగ రాముడు పాలించినదే ఉత్తమ రాజ్యం, ఆయన జీవితమే మానవాళికి అత్యుత్తమ మార్గదర్శకం. ఓ యుగ పురుషుడిగా, ఒక ఆదర్శ పురుషుడిగా, నేటికీ భక్త కోటి మదిలో గుడుకట్టుకున్న దైవంగా నిలిచిపోయాడు ఆ రామచంద్ర ప్రభువు. రాఘవుడి జన్మ భూమి అయిన ఈ భరత భూమిలో, రామాలయం లేని ఊరుండదు, రామాయణం వినని మనిషి ఉండడనటంలో అతిశయోక్తి లేదు. ఈ కారణంగానే భారత దేశంలో సీతా, లక్ష్మణ, హనుమ సమేతంగా ఉన్న రాముడి ఆలయలు వాడవాడలా కనువిందుజేస్తూ మైమరపింపజేస్తుంటాయి. ఎక్కడ రామ నామ సంకీర్తనం జరుగుతుంటుందో, అక్కడ హనుమ తప్పనిసరిగా ఉంటాడన్నది ఆర్యోక్తి. మరి అటువంటిది, హనుమంతుడు లేని రాముడిని కనీసం ఊహించుకోగలమా! మన తెలుగు రాష్ట్రంలోనే, భద్రాచల క్షేత్రం కంటే పురాతనమైన ఓ రామయాలంలో, రాముడికి తోడుగా సీతా, లక్ష్మణ విగ్రహాలే ఉంటాయి. అక్కడి గర్భగుడిలో హనుమంతుడి విగ్రహం మాత్రం ఉండదు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాలలో శ్రీ రామ నవమి నాడు వైభవోపేతంగా సీతారామ కళ్యాణం జరిపించడం, అనాదిగా వస్తున్న ఒక సంప్రదాయం. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయంలో మాత్రం, శ్రీ రామ నవమినాడు స్వామి వారి కళ్యాణం జరిపించరు! అసలు ఆంజనేయుడు లేని రామాలయం ఏమిటి? శ్రీ రామ నవమికి సీతా రాముల కళ్యాణం జరిపించకపోవడం ఏమిటి? వీటన్నింటికీ అసలు కారణాలేమిటి? ఎక్కడుంది ఈ ఆలయం? ఆలయ చరిత్ర ఏమిటి - వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/SAImZfea9jE ]
మన దేశంలో ఊరూరా, వాడవాడలా ఎన్నో రామాలయాలున్నా, వాటన్నిటిలో శ్రీ రాముడు ఖచ్చితంగా సీతా లక్ష్మణ హనుమ సమేతంగా కొలువై ఉంటాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయంలో మాత్రం హనుమంతుడు లేకపోవడం, నిజంగా అందరనీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విభిన్న ఆలయం మన ఆంధ్ర ప్రదేశ్ లోని కడప జిల్లాలో గల ఒంటిమిట్టలో ఉంది. ఆంధ్రా అయోధ్యగా, మన తెలుగు రాష్ట్రాలలో అత్యంత పురాతనమైన ఆలయంగా ఒంటిమిట్ట రామయాలనికి పేరుంది. ఈ క్షేత్రంలో ఉన్న మూలవిరాట్ విగ్రహం ఏక శీలపై చెక్కబడింది. ఒకే శిలలో సీతారామలక్ష్మణులు ఉండటంతో పాటు, రాముడు ఇక్కడ యోగ ముద్రలో ఉండటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలయ మూల విరాట్ దగ్గర హనుమంతుడి విగ్రహం లేకపోవడం ఏమిటో తెలియాలంటే, ముందుగా స్థల పురాణం తెలుసుకోవాలి.
ఒంటిమిట్ట రామాలయ నిర్మాణానికి సంబంధించి ఎన్నో గాధలు జనబాహుళ్యంలో ప్రచారంలో వున్నా, రెండు మాత్రం స్థల పురణానికి దగ్గరగా ఉంటాయని ఆధ్యాత్మిక వేత్తలంటున్నారు. ఒకప్పుడు ఒంటిమిట్ట ప్రాంతమంతా కీకారణ్యంలా ఉండేది. రామచంద్రుడి పద్నాలుగేళ్ల వనవాస సమయంలో, సీతా లక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలో కొంతకాలం గడిపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. త్రేతాయుగంలో శృంగి, మృకండు మహర్షుల ఆశ్రమం ఇక్కడుండేది. వాళ్లు చేస్తున్న యజ్ఞయాగాదులకు రాక్షసులవలన విఘాతం ఏర్పడుతుండడంతో, మహర్షులు శ్రీ రాముడిని శరణు వేడారు. శిష్ట రక్షకుడైన స్వామి ఆ రాక్షసులను కడతేర్చి, యాగరక్షణ గావించాడు. త్రేతాయుగంలోని ఆ ఘట్టానికి గుర్తుగా మహర్షులు ఒక ఏకశిలపై సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆ ఏకశిలా విగ్రహాలకు ఆలయం నిర్మించి వాటిని ప్రతిష్ఠించాడన్నది పురాణ విదితం. రాముడు శృంగి, మృకండు మహర్షులను కలిసే సమయానికి, హనుమంతుడు స్వామి వారికి పరిచయం కాకపోవడం వలననే, మహర్షులు కేవలం సీతారామలక్ష్మణుల విగ్రహాలను మాత్రమే చెక్కించారని ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు.
ఈ ప్రాంతంలో బోయవారైన ఒంటడు, మిట్టడనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. నాడు ఆ అటవీ ప్రాంతం మొత్తం వారి సంరక్షణలోనే ఉండేది. ఓసారి ఆ ప్రాంతాలన్నీటిపై సర్వాధికారాలున్న కంప రాజనే ఉదయగిరి రాజు అక్కడకు రావడంతో, అన్నదమ్ములు తమ గూడెం ప్రజలతో కలసి రాజును స్వాగతించి, అతిథి సత్కారాలు చేసి, చుట్టుప్రక్కల ప్రాంతాలను చూపించి విశేషాలను తెలియజేశారు. కంపరాజు సంతోషించి ఏదయినా కోరుకోమన్నాడు. అప్పుడు వారు తమకు అడవిలో లభించిన ఏక శిలా సీతారామలక్ష్మణుల విగ్రహాలను గురించి తెలియజేసి, అక్కడ ఒక ఆలయం నిర్మింపజేయమని కోరారు. రాజు ఆనందించి, ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చి, ఆ బాధ్యతను వాళ్లకే అప్పగించి వెళ్లిపోయాడు. విగ్రహాలు లభించిననాటి నుండీ పరమ రామ భక్తులుగా మారిపోయిన ఒంటడు, మిట్టడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ ఆలయాన్ని నిర్మించారనీ, అందువల్లనే ఆ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు స్థిరపడిందనీ కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు.
ఒంటిమిట్ట రామాలయ ప్రాంగణంలో రామ తీర్ధం అనే కొలను ఉంది. సీత రాములు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో కొన్నాళ్ళున్నారు. ఆ సమయంలో వారి అవసరాల కోసమని స్వామి వారు తన బాణంతో ఈ కొలనును ఏర్పాటు చేశాడనీ, అందుకే ఈ కొలనుకు రామ తీర్ధం అనే పేరు స్థిరపడిందనీ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషమేమిటంటే, 18 మహా పురాణాలలో ఒకటైన వ్యాస విరచిత శ్రీమద్ భాగవతాన్ని తెనుగీకరించిన సహాజకవి పోతన, దానిని ఇక్కడి రామయ్యకే అంకితమిచ్చాడని చెబుతారు.
ఇక ఆలయ పునరుద్ధరణ విషయానికి వస్తే, కాలానుగుణంగా చోళులు, అగ్నికుల క్షత్రియులు, విజయనగర రాజులు, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. మూల విరాట్టు దగ్గర హనుమంతుల వారి విగ్రహం లేకపోవడం వల్ల, ఈ ఆలయ ప్రాంగణంలో ఒక ఆంజనేయుల వారి మందిరాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాలగమనంలో ఒంటిమిట్ట రామాలయం కొంత దెబ్బతినగా, వావిలికొలను సుబ్బారావు అనే మహా రామభక్తుడు ఈ రామాలయాన్ని పునరుద్ధరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. భద్రాద్రి రామయ్యపై ఉన్న భక్తితో గుడి కట్టించి ఆభరణాలు చేయించడానికిగానూ, భక్త రామదాసు సర్కారు వారి ధనం వాడి జైలు పాలైన విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న రామభక్తుడు సుబ్బారావు మాత్రం, ఆలయ నిర్మాణానికి గానూ, స్వామికి విలువైన ఆభరణాలను సమకూర్చేందుకు గానూ వాడిన ధనం, ఆయన కొబ్బరి చిప్పను పట్టుకుని ఊరూరా తిరిగి భిక్షాటన చేస్తూ, ఆ కాలంలోనే సుమారు పది లక్షల రూపాయలు సేకరించారు. ఆ విధంగా వచ్చిన డబ్బుతో నాడు ఒంటిమిట్ట రామయ్యకు కావలసినవన్నీ సమకూర్చినట్లు ఆలయ రికార్డులు పేర్కొంటున్నాయి. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించినందుకుగానూ, ఈయనను 'ఆంధ్ర వాల్మీకి' గా భక్త కోటి పిలుచుకుంటారు.
ఆలయ నిర్మాణం జరిగిననాటి నుంచీ, శ్రీ రామ నవమి నాడు సీతారాముల కళ్యాణం జరపకుండా, చతుర్దశినాడు కల్యాణం, పౌర్ణమిరోజున రథోత్సవం నిర్వహించడం ఆచారంగా కొనసాగుతోంది. నవమినాడు పోతన జయంతి పేరుతో కవిపండితులను సత్కరించడాన్ని ఓ సంప్రదాయంగా నేటికీ పాటిస్తున్నారు. శ్రీ రామ నవమి సందర్భంగా ఒంటిమిట్టలో తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఒక విశేషంగా చెప్పవచ్చు.
🚩 జై శ్రీరామ 🙏
Comments
Post a Comment