గురు పౌర్ణమి - శ్రీ వ్యాస పూర్ణిమ / గురు పూర్ణిమ శుభాకాంక్షలు - Guru Paurnami 2024
ఈ రోజే '21 జులై, 2024' గురు పౌర్ణమి.. అందరికీ శ్రీ వ్యాస పూర్ణిమ / గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏🏻 శ్రీ వ్యాస స్తుతి.. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ । పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ।। వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే । నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ।। నారాయణుడు, ఆయన నాభి కమలం నుండి జన్మించిన బ్రహ్మ, బ్రహ్మ మానస పుత్రుడు వశిష్ఠుడు, వశిష్ఠుని సంతానమైన శక్తి, శక్తి మహర్షి పుత్రుడు పరాశరుడు, పరాశరాత్మజుడు వ్యాసుడు, ఆయన కొడుకు పరమ భాగవతోత్తముడైన శుకుడు, ఆ పరంపరలో గౌడపాదాచార్యులు, గోవింద యోగి మొదలైన వారు మన గురువులు. ఇది ఆర్ష గురు పరంపర. వీరిలో వ్యాస మహర్షి సాక్షాత్ విష్ణు రూపుడే. ఆయనకు నాలుగు ముఖాలు లేవు కానీ, బ్రహ్మ స్వరూపుడే. అటువంటి వ్యాస భగవానునికి నమస్కారం 🙏🏻 పరమపావనమైన ఆషాఢ పూర్ణిమ పర్వదినం ఇది. పూర్ణిమ అనగానే ఆధ్యాత్మిక సాధనకి చాలా యోగ్యమైనది. అందునా ఈ ఆషాఢ పూర్ణిమకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది గురు పూర్ణిమ అని ప్రసిద్ధి. ఇక్కడి నుంచి చాతుర్మాసాలలో వచ్చే పూర్ణిమలు అన్నీ, జ్ఞాన ప్రధానమైనటువంటి పూర్ణిమలు. జ్ఞానము అనగానే, ఆధ్యాత్మ జ్ఞానమే జ్ఞానము....