Mahabali Founded Bali & Discovered Americas long before Columbus and Vikings? | బాలీ దీవులకూ పాతాళానికీ సంబంధం!


బాలీ దీవులకూ పాతాళానికీ సంబంధం ఏమిటి?
1000 ఏళ్ల క్రితం మొదటిసారి అమెరికాను కనుగొన్నది వైకింగ్సా? మరి ‘బలి చక్రవర్తి’?

అంతర్జాలం పుణ్యమా అని కొన్ని తరాలుగా మరుగున పడిపోయిన ఎన్నో అద్భుత విషయాలు శరవేగంతో మన ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో, గత కొద్ది నెలలుగా అంతర్జాలంలో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. అమెరికాను మొట్ట మొదటగా కనుగొన్నది కొలంబస్ కాదు, దాదాపు వెయ్యేళ్ళకు పూర్వం యూరోప్ లో నివసించిన వైకింగ్స్ అనే జాతి ప్రజలని ఆ పోస్ట్ యొక్క ముఖ్య సారాంశం. ఇక ఆ విషయాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇదే క్రమంలో ఇండోనేషియాలోని బాలీ దీవులు, పాతాళ లోకానికి దారి వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. దానితో ఆమెరికా ఖండానికీ, బాలీ దీవులకూ, పాతాళ లోకానికీ ఉన్న సంబంధం ఏమిటి..? వంటి సందేహాలు మొదలయ్యాయి. దానికి సమాధానంగా, ఒకప్పుడు భరత ఖండాన్ని ఏలిన గొప్ప చక్రవర్తులలో ఒకరైన బలి చక్రవర్తికి సంబంధించిన చరిత్రను త్రవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాలన్నీ కొంత అయోమయంగా అనిపించవచ్చు. అసలు బలి చక్రవర్తికీ, పాతాళానికీ, అమెరికాకూ సంబంధం ఏమిటి..? మధ్యలోకి బాలీ దీవులు ఎందుకు వచ్చాయి..? వంటి విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/XjMrja4KXiI ]


అందమైన బీచ్ లకూ, ప్రకృతి సోయగాలకూ బాలీ దీవులు బాగా ఫేమస్ అనే విషయం తెలిసిందే. అందుకే ప్రతి సంవత్సరం కోట్లాది మంది టూరిస్ట్ లు బాలీ దీవులకు క్యూ కడుతూ ఉంటారు. అందులో మన దేశానికి చెందిన పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే. 90 శాతం ముస్లిం జనాభాతో నిండి ఉన్న ఇండోనేషియాలోని బాలీ దీవులలో మాత్రం, ఈనాటికీ 90 శాతం మంది హిందూ ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తున్నారనే సందేహం ఖచ్చితంగా కలుగుతుంది. బాలీలో ఎక్కడ చూసినా హిందూ దేవుళ్ళకు చెందిన భారీ విగ్రహాలు కనువిందుజేస్తాయి. ఎక్కడపడితే అక్కడ వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి. అక్కడ అతి పురాతన హిందూ ఆలయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అసలు మనం ఒక ముస్లిం దేశంలో ఉన్నామా, లేక భారత దేశంలోని ఏదైనా టెంపుల్ సిటీలో ఉన్నామా అనే సందేహం కలగటం ఖాయం. దానికి సమాధానంగా, చాలా మంది చాలా రకాల నిర్వచనాలిస్తూ ఉంటారు. కానీ అసలైన సమాధానం, బలి చక్రవర్తికి సంబంధించిన చరిత్ర పుటలలో ఉందని, భారతీయ ఇతిహాసాలను అధ్యయనం చేసిన వారు చెబుతున్నారు.

అంతేకాదు, వెయ్యేళ్ళ క్రితం వైకింగ్స్ జాతి వారు మొదటి సారి అమెరికాను కనుగొన్నారని విదేశీ చరిత్రకారులు చెబుతున్న విషయం పూర్తిగా అవాస్తవం. మన దేశ రాజులు అక్కడ కొన్ని యుగాలకు పూర్వమే మహా సమారాజ్యాలను నెలకొల్పి, అక్కడి ఆటవిక జాతులవారికి నాగరికత నేర్పించారు. ప్రపంచంలో అత్యంత పురాతన నాగరికతలలో ఒకటిగా చెప్పుకునే మయ (Mayan) నాగరికత కూడా భారతీయుల వల్ల పుట్టిన నాగరికతే అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇటువంటి విషయాలను విన్న తర్వాత మనలో ఎన్నెన్నో సందేహాలు కలుగుతాయి. వాటికి సమాధానాలను ఇప్పుడు వామనావతారం ద్వారా తెలుసుకుందాము.

విష్ణుమూర్తి అవతారాలలో అత్యంత సాత్విక అవతారంగానూ, తొలి మానవ అవతారంగానూ వామనావతారానికి పేరు ఉంది. యుగాలకు పూర్వం దానవరాజైన ప్రహ్లాదుడి మనుమడు, విరోచనుడి కొడుకు, అయిన బలి రాజై అఖండ భారతావనిని ఏలాడు. ఒకానొక సమయంలో దేవతలతో యుద్ధం చేయాల్సి వచ్చి, దేవతల బలం ముందు తన బలం చాలక, ఓటమి పాలయ్యాడు బలి చక్రవర్తి. అప్పటికే గొప్ప రాజుగా, దాయా శీలుడిగా, దానంలో తనను మించిన వాడు మరొకడు లేడని పేరు తెచ్చుకున్న బలి చక్రవర్తి, ఆ ఓటమిని భరించలేకపోయాడు. ఎలాగైనా దేవతలను ఓడించి స్వర్గాధిపతి ఇంద్ర పదవిని పొందాలని నిర్ణయించుకుని, బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి మెప్పించి, అనేక వరాలను పొందాడు బలి చక్రవర్తి. ఆ వర ప్రభావంతో బలి చక్రవర్తి దేవతలపై దాడి చేసి, ఇంద్రుడిని తరిమి, దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు.

ఇలా అటు స్వర్గాన్నీ, ఇటు భూ లోకాన్నీ ఏలుతూ, అత్యంత బలమైన చక్రవర్తిగా మారిన బలికి, ఎప్పుడూ ఒక సందేహం మదిలో మెదులుతూ ఉండేది. ఏనాటికైనా స్వర్గాన్ని మళ్ళీ దేవతలు ఆక్రమించే అవకాశం ఉంది. అలాకాకుండా, ఆ ఇంద్ర పదవి తనకు శాశ్వతంగా దక్కితే, ఎటువంటి ఇబ్బందీ ఉండదని భావించాడు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం, బలికి స్వయంగా ఆ సందేహం ఉండేది కాదనీ, అతడి మనస్సులో ఆ ఆలోచనను నాటినది దానవవుల గురువైన శుక్రాచార్యుడనీ అంటారు. ఏది ఏమైనప్పటికీ, స్వర్గలోకానికి శాశ్వత నాయకుడిగా ఉండటానికి ఓ ఉపాయాన్ని ఆలోచించి, బలి చక్రవర్తికి చెప్పాడు శుక్రాచార్యుడు. ఆ ఆలోచనే సహస్ర అశ్వమేధ యాగాలు నిర్వహించడం. అశ్వమేధ యాగం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క అశ్వమేధ యాగం చేయాలంటే, నేటి కాలంలో మన దేశంలోని కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని చెప్పవచ్చు. అలాంటిది ఏకంగా వెయ్యి అశ్వమేధ యాగాలు నిర్వహించడం అంటే సాధారణ విషయం కాదు. అయినా ఇంద్ర పదవిని పొందటం కోసం బలి చక్రవర్తి ఆ యాగాలను మొదలు పెట్టి, దాదాపు విజయ వంతంగా పూర్తి చేయబోయాడు.

ఇదిలా ఉంటే, అదే సమయంలో మరో పక్క ఓ మహత్కార్యం జరిగింది. దేవతలు ఓడిపోయి వారికి దుర్భర గతి పట్టడంతో, కశ్యపుని భార్య, దేవతల తల్లి అయిన అదితి విష్ణుమూర్తిని ప్రార్ధించింది. నారాయణుడు కరుణించి, తాను స్వయంగా ఆమె గర్భాన జన్మించి ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పాడు. సాక్ష్యత్తు విష్ణుమూర్తే తన కడుపున జమించబోతున్నాడని తెగ సంబరపడిపోయింది ఆ తల్లి. ఆ స్వామి ఇచ్చిన మాట ప్రకారం అదితి కడుపున వామనావతారంగా జనించాడు. ఇదే, విష్ణుమూర్తి ఈ భూమిపై ఎత్తిన తొలి మానవ అవతారం.

అలా జన్మించిన స్వామి, కేవలం మూడడుగుల ఎత్తున్నప్పుడే బలి చక్రవర్తి చేస్తున్న యాగ శాల వద్దకు వెళ్లాడు. బలి చక్రవర్తి ఆ పిల్లవాడిని చూడగానే లేచి నుంచుని నమస్కరించాడు. శోభాయమానంగా వెలిగిపోతున్న ఆ  బ్రాహ్మణ బాలకుడి ముఖంలోని తేజస్సును చూసి సమ్మోహితుడైన బలిచక్రవర్తి ఆ పిల్లవాడిని సమీపించి, ‘ఎవరు నీవు, ఎందుకోసం ఇక్కడికి వచ్చావ’ని ప్రశ్నించాడు. దానికి ఆ బాలుడు, ‘మహారాజా.. నేను వామనుడను. నీవు గొప్ప దానశీలివని విని నీ వద్దకు వచ్చాను. నాకు కూడా దానం కావాల’ని అన్నాడు. ముల్లోకాలలో దేనినైనా కోరుకోమన్నాడు బలి. తనకు మూడడుగుల స్థలం చాల’ని అన్నాడు, వామనుడు. ఆనందంగా తథాస్తు పలికాడు బలి చక్రవర్తి.

ఇదంతా చూస్తున్న శుక్రాచార్యుల వారు, బాలుని రూపంలో వచ్చినది రాక్షస సంహారి అయిన శ్రీహరి అని గ్రహించి, బలి చక్రవర్తిని హెచ్చరించాడు. శ్రీ మహా విష్ణువే స్వయంగా వచ్చి దానం అడిగినప్పుడు తాను ఇవ్వకుండా ఉండలేననీ, మాట ఇచ్చాక తప్పననీ చెప్పి, వామనుడి కోరిక మేరకు దానమివ్వడానికి సిద్ధమయ్యాడు. దానమివ్వడానికి నీటికై కమండలాన్ని వంచడం, అందులోంచి నీరు బయటకు రాకుండా పురుగు రూపంలో శుక్రాచార్యుడు అడ్డుపడటం, వామనుడు దర్భతో కమండల రంధ్రంలో పొడవడం, మారు రూపంలో ఉన్న శుక్రాచార్యుల వారి కంటికి గాయం అయ్యి ఆయన అడ్డు తొలగడం, బలి దానమివ్వడం వెనువెంటనే జరిగిపోయాయి.

శా॥ ‘ఇంతింతై, వటుఁడింతయై, మరియుఁ దానింతై, నభోవీధిపై
నంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రుని కంతయై, ధ్రువుని పైనంతై, మహర్వాటి పై
నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై’

అన్నట్లు, మహా కాయుడైన వామనుడు, ఒక అడుగుతో సమస్త భూ మండలాన్నీ, మరో అడుగుతో సమస్త విశ్వాన్నీ కొలిచి, ‘నువ్వు మాట తప్పావు బలీ.. నాకు మూడడుగులిస్తానన్నావు. కానీ రెండు అడుగులు మాత్రమే ఇచ్చావు’ అని వామనుడడగగా.. ‘లోకనాథా.. ప్రాణంపోయినా నేను ఆడిన మాట తప్పను. మీ మూడవ అడుగు నా తలపై పెట్టండి’ అని విన్నవించాడు. అప్పుడు స్వామి బలి చక్రవర్తి తలపై పాదం మోపి, ఆయనను పాతాళానికి తొక్కేశాడన్న విషయం తెలిసిందే. వామనుడు ఇలా చేయడం వెనుక పరమార్థం, ఆయన బలి తలకెక్కిన ఆహాన్ని అణచి వేశాడు తప్ప, అతడిని పాతాళానికి తొక్కి అంతం చేసేయలేదని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.

ఆ సమయంలో బలికి, వామన మూర్తి ఎన్నో వరాలను ప్రసాదించాడు. పాతాళానికి వెళ్ళి అక్కడ తన సామ్రాజ్యాన్ని స్థాపించుకుని సుఖంగా ఉండమనీ, సావర్ణి మన్వంతరంలో స్వర్గానికి వచ్చి, ఇంద్ర పదవిని స్వీకరించమనీ అనుగ్రహించాడు. అప్పటివరకూ బలి కేరళ దేశాన్ని తన రాజధానిగా చేసుకుని పాలించేవాడు. అందువలన సంవత్సరానికి ఒకసారి భూమిపైకి వచ్చి, తన రాజ్యాన్ని చూసుకుంటానని కోరగా, అతడి కోరికను మన్నించాడు స్వామి. అందుకే ప్రతి సంవత్సరం కేరళ ప్రజలు ఓనమ్ పండగను జరుపుకుంటారు. దీని తర్వాత జరిగిన విషయాలే, ఇప్పుడు బాలీ దీవులకూ, పాతాళ లోకానికీ చెందిన అసలు చరిత్రను తెలియచేస్తాయని చరిత్రకారులంటున్నారు.

పురాణాల ప్రకారం, బలి చక్రవర్తిని పాతాళానికి పంపిన తర్వాత, ఆయన కొన్నేళ్ళ పాటు ద్వీప ప్రదేశంలో ఉన్నాడని తెలుస్తోంది. అక్కడ కూడా ఆయన తన సామ్రాజ్యాన్ని స్థాపించి, ప్రజారంజక పాలనను కొనసాగించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన తన పరివారంతో సహా నరకలోకానికి వెళ్ళినట్లు పురాణ విదితం. అలా ఆయన మధ్యలో పాలించిన ద్వీప ప్రాంతమే, ఇప్పుడు మనం చూస్తున్న బాలీ దీవులు. పూర్వం ఇండోనేషియాలో కూడా పూర్తిగా హిందూత్వమే ఉండేది. 12 - 13వ శతాబ్దం నుంచి ఇస్లాం పాలకుల వరుస దండయాత్రల కారణంగా, ఇండోనేషియా మెల్లగా ఇస్లామిక్ రాజ్యంగా మారిపోయింది. అయినప్పటికీ ఆనాటి బలి చక్రవర్తి పాలనా విధానం, ప్రధాన ఇండోనేషియా నుంచి ఈ దీవులు దూరంగా ఉండటం, అనే కారణాల వల్ల, నేటికీ బాలీ దీవులలో హిందూత్వమే కొనసాగుతోందనీ, బలి పేరు మీదనే ఆ ప్రాంతానికి బాలీ అనే పేరు స్థిరపడిందనీ నిపుణుల వాదన.

ఇక బలి చక్రవర్తి బాలీ దీవుల నుంచి వెళ్ళిన నరకలోకం, నేడు దక్షిణ అమెరికాలో ఉన్న చిలీ దేశం అని చరిత్రకారులు చెబుతున్నారు. అలాగని బలి చక్రవర్తి తొలిసారిగా అమెరికా ఖండంలో అడుగు పెట్టిన వ్యక్తి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, బలి చక్రవర్తి తండ్రి అయిన విరోచన చక్రవర్తి అంతకంటే ముందే అక్కడికి వెళ్ళినట్లు ఆధారాలున్నాయి. ఆయన బలి కంటే ముందే అమెరికా ఖండంలో అడుగుపెట్టి, ఆ ఖండాన్ని మొత్తం తన పాలన కిందకు తెచ్చుకున్నాడని చరిత్ర చెబుతోంది. దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశంలో నేటికీ తివానాకు (Tiwanaku) అనే అతి పురాతన నగరం ఒకటి ఉంది. దాదాపు నాశనం అయ్యి, పురావస్తు శాఖ చేతుల్లో ఉన్న ఆ ప్రాచీన నగరాన్ని స్థాపించినది బలి చక్రవర్తి తండ్రి విరోచనుడే అని చరిత్రకారులు గుర్తించారు. ఆయన అక్కడ కేవలం మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజు మాత్రమే కాకుండా, అక్కడి ప్రజలు పూజించే, సమస్త శక్తులూ కలిగిన దైవం. Viracocha అనే పేరుతో ఆయనను వారు ప్రధాన దైవంగా పూజించేవారు. విరోచనుడు స్థాపించన తివానాకు (Tiwanaku) నగరం ద్వారా, కొన్ని యుగాల పూర్వం అదే పేరుమీద ఒక నాగరికత పరిఢవిల్లిందని చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాకుండా, దక్షిణ అమెరికా ఖండంలోని అత్యంత పురాతన నగారికతలలో ఒకటైన Inca నాగరిక ప్రజలు, విరోచన చక్రవర్తిని Viracocha దేవుడి పేరుతో పూజించే వారనీ, Inca నాగరికత అంతమైన తర్వాత కూడా, అక్కడున్న ఆదిమ జాతి ప్రజలు ఆయనను పూజించడం కొనసాగించారనీ చరిత్ర చెబుతోంది.

అలా తన తండ్రి ఏలిన ప్రాంతానికి వెళ్ళిన బలి చక్రవర్తి, దాదాపు కలియుగారంభం వరకూ, దక్షిణ అమెరికా ఖండాన్ని ఈ ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో పాలించాడు. కలియుగం ఆరంభంకాగానే ఆయన భూమిపై ఉన్న మరో డైమన్షన్ లోకి వెలిపోయాడనీ, ఈ యుగాంతం తరువాత మొదలయ్యే సావర్ణి మన్వంతరం మొదలవ్వగానే బయటకు వచ్చి, నేరుగా స్వర్గానికి వెళ్ళి ఇంద్ర పదవిని అధిరోహిస్తాడనీ చరిత్రకారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, బలి చక్రవర్తితో పాటు కొంతమంది నేటికీ దక్షిణ అమరికాలో ఉన్న అమెజాన్ అడవులలో అత్యంత రహస్యంగా జీవిస్తున్నారనీ, కలి ప్రభావంతో అస్తవ్యస్తంగా ఉన్న ఈ లోకంలోకి రావడానికి వారు ఇష్టపడటం లేదనీ మరి కొంతమంది చరిత్రకారులంటున్నారు. వారి వాదనకు ఆధారంగా, నేటికీ పూర్తిగా explore చేయలేని Amazon అడవుల లెక్కలు చూపిస్తున్నారు. కొంతమంది నిపుణులు చెబుతున్న లెక్కల ప్రకారం, ఇంత advanced ప్రపంచంలో కూడా, అమెజాన్ అడవిని పూర్తిగా explore చేసింది కేవలం 30 శాతం మాత్రమే అనీ, నేటికీ మనుష్యులు అడుగుపెట్టడానికి వీలుకాని 70 శాతం అడవి రహస్యంగానే మిగిలి ఉందనీ అంటున్నారు. అక్కడ ఎటువంటి జీవులున్నాయి? ఎలాంటి ఆదిమ జాతి ప్రజలున్నారు? ఏ విధమైన వృక్ష జాతులు పెరుగుతున్నాయి? వంటి విషయాలు నేటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయని శాస్త్రవేత్తలంటున్నారు. ఇవన్నీ తెలుసుకున్న తరువాత మీకు ఏమనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

🚩 ॐ నమో నారాయణాయ 🙏

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess